ఒడెస్సీ-2

18

కొత్త సంవత్సరం సోమయ్యగారింట్లో గడిచింది. రావెల సోమయ్యగారు, అరుణగారి ఆతిథ్యం, వారి ప్రేమ, ఆప్యాయతా ఇప్పటి కాలానివి కావు. మధ్యాహ్నం భోజనాలయ్యాక, ‘ఇప్పుడు మీరు ఒడెస్యూస్ గురించి చెప్పండి’ అన్నాడు గంగారెడ్డి. రెప్పలమీంచి పాకుతున్న సన్నని కునుకు నాకు తెలీకుండానే జారిపోయింది. ‘రామాయణానికీ, ఒడెస్సీకి పోలిక చెప్పారు కదా, అదేమిటో ఇంకొంత వివరించండి’ అన్నారు సోమయ్యగారు.

ఏదైనా విషయం గురించీ రాయడంలో, మాట్లాడంలో ఉన్న ఉపయోగమేమిటంటే, ఆ వంకన, మనం ఆ విషయాన్ని మరింత బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. రాసేటప్పుడూ,మాట్లాడేటప్పుడూ మనలోపలి ప్రజ్ఞ ఒకటి యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మనకే తెలియని, మనం అంతదాకా ఊహించని చాలా insights ముందుకొస్తాయి.

ఒడెస్సీ చదివినప్పణ్ణుంచీ నాలోనేను కూడబలుక్కుంటున్న చాలా ఆలోచనలు, శకలాలుగా ఉన్నవి ఒక సాకల్యంతో స్పష్టమైన రూపుదిద్దుకోవడం మొదలయ్యింది.

ఒడెస్సీ, రామాయణమూ ఏ మాత్రం సంబంధం లేని కథలు. కాని వాటి వాటి సంస్కృతులమీద అవి చూపించిన ప్రభావం మాత్రం అపారం. ఆ కథల్ని హోమర్, వాల్మీకి ఇతిహాసాలుగా చెప్పినప్పుడు, తమ శ్రోతల అవసరాలకు తగ్గట్టుగా వాటిని నిర్మించారనీ, పునర్నిర్మించారనీ చెప్పవలసి ఉంటుంది. ఆ కథనాలవెనక, వారి కాలాలూ, వారి వారి సాంస్కృతిక అవసరాలూ ఉన్నాయనిపిస్తుంది.

ఒడెస్సీలో ప్రధాన ఇతివృత్తం ఒక మనిషి తన స్వదేశానికీ,తన స్వగృహానికీ తిరిగి రావాలనుకోవడం. మధ్యలో ఎన్నో కష్టనష్టాలకోర్చి చివరికి తన ఇంటికి చేరుకోవడం, తన భార్యనీ, కొడుకునీ, తండ్రినీ కలుసుకోవడం. కానీ, ఆ క్రమంలో ఒడెస్యూస్ ని ఒక శూరుడిగానూ, వీరుడిగానూ మాత్రమే కవి చిత్రించలేదు. ఏది చేసైనాసరే, పరాక్రమమో, పన్నాగమో ఏదో ఒకటి ఉపయోగించి తనని చుట్టుముట్టిన ఆటంకాలనుంచి బయటపడాలి. అదే ఒడెస్యూస్ ధ్యేయం. కొన్ని చోట్ల అతడు వీరుడిగా, కొన్ని చోట్ల చోరుడిగా కూడా కనిపిస్తాడు. వీరుడిగా ప్రవర్తించాలనుకున్నప్పుడు కూడా ఒకటి రెండు చోట్ల ప్రాకృతిక శక్తులముందు అత్యంత నిస్సహాయుడిగా నిలబడిపోతాడు.

ట్రాయి నగరాన్ని గెలిచిన తర్వాత, ఇథాకా చేరుకునేవరకూ, ఒడెస్యూస్ పదేళ్ళపాటు మహాసముద్రాలమీద దిమ్మరుతాడు. ఆ క్రమంలో అతడు నరకలోకంతో సహా మొత్తం 12 స్థలాల్లో సంచరిస్తాడు. ప్రతి ఒక్కచోటా అతణ్ణొక ఆశ్చర్యకరమైన, దాదాపు ప్రాణాంతకమైన విపత్తు చుట్టుముడుతుంది. ప్రతి చోటా అతడు ఏదో ఒక విధంగా ఆ విపత్తునెదుర్కుంటాడు. కొన్నిసార్లు తన భుజబలంతో, కొన్ని సార్లు యుక్తితో, చివరికి శారీరిక, మానసిక బలాలు క్షీణించిన దశలో దేవతల సహాయంతో బయటపడతాడు.

హనుమంతుడి సముద్రలంఘనంలాగ, సింద్ బాద్ సముద్రయాత్రల్లాగా, ఒడెస్యూస్ సాగరయాత్రలు కూడా ఊహాతీతంగానూ, fantastic గానూ ఉంటాయి. ఆ కథల్లో అత్యంత ప్రాచీనమైన జానపదకథల బీజాలున్నాయి. ఎన్ని యుగాలుగా వింటున్నా, చదువుతున్నా, అవి స్ఫురించగలిగే అర్థాలు inexhaustible గా ఉంటూనే ఉన్నాయి.

ట్రాయి నగరాన్ని గెలిచిన తర్వాత, గ్రీకు వీరులంతా తిరిగి తమ స్వదేశానికి వెళ్ళిపోయాక ఒడెస్యూస్ కూడా పన్నెండు నౌకలతో తిరుగుప్రయాణం మొదలుపెడతాడు. ఆ దారిలో వాళ్ళకి మొదట సికోనా అనే రేవు పట్టణం కనిపిస్తుంది. యుద్ధంలో విజయం సాధించిన మత్తులో ఒడెస్యూస్ అనుచరులు ఆ రేవుపట్టణాన్ని కొల్లగొట్టి స్త్రీలని చెరబట్టి పురుషుల్ని వధిస్తారు.

గ్రీకు విశ్వాసాల ప్రకారం అపరిచితులకి, విదేశీయులకి, పరదేశులకి, వికలాంగులకి ఈశ్వరుడే సంరక్షకుడు. వాళ్ళ పట్ల ఎవరు ఎటువంటి అపచారం,ఆఘాయిత్యం చేసినా జ్యూస్ (సర్వేశ్వరుడి) ఆగ్రహం తప్పించుకోలేరు. సికోనా నగరంలో ఒడెస్యూస్ అనుచరులు చేసిన మారణకాండ జ్యూస్ కి ఆగ్రహం తెప్పించింది. ఆయన ఒక పెద్ద తుపాను సృష్టించి ఆ నౌకల్ని సుదూర సముద్రతీరాలకు నెట్టేసాడు.

గ్రీకు ప్రాపంచిక దృక్పథంలో రెండు భావనలున్నాయి. ఒకటి hubris, రెండవది nemesis. హుబ్రిస్ అంటే,ఏదైనా పొందినప్పుడో, సాధించినప్పుడో, కైవసమైనప్పుడో మనిషికి ఒక క్షణం పాటు కలిగే గర్వం, మైమరపు, దానివల్ల సంభవించే అంధత్వం. అది దేవతలకి ఆగ్రహం తెప్పిస్తుంది. మరుక్షణమే అతడా ఔన్నత్యం నుంచి పతనం చెందుతాడు. అది నెమెసిస్. కాబట్టి గ్రీకు వివేకం ఏమని చెప్తుందంటే, నీకేదైనా సాధ్యపడ్డప్పుడు, నీకేదైనా చేజిక్కినప్పుడు నువ్వు మరింత జాగ్రత్తగా, వినయంగా ఉండాలి, క్షణమైనా ఏమరుపాటు చెందావో దాన్ని శాశ్వతంగా పోగొట్టుకోవలసి ఉంటుంది అని. ఈ ఉదాహరణలు మన పురాణాల్లో కూడా ఉన్నాయి. ‘వాళ్ళు గర్వాంధతవల్ల అభిశప్తులైన నహుషులు’ అంటాడు బైరాగి ఒకచోట.

సికోనా నుండి నెట్టివేయబడ్డ నౌకలు Lotus-eaters ద్వీపానికి చేరతాయి. అక్కడ మనుషులు మరే పని చెయ్యకుండా కేవలం తామరతూళ్ళు తింటూ బతుకుతుంటారు. వాళ్ళు కోరుకునేదీ, కష్టపడేదీ ఏమీ ఉండదు. ఒడెస్యూస్ అనుచరులకి ఆ ద్వీపం బాగా నచ్చుతుంది. వాళ్ళు కూడా ఆ తామరతూళ్ళు తినేవాళ్ళతో కలిసి తామరగింజలు తింటూ తమ దేశాన్నీ, తమ కుటుంబాల్నీ మర్చిపోతారు. కాని ఒడెస్యూస్ ఆ విస్మృతిని కోరుకోడు. అతడికి తన ఇల్లు, తన జ్ఞాపకాలు ముఖ్యం. అతడు తన అనుచరుల్ని బలవంతంగా నౌకమీదకు లాక్కుపోయి పడేస్తాడు. వాళ్ళు మళ్ళా ఆ విస్మృతిసంతోషం వైపు జారిపోకుండా వాళ్ళని గొలుసుల్తో కట్టిపడేస్తాడు.

అక్కణ్ణుంచి వాళ్ళు సైక్లోప్స్ ఉండే ద్వీపాన్ని చేరుకుంటారు. సైక్లోప్స్ ఒంటికంటి రాక్షసుడు. మహాకాయుడు. వాడిపేరు పాలిఫెమస్. ఒడెస్యూస్ కొందరి అనుచరుల్తో వాడి గుహలో ప్రవేశిస్తాడు. ఆ రాక్షసుడు ఒడెస్యూస్ అనుచరుల్ని ఒడెస్యూస్ కళ్ళముందే చంపి తినేస్తాడు. ఎట్లాగయితేనేం ఒడెస్యూస్ వాడి కన్ను పొడిచి బయటపడతాడు. వాడితో తనపేరు ‘ఎవరూ లేరు’ అని చెప్తాడు. తనని పొడిచి ఒడెస్యూస్ పారిపోతుంటే, పాలిఫెమస్ భీకరంగా ఆక్రోశిస్తాడు. అతడికేమయిందని చుట్టుపక్కల కొండలమీంచి తక్కిన సైక్లోప్స్ అడిగితే, ‘ఎవరూ లేరు’ , ‘ఎవరూ లేరు’ అని బదులిస్తాడు. కాని నౌకలో అడుగుపెట్టాక, ఒడెస్యూస్ మళ్ళా బిగ్గరగా తన పేరు ‘ఎవరూ లేరు ‘ కాదనీ, ఒడెస్యూస్ అనీ, తనది ఇథాకా అనీ అరుస్తాడు. ఇది మళ్ళా హుబ్రిస్. ఒడెస్యూస్ మీద పాలిఫెమస్ సముద్రాధిదేవత పోసీడాన్ తో మొరపెట్టుకుంటాడు. అప్పుడు మళ్ళా ఒడెస్యూస్ దేవతల ఆగ్రహానికి మరోమారు గురవుతాడు. పోసీడాన్ అతడి సముద్రప్రయాణాన్ని అల్లకల్లోలం చేసేస్తాడు.

చివరికి ఏదో ఒకలాగ, ఒడెస్యూస్ సముద్రపవనాధిదేవత ఈవొలస్ ద్వీపానికి చేరుకుంటాడు. సముద్రపుగాలుల్ని నియంత్రించే ఆ దేవత ఒడెస్యూస్ ని ఆదరించి, అతడి తిరుగుప్రయాణం సుఖకరంగా ఉండటం కోసం ఒక్క పడమటిగాలి తప్ప మరే గాలులూ అడ్డుపడకుండా, ఆ గాలులన్నిటినీ ఒక తోలుతిత్తిలో బిగించి, ఆ తిత్తి ఒడెస్యూస్ చేతికిస్తాడు. ప్రయాణం సంతోషంగా సాగి ఇథాకా కనుచూపుమేరలో ఉండగా, ఒడెస్యూస్ కి కునుకు పడుతుంది. అప్పుడు అతడి అనుచరులు ఆ తోలుతిత్తిలో ఏ సంపద మూటగట్టి ఉందో చూద్దామని రహస్యంగా ఆ తిత్తి తెరుస్తారు. దాంతో గాలులన్నీ ప్రచండంగా బయటకు వచ్చి నౌకలన్నీ మళ్ళా వెనక్కి కొట్టుకుపోతాయి.

ఒడెస్యూస్ కి మెలకువ వచ్చేటప్పటికి అతడు మళ్ళా ఈవొలస్ ద్వీపం దగ్గర పడి ఉంటాడు. అతడు మళ్ళా ఆ దేవత ముందుకుపోయి తన అనుచరులు తప్పు చేసారని చెప్పి, తనని మళ్ళా తన దేశానికి చేర్చమని కోరుకుంటాడు. కాని ఈ సారి ఈవొలస్ అతడి ముఖం చూడటానికి కూడా ఇష్టపడడు. దైవోపహతుడైనవాణ్ణి తాను చూడలేనని తలుపులు మూసేస్తాడు.

3-1-2017

Leave a Reply

%d bloggers like this: