కిర్క్ గార్డ్ అవునంటే సార్త్ర కాదంటాడు

12

మరోసారి సెకండ్ హాండ్ బుక్ స్టాల్లో మరొక అనర్ఘ రత్నం. వాల్టర్ కాఫ్ మన్ సంకలనం చేసిన Existentialism: From Dostoevsky to Sartre ( ఎ మెరిడియన్ బుక్, 1989).

వాల్టర్ కాఫ్ మన్ తత్త్వశాస్త్ర ఆచార్యుడిగా పనిచేసాడు. కవి, రచయిత, అనువాదకుడు. నీషే రచనలన్నిటినీ దాదాపుగా అనువదించాడు. వాటితో పాటు జర్మన్ కవిత్వాన్నీ, ఫౌస్ట్ నీ కూడా అనువదించాడు. Tragedy and Philosophy అతడి మరొక సుప్రసిద్ధ రచన. యూరపియన్ ఆత్మని పట్టివ్వగల రచయితలు,కవులు, తత్త్వవేత్తలందరి మీదా సాధికారికంగా మాట్లాడగల సమర్థుడు.

ఈ పుస్తకం కూడా ఆ కోవలోకే వస్తుంది. ఇందులో డాస్టవిస్కీ, కిర్క్ గార్డ్, నీషే, రిల్క, కాఫ్కా, ఒర్టెగా, జాస్పర్స్, హిడెగ్గర్, సార్త్రే, కామూ ల రచనలనుంచి ఏరి కూర్చిన భాగాలతో పాటు కాఫ్ మన్ రాసిన సవివరమైన, విమర్శనాత్మకమైన ముందుమాట కూడా ఉంది.

పుస్తకం చదువుతున్నంతసేపూ ఒకటే అనిపిస్తూ ఉంది, ఈ రచన ముఫ్ఫై ఏళ్ళ కింద నా చేతుల్లోకి వచ్చి ఉంటే ఎంతబాగుండేదని!

80 ల ప్రాంతంలో నేను డిగ్రీ మొదటి ఏడాదిలో ఉండగా, జార్జి కాట్లిన్ (1896-1979) రాసిన గాంధీజీ అడుగుజాడల్లో (In the Path of Mahatma Gandhi) అనే పుస్తకం చదివాను. తత్త్వశాస్త్రం, కళలు, సౌందర్యమీమాంసలో ఆ రచయితకున్న అభిరుచివల్లా, ప్రాక్పశ్చిమాల్ని హృదయపూర్వకంగా దగ్గరకు తీసుకోవాలన్న గాఢమైన కోరికవల్లా ఆ రచన నన్ను తీవ్రంగా కట్టిపడేసింది.

అయితే అందులో ఒకచోట, ఆ రచయిత ,అస్తిత్వవాదం గురించి ప్రస్తావిస్తూ ‘కిర్క్ గార్డ్ అవునంటే సార్త్ర కాదంటాడు’ అని రాసాడు. ఆ వాక్యం నన్ను తీవ్రంగా వెంటాడింది. కిర్క్ గార్డ్, విచిత్రమైన పేరు. ఎవరతడు? అతడు దేన్ని అవునంటున్నాడు? సార్త్ర ఎవరు? అతడు దేన్ని కాదంటున్నాడు? గాంధీ గురించి తెలుసుకోవడానికి బయలుదేరిన జిజ్ఞాసికి వాళ్ళిద్దరూ ఎందుకు గుర్తొచ్చారు? వాళ్ళేం రాసారు? ఆ రచనలెక్కడ దొరుకుతాయి? ఎప్పటికి చదవగలుగుతాను?

ఆ వాక్యం నా జీవితాన్నే మార్చేసింది.

ఆ తర్వాత ఏమి జరిగిందో నా ‘సత్యాన్వేషణ’ (2003) కు రాసిన ముందుమాటలో వివరంగా రాసేను.

కిర్క్ గార్డ్, సార్త్రే అస్తిత్వవాద రచయితలని తెలిసిన తరువాత అస్తిత్వవాదం గురించి తెలుసుకోవాలన్న నా తృష్ణని తెలుగు రచయితలు తీర్చలేకపోయారు. పాశ్చాత్య చైతన్యాన్ని ఎంతో సాధికారికంగా తెలుగువాళ్ళకు పరిచయం చేసిన శ్రీ శ్రీ కూడా ఇక్కడ తొట్రుపడిపోయాడు. ‘ఝ్యా పాల్ సౌర్త్ర్ సౌండించిన ఎగ్జిస్టెన్షియాలిజం/ జనన మరణ నరక నాక సబ్ సూపర్ రియలిజం’ అనే అర్థరహితమైన వాక్యం తప్ప మరేమీ రాయలేకపోయాడు. గోపీచంద్ ‘తత్త్వవేత్తల్లో’గాని నండూరి రామ్మోహనరావుగారి ‘విశ్వదర్శనం’లోగాని నాకు దొరకవలసిన స్పష్టత దొరకనే లేదు.

అట్లాంటి రోజుల్లో రాజమండ్రిలో ఆర్.ఎస్.సుదర్శనంగారు, నా మిత్రుడు కవులూరి గోపీచంద్ అస్తిత్వవాదం గురించి నాకు కొంత అర్థమయ్యేలా చెప్పారు. కాని అందరికన్నా విస్తృతంగానూ, లోతుగానూ కూడా అస్తిత్వవాద ప్రశ్నల్ని నాకు బోధపరిచినవాడు బైరాగి.

20 వ శతాబ్దంలో మనం పాశ్చాత్య ప్రపంచం నుంచి దిగుమతి చేసుకున్న భావజాలంలో కొంత ఎక్కువతక్కువ లున్నాయి. ఉదాహరణకి మనం మార్క్సిజాన్ని దిగుమతి చేసుకున్నాంగాని, అదే నిష్పత్తిలో మార్క్స్ కి ముందూ వెనకా సంభవించిన ఆర్థిక విశ్లేషణనిగానీ, సత్యమీమాంసనుగానీ, సామాజికచింతనను గానీ అధ్యయనం చెయ్యలేదు. మార్క్స్, ఎంగెల్స్ ప్రతిపాదించింది డయలెక్టికల్ మెటీరియలిజం. అది కేవలం ఐడియలిజం మీద మాత్రమే తిరుగుబాటు కాదు, పద్ధెమినిది, పందొమ్మిది శతాబ్దాల యాంత్రిక భౌతికవాదం మీద కూడా అంతే తిరుగుబాటు. కాని మనం కేవలం మార్క్స్ ఎంగెల్స్ లను మాత్రమే దిగుమతి చేసుకున్నందువల్ల మన దేశంలో మార్క్సిజం మరొక యాంత్రిక భౌతికవాదం గా మారిపోయింది.

హెగెల్, మార్క్స్ లు ( ఒకరు ఐడియలిస్టు, మరొకరు మెటీరియలిస్టు) ప్రతిపాదించింది అంతిమంగా ఒక చారిత్రిక నిర్ణాయకవాదంగా పరిణమించిందనీ ( Historical determinism), అందులో వ్యక్తికి చోటులేదనీ, మహాప్రమాణాల్తో ఆవిష్కృతమవుతున్న చారిత్రిక శక్తులముందు మానవుడొక అల్పజీవిగా నిలబడవలసి వస్తున్నదని గుర్తించి ఆ చారిత్రిక నిర్ణాయకవాదాన్ని ధిక్కరిస్తూ రష్యన్ రచయిత డాస్టవిస్కీ రాసిన కథల్లోంచీ, డేనిష్ చింతకుడు కిర్క్ గార్డ్ రాసిన రచనల్లోంచీ రూపుదిద్దుకున్నదే అస్తిత్వవాద ధోరణి.

డాస్టవిస్కీ Notes from the Underground (1864) తో మొదలైన ఈ ధోరణిలో మూడు ముఖ్యలక్షణాలున్నాయి.

మొదటిది, ఇది అకడెమిక్ ఫిలాసఫీ కాదు, సోక్రటీస్ సంభాషణలాగా జీవితంలోంచి తలెత్తింది, ఒక జీవనవైఖరి.

రెండవది, ఇది హేతుప్రాధాన్యతని ప్రశ్నిస్తుంది. హేతువు (reason) ఒక్కటే జీవితానికి అర్థం సమకూర్చగలదని నమ్మలేదు. అసలు మనం జీవితానికి చెప్పుకునే అర్థాలన్నిటికన్నా ముందే మనకొక అస్తిత్వం ఉంది. (Existence precedes essence). ఆ అస్తిత్వం (హిడెగ్గర్ దాన్ని being అన్నాడు, సార్త్రే దాన్ని existence అన్నాడు)మనకొక ప్రత్యేక మనస్థితిలో ఎరుకపడుతుంది. ఆలోచనకు విరుద్ధమైన ఈ మనస్థితిని వాళ్ళు angst అనే మాటతో సూచించారు. ఇంగ్లీషులో దీన్ని dread అనీ, fear అనీ అనువదించారుగానీ అది సరైన అనువాదం కాదు.( తెలుగులో ఒక ప్రసిద్ధ విమర్శకుడు దీన్ని విశ్వనాథ జీవుని వేదనతో పోల్చే సాహసం చేసాడు!). ఒకప్పుడు అజంతా గురించి రాస్తూ నేను దీన్ని ‘భీతి’ అన్నాను. కాని ఆ పదం పట్ల కూడా నాకు సంతృప్తి లేదు.

మూడవది, ముఖ్యమైంది, ఈ dread లోంచి మన అస్తిత్వం మనకు మనం ఎంచుకునే సంభావ్యతల రూపంలోనూ,తీసుకునే నిర్ణయాల రూపంలోనూ అవగతమవుతుంది. అందుకనే మనిషికి అన్నిటికన్నా కఠినమైన విషయం, ఎంచుకోవడం, నిర్ణయించుకోవడం.

దీన్ని అబ్రహాం తన కుమారుడు ఇసాకును బలివ్వడానికి పూనుకున్న సంఘటనతో కిర్క్ గార్డ్ వివరిస్తాడు. దేవుడి ఆజ్ఞమేరకు అబ్రహాం తన కుమారుణ్ణి బలివ్వడానికి నిల్చున్నప్పుడు, ఆ క్షణం, అది అత్యంత వ్యక్తిగత క్షణం. తక్కిన ప్రపంచానికక్కడ చోటు లేదు, హేతువుకి స్థానం లేదు. ఒక మనిషి, అతడు తనకై తను ఎంచుకోవలసిన మార్గం, తనకై తను తీసుకోవలసిన నిర్ణయం, అంతే. తన పినతండ్రిమీద ప్రతీకారం తీర్చుకోవలసి వచ్చినప్పుడు హామ్లెట్, తన తాతనీ, గురువునీ, తమ్ముళ్ళనీ సంహరించవలసి వచ్చినప్పుడు అర్జునుడు ఎదుర్కొన్నదీ సమస్యే.

‘కర్మ యొనర్చడమెలాగు, ఈ బాధ్యత కఠిన తరం’ అంటాడు బైరాగి.

డాస్టవిస్కీనుంచి బైరాగిదాకా కూడా, మనకి చెప్తున్నది, కాఫ్ మన్ వాక్యాల్లో చెప్పాలంటే, the self is essentially intangible and must be understood in terms of possibilities dread and decisions.. and my choice is made in fear and trembling.

26-10-2015

Leave a Reply

%d bloggers like this: