ఒడెస్సీ-5

21

మళ్ళా ప్రయాణం మొదలుపెట్టేటప్పటికి ఒడెస్యూసూ, అతడి అనుచరులూ పూర్తిగా అలసిపోయి ఉన్నారు. సుఖకరమైన ప్రయాణానికి, అలసటా, ఆకలీ తోడయ్యాయి. వారి ప్రయాణంలో సూర్యద్వీపం తారసపడింది, అక్కడి పచ్చికలో సూర్యుడి గోవులు చరిస్తున్నాయి. ‘ఎట్టి పరిస్థితిలోనూ ఈ దీవి దగ్గర ఆగవద్దని చెప్పింది సర్సి’ అన్నాడు ఒడెస్యూస్ తన నావికులతో. కాని అలసిపోయిన ఆ దళం అతడి మాట వినలేదు. ‘ఒకవేళ ఆగవలసి వస్తే, ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ గోవులకి హాని చెయ్యకూడదు’ అన్నాడతడు. కాని, ఎప్పట్లానే ఆ నాయకుడి మాటలు ఆ అనుచరులు పెడచెవిన పెట్టారు.

అలసిపోయిన ఒడెస్యూస్ కి నిద్రపట్టగానే ఆ అనుచరులు ఒక గోవుని వధించి భక్షించేరు. తన గోవులమీద జరిగిన అత్యాచారం గురించి సూర్యుడు సర్వేశ్వరుడికి మొరపెట్టుకున్నాడు. మరోసారి ఆ యాత్ర శాపగ్రస్తమైంది. ఉరుము పడి, ఆ నౌక భగ్నమైపోయింది. ఆ నావికులంతా మునిగిపోయారు. విరిగిన నౌక కొయ్యనొకదాన్ని పట్టుకుని ఒడెస్యూస్ ఒక్కడూ మరొక దూరతీరానికి కొట్టుకుపోయాడు.

అట్లా కొట్టుకు పోయిన ఒడెస్యూస్ చేరుకున్న దీవిలో కాలిప్సో అనే ఒక ఒంటరి అప్సరస నివసిస్తూ ఉంది. ఆమె ఒడెస్యూస్ ని ఆదరించింది.అన్నం పెట్టింది. అతడి ఆలనా పాలనా చూసుకుంది. అతడికి స్వర్గసుఖాలు చవి చూపింది. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, ఏడేళ్ళ పాటు అక్కడ ఒడెస్యూస్ అత్యంత సౌకర్యవంతమైన, సుఖప్రదమైన జీవితం జీవించాడు. కాని బంగారు పంజరంలాంటి జీవితాన్ని అతడు లోపల్లోపల గాఢంగా తిరస్కరిస్తూనే ఉన్నాడు. కాని సైక్లోప్స్ నుంచి బయటపడ్డప్పుడు అతడిలో ఉన్న భుజబలంగాని, సర్సి కి లొంగకుండా ఉండగలిగినప్పటి మానసిక బలం గాని అతడికిప్పుడు లేవు. అతడికి ఉన్న ఏకైక ఆధారం అతడి జ్ఞాపకాలు మాత్రమే. తన ఊరు, తన ఇల్లు, తన భార్య, తాను యుద్ధానికి వెళ్ళేటప్పుడు పొత్తిళ్ళల్లో ఉన్న తన బిడ్డ.

అతివేగాకులమై,జీవితశకలపార్శ్వాలనూ విశీర్ణం చేసి, తననొక అపరిచితుడిగా ఒక ఒంటరి దీవికి నెట్టిన సముద్రం ముందు తన identity ని నిలుపుకోగలిగే ఆధారాలు అవే. తాను ఒడెస్యూస్ ని అని చెప్పుకోవడానికి తాను ఎట్లాగైనా ఇథాకా చేరుకోవాలి.

కాలిప్సో అతణ్ణి చాలా ప్రేమించింది. అతడికి అమరత్వాన్ని ఇస్తానంది. నిత్యయవ్వనుడిగా ఉంచుతానంది. తామిద్దరూ ఆ ఏకాంతద్వీపంలో అనంతకాలం పాటు అట్లా సుఖిస్తూ ఉండవచ్చని చెప్పింది. అంతేకాదు, అతడి తిరుగుప్రయాణం మరింత బాధాకరంగా ఉండకతప్పదనీ, కాబట్టి తిరిగిపోవాలనే ఆలోచన వదులుకొమ్మనీ చెప్పింది. కాని ఒడెస్యూస్ ఇట్లా అన్నాడు:

‘ఓ దేవతా, నా మీద కోపం తెచ్చుకోకు. నాకు తెలుసు, నా భార్య పెనెలోపి నీ అంత స్ఫురద్రూపి కాదు, నీ అంత సౌందర్యవతి కూడా కాదు. ఆమె కేవలం మనిషి మాత్రమే,నువ్వో, దేవతవి. అయినా కూడా నాకు ఇంటికి వెళ్ళిపోవడం మీద తప్ప మరో ధ్యాస లేదు. నేను మళ్ళా సముద్రం మీద ప్రయాణం మొదలుపెట్టగానే మరో దేవుడెవరైనా నా మీద ఆగ్రహించి నా నౌకని విరిచెయ్యనీ, అయినా కూడా ఏదో ఒక విధంగా ఈదుకుంటూ పోగలను. ఇప్పటికే నేను భూమ్మీదా, సముద్రమ్మీదా కూడా చెప్పలేనంత కష్టం చవిచూసాను. ఇకముందు సంభవించే కష్టాలూ దాంతో పాటే అనుకుంటాను ‘

కాని ఆమె బాహుబంధాన్ని వదిలి పోగల సత్తువ అతడిలో మిగల్లేదు. అందుకని దేవతలే స్వయంగా జోక్యం చేసుకోవలసి వచ్చింది. దేవదూత హెర్మెస్ ఆమె దగ్గరకి వచ్చి, ఒడెస్యూస్ ని విడిచిపెట్టవలసిందిగా సూచిస్తాడు. ఆ మాట వినగానే ఆమె దేవుళ్ళని తిట్టింది. ఒక అప్సరస ఒక మనిషి ని ప్రేమిస్తుంటే దేవతలు అసూయతో రగిలిపోతున్నారంది. కాని చివరికి ఒప్పుకోక తప్పలేదు. ఆమె ఒక తెప్ప తయారు చేసి అకాశంలో నక్షత్రసముదాయాల గుర్తులు చెప్పి ఒడెస్యూస్ తన దేశం ఎట్లా చేరుకోవాలో చెప్పి పంపించింది.

కాని అతణ్ణి పోసీడాన్ ఇంకా విడిచిపెట్టలేదు. ఆ మహాసముద్రం మీద ఒక కొయ్యచెక్కమీద తేలుకుంటూ పోతున్న ఆ ఒంటరిమానవుణ్ణి దైవాగ్రహం వెన్నాడుతూనే ఉంది. మళ్ళా సముద్రం అల్లకల్లోలమయింది. ఆ కొయ్య కూడా కొట్టుకుపోయింది. ఎట్లానో ఈదుకుంటూ ఒడెస్యూస్ ఫియేషియన్స్ ద్వీపానికి చేరుకున్నాడు.

ఫియేషియన్స్ ద్వీపం ఒక యుటోపియా లాంటిది. వాళ్ళకి యుద్ధాలు తెలీదు. ఆయుధనిర్మాణం తెలీదు. గొప్ప కళలూ,నాట్యమూ, సంగీతమూ కూడా తెలీదు. వాళ్ళకి తెలిసిందల్లా శాంతిగా, సంతోషంగా జీవించడమే. వాళ్ళదింకా దేవుళ్ళకి దూరంగా జరగని జీవితం. వాళ్ళ దైనందిన జీవితంలో దేవుళ్ళు పాలుపంచుకుంటూనే ఉంటారు. ఆ ద్వీపానికి చేరుకున్న ఒడెస్యూస్ ని ఆ ద్వీపరాకుమార్తె నౌసికా చూసింది. అతణ్ణి తన ఇంటికి తీసుకువెళ్ళింది. ఆమె తండ్రి ఆ ద్వీపపాలకుడు. అతడికి ఒడెస్యూస్ తన సముద్రానుభవాల కథ చెప్తాడు. తనని తిరిగి తన దేశానికి చేర్చమని కోరుకుంటాడు.

అతణ్ణి సుదీర్ఘకాలం పాటు అతిథిగా ఆదరించి, విలువైన కానుకలతో అతణ్ణి ఆ ద్వీపపాలకుడు ఇథాకా పంపిస్తాడు. ఇథాకా చేరుకుంటూండగా అలసి నిద్రపోతున్న ఓడెస్యూస్ ను ఆ నావికులు తీరం చేర్చి వెనక్కి వెళ్ళిపోతారు.

అక్కడితో ఒడెస్సీలో సాహససముద్రయాత్రల కథనం పూర్తవుతుంది. ఆ తర్వాత మళ్ళా మరొక సుదీర్ఘకథ. ఒడెస్యూస్ మారువేషంతో తన ఇంటికి చేరుకోవడం, తమని పెళ్ళాడమని తన భార్యని నిర్బంధిస్తున్న పెద్దమనుషుల్తో యుద్ధం చేయడం, ఓడించడం హోమర్ చాలా వాస్తవికంగా చెప్పుకొస్తాడు.

కాని ఆ కథకి ప్రాతిపదికగా, వీరోచిత ఇతిహాసానికి భూమికగా చెప్పుకొచ్చిన సముద్రయాత్రల కథ (దాన్ని గ్రీకులో apologoi అంటారు) సుమారు మూడువేల ఏళ్ళుగా పాఠకుల్నీ, పండితుల్నీ కూడా ఒక్కలానే సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ ఉంది. ఆ కథల్లో మనల్ని ఆకర్షిస్తున్నదేమిటి? ఆ కథలు వింటున్నప్పుడు మనలో మనకే తెలీకుండా సంభవిస్తున్న రాసాయనిక చర్య ఏమిటి? ఆ కథలు వింటున్నప్పుడు, మన ‘ శైశవ చిత్రనిద్రలో ఏ ప్రాచీన స్మృతులూచేచప్పుడు’ వినవస్తున్నది?

ఎన్నో వ్యాఖ్యానాలు. అన్ని వివరణలూ అద్భుతంగా ఉంటాయి. వాటిని చదవడమే గొప్ప విద్య. కాని ఏ ఒక్క వ్యాఖ్యానం దగ్గరా మనం ఆగిపోలేం. ఆ కథలన్నిటినీ, మన నిత్యజీవితంలో సంభవించే సాధారణ సంఘటనల్లోకూడా గుర్తుపడుతూ ఒక జాయిస్ ఒక యులిసెస్ వంటి నవల రాసాక కూడా, ఆ మాట కొస్తే, ఆ తర్వాత కూడా ఒడెస్సీకి మరిన్ని వ్యాఖ్యానాలు వెలువడుతూనే ఉన్నాయి.

9-1-2017

Leave a Reply

%d bloggers like this: