ఒక మబ్బుపింజ

Reading Time: < 1 minute

5

కొత్తగా కవిత్వం రాయడం మొదలుపెట్టినవాళ్ళమొదలుకుని ఏళ్ళతరబడి కవితాసాధన చేస్తున్నవాళ్ళదాకా శ్రీశ్రీ అన్నట్టు ‘ఆరంభం పెద్ద అవస్థ.’

నీలో ఒక అనుభూతి చాలా సున్నితంగా కదిలిపోతుంది. పొద్దుటిపూట మనింట్లో పైకిటికీలోంచి పడే సూర్యకాంతిలో పల్చగా ఎగిరే పోగుల్లాగా, సాలీడు దారాల్లాగా ఆ స్ఫురణలు చాలా సున్నితంగా, ముట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి. ఆ క్షణాలకోసం ఎంతో జాగరూకంగా ఉండాలి.

గొప్పకవుల్ని చదువుతున్నప్పుడు మనకి తెలిసేదిదే. వాళ్ళు జీవితంలో తక్కిన వ్యాపకాలన్నీ ఒదిలి ఆ క్షణాలకోసమే ఎదురుచూస్తూ గడిపారని. తపస్సు అంటే అది.

అవి మహాగంభీర క్షణాలే కానవసరం లేదు.మనిషి నడుస్తూ వచ్చిన చరిత్రని తల్లకిందులు చేసే చారిత్రకయుగాలు కానవసరం లేదు. చాలా చిన్ని చిన్ని సంగతులు కావచ్చు, సంఘటనలు కావచ్చు. కాని అవి గాజుముక్కమీద అద్దిన నీ రక్తం నమూనాలాగా నీ మొత్తం జీవవ్యవస్థకంతటికీ ఆనవాలుగా నిలబడతాయి.

ఇరవయ్యవశతాబ్దపు ఆటుపోట్లెన్నిటినో నాటకాలుగా, కవిత్వంగా, ప్రసంగాలుగా మార్చిన బెర్టోల్డ్ బ్రెహ్ట్ (1898-1956) ఒక మేఘం మీద రాసిన ఈ కవిత చూడండి:

 

ఒక మబ్బుపింజ

ఒక నీలిసెప్టెంబర్ సాయంకాలం
మేమొక ఆపిల్ చెట్టునీడన, ప్రశాంతంగా,
నా ప్రియురాలు సౌమ్యంగా నా హస్తాల్లో.
అప్పుడే నిజమవుతున్న ఒక కలలాగా
ఆమెని దగ్గరగా హత్తుకున్నాను, పైన
నిశ్చలాకాశంలో ఒక మబ్బుపింజ
ఎత్తుగా, తేటగా. ఎంతో తెల్లగా
మాకన్నా ఎంతో పైపైన. దాన్నట్లా
చూస్తూండగానే కనుమరుగైపోయింది

కాలప్రవాహంలో కదిలిపోయాయి
మరెన్నో సాయంకాలాలు గుడ్డిగా
బహుశా ఆ ఆపిల్ చెట్టు కూడా
మరింత లావెక్కిఉండవచ్చు, ఇక ఆ
అమ్మాయంటారా, నిజంగా నాకు తెలియదు
మీరేమంటారో నేనూహించగలనుకానీ
నాకిప్పుడు ఆమె వదనం కూడా గుర్తు
రావట్లేదు, ఆ ముద్దు తప్ప.

బహుశా ఆ ముద్దు కూడా గుర్తుండేది కాదు
ఆ మేఘమక్కడ కదలాడివుండకపోతే.
అపారమైన నీలం మధ్య ఆశ్చర్యకరమైన
ఆ మేఘమప్పుడెలాఉందో
ఇప్పుడూ అలానే గుర్తొస్తోంది,
బహుశా ఆ ఆపిల్ మళ్ళా పూతపట్టిఉంటుంది,
ఆమె తన నాలుగో బిడ్డని ఆడిస్తూండవచ్చు,
కానీఅ మేఘం- క్షణకాలమే కదలాడి
చూస్తూండగానే గాలిలో కరిగిపోయింది.

14-7-2013

Leave a Reply

%d bloggers like this: