ఆదివారం సాయంకాలం ఐఏఎస్ స్టడీ సర్కిల్లో అబ్దుల్ వాహెద్ కవిత్వం ‘ధూళిచెట్టు’ పుస్తకావిష్కరణ జరిగింది. ఆ పుస్తకం ముడివిప్పే అవకాశం నాకు లభించింది.
తొలినుంచీ ముస్లిం కవులు తెలుగు సాహిత్యానికి, ముఖ్యంగా కవిత్వానికిస్తున్న ఉపాదానం చాలా విశిష్టమైంది. మల్కిభరాముడి మొదలుకుని ఉమర్ ఆలీషా, వజీర్ రెహ్మాన్, ఇస్మాయిల్, స్మైల్,ఖాదర్, రవూఫ్, అఫ్సర్, యాకూబ్,మహెజబీన్ ల నుండి నేటి షాజహానా దాకా ఒక భావుక పరంపర మన సాహిత్యానికొక సౌకుమార్యాన్నీ, గాఢత్వాన్నీ పరిచయం చేస్తూ ఉంది. అబ్దుల్ వాహెద్ కూడా ఈ కోవలో వాడేనని ఈ వచన కవితాసంపుటి సాక్ష్యమిస్తోంది.
నిజానికి వాహెద్ కవిత్వం రాయకపోయినా, ఉర్దూ పారశీక కవిత్వాల గురించిన అతడి పరిచయవ్యాసాలకే జాతి అతడికి ఋణపడి ఉంటుంది. సదాశివ, శేషేంద్రల తర్వాత ఆ స్థాయిలో ఉర్దూ, పారశీక కవిత్వాల గురించి అతడు మనతో పంచుకుంటున్నాడు. ఈ మధ్య విడుదలైన అతడి పుస్తకం ‘సోషలిస్టు సూఫీ ఫైజ్ అహ్మద్ ఫైజ్’ ఒక్కటి చాలు అతడిని భావుక హృదయాల్లో సుస్థిరంగా నిలపడానికి.
అయినా వాహెద్ కవిత్వం రాసాడు. అది కూడా వచనకవిత్వం. దాని వెనక యాకూబ్ ప్రేరణ ఉందని చెప్పుకున్నాడు. అందులో అతడేమి చెప్పుకుంటున్నాడు? నిజానికి, ఏదైనా ఒక కవితాసంపుటి రాగానే త్వరత్వరగా చదివేసి ‘ఈ కవి ఇదీ, ఇతడి భావజాలమిదీ’ అని చెప్పెయ్యడం, లేబుల్ తగిలించడం, ఆ కవికి మాత్రమే కాదు,మనకి మనం చేసుకునే అన్యాయం కూడా.
నా మటుకి నాకు కొత్త కవిత్వం చదవగానే మనసంతా numb గా అయిపోతుంది. ఒకలాంటి తిమ్మిరి. నగరం నాలుగురోడ్ల కూడలి మధ్య ట్రాఫిక్ జామ్ అయినట్టు, ఆలోచనలన్నీ ఆగిపోతాయి. ముందొక స్తబ్దత ఏర్పడుతుంది. ఎందుకంటే,అంతదాకా ఈ ప్రాపంచిక, దైనందిన విషయాల చుట్టూ పరిభ్రమించే మన చైతన్యాన్ని, అట్టగట్టుకుపోయిన పై పెంకుని ఆ కవిత్వం గుంజేస్తుంది. అప్పుడు నెమ్మదిగా, మళ్ళా మళ్ళా చదివి, చదువుకుని ఆ కవి భావనా ప్రపంచంలోకి ఎక్కివెళ్ళడానికి ప్రయత్నిస్తాను. అప్పుడది నాలోని సూక్ష్మలోకాల్ని మేల్కొల్పి నాలోని నాకు నన్ను సన్నిహితంగా తీసుకువెళ్తుంది.
ఆ రోజు ఆ కవిత్వం మీద మాట్లాడిన ముగ్గురు వక్తలూ, శ్రీరామోజు హరగోపాల్, రాజారామ్ తూముచర్ల, కాసుల ప్రతాపరెడ్డి అద్భుతంగా మాట్లాడేరు. వాళ్ళ మాటలవల్ల వాహెద్ కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి నాకొక ఊతం దొరికింది.
వాహెద్ కవిత్వం చదివినప్పుడు నాకు కలిగిన భావం, అతడు పూర్వ కవి అధ్యయనం వల్ల, ముఖ్యంగా ఉర్దూ పారశీక కవుల అధ్యయనం వల్ల తన వాక్కుని సుసంస్కృతం చేసుకున్నాడని. అసలు కవిత్వం ఎందుకంటే, అది మన వాక్కుని శుభ్రపరుస్తుంది. తద్వారా మనకొక నవీన ఇంద్రియచేతనను అనుగ్రహిస్తుంది. గొప్ప కవిత్వం చదువుతూన్నందువల్ల ముందు మన వాక్కు శుభ్రపడి ఆ తర్వాత మన సంస్కారం కూడా శుభ్రపడుతుంది.
అందుకనే ఏ భాషలో కవులు విస్తారంగా ఉంటారో ఆ భాష గొప్పది. తెలుగులో కవులు చాలామందే ఉన్నారంటారు. అది నిజం కాదు. జనాభా ప్రాతిపదికన చూస్తే 11 కోట్ల మంది మాట్లాడే భాషలో ఎందరు కవులున్నారు? స్వీడన్, ఐర్లాండ్, పోలండ్, జపాన్ వంటి దేశాల్లో ఎందరు కవులున్నారు? ఐరిష్ లో, పోలిష్ లో , స్వీడిష్ లో ఒక్కొక భాషలో కనీసం ముగ్గురేనా కవులకి నోబెల్ బహుమతి వచ్చింది. తెలుగులో?
తెలుగు జాతి ఒకప్పుడు కవుల్ని ఆరాధించేది. వెయ్యేళ్ళ తెలుగు కవిత్వ ప్రస్థానాన్ని నేనొక్కప్పుడు మూడు మాటల్లో చెప్పాను. తొలిరోజుల్లో అంటే కవిత్రయకాలంలో కవి రాజగురువు. మధ్యకాలంలో అంటే శ్రీనాథుడు, ప్రబంధకవుల కాలంలో కవి రాజమిత్రుడు. ఆ తర్వాత రాజభృత్యుడు. ఇప్పుడు తెలుగువాళ్ళకి సినిమాహీరోలు, టెక్నీషియన్లు ఆరాధ్యదేవతలు. కాని, కవి కన్నా నిజమైన టెక్నీషియన్ ఎవరు? జెరోం రోథెన్ బెర్గ్ అన్నట్లుగా కవులు technicians of the sacred కాదా!
వాహెద్ కవిత్వం చదివినప్పుడు శుభ్రవాక్కు ఎలా ఉంటుందో మరొక్కసారి అర్థమయింది. ఇస్మాయిల్ గారు జీవితమంతా ఈ పనే చేసాడు, భాషని శుభ్రపరచడం. తెలుగు వక్తృత్వభాష. ఉర్దూ కూడా వక్తల భాషనే గాని, ఉర్దూ ఛందస్సులు ప్రతి కవితాపంక్తినీ సితార్ తీగెలాగా బిగించిపెడతాయి. ఆ తీక్ష్ణత, ఆ తీవ్రత, ఆ క్లుప్తత, ఆ గాఢత తెలుగు కవిత్వానికి చాలా అవసరం.
వాహెద్ రాసిన ఈ వాక్యాలు చూడండి:
‘ఉడికిన అన్నం మెతుకు వాసనలాంటిది ఈ ప్రేమ
కడుపులో ఆకలి నిధి దాచుకున్నవారికే
దీని విలువ తెలుసు ‘ (పే.41)
‘బాధితుడికే కాదు, దుర్మార్గుడికి కూడా సహాయం చేయాలి
దుర్మార్గం నుంచి ఆపడమే అతడికి చేసే పెద్ద సహాయం
చేస్తూనే ఉంటాం’ (పే.81)
‘కాస్త నీడలో సేదదీరాలనుకుంటున్న నీరెండ
అలవాటయ్యాక శూన్యమే సమస్తమనిపిస్తుంది’ ( పే.118)
‘జారుతున్న నేల కింద
కాస్త నేలను పోయాలి’ (పే.124)
‘స్వేచ్ఛ కనిపించని కట్టుతాడు’ (పే.157)
‘ఆలోచనలో తేమ మిగిలి ఉంటే
చేయడానికి సేద్యం చాల ఉంది’ (పే.211)
‘కాస్త కవితల కిటికీ తెరిచిపెట్టు
దాంట్లోంచి మనుషుల గాలి రావచ్చు’ (పే.106)
మనిషిగాలి వీచే చెట్టు ధూళి చెట్టు.
21-6-2016