ఈ ఉత్తరాల్లో కూడా ఆ వ్యక్తిత్వమే

39

చలం నుండి చండీదాస్ దాకా సుప్రసిద్ధ తెలుగు రచయితలు, విమర్శకులు, సంపాదకులు ఎందరో ఆర్.ఎస్.సుదర్శనంగారికి రాసిన లేఖల్ని ‘సుదర్శనం గారికి’ (2017) పేరిట శ్రీమతి వసుంధరాదేవి సంకలనం చేసి ప్రకటించారు. ఈ పుస్తకాన్ని పోయిన నెలలో గుంటూరులో ఆవిష్కరించారు.ఆ సభలో మాట్లాడమని నన్ను కూడా ఆహ్వానించేరుగాని, నాకా అదృష్టం లేకపోయింది.

ఇందులో 19 మంది రచయితలు రాసిన 52 ఉత్తరాలు ఉన్నాయి. వీటితో పాటు శివలెంక శంభుప్రసాద్, రాధాకృష్ణగార్లు రాసినవి 40 ఉత్తరాలు, భారతి తరఫున తిరుమల రామచంద్ర గారు రాసినవి 3 లేఖలతో పాటు వసుంధరాదేవిగారికి కుటుంబరావుగారూ, శంభుప్రసాద్ గారూ రాసిన ఉత్తరాలు కూడా ఉన్నాయి.

1959 నుంచి 1996 దాకా నడిచిన ఈ ఉత్తరాల్లో సుమారు నాలుగు దశాబ్దాల తెలుగు సాహిత్య ప్రయాణం మనకు కనిపిస్తుంది. రాశిపరంగాగానీ, లేదా ఉత్తరాల నిడివి ప్రకారం గాని ఈ పుత్తరాలు ఎక్కువ పేజీలు పట్టేవికాకపోయినా, ఎన్నో కీలక అంశాల మీద సాగిన చర్చ ఇందులో మనకి కనిపిస్తుంది. అందులో చాలా అంశాల మీద మనం మళ్ళా మళ్ళా మాట్లాడుకోవలసిందీ, చర్చించుకోవలసిందీ చాలానే ఉందనిపిస్తుంది.

ఆర్.ఎస్.సుదర్శనంగా విఖ్యాతుడైన రాటకొండ సుబ్బయ్య సుదర్శనం (1927-2001) నా జీవితంలో నేను చూసిన మహోన్నత సాహితీవేత్తల్లో ఒకరు. నాకెప్పటికీ గుర్తే. 1979 లో సాగర్ లో ఇంటర్మీడియెట్ చదువుకుంటున్న రోజుల్లో, సెలవుల తర్వాత కాలేజీకి వెళ్తూ, గుంటూరు బస్టాండులో ‘అసమర్థుని జీవయాత్ర’ పుస్తకం కొనుక్కున్నాను. ఆ పుస్తకం నన్ను ఎంత ఆకట్టుకుందో, అంతగానూ, ఆ పుస్తకానికి సుదర్శనంగారు రాసిన ముందుమాట కూడా ఆకట్టుకుంది. సాహిత్యం చదివితే ఇట్లా కదా చదవాలి, పరిశీలిస్తే ఇట్లా కదా పరిశీలించాలి అనుకున్నాను. ఆ తర్వాత ఆయన రచనలు ‘సాహిత్యంలో దృక్పథాలు’, ‘సమాజము-సాహిత్యము’ తో పాటు అచ్చులో ఏది దొరికినా వదలకుండా చదివాను.

1982 లో రాజమండ్రిలో ఉద్యోగంలో చేరినప్పుడు, సువిశేషపురంలో ఉండేవాణ్ణి. సుదర్శనంగారు కూడా అక్కడే ఉంటున్నరని తెలియగానే ఉత్సాహం పట్టలేక పోయి కలిసాను. మా మొదటిపరిచయంలోనే (అప్పుడు నా వయస్సు ఇరవయ్యేళ్ళు) ఆయన ఒక స్నేహితుడితో మాట్లాడేటంత ఆదరంగా మాట్లాడేరు. తాను ‘కృష్ణశాస్త్రి నిర్వేదం’ మీద రాసిన వ్యాసం చదివి వినిపించారు.రాజమండ్రిలో సాహితీవేదిక అనే సంస్థ ఉందనీ, వాళ్ళ సమావేశాలకు తాను కూడా వెళ్తాననీ, నన్ను కూడా రమ్మని చెప్పారు. ఆ తర్వాత, ఆయన పదవీవిరమణ చేసి రాజమండ్రి వదిలివెళ్ళినదాకా, అంటే 1986 దాకా నాలుగేళ్ళు ఆయన అంతేవాసిగా జీవించే గొప్ప భాగ్యం నాకు కలిగింది. ఒక రచనని ఎట్లా చదవాలో, ఎట్లా పరిశీలించాలో, ఆ పరిశీలనని ఎట్లా ప్రతిపాదించాలో ఆయనదగ్గర్నుంచే నేర్చుకున్నాను. ఆయన ‘నూరు సమీక్షలు’ అనే సమీక్షా సంకలనం చూసాక నాకు రచయిత కావడం కన్నా సమీక్షకుడు కావడమే గొప్ప ఆదర్శంగా తోచింది.

సుదర్శనంగారు తెలుగు సాహిత్యానికిచ్చిన ఉపాదానానికి తానెంత ఋణపడిందో తెలుగు సమాజానికి ఇంకా అర్థం కానేలేదు. ఆయన కేవలం సాహిత్యవేత్త మాత్రమే కాదు. ప్రాక్పశ్చిమ దర్శనాలను సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నించిన అన్వేషి. ఆధునిక భౌతికశాస్త్రమూ, భారతీయవేదాంతమూ కూడా ఒకే గమ్యాన్ని వెతుక్కుంటున్నాయని పసిగట్టిన జిజ్ఞాసి. బుద్ధుడు, రమణమహర్షి, జిడ్డు కృష్ణమూర్తి దేన్ని దర్శించి లోకంతో సమాధానపడగలిగారో, ఆ సమాధానాన్ని ఆయనకూడా తన జీవితకాలంలో పొందారనే నేననుకుంటున్నాను. అదంతా ‘ఆయన జయించాడు’ (1987) అనే వ్యాసంలో నేను వివరంగా చర్చించేను.

ఇప్పుడు ఈ ఉత్తరాల్లో కూడా ఆ వ్యక్తిత్వమే సుస్పష్టమవుతూ ఉన్నది. మనకి మాత్రమే కాదు, ఆయనకి ఉత్తరాలు రాస్తున్నప్పుడు చలం, చండీదాస్, కుటుంబరావు, ఇస్మాయిల్, శేషేంద్ర శర్మ వంటివారికి కూడా తామొక విశిష్ట వ్యక్తితో సంభాషిస్తున్నామన్న స్పృహతోనే ఉత్తరాలు రాసినట్టుగా ఈ పుస్తకం సాక్ష్యమిస్తోంది. ఇందులో సుదర్శనంగారు రాసిన ఉత్తరాలు లేకపోయినప్పటికీ, ఆయనకి ఇతరులు రాసిన ఉత్తరాలు మాత్రమే ఉన్నప్పటికీ, ఆ ఉత్తరప్రత్యుత్తరాల సారాంశమేమిటని ఒక్క మాటలో చెప్పమంటే, ‘విలువల్ని గుర్తించడం, పరస్పరం గౌరవించుకోవడం’ అని చెప్పగలను.

చలం గారి నుంచి వచ్చిన ఆరు ఉత్తరాలూ ప్రధానంగా సుదర్శనంగారి నవల ‘మళ్ళీ వసంతం’ మీద ఇంప్రెషన్స్. అందులో చలంగారు ఎంత నిర్మొహమాటంగా ఉండాలో అంత నిర్మొహమాటంగానూ ఉంటూనే అంతకన్నా మించిన ప్రేమ కురిపించారు. ఆయన రాసిన వాక్యం చూడండి: ‘అదేమిటి? మీ నవలకీ, మన స్నేహానికీ సంబంధమేమిటి? నా జీవితంలో నాకు చాలా సన్నిహితులైన వాళ్ళు, నా పుస్తకాలు చదవనివాళ్ళు, చదివి నవ్వేవాళ్ళూ, నాకోసం వాటిని tolerate చేసేవాళ్ళూ.’

అబ్బా, చలం గారి లేని లోకం ఎలా ఉంటోందో తెలుస్తోంది కదూ, ఈ ఒక్క వాక్యంతో.

కుటుంబరావుగారు రాసిన మూడు ఇంగ్లీషు ఉత్తరాలూ కుటుంబరావుగారి సత్యనిష్ఠకీ, జ్ఞానతృష్ణకీ వేలిముద్రల్లాగా ఉన్నాయి. ప్రాస్తావికంగా కొ.కు రాసిన ఈ వాక్యాలు కూడా చూడండి: ‘ Gandhi had a great influence over me by his writings..he still has. But I never appreciated his religico-political postures…But Gandhi’s murder was a blow for me.’

ఇట్లా తమ ఆంతరంగిక అభిప్రాయాలు, తమ గురించి మామూలుగా తాము ఎవరితోనూ మాట్లాడటానికి ఇష్టపడనివికూడా సుదర్శనంగారితో చెప్పుకోవచ్చనే ఒక ఆత్మీయతని ఆయన రచయితలకు అందించారనిపిస్తుంది. చండీదాస్ రాసిన ఈ వాక్యాలు చూడండి:

‘desire and లిబరేషన్ కె.వి.ఆర్ గారికి అయోమయంగా, గందరగోళంగా అస్పష్టంగా ఉందిట. నవ్వుకున్నాను, పాషాణపాకం అన్నా, జటిలాతిజటిలం అన్నా సరే అంటాను. అర్థం కాకపోయినా, కష్టపడి శ్రద్ధగా చదివితే ఆ తత్త్వధోరణేమిటో తెలియకపోదు. విశ్వవిద్యాలయాల తత్వదురంధురలైతే భటాచార్య ఇంట్రడక్షన్ లోని మొదటి పేరా చదువుతూనే కినిసిపోయారు శిలామౌనంగా.’

చండీదాస్ పుస్తకాన్ని అధ్యయనం చేస్తూ ఆయనకి కాళిదాసు భట్టాచార్య రాసిన ఉత్తరాలు ఆచార్య రఘురామరాజు నాతో అనువాదం చేయించారు కాబట్టి, చండీదాస్ రాసిన మాటలు అక్షరసత్యాలని గుర్తుపట్టాను. కాని తన రచన గురించిన ఈ మాటలు చండీదాస్ మరొకరితో ఎన్నడైనా చెప్పిఉండేవాడా అన్నది సందేహమే.

ఈ ఉత్తరాల్లో చెప్పుకోగదగ్గ మరో రెండు విషయాలున్నాయి. ఒకటి సుదర్శనంగారి కవితలు చదివి బావున్నాయని తాను అచ్చువేయిస్తానని చెప్పి విశ్వనాథ పట్టుకెళ్ళారట. ఆ పుస్తకం అచ్చువేయించి, ఆ బిల్లు కూడా సుదర్శనంగారికి పంపించారట. అప్పుడాయన విశ్వనాథకిట్లా రాసారు:

‘నా కవిత్వాన్ని అచ్చొత్తించి ప్రకటించే ఉద్దేశ్యమే ఉండి ఉన్నట్టయితే ఏనాడో ఆ పని చేసి ఉండేవాణ్ణి. డబ్బు పెట్టలేక కాదు.మీరు రావడం, ఆ పద్యాల మీద ‘వ్యామోహపడటం ‘ వెంట తీసుకుని వెళ్ళడం జరిగింది. అందుకే ఆ పుస్తకాన్ని మీకే ‘సమర్పించాను ‘. నాకు ఇక ఆ పుస్తకం మీద ఎటువంటి ఆసక్తి లేదు. కృతిపతియైన మీరు పుస్తకముద్రణ వ్యయం భరించడం న్యాయం.అదే సంప్రదాయం కదా.నాకు ఒక 5 కాపీలు పంపితే చాలు..’

మరొక ఉత్తరం రావూరి భరద్వాజకు రాసింది. భరద్వాజ తన ‘పాకుడురాళ్ళు’ ఇంగ్లీషులో అనువాదం చేయించాలనుకుంటున్నాననీ, దానికొక సమగ్రమైన పరిచయం చెయ్యమనీ సుదర్శనం గారిని అడిగారు. అప్పటికి భరద్వాజని సుదర్శనంగారు చూడలేదు. కాని, ఆ నవలమీద తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా రాసిపంపడమే కాక, పాశ్చాత్యపాఠకుల్ని ఆ నవల ఆకర్షించలేదని కూడా రాసారు, అంతేకాక, ఆయన తన కథలకు చేయించుకున్న ఇంగ్లీషు అనువాదాలు కూడా ఏమంత ప్రశస్తంగా లేవనీ, ఆ విషయం ఆయనకు ఎవరూ చెప్పకపోవడం విచారకరమనీ కూడా స్పష్టంగా చెప్పేసారు.

ఇది ఉత్తరాల కాలం కాదు, మెసెంజర్ల కాలం. కాని అప్పటి మనుషుల్లో ఉన్న ఆ జ్ఞానతృష్ణ, ఆ విలువలు, ఒకరితో ఒకరు విభేదిస్తూనే ఒకరినొకరు గౌరవించుకోవడం, అన్నిటికన్నా ముందు ఆ ప్రేమాదరణలూ ఇప్పటి సాహిత్యలోకంలో కనిపిస్తున్నాయా? నాకైతే, అనుమానమే.

27-6-2017

Leave a Reply

%d bloggers like this: