ఈ నెల 3 వ తేదీన లా మకాన్ లో అనంతమూర్తిమీద ఒక డాక్యుమెంటరీ ప్రదర్శిస్తూ నన్ను కూడా మాట్లాడమని అడిగినప్పుడు, సంస్కార కన్నా గొప్ప రచనలు తెలుగులో వచ్చినప్పటికీ వాటి గురించి తక్కిన ప్రపంచానికి తెలియడం లేదని అన్నాను. ఆ మాటల మీద కొంత చర్చ జరిగింది. ఆ విషయాన్ని పున్నా కృష్ణమూర్తి 12 వ తేదీ సాక్షి పత్రికలో నివేదిస్తూ ‘యజ్ఞం ఇంగ్లీషులోకి ఎందుకు అనువాదం కాలేదు’ అని నా ప్రశ్నగా రాస్తూ, ఆ మాట వినగానే సభలో కొంతసేపు మౌనం నెలకొందని రాసారు.
నేనా మాటలు చెప్తున్నప్పుడు యజ్ఞానికి కనీసం ఒక ఇంగ్లీషు అనువాదం వచ్చినట్టు నాకు తెలుసు, సాహిత్య అకాదెమీ ప్రచురించిందని కూడా గుర్తుంది. కానీ ఆ అనువాదం తెలుగులో యజ్ఞం కథపట్ల కొత్తకుతూహలాన్నిగానీ, ఇతఋ భారతీయ భాషల్లో గానీ, ప్రపంచస్థాయిలోగానీ అసలు ఎటువంటి కుతూహలాన్నీ రేకెత్తించలేదన్న విషయం కూడా నాకు గుర్తుంది.
అయితే ఆ తర్వాత నాలుగైదు రోజులకి నిడదవోలు మాలతి గారు నాకో మెసేజి పెట్టారు. మీరొక సభలో మాట్లాడుతున్నప్పుడు వాస్తవాల్ని చెప్పాలికదా, యజ్ఞానికి కనీసం రెండు ఇంగ్లీషు అనువాదాలున్నాయని మీకు తెలీదా అని. అందులో ఒక అనువాదం ఆమె చేసిందే. ఆ అనువాదం thulika.netలో చూడవచ్చు కూడా. ఆమె అట్లా అడిగినందుకు నాకు సంతోషమే అనిపించింది. అంతకన్నా మరింత సంతోషం, ఆమె అక్కడితో ఆగకుండా, తెలుగు రచనల ఇంగ్లీషు అనువాదాలు ఎలా ఉన్నాయి, ఎలా ఉండాలనే పెద్ద చర్చకి కూడా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె ఆలోచనల్ని కూడా thulika.net లో చూడవచ్చు. పట్టుమని పదిమంది తెలుగువాళ్ళు కూడా లేని ఒక సభలో నేను చేసిన వ్యాఖ్యలు పున్నాకృష్ణమూర్తిగారివల్ల, నిడదవోలు మాలతిగారి వల్ల తెలుగు అనువాదాల్లో కొత్త జిజ్ఞాసకు దారితీసాయనుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది.
అయితే, ఒక తెలుగు రచన ఇంగ్లీషులోకి అనువాదమైనంత మాత్రాన అది ప్రపంచం దృష్టిని ఎకాఎకీ ఆకర్షిస్తుందనుకోలేం. తక్కిన అన్ని ఉత్పత్తుల్లానే రచన కూడా ఒక ఉత్పత్తి. దానికి ప్రపంచవ్యాప్త వినియోగం రావడమనేది, ఉత్పత్తి నాణ్యతమీద మాత్రమే కాక మరెన్నో అంశాల మీద ఆధారపడిఉంటుంది.
నేనా రోజు నా ప్రసంగంలో మూడు రచనల్ని ప్రస్తావించాను. ఒకటి, అనంతమూర్తి రాసిన ‘సంస్కార'(1965), కాళీపట్నం రామారావు రాసిన ‘యజ్ఞం’ (1964), చినువా అచెబె రాసిన The Arrow of God (1964). ఒకే కాలంలో ప్రపంచంలో వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ఈ మూడు రచనల మధ్యా ఎంతో సామ్యముంది. మూడూ కూడా ఒక స్తానిక సమాజానికి చెందిన నైతిక,ధార్మిక సమస్యను చర్చించిన రచనలు. కాని మూడింటిలోనూ సంస్కారకీ, The Arrow of God కీ లభ్యమయినట్టుగా ప్రపంచవ్యాప్త పాఠకులు యజ్ఞం కి లభ్యం కాలేదు.
ఎందుకని?
నేను ఇంతకుముందే చెప్పినట్టుగా అనువాద శ్రేష్టత ఒక్కటే ఆ రచనకు ప్రకాస్తి తీసుకురాదు. ఆ text ని మనం సమకాలిక సందర్భంలో ఎంతగా contextualize చెయ్యగలమన్నదాన్నిబట్టి కూడా ఆ గుర్తింపు ఆధారపడుతుంది.
ఒక రచనగా, నవలగా సంస్కార చాలా బలహీనమైన రచన. ఇంకా చెప్పాలంటే దారితప్పిన కథనం. కాని దాన్ని ఎ.కె.రామానుజన్ వంటివాడు అనువాదం చెయ్యడమే కాకుండా, దానికొక afterword రాసి ఆ రచనకొక context ని ఇవ్వడానికి ప్రయత్నించాడు. మనమొకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ మాటే అనంతమూర్తినే అన్నాడు, మనం సాల్ బెల్లోని సాహిత్యం కోసం చదువుతాం, అమెరికన్లు ప్రేమ్ చంద్ ని సోషియాలజీ కోసం చదువుతారని.
రామానుజన్ కి ఈ సంగతి తెలుసు, ఆయన సంస్కారలో కొంత ethnic element ఉందన్నట్టుగా, అదొక ప్రాచీన సమాజం గురించి చెప్పడానికి ప్రయత్నిస్తోందన్నట్టుగా ప్రతిపాదించడమే కాకుండా, తన కాలంనాటి literary discourse లోకి ఆ రచనని ఎంతో లాఘవంతో ప్రవేశపెట్టాడు. 60ల్లో, 70ల్లో ప్రధాన తాత్త్విక ధోరణి అయిన ఎగ్జిస్టెన్షియలిజంతో దాన్ని అనుసంధానం చెయ్యడమే కాకుండా,ఏ సంస్కారానికకైనా చెందిన separation, transition and reincorporation అనే మూడు దశల్లో ఆ కథని పునర్వ్యాఖ్యానించాడు. వాస్తవికచిత్రణని ఆధారం చేసుకున్న అలిగరిగా ఆ కథని చూపిస్తూ పుస్తకం ముగుస్తుందిగాని కథ ముగియదంటాడు.
ఒక నెరేటివ్ ని ఒక డిస్కోర్సుగా మార్చే పద్ధతి ఇది. ఏ నెరేటివ్ కూడా దానికదే తన పాఠకుల్ని వెతుక్కోలేదు. దానికొక డిస్కోర్సు అవసరమవుతుంది. కొన్నిసార్లు ఆ డిస్కోర్సు అప్పటి కాలానికీ, అక్కడి సమాజానికీ మాత్రమే పరిమితమైపోగా, కొన్నిసార్లు ఆ నెరేటివ్ ఎప్పటికాలానికి తగ్గట్టుగా అప్పుడొక డిస్కోర్సును ప్రేరేపించగలుగుతుంది. ఒక రచన రాయబడ్డ కాలాన్ని దాటి కూడా కొత్త డిస్కోర్సును లేవనెత్తగలిగితే ఆ రచనను మనం క్లాసిక్ అంటాం. ఉదాహరణకి షేక్స్పియర్ నాటకాలు. కాబట్టి మనకి కావలసింది, రామానుజన్ లాంటి అనువాదకులు మాత్రమే కాదు, ఆయనలాగా ఒక దేశభాషా రచనని గ్లోబల్ సందర్భానికి అనువుగా ఒక డిస్కోర్సులో ప్రవేశపెట్టగల విమర్శకులు కూడా.
యజ్ఞం సంగతి చూద్దాం. ఈ కథమీద తెలుగులో చాలా పెద్ద చర్చ జరిగింది. కాని ఆ చర్చ లోకల్ డిస్కోర్సు స్థాయిని దాటి విస్తరించలేదు. ఆ చర్చ యజ్ఞం కథని ఆర్థిక దృక్కోణంలోంచి మాత్రమే చూడటానికి ప్రయత్నించింది. కాని యజ్ఞంలో చర్చించబడింది ఒక నైతిక సమస్య, ఇంకా చెప్పాలంటే రాజనైతిక, రాజధార్మిక సమస్య. ఆ కథ గురించి నా ‘వందేళ్ళ తెలుగు కథ’ (2001) లో నేనిట్లా రాసాను:
‘కాళీపట్నం రామారావు యజ్ఞం (1964) సెంటర్ పైన పెరిఫెరీ ప్రకటించిన అవిశ్వాసతీర్మానం. కేంద్రీకృత పరిపాలన,కేంద్రీకృత ప్రణాళిక,కేంద్రీకృత ఆదర్శం ఆచరణలోకి వచ్చేటప్పటికి చిన్నచిన్న సమూహాల్నీ, జాతుల్నీ, ఆర్థికవ్యవస్థల్నీ అణచిఉంచటానికే ఉపకరిస్తాయని వాదించినకథ. ఆ విధంగా తెలుగులో, ఆ మాటకొస్తే భారతీయసాహిత్యంలోనే మొదటి పోస్ట్ మోడర్న్ కథగా దీన్ని గుర్తించవలసిఉంటుంది. ఈ కథలో ఉన్నది ఆర్థిక అసమానతపైన ఒక ప్రకటన మాత్రమే కాదు, ఆర్థికంగా అసమానంగా ఉండే రెండు వ్యవస్థలకు ఒకే చట్టాన్ని వర్తింపచేయాలనుకోవడం న్యాయం కాక,అన్యాయమే. ఇటువంటి న్యాయంలాగా కనిపిస్తున్న అన్యాయం సామాజిక హింసగా, ఒక అంతర్గత సంక్షోభంగా బయటపడక తప్పదని కథకుడు హెచ్చరించాడు. ఆధునిక భారతీయ ఆర్థిక -రాజకీయ నిర్మాణాలు నాగరిక నిర్మాణాలు. వాటి కేంద్రీకృత ఆదర్శాలు గ్రామీణ సమాజాల్లో ఉండే వివిధ స్తరాల్నీ,తారతమ్యాల్నీ, నిమ్నోన్నతాల్నీ గుర్తించే మెలకువ చూపలేదు. సార్వత్రిక ఓటు హక్కు ఒక్కటే అన్ని సమస్యల్నీ పరిష్కరించగలదని వారు అనుకున్నారు. కానీ ఆచరణలో రెండు రకాల యాథార్థ్యాలు ఏర్పడతాయనీ, ఒకటి బలంగా ఉన్న వాళ్ళ యాథార్థ్యం, రెండవది బలంగా లేనివాళ్ళ యాథార్థ్యం అనీ. ఈ రెండు రకాల యాథార్థ్యాల్నీ ఒకే సమాజంగా కలిపి చూడటం, ఒక నైతిక సమస్యను లేవనెత్తడమేననీ చింతాదీక్షితులుగారు శతాబ్దపు తొలిరోజుల్లోనే గుర్తించారు. దాన్నే మరింత సాంఘికార్థిక పరిభాషలో యజ్ఞం వివరంగా చెప్పుకొచ్చింది.’
నేనింకా ఇలా రాసాను:
‘కాళీపట్నం రామారావు ఈ సమస్యను మొదటిసారి ‘అప్రజ్ఞాతం’ (1951) కథలో ప్రస్తావించాడు. కాని దానికీ యజ్ఞానికీ తేడా ఆయన అవగాహనలో వచ్చిన పరిణతిలోనే కాక ఆయన ఎంచుకున్న కథాశిల్పంలో కూడా ఉంది. యజ్ఞం కథాశిల్పం స్పష్టంగా ఒక గ్రామీణ కథనరీతి. ..’
సంస్కారలోనూ, The Arrow of God లోనూ సంప్రదాయానికీ, ఆధునికతకీ మధ్య సంఘర్షణ ప్రధానంగా ఉండగా, యజ్ఞంలో ఆధునికతకీ, ఆధునికతమీద ధిక్కారానికీ మధ్య సంఘర్షణ ప్రధానం. అలా చూసినట్లయితే అనంతమూర్తికన్నా, చినువా అచెబె కన్నా కాళీపట్నం మరింత ముందుకు వెళ్ళారని చెప్పాలి. మనమిట్ల్లా ఒక నెరేటివ్ లో చర్చించబడ్డ ఒక స్థానిక సమస్యను global context లో వివరించగలిగితే, అప్పుడా కథ ప్రపంచం దృష్టిని ఆకర్షించగలుగుతుంది. తెలుగు సాహిత్యానికి ఇంగ్లీషు అనువాదాల గురించిన చర్చలో ఈ అంశాన్ని కూడా పరిశీలించవలసిందిగా నా మనవి.
26-9-2014