ఒడెస్సీ-4

20

ఒడెస్యూస్ ఇథాకాకి తిరిగి ఎట్లా వెళ్ళాలో సర్సికి తెలిసినప్పుడు ఆమె అతణ్ణి నరకానికి వెళ్ళి టైరీషియస్ ని అడగమనడంలో అర్థం లేదనీ, హోమర్ శిల్పంలో అదొక లోపమనీ కొందరు వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. కాని, నిశితంగా పరిశీలిస్తే, ఆ అభిప్రాయం తప్పని గుర్తిస్తాం. సర్సికి తిరిగివెళ్ళే దారి తెలుసుగానీ, ఒడెస్యూస్ భవిష్యత్తు ఎట్లా ఉంటుందో చెప్పగలిగే సామర్థ్యం ఆమెకి లేదు. సుగ్రీవుడికి నాలుగుదిక్కులూ తెలిసినప్పటికీ, సీత ఏ దిక్కున ఉంటుందో తెలియనట్టే. అంతేకాదు, నరకానికి వెళ్ళి వచ్చిన తరువాతనే ఒడెస్యూస్ నిజమైన మనిషిగా మారాడు. ఎందుకంటే, అక్కడే అతడికి తన మర్త్యత్వం విలువ ఏమిటో నిజంగా బోధపడింది. పాతాళాన్నించి అతడు మళ్ళా సూర్యపథాన్ని పట్టుకుని భూమ్మీదకు వచ్చాడని హోమర్ చెప్తున్నప్పుడు, సౌరలోకకాంతితో అతడు పునర్భవించాడనే ఆయన చెప్తున్నాడు.

ప్రపంచంలోని మహేతిహాసాల్లో, ఈ ఘట్టానికి సమానమైన సన్నివేశాలు మరికొన్ని- గిల్గమేష్ ఉత్నపిష్టం ని కలుసుకుని అమరత్వం గురించి అడగడం, సుమేరియన్ దేవత ఇనానా నరకంలోకి అడుగుపెట్టడం, వర్జిల్ దారిచూపుతూండగా డాంటే ఇన్ ఫెర్నో లో అడుగుపెట్టడం వంటివి లేకపోలేదు. కాని, మహాభారతంలో స్వర్గారోహణ పర్వంలో ధర్మరాజు నరకంలోకి అడుగుపెట్టిన సన్నివేశం శిల్పరీత్యా, వస్తురీత్యా వీటన్నటి కన్నా మరింత ప్రగాఢమైంది.

యుద్ధరంగంలో చెప్పుకోగదగ్గ వీరత్వాన్ని ఎన్నడూ ప్రదర్శించి ఉండని ధర్మరాజును యుధిష్ఠిరుడిగా (యుద్ధంలో స్థిరంగా నిలబడేవాడిగా) భారతకారుడు చూపించిన మూడు సన్నివేశాల్లోనూ అది మూడవది. ( మొదటి రెండూ, కామ్యకవనంలో ఒక యక్షుడి ప్రశ్నలకు సమాధానం చెప్పినప్పుడు, రెండవది, తనను అనుసరించిన కుక్కకికూడా చోటులేకపోతే తనకి స్వర్గంతో పనిలేదన్నప్పుడు.) ఈ మూడు పరీక్షల్లోనూ చివరి పరీక్షని ధర్మజుడు పరీక్షగా భావించనే లేదు. అక్కడ ఆయన ప్రవర్తన తన నైజ స్పందన. తన సోదరులు, ముఖ్యంగా కర్ణుడు నరకంలో మగ్గుతుండగా తాను వాళ్ళని వదిలి ఒక్క అడుగు కూడా మరల్చలేనని, వారికి స్వాంతన కలిగించడంకోసం తాను శాశ్వతంగా నరకంలోనే నిలిచిపోవడానికి సిద్ధమని ధర్మరాజు చెప్పడంతో మహాభారతసందేశం పరిపూర్ణమైంది.

కాని ఒడెస్యూస్ నరకంలోనే ఉండిపోవడానికి ఇష్టపడలేదు. హెర్క్యులస్ ని చూసిన తరువాత థేసియస్ వంటి దేవతాసమానులైన మరికొందరు పూర్వగ్రీకు వీరుల్ని చూడవచ్చునని ఒక క్షణం నిలబడ్డాడుగాని, ఇంతలోనే, నరకాధిదేవత తన ముందుకి మెడుసాని పంపిస్తుందేమోనని భయానికి లోనయ్యాడు. గ్రీకు పురాణాల్లో మెడుసా ఒక భీకరరూపిణి. భరించలేని ఏహ్యత కల్గించే రూపమది. ఆమెని ముఖాముఖి చూసినవాడు శిలగా మారిపోతాడు. తాను ఆమెని ఎక్కడ చూడవలసి వస్తుందోనని ఒడెస్యూస్ భయపడి త్వరత్వరగా నరకం నుంచి బయటపడతాడు.

నరకంలోకి నిర్భయంగా అడుగుపెట్టగలిగిన ఒడెస్యూస్ మెడుసాని చూడటానికి ఎందుకు భయపడ్డాడు? అందులో కొందరు వ్యాఖ్యాతలు స్త్రీద్వేషాన్ని ఊహించారు. కాని అది నిజంకాదు, నరకంలో ఒడెస్యూస్ కి వరసగా తన తల్లితో సహా, ఎందరో స్త్రీలు కనిపించారు. అతడు నిజంగా ద్వేషించవలసిన స్త్రీ, ఆగమెమ్నాన్ భార్య, తన ప్రియుడితో కలిసి తన భర్తను వధించిన, క్లీటెం నెస్ట్రా కనిపించనే లేదు. ఒడెస్యూస్ మెడుసాను చూడటానికి భయపడటంలో గొప్ప మెటఫర్ ఉంది. మెడుసాని చూసినవాళ్ళు రాళ్ళుగా మారిపోతారు. తానింకా నరకంలో మరికొంతసేపు ఉంటే, తాను కూడా పాషాణ హృదయుడిగా మారిపోతానని ఒడెస్యూస్ భయపడ్డాడు. అతడిలో జీవితేచ్ఛ మరింతగా రగిలిన క్షణమది. అందుకనే మరొక్క క్షణం కూడా అతడక్కడ ఉండటానికి ఇచ్చగించలేదు.

ఒడెస్యూస్ తిరిగి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసి సర్సి అతడికి మార్గమధ్యంలో ఎదురుకాగల మరొక రెండు ప్రమాదాల గురించి చెప్పింది.

మొదటిది, సైరెన్లు. సముద్రమ్మీద నావికులు ప్రయాణిస్తున్నప్పుడు వారిని తమ సుందరగీతాలతో ఆకట్టుకునే శకుంతకన్యలు వాళ్ళు. ఆ నావికులు ఆ గానానికి లోబడగానే వాళ్ళ చుక్కానులు దారితప్పి వారు సముద్రంలో మునిగిపోతారు. అందుకని సర్సి ఒడెస్యూస్ తో అతణ్ణీ అతడి నావికులందరినీ చెవిలో మైనం పెట్టుకుని ప్రయాణించమని చెప్తుంది. కానీ తీరా ప్రయాణం మొదలయ్యాక ఒడెస్యూస్ కి ఆ గానం వినాలనిపిస్తుంది. అతడు తనని తెరచాపకొయ్యకు బంధించమనీ, తానెంత అరిచినా కట్లు విప్పవద్దనీ నావికులకి చెప్తాడు. నావికుల చెవుల్లో మైనం పోస్తాడు. వాళ్ళట్లా ఆ శకుంతకన్యల గానాకర్షణ దాటి బయటపడతారు. ‘నాకు ఆ గానం మరింత మరింత వినాలనిపించింది. కట్లు తెంచుకుని సముద్రంలో ఈదుకుంటూ పోవాలనిపించింది’ అంటాడు ఒడెస్యూస్ ఆ మలుపు తిరిగాక తన అనుచరులతో.

కాని ఆ తరువాత దాటవలసిన విపత్తు ఒడెస్యూస్ శౌర్యాన్ని నిజంగా పరీక్షకు పెట్టింది.

ఆ తర్వాత మార్గంలో అతడొక ఇరుకైన జలసంధిని దాటవలసి ఉంటుంది. అక్కడ మరీ ఇరుకైన చోట ఒకవైపు ఆరుతలల రాక్షసి సిల్లా ఉంటుంది. ఆమె ఆ దారినపోయే వారిని ఏకకాలంలో ఆరుగురిని తన చేతుల్లోకి లాక్కుని భక్షించేస్తుంది. ఆమెని తప్పించుకుందామంటే, అవతలి వైపు చారిబ్డిస్ అనే రక్తపు బుగ్గ ఉంటుంది. అది క్షణక్షణం నోరుతెరిచి అందినవాళ్ళను అందినట్టే గుటకేస్తూ ఉంటుంది. ‘నేను నా ఒక్క నౌకనీ ఒక్క క్షణంలో దాటించలేనా ఆ ఇరుకుదారిని?’ అనడుగుతాడు ఒడెస్యూస్ సర్సిని. ‘మరొకదారిలేదు. అది నీ శౌర్యం చూపించే తావు కానే కాదు.నీ నావికుల్లో ఒక ఆరుగురిని పోగొట్టుకోవడమా లేక మొత్తమంతా రక్తంమడుగులో మునిగిపోవడమా’ ఏదో ఒకటే సాధ్యమవుతుంది నీకు ‘ అంటుంది సర్సి.

అయినా ఒడెస్యూస్ ఉండబట్టలేక కవచం ధరిస్తాడు.కత్తి చేతుల్లోకి తీసుకుంటాడు. కాని తీరా ఆ క్షణం వచ్చేటప్పటికి, సిల్లా ఆరుచేతులూ చాచి ఆరుగురు నావికుల్ని అమాంతం మింగేస్తూండగా, వారు తమని రక్షించమంటూ ఒడెస్యూస్ ని ప్రార్థిస్తూ, దీనంగా, వేడుకుంటూ ఉండగా అతడేమీ చెయ్యలేక నిస్సహాయింగా చూస్తూ ఉండిపోతాడు.

‘నా సముద్రప్రయాణాలన్నిటిలోనూ నేను చూసినవాటన్నిట్లోనూ అత్యంత బాధాకరమైన దృశ్యమది’ అంటాడు ఒడెస్యూస్ తన కథ చెప్తూ.

8-1-2017

Leave a Reply

%d bloggers like this: