ఒడెస్సీ-1

17

ఒడెస్సీ చదవడం పూర్తిచేసాను. గ్రీకు ఇతిహాసకారుడు అల్లిన రెండు ఇతిహాసాల్లోనూ, ‘ఇలియడ్’ ఇరవయ్యేళ్ళ కిందటే చదివాను. కాని, ఒడెస్సీనే ఇప్పటికి పూర్తిగా చదవగలిగాను.

భారతీయ సాహిత్యంలో రామాయణం, మహాభారతం లాగా, పాశ్చాత్య సాహిత్యాన్నీ, సంస్కృతినీ వివరించలేనంతగా ఇలియడ్, ఒడెస్సీలు ప్రభావితం చేసాయి. ఆ రెండింటిలోనూ ఇలియడ్ ప్రాచీన కాలంలో ప్రభావం చూపిస్తే, ఒడెస్సీ ప్రభావం మధ్యయుగాలతో మొదలై ఆధునికకాలంలో మరింత ప్రబలమవుతూ ఉంది.

ఒడెస్సీ నమూనాగా 1922 లో జాయిస్ రాసిన యులిసెస్ నవలతో బహుశా ఒడెస్సీ ప్రభావం పతాకస్థాయికి చేరుకుందనుకున్నారు. కాని, 1938 లో నికోస్ కజంటికస్ అనే ఆధునిక గ్రీకు కవి Odyssey: A Modern Sequel పేరుమీద 33,333 పంక్తుల ఆధునిక ఇతిహాసాన్ని రచించాడు. 1968 లో 2001: A Space Odyssey పేరిట స్టాన్లీ కుబ్రిక్ ఒక సినిమా తీసాడు. ఇవి ఒడెస్సీకి అనుకరణలు కావు, ఆ స్ఫూర్తితో సృష్టించిన ఆధునిక ఇతిహాసాలు. ఇక ఆధునిక యూరోపియన్ కవులమీదా, కళాకారులమీద ఒడెస్సీ ప్రభావాన్ని వివరించాలంటే అదొక ఉద్గ్రంథమవుతుంది.

ఆధునిక ఐరోపీయ చింతన, తపన, అన్వేషణ అర్థం కావాలంటే ఒడెస్సీ ఎందుకు తప్పనిసరిగా చదవాలో ఇప్పుడు నాకై నేను స్వయంగా తెలుసుకున్నాను.

ఇలియడ్, ఒడెస్సీల్ని ఇంగ్లీషులో చాలామంది పద్యరూపంలోనూ,గద్యరూపంలోనూ కూడా అనువదించారు. కాని గద్యానువాదాల్లో సామ్యూల్ బట్లర్ (1835-1902) అనువాదాలు ఎక్కువ ప్రజాదరణ పొందాయి. సైమన్ అండ్ షూస్టర్ వారు బట్లర్ అనువాదాన్ని సవివరమైన నోట్సుతోనూ, ఒడెస్సీపైన వచ్చిన సమీక్షలు, వ్యాఖ్యానాల సంక్షిప్త పరిచయంతోనూ వెలువరించారు. కాబట్టి, నాలాగా కొత్తగా చదవాలనుకునే పాఠకులకి ఈ ప్రచురణల్నే చదవమని సూచిస్తున్నాను.

ఒడెస్సీ చదవడం నిస్షందేహంగా గొప్ప సాహిత్యానుభవం. పాశ్చాత్యమానవుడి అంతరంగ పరిచయం లభిస్తుందని చదవడం కాదు, ఆ పుస్తకం గురించి ఏమీ తెలియకుండా చదివినా కూడా అది పాఠకుణ్ణి గాఢాతిగాఢంగా ముగ్ధుణ్ణి చెయ్యగల రచన.

క్రీ. పూ. 7-6 శతాబ్దాలకు చెందిన హోమర్ అనే ప్రజాగాయకుడు ఆరుగణాల పద్యపాదాలతో (డాక్టిలిక్ హెక్సామీటర్) 15000 పంక్తులతో ఇలియడ్ కావ్యాన్నీ, 12000 పంక్తుల్తో ఒడెస్సీ కావ్యాన్నీ నిర్మించాడు. ఆ రెండూ, క్రీ.పూ. 12 వ శతాబ్దంలో మైసినీయన్ నాగరికతాకాలంలో జరిగినట్టుగా భావించబడే సంఘటనల చుట్టూ అల్లిన కథలు. చారిత్రికంగా అవి 12 వ శతాబ్దానికి చెందినప్పటికీ, హోమర్ దాదాపుగా వాటిలో తన సమకాలిక గ్రీకు సంస్కృతినీ,సభ్యతనే ప్రతిబింబింపచేసాడు.

మీనెలాస్ అనే ఒక గ్రీకువీరుడి భార్య హెలెన్ ను, ట్రాయ్ నగరపు రాజు ప్రియం కొడుకు పారిస్ ఎత్తుకుపోతాడు. ఆమెను విడిపించడంకోసం మీనెలాస్ తో సహా ఆగమెమ్నాన్, అకిలిస్, ఒడెస్యూస్ వంటి వీరులంతా పదేళ్ళ పాటు ట్రాయినగరాన్ని ముట్టడించి పోరాడతారు. ఆ సమయంలో అకిలిస్ కీ, ఆగమెమ్నాన్ కీ మధ్య గొడవ జరిగి అకిలిస్ యుద్ధం నుంచి పక్కకు తప్పుకుంటాడు. ఆ కీలకసంఘటన చుట్టూ అల్లిన కావ్యం ఇలియడ్. చివరికి ఒడెస్యూస్ చతురతతో గ్రీకులకు గెలుపు సాధిస్తాడు. ఆ తర్వాత ఆ యుద్ధంలో మిగిలిన విజేతలు, ఆగమెమ్నాన్, మీనిలాస్ వంటి వారు తిరిగి తమ స్వదేశం చేరుకుంటారు.

కాని ఒడెస్యూస్ మరొక పదేళ్ళ పాటు సముద్రాలమీద దిమ్మరుతూనే ఉంటాడు. చివరికి, ఒంటరిగా, అజ్ఞాతంగా, ఒక బిచ్చగాడిగా అతడు తన స్వగృహంలో అడుగుపెడతాడు. యుద్ధానికి బయలుదేరిన ఇరవయ్యేళ్ళ తరువాత గానీ,అతడు తన స్వగృహాన్ని చేరుకోలేకపోతాడు. అన్నేళ్ళుగానూ తన కోసమే ఎదురుచూస్తున్న తన భార్య పెనెలోపి, కొడుకు టెలిమాకస్ ను కలుసుకుంటాడు. తాను లేనప్పుడు తన భార్య పెనెలోపి వెంటపడి తమను పెళ్ళిచేసుకొమ్మని నిర్బంధిస్తూ, తన సంపదనంతా యథేచ్ఛగా కొల్లగొడుతున్న శత్రువుల్ని నిశ్శేషంగా సంహరిస్తాడు. తన కోసం ఎదురుచూస్తున్న వృద్ధుడైన తన తండ్రిని కలుసుకోవడంతో కథ పూర్తవుతుంది.

24 కాండలుగా నిర్మించిన ఈ కావ్యం ఆద్యంతం ఉత్కంఠభరితంగా మనల్ని చదివింపచేస్తుంది కాబట్టే సాహిత్యవేత్తలు దీన్ని మొదటినవలగా ప్రస్తుతించారు. దీన్ని మూడుభాగాలుగా విభజించవచ్చు. మొదటి నాలుగు కాండలూ ఒడెస్యూస్ కొడుకు టెలిమాకస్ తన తండ్రి గురించి వెతకడం మొదలుపెట్టడం గురించిన కథ. చివరి 11 కాండలూ ఒడెస్సీ తన స్వదేశం ఇథాకా చేరుకున్నాక జరిగిన సంఘటనలు. మధ్యలో 9 కాండలు ఒడెస్యూస్ సముద్ర సంచారగాథలు.

ఒక మామూలు సాహసగాథలాంటి కథని దాదాపు 3000 ఏళ్ళుగా జనస్మృతిలో నిలపడమే కాక భావుకుల్ని ఉత్తేజితుల్ని చేస్తూండే రహస్యమొకటి ఒడెస్సీలో ఉంది. అదేమంటే, ఆ కథ అనేక వ్యాఖ్యానాలకి లొంగుతూ అనేక స్థాయిల్లో అర్థమవుతూ రావడం. ప్రతి తరంలోనూ, ఇదే ఒడెస్సీ సారాంశమంటూ ఎవరో ఒక ప్రతిభావంతుడు తేల్చేసాక, మళ్ళా మరొక తరం మరొక కొత్త వ్యాఖ్యానంతో సాహిత్యప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తూనే ఉంది. బహుశా గొప్ప సాహిత్యాన్ని మామూలు సాహిత్యం నుంచి వేరుచేసే లక్షణమిదే అనుకుంటాను. ఎంత తోడినా ఇంకిపోని అర్థాల్ని ఇవ్వగలుగుతున్నందువల్లనే రామాయణమూ, షేక్ స్పియరూ, ఫ్రాంజ్ కాఫ్కా లు కాలం తాకిడికి చెదిరిపోకుండా నిలబడుతున్నారు. ఆ లక్షణం ఇలియడ్ కన్నా ఒడెస్సీలో అపారంగా ఉందన్నది కూడా ఈ రోజు తెలుసుకున్నాను.

ఒడెస్సీకి, రామాయణానికీ మధ్య పోలిక నేను కొత్తగా తేనక్కర్లేదు. అది ఇండాలజిస్టులెంతమందో పూర్వం చెప్పినమాటనే. కాని వారికి కొత్తగా నేనొక పరిశీలన జోడించగలననుకుంటున్నాను. అదేమంటే, రామాయణంలో యథార్థమూ, కల్పనా విడదీయలేనంతగా కలిసిపోయాయి. రాముడు వనవాసానికి గంగానది దాటేటప్పటిదాకా, ఆ కథనం వాస్తవికంగా (realistic) గా ఉంటుంది. ఆ తర్వాత అదొక mythological కథనంగా మారిపోతుంది. తరతరాలుగా రామాయణం పాఠకుల్లో జాగృతం చేసే అసంఖ్యాకమైన అర్థాలూ, స్ఫురణలూ ఆ mythological పార్శ్వంలోంచే ప్రభవిస్తున్నాయి. ఉదాహరణకి సుందరకాండలో హనుమంతుడు సముద్రాన్ని లంఘించి, లంకలో చేపట్టిన సీతాన్వేషణ. హనుమంతుడి సముద్రయానం, ఆ మధ్యలో అతడు ఎదుర్కొన్న రకరకాల అనుభవాలు, ప్రలోభాలు,వాటిని అతడు అతిక్రమించిన తీరు సుందరకాండని ఒక అజరామర సాహిత్యకృతిగా మార్చేసాయి.

ఒడెస్సీకూడా ఇంతే. కాని చిన్న తేడా, ఇక్కడ ఒడెస్యూస్ మళ్ళా ఇథాకాలో అడుగుపెట్టేదాకా మాజికల్, ఆ తర్వాత రియలిస్టిక్. ఒడెస్యూస్ సాగరయాత్రల్లో, సాహసయాత్రల్లో, అసలు ఆ motifs లోనే ఏదో మాజిక్ ఉంది. ఏ అతీతకాలానికో చెందిన ఏ జానపదకథలకో చెందిన ఇంద్రజాలం అది. ఆ కథల్ని తన ఇతిహాసమౌలిక సూత్రానికి అనుగుణంగా అల్లుకోవడంలోనే హోమర్ ప్రతిభ వెల్లడవుతూంది.

ఆ సాహస సంచారం నేపథ్యంలోంచి ఒడెస్యూస్ ని చూసినప్పుడు, సంచారం బదులు స్థావరాన్నీ, మరుపుకి బదులు జ్ఞాపకాల్నీ, అమరత్వానికి బదులు మర్త్యత్వాన్నీ, దేవతలతో సహజీవనానికి బదులు తన ఇంట్లో తన భార్యాపిల్లల్తో జీవితం చివరిరోజులదాకా ఒక సాధారణమానవుడిగా బతకడాన్నీ కోరుకున్న ఒక మనిషి కనిపిస్తాడు. నువ్వు నీ జీవితప్రయాణంలో ఎన్ని వింతవింత లోకాలైనా చూడవచ్చుగాక కాని నీ హృదయం మాత్రం నీ స్వదేశంకోసం, నీ స్వగ్రామం కోసం, నీ స్వజనం కోసం కొట్టుమిట్టాడుతూంటుందని తెలియరావడమే ఒడెస్సీ.

30-12-2016

Leave a Reply

%d bloggers like this: