ఒడెస్సీ-3

19

ఈవొలస్ ద్వీపం నుంచి మళ్ళా తన నౌకలతోనూ, నావికులతోనూ అగమ్యంగా సముద్రం మీద బయలుదేరిన ఒడెస్యూస్ ని అల్లకల్లోలంగా ఉండే సముద్రం మరీ తీరానికి నెట్టివేసింది. అక్కడొక పొడవైన యువతి వాళ్ళకు కనబడి తమ ఇంటికి ఆతిథ్యానికి రమ్మని ఆహ్వానించింది. అక్కడికి వెళ్ళాక గానీ, ఒడెస్యూస్ కి అసలు సంగతి తెలిసి రాలేదు. వాళ్ళు రాక్షసకాయులు, లాస్ట్రిగోనియన్స్ అనే నరభక్షకులు. వాళ్ళు ఒడెస్యూస్ అనుచరుల్ని విరుచుకు తినేసారు. అతి కష్టమ్మీద ఒడెస్యూస్ వాళ్ళని తప్పించుకుని సముద్రం దగ్గరకి పరిగెత్తాడు. కాని వాళ్ళు బండరాళ్ళు దొర్లిస్తూ వెంటబడ్డారు. ట్రాయి నుంచి పన్నెండు నౌకల్తో బయల్దేరిన ఒడెస్యూస్ వాళ్ళను తప్పించుకుని మళ్ళా సముద్రం వదిలేటప్పటికి మిగిలింది ఒక్క నౌక మాత్రమే.

అక్కణ్ణుంచి ఆ ఒంటరి నౌక ఐయేయియా అనే ద్వీపానికి చేరుకుంది. అక్కడ కొన్నాళ్ళు గడిపేక, ఆ ద్వీపంలో విశేషాలేమున్నాయో తెలుసుకొమ్మని ఒడెస్యూస్ తన అనుచరుల్ని పంపించాడు. ఆ లోపల ప్రాంతంలో సర్సి (లేదా కిర్కి) అనే ఒక మంత్రగత్తె ఉందని వాళ్ళకి తెలుస్తుంది. ఆమె మనుషుల్ని ఆకర్షించి వాళ్ళకి ఆతిథ్యమిచ్చి పందులుగా మార్చేస్తుంటుంది. ఒడెస్యూస్ అనుచరుల్ని కూడా ఆమె పందులుగా మార్చేస్తుంది. వాళ్ళని వెతుక్కుంటూ బయలుదేరిన ఒడెస్యూస్ కి , దేవదూత హెర్మెస్ కనిపించి, ఆ మంత్రగత్తె గురించి చెప్తాడు. ఆమె ఆకర్షణనుంచి బయటపడే మార్గం చెప్తాడు. ఒడెస్యుస్ అతడు చెప్పినట్టే సర్సి ప్రలోభానికి లోనుకాకుండా నిలబడగలుగుతాడు. అప్పుడామె అతడికి తనని తాను అర్పించుకుంటుంది. అతడికోసం ఏమైనా చేస్తానంటుంది. తన అనుచరుల్ని మళ్ళా మనుషులుగా చెయ్యమని కోరుకుంటాడు.ఆమె వాళ్ళని మనుషులుగా మార్చగానే వాళ్ళు ఒడెస్యూస్ ని వెంటనే తమ దేశానికి తీసుకుపొమ్మని ప్రార్థిస్తారు. తాము తమ దేశానికి పోయే దారిచూపించమని సర్సిని అడుగుతాడు. ఆమె వాళ్ళకి స్థూలంగా తిరుగుప్రయాణం దారి వివరిస్తుంది కాని, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఒడెస్యూస్ పాతాళలోకం వెళ్ళి అక్కడుండే టైరీషియస్ అని అడగవలసి ఉంటుందని చెప్తుంది.ఆమె చెప్పినట్టే ఒడెస్యూస్ పాతాళలోకానికి ప్రయాణిస్తాడు.

గ్రీకు పురాణాల్లో hades నరకం, పాతాళం, పితృదేవతల లోకం. అమరత్వాన్ని కోరుకునే ప్రతిమనిషీ నరకలోకం చూడక తప్పదనేది మెసొపొటేమియా సాహిత్యం మొదలుకుని ఐరోపీయ ఇతిహాసాలన్నిటిలోనూ మనకి కనిపిస్తుంది. సుమేరియన్ ఇతిహాసం గిల్గమేష్ మొదలుకుని, వర్జిల్ రాసిన ఏనియాడ్, డాంటే డివైన్ కామెడీల తో సహా ఇలియట్ దాకా ప్రతి మహాకవి తాను నరకాన్ని స్వయంగా చూసి మనకు చూపించారు. ఇంతకీ waste land అంటే ఏమిటి? నిర్జీవ భూమి అనే కదా.

ఒడెస్యూస్ నరకలోకసందర్శన ఒడెస్సీకి అపారమైన తాత్త్విక గాఢతనీ, గౌరవాన్నీ సాధించింది. అక్కడ ఒడెస్యూస్ కి మరణించిన తన అనుచరుడు, తల్లి, టైరీషియస్ ల తో సహా, ప్రాచీన గ్రీకు వీరులు, పురాణ వీరులైన హెర్క్యులస్ తో సహా ప్రతి ఒక్కరు కనిపిస్తారు.

గ్రీకులందరిలోనూ మహా వీరుడెవ్వరు? హోమర్ ఈ ప్రశ్న కవిత్వదేవత నే అడిగాడు.

Tell me then Muse, who of them all was the best and the bravest
of the men, and the men’s horses. who went with the sons of Atreus

ఆ ప్రశ్నకు సమాధానం అన్వేషిస్తూ చెప్పిన కావ్యమే ఇలియడ్. కోపాన్ని నిగ్రహించుకోగలిగితే అకిలిస్ కన్నా గొప్ప వీరుడెవ్వరూ లేరని హోమర్ ఇలియడ్ లో అంటాడు. అంటే అందరికన్నా గొప్ప వీరుడు అకిలస్ అని చెప్పినట్టే కదా.

కాని, అక్కడ నరకలోకంలో అకిలిస్ కీ తనకీ మధ్య జరిగిన సంభాషణ గురించి ఒడెస్యూస్ ఇట్లా చెప్తాడు:

”అకిలిస్, ఇప్పటిదాకా నీ అంత అదృష్టవంతుడు మరొకడు లేడు. భవిష్యత్తులో కూడా ఉండబోడు. నువ్వు జీవించి ఉన్నంతకాలం నీ మనుషులు నిన్ను ఆరాధిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా మృతజీవులమధ్య కూడా నువ్వొక రాజకుమారుడిలాగా ఉన్నావు. కాబట్టి నువ్వు మరణించావన్నదేమంత పెద్ద విషయం కాదు’ అన్నాను.”

”అప్పుడు అకిలిస్ నాతో ‘ ఒడెస్యూస్, మృత్యువుని సమర్థిస్తూ ఒక్క మాట కూడా మాట్లాడకు. మరణించినవాళ్ళ మధ్య రాజాధిరాజుగా ఉండటం కన్నా, భూమ్మీద ఒక పేదవాడి ఇంట్లో నౌకరుగానైనా బతకడమే నాకు గొప్పగా తోస్తున్నది..’ అన్నాడు.”

మృతాత్మల లోకంలో ఈ సంభాషణ ఒడెస్సీ కావ్యానికి ఆయువుపట్టు. ఎందుకంటే, ఇక్కడ మానవుడి గృహోన్ముఖ తృష్ణ (nostos) మానవుడి యశం (kleos) తో అనుసంధానించబడిందని ఒక వ్యాఖ్యాత గొప్పగా వివరిస్తాడు. ( Keld Zeruneith, The Wooden Horse,The Liberation of Western Mind From Odysseus to Socrates, 2007, పే.211).

అకిలిస్ యశఃకాయం గొప్పది. కాని అది మానవుడి రెండు పురుషార్థాల్లోనూ సగాన్ని మాత్రమే పూరించగలిగింది. అతడు యశోవంతుడిగా తన ఇంటికి చేరుకోగలిగే ఉంటే, అప్పుడతడు పరిపూర్ణమానవుడై ఉండేవాడు. అలాగని ఒక మనిషి యుద్ధం నుంచి పారిపోయి ఇంటికి చేరుకోవడం కూడా పరిపూర్ణ పురుషార్థం కాదు. అప్పుడతడి భౌతికకాయం మాత్రమే మిగిలి ఉంటుందికాని, యశఃకాయం నశించి ఉంటుంది. మానవుడు అంతిమంగా కోరుకోవలసింది, జీవించడమే, కాని ఏదోలా కాదు, యశోవంతుడిగా. అకిలిస్ గ్రీకు వీరుడు, కాని దురదృష్టవంతుడు, అతడు యుద్ధరంగంనుంచి తిరిగి ఇంట్లో అడుగుపెట్టలేకపోయాడు. ఆ భాగ్యం ఒడెస్యూస్ కి లభిస్తుందనే అక్కడ కాలజ్ఞాని టైరీషియస్ ఒడెస్యూస్ కి వివరిస్తాడు.

నరకలోకం నుంచి తిరిగి మళ్ళా ఒడెస్యూస్ సర్సి దగ్గరికి వస్తాడు. అప్పుడామె వాళ్ళకి తిరుగు ప్రయాణానికి దారిచూపిస్తుంది. కాని, ఆ మార్గమధ్యంలో అతడు మరికొన్ని గండాలు గడిచి గట్టెక్కవలసి ఉంటుందని చెప్తుంది.

6-1-2017

Leave a Reply

%d bloggers like this: