క్లౌడ్స్

అసెంబ్లీ సమావేశాల కోసం నోట్సు తయారు చేసుకుంటూనే మధ్యలో అరిస్టోఫేన్సు ‘క్లౌడ్స్’ నాటకం చదవడం పూర్తి చేసేసాను. నాటకం గురించీ, నాటకకర్త గురించీ నా ఆలోచనలు ఫ్రెష్ గా ఉండగానే మీతో పంచుకుందామనిపించింది.

అరిష్టోఫేన్సు (క్రీ.పూ.445-375) గ్రీకునాటక కర్తల్లో కామెడీ రూపకర్తగా చాలా ప్రసిద్ధి చెందినవాడు. ఏథెన్సు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు, ప్రజాస్వామిక ఆదర్శాలను అనుసరిస్తున్నప్పుడు వాక్ స్వాతంత్ర్యానికీ, పౌరస్వేచ్ఛకూ పేరెన్నికగన్నప్పుడు అతడు నాటకరచన చేసాడు. ఒకప్పుడు సిరాక్యూస్ నగరరాజ్య నియంత ప్లేటోని ఏథెన్సు రాజ్యాంగం ఎలా ఉంటుందని అడిగితే అతడు అరిష్టోఫెన్సు నాటకాల్ని చదవమని చెప్పాడట.

అరిష్టాటిల్ పొయెటిక్సులో ట్రాజెడీకి ఇచ్చిన స్థానాన్ని కామెడికీ ఇవ్వలేదు. కాని చారిత్రకంగా చూస్తే కామెడీనే ఒక అనాది రూపకవిశేషం. దాని మూలాలు సంతాన క్రతువుల్లో ఉన్నాయి. సామాజిక, సామూహిక సంబరాల్లో వున్నాయి. నా ముందున్న సంకలనం ‘ఎయిట్ గ్రేట్ కామెడీస్’ సంకలనకర్తలు ‘కామిక్ వ్యూ’ అనే వ్యాసంలో ట్రాజెడీలో మానవుడు తన చుట్టూ వున్న సమాజంతో సంఘర్షించడముంటుందనీ, అక్కడ మనిషి సమాజంకన్న గొప్పవాడనే భావానికి ఆస్కారముందనీ, కామెడీ అలా కాక, మనిషిని సామాజిక సూత్రాలకూ, సందర్భానికీ తగ్గట్టుగా సరిదిద్దే ప్రయత్నం చేస్తుందనీ వాదించారు. ఒక మనిషి తనని తాను సమాజంకన్నా పెద్దగా ఊహించుకోవడంలోనే ఎంతో పరిహాసాస్పదత ఉంటుందనీ, అరిస్టాటిల్ కూడా కామెడీలో పాత్రలు మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నందువల్లనే మనకు నవ్వుపుడుతుందని అన్నాడనీ కూడా వారు రాసారు.

ఈ నేపథ్యంలోంచి చూస్తే అరిష్టోఫేన్సు క్లౌడ్స్ నాటకంలో సోక్రటీస్ ని విమర్శించడం సహజమే అనిపిస్తుంది. కాని తన నాటకంలో సోక్రటీస్ పట్ల అరిష్టోఫేన్సు నిజంగానే క్రూరంగా వ్యవహరించాడనిపిస్తుంది. క్లౌడ్స్ నాటకం ప్రధానంగా సోఫిస్టులమీద ఎక్కుపెట్టిన విమర్శ. అరిష్టోఫేన్సు చెప్పినదాని ప్రకారం తర్కం రెండురకాలు: సుతర్కమూ, కుతర్కమూ.

పూర్వకాలపు గ్రీకు కవులు, సంప్రదాయం సుతర్కాన్ని ప్రోత్సహిస్తే, సోఫిస్టులు కుతర్కాన్ని ముందుకు తీసుకొస్తున్నారంటాడు. సోక్రటీస్ నిజానికి సోఫిస్టుల్ని వ్యతిరేకించినప్పటికీ, అరిష్టోఫేన్సు నాటకంలో అతణ్ణి సోఫిష్టుల ప్రథినిధిగా చూపించాడు. దాని దుష్పరిణామం ఎంత దూరం పోయిందంటే, ఏథెన్సు సోక్రటీస్ ని విచారించి అతడికి మరణశిక్ష విధించడం వెనక అరిష్టోఫేన్సు రచన చాలావరకు కారణమనడంలో ఆశ్చర్యం లేదు. అందుకనే ఒక విమర్శకుడు ఏ ఏథెన్స్ అయితే అరిష్టోఫేన్సుకి వాక్ స్వాతంత్ర్యమిచ్చిందో, అదే ఏథెన్సు సోక్రటీస్ కి ఆ స్వాతంత్ర్యం లేకుండా చేసిందన్నాడు. ఇప్పటి మన సమాజం లో మీడియా పోషిస్తున్న పాత్రనే ప్రాచీన గ్రీసులో రంగస్థలం పోషించిందనుకుంటే, ఇప్పటిలానే అప్పుడు కూడా రెండురకాల సత్యాలున్నాయని అనుకోవాలి. ఒకటి, యథార్థ సత్యం. రెండవది, సమాచార, ప్రసారసాధనాల సత్యం. యథార్థ జీవితంలో సోక్రటీస్ సోఫిష్టు కాడు. డబ్బుకోసం ఎవరికీ ఉపదేశం చేసినవాడు కాడు. స్వానుభవాన్నే నమ్ముకున్నాడు తప్ప సైన్సుని కాదు. కాని అరిస్టోఫేన్సు చిత్రించిన చిత్రణ వల్ల ఆ యథార్థ సత్యం మరుగున పడి నాటకసత్యమే ముందుకొచ్చింది. క్రీ.పూ. 399 లో 501 మంది ఎథీనియన్ల సంఘం సోక్రటీస్ మీద ఆరోపణలు చేసినప్పుడు సోక్రటీస్ తన సత్యత్వంగురించి వారినెంత మాత్రం ఒప్పించలేకపోయాడంతే అందుకు అరిష్టోఫేన్సు నాటకం వాళ్ళ మనసుల మీద బలంగా ముద్రించిన విరుద్ధ చిత్రమే కారణం. బహుశా ఈ విషయంలో మన సమాజానికీ ప్రాచీన ఏథెన్సుకీ ఏమీ తేడా లేదనుకోవాలి. ఇక్కడ ఒక మనిషి జీవితకాల కృషికీ, అతడి తపనకీ సమాచారప్రసార సాధనాలు ఇచ్చే గుర్తింపే గుర్తింపుగా చలామణి అయ్యే పరిస్థితి.

తన విమర్శకు సోక్రటీస్ ని పాత్రగా చేసుకున్నాడన్న విషయం వదిలిపెడితే, క్లౌడ్స్ నాటకం ద్వారా అరిస్టొఫేన్సు ప్రకటించిన అభిప్రాయాలు, ముఖ్యంగా విద్య గురించి అతడు పడ్డ ఆవేదన చాలా విలువైనవనే అనుకోవాలి. అతడు విద్యని సాంప్రదాయిక దృక్పథం నుంచే సమర్థించడానికి చూసినప్పటికీ, అతడి దృష్టిలో విద్య మనుషుల పట్క గౌరవాన్నీ, మానవసంబంధాల సమగ్రతనీ ప్రోత్సహించేదిగానే ఉండటం గమనించాలి. అతడు సోఫిష్టులమీద చేస్తున్న విమర్శ ఇప్పుడు మనం వ్యక్తిత్వవికాసవాదులపైనా, మానేజిమెంటు నిపుణులపైనా చేయవచ్చు. యథార్థానికి ఈ విషయంలో సోక్రటీస్ అభిప్రాయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. సోక్రటీస్ సత్యం వేరు, రెటారిక్ వేరు అని వాదించాడు. సోఫిష్టులూ, వ్యక్తిత్వవికాసవాదులూ కూడా రెటారిక్ మాట్లాడతారు. అది సత్యం కాదు. ఇప్పటి రాజకీయపార్టీల మానిఫెష్టోల్లో ఉండేది రెటారిక్, సత్యం కాదు. ఈ మెలకువలో అరిష్టోఫేన్సుకీ, సోక్రటీస్ కీ మధ్య తేడా ఏమీ లేదు.

క్రీస్తు పూర్వపు 5 వ శతాబ్దపు ఏథెన్సులో అరిష్టోఫేన్సు ఇలా సాహసంగా మాట్లాడటానికి అతడి వెనుక కొంత అలిగార్కీ మద్దతు ఉండి ఉందాలని కొందరు భావించారు. కాని మోసస్ హాడాస్ అనే విమర్శకుడు దీన్ని తోసిపుచ్చాడు. అతడి దృష్టిలో అరిష్టోఫేన్సు కవి, ఒక కామిక్ జీనియస్. కాని ఇంతకన్నా మరింత చక్కని వివరణ కార్నవాల్ లూయిస్ అనే విమర్శకుడు రాసాడని డబ్ల్యు.డబ్ల్యు. మెర్రీ అనే పండితుడు రాసాడు. దాని ప్రకారం అరిష్టోఫేన్సు తెలివైనవాడు, స్వేచ్ఛావర్తనుడు, ప్రత్యేకంగా ఏ సిద్ధాంతాలూ లేనివాడు, ఏ రాజకీయపక్షానికీ చెందనివాడు, ప్రత్యేకమైన దేశభక్తిలేనివాడు, ప్రత్యేకంగా తనదంటూ ఏ మతమూ లేనివాడు, కాని అపారప్రతిభావంతుడు, సృజనాత్మక ప్రతిభ నిండా పొర్లిపోతుండే జీనియస్.’ ఇంతా చెఫ్ఫి చివరికి ఆ విమర్శకుడు అరిష్టోఫేన్సుని ఒక ‘డెమోగాగ్’ అన్నాడు. మరొక విమర్శకుడు అతణ్ణి నేటికాలపు పత్రికల్లో తరచు వ్యాసాలు రాస్తుండే పొలిటికల్ కాలమిస్టులతో పోల్చాడు.

అరిష్టోఫేన్సు నాటకాల్లో పేరాబేసిస్ అనే ఒక భాగం ఉంటుంది. అక్కడ కోరస్ ద్వారా రూపకకర్త నేరుగా తన గురించి చెప్పుకుంటూ తన సా మాజిక రాజకీయ అభిప్రాయాలు ప్రకటిస్తాడు. అరిష్టోఫేన్సు నాటకాల్లో ఇవే అతణ్ణొక పొలిటికల్ కాలమిష్టుగా చూపించే భాగాలు. అంతేకాదు, చిన్నపిల్లలకి ఉపాధ్యాయుడెలాగో పెద్దవాళ్ళకి నాటకకర్త అలాగ అని అతడే ఒకచోట అంటాడు. నాటకకర్త ప్రజలని ఆహ్లాదపరచడమే కాదు, విద్యావంతుల్ని చేయాలని కూడా అంటాడు. ఇది మన సాహిత్యవేత్తలు మాట్లాడిన ఉపదేశమనేదానికి సన్నిహితంగా వినిపిస్తున్న భావం. తాను దేన్ని తక్కువ చేసినా, ఏ విలువను పరిహాసాస్పదంగా చూపించినా, సత్యాన్నీ, నిజాయితీని మాత్రం ఎప్పటికీ తక్కువ చెయ్యలేదని చెప్పుకున్నాడని, పొయెటిక్స్ మీద రాసిన వ్యాఖ్యానంలో బుచర్ పేర్కొన్నాడు. ఏథెన్స్ నగరవాసులకి ఏది మంచిదో చెప్పడానికి తానెప్పుడూ సిద్ధమేనని అతడన్నాడని కూడా బుచర్ గుర్తు చేసాడు.

ఇంతకీ ఇదంతా ఎందుకు రాస్తున్నాను? ఉపనిషత్తుల్నీ, పారశీక కవిత్వాన్నీ చదవడం ఎలానో ప్రాచీన గ్రీకు నాటకం చదవడం కూడా అలానే. ఎస్కిలస్, యురిపిడిస్, సొఫోక్లిస్ వంటి వారి నాటకాల్నీ, ఆ నాటకాల మీద గత రెండువేల ఏళ్ళుగా రసజ్ఞులు రాసినదాన్నీ చదవడంలో ఉన్న ఆనందం ఎటువంటిదో పంచుకోవడానికే ఇదంతా రాసాను.

1-12-12

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%