ఒడెస్సీ-6

22

మీరు చెప్తున్న కథ వింటుంటే మహాభారతానికి దగ్గరగా ఉన్నట్టుంది, మీరు ఒడెస్సీని రామాయణం తో ఎందుకు పోల్చారు అని ఒక మిత్రుడు ప్రశ్నించారు.

నిజానికి, పురాణగాథలన్నిటిలోనూ ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఉమ్మడి ప్రతీకలూ, లక్షణాలూ కనబడతాయి. వీటిని ప్రసిద్ధ మనోతత్త్వవేత్త యూంగ్ archetypes అన్నాడు. అంటే నమూనా రూపాలన్నమాట. (వీటిని ప్రాగ్రూపాలు అని తెలుగులో అంటూంటారు). ప్రపంచమంతా మనుషుల అధోచైతన్యం కింద ఒక సామూహిక అంత:చైతన్యం ఉంటుందనీ (collective unconscious) ఆ ఉమ్మడి చేతనలోంచే పురాణగాథలు (myths) రూపుదిద్దుకున్నాయనీ మనోశాస్త్రజ్ఞులు వివరించారు.

యూంగ్ అనుయాయి జోసెఫ్ కాంప్ బెల్ అనే అమెరికన్ శాస్త్రజ్ఞుడు, సత్యాన్వేషి ప్రపంచవ్యాప్తంగా లభ్యమవుతున్న కొన్ని వేల పురాణగాథల్ని పోల్చి చూసి The Masks of God పేరిట నాలుగు సంపుటాలు వెలువరించాడు. తన అధ్యయన సారాంశాన్ని అతడు The Hero with a Thousand Faces (1949) అనే పుస్తకంగా వెలువరించాడు. అందులో అతడు స్వప్నాలకీ,జానపదకథలకీ, పురాణగాథలకీ ఒకటే కథాసూత్రం ఉంటుందనీ, వాటి ప్రయోజనం wish fulfillment అనీ తీర్మానించేడు. ఈ వరసలో ఇప్పుడు మనం ఫార్ములా సినిమాల్ని కూడా చేర్చుకోవచ్చు. వీటన్నిటిలోనూ అంతర్గతంగా ఉన్న కథానిర్మాణాన్ని అతడు mono-myth అన్నాడు. అంటే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పురాణగాథ ఒకటే, దాన్నే వేరు వేరు జాతులు, వేరు వేరు భాషల్లో వేరు వేరు విధంగా చెప్పుకుంటాయి అని.

ఆ ప్రకారం, అతడు గ్రీకు వీరుడు ఒడెస్యూస్ అయినా, సింద్ బాద్ అయినా, రాముడైనా , పాతాళ భైరవిలో తోటరాముడైనా ప్రతి ఒక్క వీరుడి ప్రస్థాన మార్గం ఒక్కటే.

అందులో మూడు భాగాలు: పిలుపు, ప్రయాణం, పునరాగమనం. మొదట అతడికొక పిలుపు వినిపిస్తుంది. అక్కడితో అతడి ప్రయాణం మొదలవుతుంది. ఆ క్రమంలో అతడికి దైవిక సహాయం అందుతుంది. అతడు ప్రయాణించవలసిన లోకం సాధారణంగా అజ్ఞాతమూ, అవ్యక్తమూ అయి ఉంటుంది. దానిలోకి ప్రవేశించడానికి ముందు ద్వారపాలకుల్ని దాటవలసి ఉంటుంది.అతడు సింహద్వారం దాటగానే అవ్యక్తలోకం మొదలవుతుంది. ఆ లోకం మొదలయ్యే ముందే ఒక మార్గదర్శి లేదా సహాయకుడు కనిపిస్తాడు. సాధారణంగా అతడు మారువేషంలోనే కనిపిస్తాడు. ఆ తర్వాత ఎన్నో ప్రలోభాలు, సవాళ్ళు, ఒడిదుడుకులు మొదలవుతాయి. వాటి పరాకాష్టగా అతడు తన identity ని కోల్పోయే పరిస్థితి సంభవిస్తుంది. అది ఒడెస్యూస్ నరకంలో అడుగుపెట్టినట్టు, రాముడు సీతను కోల్పోయినట్టు, ధర్మరాజు అజ్ఞాతవాసం చేసినట్టు లేదా నలుడికి సంభవించినట్టుగా, రాజ్యాన్నీ, భార్యనీ, రూపాన్నీ కూడా కోల్పోవలసి రావడం కావచ్చు. ఇక్కడిదాకా మామూలు మానవులంతా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక ఘట్టంలో అడుగుపెడతారు. కాని ఈ గండాన్ని గడిచిగట్టెక్కినవాడే వీరుడవుతాడు. అప్పుడతడికి వరసిద్ధి లభిస్తుంది. అది పునర్జన్మ లాంటిది. కాంప్ బెల్ దీన్ని సాక్షాత్కార క్షణమని కూడా అన్నాడు. అతడి మాటల్లో చెప్పాలంటే bliss. అది పొందినతర్వాత ఆ వీరుడికి విమోచన లభిస్తుంది. అతడు మళ్ళా కొత్తగా పుట్టినట్టు ఈ లోకంలో అడుగుపెడతాడు.

ఆ పునరాగమనం ఒడెస్యూస్ ఇథాకాకి రావడంలాంటిది, రాముడు అయోధ్యకు రావడం లాంటిది. క్రీస్తు wilderness లో నలభై రోజులు గడిపి సాతాను శోధనను తట్టుకుని తిరిగిమళ్ళా గలిలిసముద్రం ఒడ్డుకి రావడం లాంటిది. సిద్ధార్థుడు మారవిజయం సాధించి బుద్ధుడై తిరిగి సారనాథ్ లో తనకు కనబడ్డ నలుగురికీ ధర్మచక్రం గురించి బోధించడం లాంటిది.

ఇది మనం ప్రతి రాత్రీ మనకు తెలీకుండానే కనే ఎన్నో కలల్లో అంతర్గతంగా ఉన్న సూత్రమే. ఇంతకీ మనం కలలెందుకు కంటాం? దాని గురించి ఎన్నో సిద్ధాంతాలు వచ్చాయి. కాని అంతిమంగా కలల ప్రయోజనం ఒకటే, అది మనల్ని మన అవ్యక్తలోకంలోకి తీసుకువెళ్తుంది. అక్కడ మనం కోరుకున్న కోరికలు క్షణమేనా తీరాతాయి. అట్లా తీరడం గొప్ప మానసిక అవసరం.

మనం ఫార్ములా సినిమాలు చూస్తున్నప్పుడు మనకు తెలీకుండానే ఈ bliss కి లోనవుతాం. కాని అది చాలా స్థూలంగానూ, కేవలం మానసిక ఉపరితలంలోనూ మాత్రమే సంభవించే సంతోషం. ఒకసారి ఆ సినిమా చూసేసాక ఆ సంతోషం పాతబడిపోతుంది.కాని ఇతిహాసాలు చదువుతున్నప్పుడూ, పురాణగాథలు వింటున్నప్పుడూ మనం లోనయ్యే wish fulfillment పై పైన జరిగేది కాదు. దానిలో తరతరాల అనుభవాలూ, జ్ఞాపకాలూ క్రోడీకరింపబడి ఉంటాయి. అవి వాటిని వింటున్న ప్రతిసారీ కొత్త అర్థాల్తో, కొత్త సంకేతాలతో మనల్ని నివ్వెరపరుస్తూనే ఉంటాయి.

ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న వివిధ పురాణగాథల మధ్య ఒక సారూప్యత ఉందనేది తత్త్వవేత్తల్ని కూడా ఆకర్షించింది. ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభంలో ఫెర్డినాండ్ డి ససూర్ అనే ఒక భాషావేత్త ఉండేవాడు.అతడు భాషని వాక్కు అనీ, భాష అనీ రెండు రకాలుగా విభజించాడు. భాష (langue) అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే ఒక మానసిక సంజ్ఞావ్యాపారం.దానిలోంచి ఎక్కడికక్కడ నిర్దిష్ట సమయంలో మనుషులు స్వీకరించే పదజాలం వాక్కు(parole). ఈ సూత్రాన్ని పురాణగాథలకి అన్వయిస్తూ లెవి స్ట్రాస్ అనే ఫ్రెంచి మానవశాస్త్రవేత్త Introduction to a Science of Mythology (1964-71) నాలుగు బృహత్తరసంపుటాలు వెలువరించాడు.

మనిషిలోని అవ్యక్త ఆకాంక్షలూ, భయాలూ, ఆందోళనలుంచి పురాణాలు రూపొందేయని మనస్తత్వవేత్తలు భావిస్తే, ఒక అంతర్గత తర్కం ప్రకారం పురాణగాథలు రూపొందేయని స్ట్రాస్ వాదించేడు. మరొకవైపు వ్లదిమీర్ ప్రాప్ అనే రష్యన్ సాహిత్యవేత్త, జానపదకథల్ని భాషా, వ్యాకరణ సూత్రాల ప్రకారం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేడు. అందులో అతడు జానపదకథల్ని functions ప్రకారం విశ్లేషిస్తూ A Morphology of a Folktale (1928) అనే అపూర్వమైన పరిశోధన వెలువరించాడు.

వీరందరూ చెప్పినదాని ప్రకారం పురాణగాథల్లోనూ, ఆ విధంగా మానవుడి భాషావ్యవహారం లోనూ, ఆలోచనలోనూ ఒక అంతర్గనిర్మాణం ఉంది. అటువంటి ఒక structure ను ఊహించారు కాబట్టి వాళ్ళని structuralist తత్త్వవేత్తలు అన్నారు.

కాని 60 ల తర్వాత ఆ వాదం మీద పెద్ద తిరుగుబాటు తలెత్తింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పురాణకథల్లో ఒకే అంతర్గత నిర్మాణం ఉంటే, మరి ఆ కథనాల్లో అన్ని వ్యత్యాసాలెందుకున్నాయి? ఒకే వీరుడు గ్రీకులకి ఒడెస్యూస్ గానూ, భారతదేశంలో రాముడిగానో, లేదా యుధిష్ఠిరుడిగానో ఎందుకు కనిపిస్తున్నాడు? ఈ ప్రశ్నలు వెయ్యడంతో post structuralism మొదలయ్యింది.

10-1-2017

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s