ఉల్లిపాయలు తరుగుతున్నప్పుడు

Reading Time: 3 minutes

38

‘ఇప్పటి యువతరం సాహిత్యం చదవడం లేదు, వీళ్ళకి కవిత్వం మీద ఆసక్తి లేదు, ఎంతసేపూ క్రికెట్టూ, సినిమాలూ, సెల్ ఫోన్లూ.. ‘ఈ మాటలు చాలా ఏళ్ళుగా వింటున్నాను.

2000 లో నేను హైదరాబాదు వచ్చినప్పుడు, డిగ్రీ చదువుకుంటున్న ఒక పిల్లవాడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. తనకి సాహిత్యమంటే చాలా ఇష్టమని చెప్పాడు. పుష్కర కాలం తిరక్కుండానే, నా ‘సోమయ్యకు నచ్చిన వ్యాసాలు’ పుస్తకానికి ముందుమాట ఎవరితో రాయిద్దామా అని ఆలోచిస్తే అతడు తప్ప మరెవరూ కనిపించలేదు నాకు.

ఏడేళ్ళ కిందట, గంగారెడ్డి, 1978 లో పుట్టినపిల్లవాడు, నాతో అన్నాడు కదా, ‘సార్, ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఏ సాహిత్య సమావేశానికి వెళ్ళినా నా కన్నా చిన్నవాళ్ళెవ్వరూ కనిపించడం లేదు’ అని. అతడట్లా అంటూండగానే, మోహన ప్రసాద్ సన్మాన సభ జరిగిన రోజు, ఆదిత్య కొర్రపాటి కనిపించాడు. 1991 లో పుట్టిన పిల్లవాడు. నిన్న ఏదో రిఫరెన్సు కోసం గత యాభై ఏళ్ళల్లో భారతదేశంలో వచ్చిన గొప్పనవలాకారులెవరో చెప్పు అంటే ఉన్నఫళంగా ఫోన్ లోనే యాభై ఏళ్ళ భారతీయ నవలా వికాసాన్నంతటినీ సమీక్షించేసాడు! అతడు చెప్పిన పేర్లలో చాలా పేర్లు నాకు తెలియనే తెలియదు!

ఇక, ఈ రోజు అంతకన్నా గొప్ప ఆశ్చర్యం, రామారావు కన్నెగంటి వచ్చాడని కలుద్దామనుకుంటే, అక్కిరాజు భట్టిప్రోలు ఇంట్లో ఉన్నాను రమ్మన్నాడు. అక్కిరాజుని కూడా చూసినట్టు ఉంటుంది కదా, అని వాళ్ళింటికి వెళ్తే, వాళ్ళమ్మాయి భావనని పరిచయం చేసాడు. ఇంటర్మీడియెట్ చదువుతున్న బాలిక. ఆమె కవితలు రాస్తుందని ఒకసారెప్పుడో అక్కిరాజు చెప్పింది గుర్తొచ్చింది.

‘నీ కవితలు వినిపిస్తావా’ అని అడిగాను.

రెండు కవితలు వెంటనే మా కోసం వినిపించింది. అవి ఏమి కవితలు! అదంతా కొత్త తరం కవిత్వం. ఇప్పుడు ప్రపంచాన్నంతా వరదలాగా ముంచెత్తుతున్న Spoken Word Poetry ప్రక్రియకు చెందిన కవిత్వం తనదని చెప్పింది.

‘నీకు కవిత్వం రాయాలని ఎందుకనిపించింది, ఎప్పుడనిపించింది ‘ అనడిగాను.

‘ఒక రోజు యూ ట్యూబ్ లో లిలీ మెయెర్స్ అనే అమ్మాయి Shrinking woman అనే కవిత చదవడం విన్నాను. ఆ కవిత వినగానే నాలో ఏదో జరిగింది, దాన్ని మాటల్లో చెప్పలేను.అప్పణ్ణుంచీ నాక్కూడా నా భావాల్నట్లా చెప్పాలని అనిపిస్తోంది ‘ అంది.

ఆమె ఈ రోజు మా కోసం వినిపించిన కవిత Chopping Onions వినగానే, (మా తాడికొండ స్వభావం కొద్దీ) నేనూ, రామారావూ ఆ కవితని సమీక్షించడానికి పోటీపడ్డాం. కాని, ఆ కవిత వివరించవలసినది కాదు, చదివి, వంటబట్టించుకోవలసింది.

అందుకని,ఆ కవిత ఇంకా నా చెవుల్లో గింగురుమంటూండగానే, ఇట్లా ఆఘమేఘాలమీద, తెలుగులో మీకోసం.

ఉల్లిపాయలు తరుగుతున్నప్పుడు

నాకు బాగా గుర్తుంది నా చిన్నప్పుడోసారి
మా అమ్మ కేసి చూసి అడిగాను
‘నువ్వేం చేస్తుంటావు?’అని.
నీళ్ళకళ్ళతో చిరునవ్వి చెప్పిందామె:
‘నేను చేసేదంతా మామూలుగా మనుషులు పట్టించుకోనిదే
ఏమంత ముఖ్యం కానిది,
నేను ఇస్తాను, లాలిస్తాను, పోషిస్తాను,
నువ్వు స్కూలునుంచి వచ్చేటప్పటికి నేనిక్కడుంటాను,
నీకేదన్నా పెట్టి నీ మీదే మనసుపెట్టుకుని ఉంటానిక్కడే.’

అప్పుడు నాకు తెలీదు,
ఆ కళ్ళల్లో ఆ నీళ్ళు ఉల్లిపాయలు తరిగితే వచ్చినవి కావని.

సరే,ఆమె నన్నెంతో ప్రోత్సహించింది, నేను బలపడాలనీ, బాగుపడాలనీ, మంచిదాన్నికావాలనీ
ఇప్పుడు కూడా ఆమె నన్ను ప్రోత్సహిస్తూనే ఉంటుంది,
కాని నేనేది కావాలనుకోవడంలేదో, వాటికి.
చూడండి, నాక్కూడా కలలున్నాయి,
గమ్యాలున్నాయి,
జీవితంలో ఫలానాది సాధించాలనే ఆశయాలున్నాయి,
ఆకర్షణీయమైన భవనంలో చిన్న కార్యాలయం
ఒక చేతిలో స్టార్ బక్స్ కాఫీ, మరొక చేతిలో ముఖ్యమైనవేవో ఫైళ్ళు,
ఈ రోజు నా రెండుచేతులనిండా
నింపుకోవాలని చూస్తున్నాను
చెయ్యాలనుకున్నవాటినీ, కావాలనుకున్నవాటినీ.

కాని, ఇప్పుడు ఆలోచిస్తుంటే అనిపిస్తోంది
మా అమ్మ చేతులు కూడా నిండుగానే ఉన్నాయి,
ఏదో ఒక పరమార్థంతోనో, విశ్వాసంతోనో
వాటినిండా ఉన్నదంతా ధారపొయ్యడానికే.
వేలమైళ్ళు ఎగురుకుంటూ వచ్చిన ఆ విదేశీ విహంగం
ఎక్కడ ‘సాధికారికతా సంకేతం’ కనిపిస్తే
అక్కడ రెక్కలల్లార్చినట్టు
చివరి ధాన్యపు గింజని కూడా ముక్కునకరుచుకుపోయే
చేతులు కావవి, ఇవ్వడం మటుకే తెలిసినవి.

కాని మా అమ్మంటే నాకు చిరాకు
ఆమెకి విలువలేదు, పిరికిది,
వసంతకాలపుష్పంలాగా అందమైనదే,

కాని దుర్బలురాలు, అందరిలో ఒకతె,
మరీ ఈ లోకం మనిషి,
ఏళ్ళతరబడి ఇంటిపట్టున ఉండిపోయి
అలసిపోయిన మనిషి.

కాని ఇప్పుడర్థమవుతోంది నేను కావాలని మా అమ్మని
ద్వేషించడం లేదని,
నేను ద్వేషించడానికి నాకెవరో చాలానే నూరిపోసారు:
నీకంటూ ఏదో ఒక గుర్తింపు పొందాలంటే
నువ్వు బయటకి అడుగుపెట్టకతప్పదని,
నిన్ను నువ్వు ప్రకటించుకోక తప్పదని,
ఈ శక్తిసామర్థ్యాలు నువ్విట్లా కూడగట్టుకోకపోతే
నువ్వేమి చేస్తున్నావో నీకే తెలియకుండా
వృథాగా కర్చయిపోతాయని.

ఈ పరుగుపందెం నాకిది కూడా చెప్పింది,
ఒక స్త్రీగా నీ సాధికారికత, ఆ చిన్న కార్యాలయం
లేదా ఆ స్టార్ బక్స్ కాఫీ
నేనూ పురుషుడూ సమానమేనని.
నేను కూడా అతడు సాధించినంత సాధిస్తే,
అంటే, గౌరవంవల్ల కాదు, హుందాతనం వల్లకాదు.
బూడిదరంగు సూటూ, చేతిలో బ్రీఫ్ కేసూ ఉంటే
నేను సాధికారికత సాధించినట్టేనని.

ఇప్పుడు తెలుస్తోంది నాకు
సాధికారికత అంటే మా అమ్మ అని.
చుట్టూ రాలుతున్న మంచుమధ్య
పరుచుకున్న ప్రతి ఒక్కదాన్నుంచీ బలం పుంజుకుని
పూచే శీతాకాలపుష్పమని.
.
సాధికారికత అంటే నీ చేతుల్లో పొంగిపొర్లుతున్నదాన్నంతా
ఇతరులకి ధారపొయ్యడం తప్ప
మరేంచేసుకోవాలో తెలియకపోవడం,
భయం లేకుండా నీ మనసులో మాట చెప్పగలగడం,
చీకటిలో చిరుదీపంగా వెలగడం,
నువ్వేం చెయ్యాలో నీకు నువ్వే నిర్ణయించుకోవడం.

వంటగదిలోనా
లేదా ఆఫీసులోనా
లేదా రెండుచోట్లానా
ఎక్కడ కూచుంటానో నా ఇష్టం.

ఇస్తానో
లేక తీసుకుంటానో
లేదా రెండుచేస్తానో, నా ఇష్టం.

వసంతకాలంలో వికసిస్తానో
హేమంతకాలంలో విరబూస్తానో
లేదా రెండు ఋతువుల్లోనూ.

అయితే, ఒకటి
నా సాధికారికతని నిరాకరించడం మటుకు
నీ ఇష్టం కాదు.

నాకు తెలుసు, నేనీ మాటలు చెప్తున్నప్పుడు
నీళ్ళకళ్ళతో
మా అమ్మ నన్నే పరికిస్తున్నదని,
ఇప్పుడు మటుకు నాకు స్పష్టంగా తెలుసు
ఆ కన్నీళ్ళు ఉల్లిపాయలు తరిగితే వచ్చినవి కావని.

24-6-2017

Leave a Reply

%d bloggers like this: