కాఠజోడి నది ఒడ్డున

Reading Time: 4 minutes

51

వేలూరి వెంకటేశ్వర రావు గారి పేరు మొదటిసారి చాలా ఏళ్ళ కిందట స్మైల్ గారి దగ్గర విన్నాను. కాని వారితో పరిచయం లేదు. ఈ మధ్య ఆయన తానొక ఒరియా కవిని తెలుగు చేసాననీ, ఆ అనువాదం మీద నా అభిప్రాయం చెప్పమనీ అడిగారు. సౌభాగ్య కుమార మిశ్ర అనే ఒక సమకాలీన ఒరియా కవి, సాహిత్య అకాడెమీ పురస్కార స్వీకర్త, కవితలనుండి 60 కవితలు ఎంపిక చేసి ‘అవ్యయ’ పేరిట వెలువరించిన పుస్తకం నాకు పంపారు.

ఆ పుస్తకం అందినప్పటినుంచీ నేను ఆ కవీ, అతడి కవిత్వమూ నాలో ఎటువంటి స్పందనలు కలిగిస్తున్నాయో పోల్చుకునే ప్రయత్నంలోనే ఉన్నాను.

2

కవిత్వం, ఏ భాషకి చెందినదైనా, దానికదే ఒక భాష. భాషలన్నిట్లోనూ, రెండు భాషలుంటాయి. ఒకటి, రోజువారీ వ్యవహారానికి అవసరమైన సింటాక్సుతో నిర్ర్మాణమయ్యే వ్యవహారం. రెండవది, దైనందిన ప్రయోజనాన్ని దాటిన వాక్కు. నిజానికి, భాష అవసరం దైనందిన ప్రయోజనం కోసం కాదు. అందుకు సైగలు సరిపోతాయి. దాన్ని దాటిన హృదయసంవాదం కోసమే భాష పుట్టింది. కాని కాలక్రమంలో, ఆ భాషా శక్తి వ్యయమైపోతూ ఉంటుంది. ఆ భాషలోని సున్నిత సంవేదనలు రాటు తేలిపోతాయి. కాకువు మొద్దుబారుతుంది. లక్షణ రూఢిలక్షణ గా స్థిరపడిపోతుంది.

అటువంటి సందర్భంలో భాషకి మళ్ళా కొత్త ఊపిరి ఊది దాన్ని పునర్నవం చేసేవాడే కవి, అందుకనే ‘అపారే కావ్యసంసారే కవిరేవ ప్రజాపతిః’.

కవులు ఈ పని మూడు విధాలుగా చేస్తారు. ఒక ధోరణికి చెందిన కవులు తమ పూర్వకవుల సంస్కారాన్ని పట్టుకుని, ఆ పునాదుల మీద కొత్త ప్రపంచాన్ని నిర్మిస్తారు. కాళిదాసు అట్లాంటి కవి. ఆయన వాల్మీకి స్ఫూర్తితో మనోహర కావ్యలోకాన్ని నిర్మించాడు. తెలుగులో, కొత్త కావ్యం నిర్మించవలసి వచ్చినప్పుడు నన్నయ ఆ బాటనే నడిచాడు. ‘ఋషి వంటి నన్నయ రెండవ వాల్మీకి.’

రెండవ తరహా కవులు ఉన్న భాషను విధ్వంసం చేస్తారు.తమముందున్న సింటాక్సును తునియలు చేస్తారు. తెలుగులో పఠాభి, మో, ఎం.ఎస్.నాయుడు ఇటువంటి కవులు.

మూడవ తరహా కవులు ఒకవైపు విధ్వంసం చేస్తూనే మరొకవైపు కొత్త సృష్టి కూడా చేస్తూ ఉంటారు. శ్రీ శ్రీ ఇటువంటి కవి. ఇటువంటి కవుల్ని ఉద్దేశించే అజంతా ఇలా అన్నాడు:

”రాజకీయ భాష్యకారులైతే నీ ముఖం మీద ప్రశ్నార్థకాలు చిత్రించవచ్చు గాక
కాని నేను మాత్రం ‘క్రియేటర్ ‘, ‘క్రియేటర్ ‘ అంటాను
డిస్ట్రాయిర్ అని కూడా అంటాను.
చీకటి నిబర్హణం తర్వాతే కదా కొత్త సృష్టి, కొత్త ప్రపంచం ”

ఒక భాష ద్వారా మనకి లభించేది వట్టి పదజాలం కాదు. అది మనకొక దేశకాల స్ఫూర్తినిస్తుంది. కొత్త భాషను నిర్మించే కవి, మనకొక కొత్త లోకాన్నీ, కొత్త కాలాన్నీ స్ఫురింపచేస్తాడు. ఆ లోకమూ, ఆ కాలమూ ఏదో ఒక నిర్దిష్ట స్థలకాలాలకు కట్టుబడేవి కావు. మేఘదూత కావ్యం చదువుతున్నప్పుడు మన మనోలోకంలో గోచరించే ఆ లాండ్ స్కేప్ ఏ మూడవ శతాబ్దం నాటిదో లేదా మాళవదేశానిదో కాదు. అది మనో దిగంతంలో ప్రత్యక్షమవుతూ, మనకి ఎన్నటికీ పూర్తిగా చేజిక్కకుండా మనల్ని ఊరిస్తూనే ఉంటుంది.

ఆ కావ్యప్రపంచం స్ఫురింపచేస్తున్న దేశకాలాలు పడికట్టు పదాలుగా మారిపోయినప్పుడల్లా, కవులు, ఆ భాషని ధ్వంసం చేసి కొత్త భాష నిర్మించాలనుకుంటారు. పఠాభి తెలుగులో కవిసమయాల్ని ధ్వసం చేసాడని విశ్వనాథ సత్యనారాయణ అన్న మాట ఎంతో సత్యం. పఠాభి చేసిందేమిటి? అతడు కోకిలలు, వెన్నెల, జాబిలి, సీత, పడికట్టుపదాలుగా మారిపోతుంటే వాటిని మన మనఃఫలకం మీంచి తుడిపేయాలని చూసాడు.

కాని శ్రీశ్రీ అదే వెన్నెల ని, అదే జాబిలిని ‘బహుళ పంచమి జ్యోత్స్న’, ‘శరశ్చంద్రిక’ కవితల్లో కొత్త కవిసమయాలుగా మార్చేసాడు.

3.

సౌభాగ్య కుమార మిశ్ర కవిత్వంలో పఠాభి తరహా విధ్వసం నుండి శ్రీ శ్రీ తరహా నవ్యసృష్టి వైపు ప్రయాణం కనిపించిందని చెప్పడానికే ఇదంతా రాయవలసి వచ్చింది.

స్వప్న సదృశమైన దేశకాలాలు, బహుశా ఒరియా రొమాంటిక్ కవిత్వంలో ఒక వెలుగు వెలిగిన దేశకాలాల్ని వాస్తవ జీవితం ,నిష్టుర జీవితం మసకపరచడం అతడి కవిత్వమంతా కనిపిస్తున్నది. అతడికి చిరపరిచితమైన దేశకాలాలు కరిగిపోతున్న దృశ్యం. ‘ఎండు ఎముకలలో ఎత్తిరిల్లుతున్న బేహల రాగం’, ‘జాజ్ పూర్ ప్రాంతంలో నది పొంగిన వరద’, ‘గరుడపచ్చని ఎండమావి’, ‘ఉజ్జయిని నుంచి కటక్ దాకా తడిసిపోయిన కొండదారి’, ‘గంజాం జిల్లా అకాలపుటెండ’, ‘అలిజచెట్టు ఆకుల జీవనవర్ణాలన్నీ కడిగేసి చచ్చిన కొంగలాగా పడి ఉన్న ఏప్రిల్ మాసపు మధ్యాహ్నం మాడి మండిపోయిన బుద్ధ అశోకుల జ్ఞాపకాలు’, ‘సొహాగినీ నది ఒడ్డున నీళ్ళల్లో తడిసిన పెదవుల గడగడ వణుకు’, ‘మూషకాని చెట్టు ఆకుల ఎర్ర రంగు’, ‘పల్లె నాలుగురోడ్ల కూడలి అవతల రాత్రి ఘడియలో వినిపించే కంజరి వాద్యం’, ‘చేతులెత్తి పిలుస్తున్న కృష్ణ చూడా పుష్పం’, ‘కాఠజోడి నది ఒడ్డున బూడిద రంగు రెక్కల గబ్బిలం’ -అల్లుకుపోతున్న ఈ దేశకాలాలమధ్య తన స్వస్థలమేదో, తన కాలమేదో గుర్తుపట్టడం కవికి పరీక్ష.

కాని అతడు వెతుకున్నది పూర్వకవిసమయాల మీంచి పోల్చుకున్నదే:

“కాంతి ఎక్కడ? ఎక్కడ నా చైత్రమాసపు రాత్రి?
వేణు నాదం ఎక్కడ? యమునా నది నీలి నీళ్ళెక్కడ?..” (పే.103)

అతడు వెతుకున్న మేఘం కాళిదాసు దర్శించిన కాలాతీతమేఘమే:

“నేను ఈ రోజు రెండవఝాము పహరా కాస్తున్నాను
ఎండలొ మండిపోతున్న మర్రిచెట్టులా ఎదురుచూస్తున్నాను
భూమికీ అకాశానికీ నదికీ ఇసుకకీ మేఘం వస్తుందని
మేఘదూతం నుంచో, ప్రకృతి రాసిన జాగ్రఫీ పుస్తకం నుంచో..” (పే.109)

కాని ఆ మేఘం ఒక పడికట్టు పదంగా మారిపోయింది. అందుకని అంటాడు:

“జాగ్రఫీ పాఠం నేర్చుకోవటం గ్యారంటీగా చాలా కష్టం ” (పే.55)

కవికి నిజమైన దుఃఖమేమిటంటే, ఇట్లా కరిగిపోతున్న స్థలకాలాలు ఒక పద్యంగా మారకపోవడం. అందుకనే,

“యోగ్యమైన నా ఋతుకాలం నా నిష్ఫలమైన తరుణం
శుష్కస్తనాలు, ఆ దినాలు మృతిఝుంకారానికి ప్రతిధ్వని!” (పే.77)

“ఇవాళ్టి శూన్యతలాగా
జీవితంలో బరువైన బస్తా నేనెప్పుడూ మోయలేదు..
ఈ పృథివిలో పద్యం మాత్రం లేదు.” (పే.37)

కాబట్టి కవి దృష్టిలో పద్యమంటే, ఒక పృథివి ని అన్వేషించడం, తనదైన ఒక దేశాన్నీ, ఒక కాలాన్నీ కనుగొనడం. అతడు రాసిన లాండ్ స్కేప్ అన్న కవితలో అటువంటి దేశకాలాలు కనిపిస్తాయి, అయితే, ఇవి మేఘదూతం నుంచి పుట్టినవి కావు, ఒక పడికట్టు పదం గా మారిపోయిన మేఘాన్ని తొలగించి, అక్కడ మేఘాల్లేని పసుపు రంగు ఆకాశాన్ని ప్రతిష్టించిన లాండ్ స్కేప్:

“మైళ్ళకు మైళ్ళు ఆకుపచ్చని వరిపొలాలు
చేలగట్లు కనపడవు గలపంటకాలువ నీళ్ళు
అక్కడక్కడ ముళ్ళకంపలు ఇరుకుదారి తాటిపుంతలు
ఒక చిన్న నీలిరంగు పిట్ట ఎగిరి ఎగిరి తప్పింది దారి
రెండో ఝాము ఎండ నదిమీద ఆవిరి, దూరపు కొండల్లో నిప్పు
నక్కల బొరియల మూతుల్లో గుప్పెడు గుప్పెడు రాళ్ళ ముక్కలు.

అక్కడ పల్లెలో కాబోలు రాతిరి నిశ్శబ్దం, ఒక్క చిన్నపిట్ట,
కొత్త గుడిసె కప్పు మీద పాకిన బీరతీగె
సగం తెరిచిన తలుపు ఇంటిలో రోలు రోకలి చప్పుడు
బార్లగా తెరిచిపడి ఉంది ఆలోచనలు లేని పిల్ల మనసు
గుమ్మడిపూలలో అటూ ఇటూ తిరుగుతూ సీతాకోకచిలుక
దారిపక్కన కింద ఎండిపడి ఉంది బురద జీవితం.

రెండవ ఝాము స్తబ్ధత, మేఘాలు లేని పసుపు రంగు ఆకాశం
ఇక్కడ నా నది చుట్టూ వణుకుతూ పోసిన ఇసుక గుట్టలు
అలసిన దేహం, నిశ్చల చింతనకి బలహీనం
రెండవ ఝాము ఎండ తుక్కునంతా కడుగుతుంది
నది ఒడ్డున ఉల్లాసంగా వినవస్తుంది వంశీరవం
పూలై వికసిస్తుంది లాండ్ స్కేప్ నా మనశ్శాఖలో”.

ఈ కవితని పూర్తిగా ఉల్లేఖించడానికి కారణం, ఇక్కడ పాతదేశకాల స్ఫురణ విధ్వంసమై కొత్త లాండ్ స్కేప్ ఆవిష్కరణ సంపూర్తిగా జరగడమే. ఇక్కడ లాండ్ స్కేప్ లో జరిగిన దాన్నే తనకి జరిగినట్టుగా ఆరోపించుకుని చెప్పిన కవిత ‘అవ్యయ’.

ఆ కవితను కూడా ఉదాహరిస్తే, నేను చెప్పేది పూర్తిగా స్పష్టమవుతుంది.

“నిన్న ఏ సమయంలో నువ్వు నాతో తిరగడానికి బయలుదేరావో
ఏడణాలిచ్చి రిక్షా ఎక్కి అకస్మాత్తుగా సముద్రపు వడ్డుకు
నీకు తెలిసిందా నేను హఠాత్తుగా చనిపోతానని
నేను ఇక్కడ ఉండనని, నాతో పాటు నువ్వు రొట్టె తినటానికి.

మనం ఇద్దరం మౌనంగా కూచున్నాం
ఏతావాతా కబుర్లు చెప్పుకుంటున్నాము
పక్కనే అలలు నిర్విరామంగా గంటలు కొడుతున్నాయి
వెలిసిపోతున్న వెన్నెల లో నేను చూశాను
నా రక్తమాంసాలు పాముకుబుసంలా జారి
ఇసుకలోనో, సముద్రం నీళ్ళలోనో పడటం.

నువ్వు తరువాత ఒంటరిగా వెళ్ళిపోయావు
తలుపు తాళం తీశావు, స్విచ్ వేసి చూశావు
కుర్చీలో కూచొని వున్నది నా ప్రేతాత్మ
నిన్ను పక్కకు పిలిచి చెప్పింది ‘మూసెయ్యి, ఆ తలుపు నాది,
చూడు నా ఎముకల బాధ, చూడు నా మండే పుర్రె’ అని.

నేను ఎన్ని సార్లు రాశానో నా పేరు సముద్రపొడ్డున ఇసుకలో
నేను చెప్పాను, నా మనసు పాటలమయం, నీలిరంగు సరివితోట.
ఆఫీసు కుర్చీలో కూచొని లెక్కపెట్టాను నా జీతపురాళ్ళు
మృత్యువుకీ, స్వర్గలోక జన్మకీ కారణాలు వెతికాను.

ఉదయం హఠాత్తుగా చూశావు నువ్వు
పళ్ళు తోముకుంటున్న నన్ను
న్యూస్ పేపర్ లో చదువుతున్నాను నా చావుకబురు.
నేను అంటున్నాను
‘నువ్వు ఎంత అందంగా ఉన్నావు, ఇవాళ ఆదివారం, కదూ!’ అని!
నా జేబులో మిగిలి ఉన్నాయి గుప్పెడు గవ్వలు
దూరంగా మిగిలిన నీలి సముద్ర జలస్మృతులు.”

అవ్యయం అంటే వ్యయంకానిదని. విధ్వంసానంతరం కూడా అవ్యయంగా మిగిలేదేమిటనేదే కవి వెతుకులాట.

అనుభవం వ్యయమవుతుంది, అక్షరం అవ్యయం.

అటువంటి అవ్యయాక్షరం కోసం కవి పడ్డ తపన సౌభాగ్య కుమార మిశ్ర కవిత్వం. ఆ కవిత్వాన్ని ఎంతో శ్రమతో, ప్రతిఫలాపేక్షలేని సాహిత్యప్రేమతో మనకి అందించిన వేలూరి వెంకటేశ్వరావుగారికి ఏమివ్వగలం? మరికొంత ఒరియా కవిత్వాన్ని మనకి అందించమని అడగటం తప్ప!

20-8-2016

Leave a Reply

%d bloggers like this: