తెంపులేని రాగధార

16

నిన్న ట్రాన్స్ ట్రోమర్ కవితలు మూడు అనువదించాక ఆ అనువాదం ఒక సవాలుగా తోచింది. తెలుగు కవిత్వాన్ని యుగాలుగా మన కవులు శబ్దాడంబరంతో బరువెక్కించేసారు. అందుకనే కవిత్వంలో నిశ్శబ్దం గురించి ఇస్మాయిల్ గారు అంతగా కొట్టుకుపోయేడు. బయటి కవిత్వాన్ని తెలుగు చెయ్యాలంటే, పాబ్లో నెరూడానో, నజీం హిక్మత్ నో అనువదించినంత సులభంగా రిల్కనో, మచాడోనో, చీనా జపనీయ కవుల్నో అనువదించలేం.

అందుకని ఈ పొద్దున్నే మళ్ళా ట్రాన్స్ ట్రోమర్ కవిత మరొకటి వాగాడంబరం లేని తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నించాను. ట్రాన్స్ ట్రోమర్ కవిత్వంలో సంగీతకారుల గురించిన ప్రస్తావనలూ, వారి సంగీతాన్ని కవిత్వంద్వారా ప్రశంసించే ప్రయత్నం కనిపిస్తాయి, హేడెన్ మీద రాసిన కవిత నిన్న అనువదించాను. ఆయనకు ఎంతో ప్రకాస్తి సముపార్జించిన The Grief Gondola వాగ్నర్ మీద రాసిన కవిత. ట్రాన్స్ ట్రోమర్ కి ఆస్ట్రియా సంగీతకారుడు ఫ్రాంజ్ షూబర్ట్ సంగీతమంటే చాలా ఇష్టం. ఆయన సంగీతాన్ని మాటల్తో, అది కూడా నిశ్శబ్దం నింపుకున్న మాటల్తో వర్ణించే ప్రయత్నం చేసిన Shubertina కవితకి నేను ప్రయత్నించిన అనువాదం ఇదిగో, ఇలా ఉంది.

షూబర్టీయం

నూయార్క్ కి బయట, ఎనభై లక్షల మనుషులు జీవిస్తున్న ఇళ్ళన్నటినీ ఒక్క చూపులో ఒడిసిపట్టుకునేటంత ఎత్తుమీంచి.

ఆ నగరమక్కడ ఒక కాంతిప్రవాహం, ఏటవాలుగా కనిపిస్తున్న నక్షత్రమండలం.

ఆ నక్షత్రసముదాయం మధ్య బల్లలమీద జరుపుతున్న కాఫీ కప్పులు, గవాక్షాల్లోంచి
పెద్దపెద్దదుకాణాల యాచన, ఆనవాలు కూడా మిగలని వస్తువుల సుడిగాలి.

అంతస్తులమీద అంతస్తులు, నిశ్శబ్దంగా మూసుకుపోయే ఎలివేటర్ల తలుపులు
మూడుసార్లు బీగాలు బిగించిన తలుపుల వెనక స్థిరంగా హెచ్చుతున్న కంఠధ్వని.

భూగర్భ మార్గాల్లో కార్లలో ముందుకు తూలుతున్న దేహాలు, సంచలిస్తున్న పాతాళ స్మశానాలు.

లెక్కలమాటకేం గాని -నాకు తెలుసు- ఈ క్షణాన అక్కడ కిందన ఏదో ఒక గదిలో ఎవరో షూబర్ట్ ని సాధన చేస్తుంటారు, తక్కినప్రపంచమంతటికన్నా అతడికి ఆ స్వరాలే ఎంతో యథార్థం.

2
ఒక్క చెట్టుకూడా లేని మానవమేధా క్షేత్ర విస్తారమైదానాలు పిడికిటి ప్రమాణానికి కుంచించుకునేదాకా చుట్టలుచుట్టుకుపోయాయి.

ఈ చైత్రంలో ఆ పక్షి అదే పట్టణంలో, అదే పెరటితోటలో అదే చూరుకింద కిండటేడాది గూటికే మళ్ళా తిరిగివస్తున్నది.

ఆమె ఆఫ్రికాఖండం నుంచి భూమధ్యరేఖమీదుగా ఆరువారాల పాటు రెండు ఖండాలు దాటి ఈ అపారభూక్షేత్రమ్మీది ఈ బిందువుకే మరలివస్తున్నది.

వియన్నాకి చెందిన ఆ లావుపాటి యువకుడు, సూదిబెజ్జంలోంచి నదుల్ని ప్రవహింపచేసినవాడు, ఒక జీవితకాలం పాటు అయిదు తంత్రుల సంగీత వాద్యకారులకోసం కొన్ని చిహ్నాలు, సంకేతాలు పోగుచేస్తూనే గడిపాడు, రాత్రికాగానే కళ్ళద్దాలతోనే నిద్రపోయేవాడు, మిత్రులని ‘పుట్టగొడుగ ‘ ని పిలిచేవాళ్ళు,
తెల్లవారగానే క్రమంతప్పకుండా తన సంగీతంబల్లముందు నిలబడేవాడు.

అప్పుడేంచేసేవాడో గాని కాగితాలమీద విచిత్రంగా వెయ్యికాళ్ళ జెర్రులు పాకడం మొదలుపెట్టేవి.

3
అయిదు తంత్రుల వాద్యాలు వినిపిస్తున్నాయి, కాళ్ళకింద నేలలొత్తలు పడుతుంటే నునువెచ్చని అడవిదారిన ఇంటిబాట పడతాను.

ఇంకా పుట్టని శిశువులాగా మెలికెలు తిరిగి, కళ్ళుమూసుకుని, భారరహితంగా భవిష్యత్తులోకి దొర్లిపోతాను, ఇంతలో హటాత్తుగా మొక్కలు కూడా ఆలోచిస్తున్నాయని తడుతుంది.

4
ఈ భూమిలోకి జారిపోకుండా బతకాలంటే ప్రతి క్షణం ఎంత జాగ్రత్తగా బతకాలి!

పట్టణాన్ని పట్టుకు వేలాడుతున్న హిమరాశులపట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలి.

అవ్యక్తవాగ్దానాలపట్ల,అంగీకారమందహాసాలపట్ల ఎంత మెలకువగా ఉండాలి, ఆ టెలిగ్రాం మనకోసం కాదనీ, లోపలనుంచి ఆ గొడ్డలిపెట్టు మనమీద పడబోదని మనమెంత నమ్మాలి.

ఉక్కుతుమ్మెదల ప్రవాహం మూడింతలయ్యే నగరమార్గాలమీద మన రథచక్రాల్ని మనమెంత నమ్ముకోవాలి.

కాని అవేవీ మన నమ్మకాన్ని చూరగొనేటంత విలువైనవి కావు.

అంతకన్నా విలువైనదాన్ని దేన్నో నమ్ముకోవచ్చనే ఆ పంచతంత్రీ వాద్యాలు మనకి చెప్తున్నాయి, రోడ్డు మీద మనతో పాటు అవి కూడా నాలుగడుగులు కలిసి నడుస్తాయి.

మెట్లమీద బల్బు ఆర్పేసాక, పక్కనున్న గోడమీద అలవాటుగా చెయ్యానించి ఆ చీకట్లో దారి వెతుకున్నంత సహజంగా.

5
అప్పుడు మనం పియానో ముందు కూచుని నాలుగు స్వరాల ఎఫ్ మైనర్ పలికించబోతాం, ఒకే శకటానికి ఇద్దరు చోదకుల్లాగా అదొకింత హాస్యాస్పదంగా ఉంటుంది.

మన చేతులు సంగీతస్వరాల తూనికరాళ్ళుగా మారిపోయి
మనని భీతావహుల్ని చేస్తున్న రాగసమతౌల్యాన్ని సరిదిద్దబోతున్నామా అన్నట్టుంటుంది
అక్కడ రాగమూ, విరాగమూ ఒక్కలానే ఉంటాయి.

‘ఆ సంగీతం వీరోచితం ‘ అంటుంది అన్నీ. నిజమే.

కాని కార్యశూరుల్ని కించిందసూయతో చూసేవాళ్ళూ, తాము స్వయంగా హంతకులు కాలేనందుకు లోపల్లోపల తమని తాము ఈసడించుకునేవాళ్ళూ,
వాళ్ళకి ఆ సంగీతంలో చోటు లేదు.

తోటిమనుషుల్ని అమ్మేవాళ్ళూ, కొనేవాళ్ళూ, ప్రతి ఒక్క మనిషినీ కొనుగోలుచెయ్యగలమని నమ్మేవాళ్ళూ
వాళ్ళకక్కడ చోటులేదు.

అది వాళ్ళ సంగీతం కాదు.

ఎన్ని గమకాలు తిరిగినా తెంపులేని రాగధార, ఒక్కొక్కప్పుడు ఉదాత్తం, సప్రకాశం, ఒక్కొక్కప్పుడు గరుకు, ప్రచండం, కొన్నిసార్లు నత్తనడక, కొన్నిసార్లు ఉక్కు తీగె.

ఇప్పుడు ఈ క్షణాన మనలోతుల్లో
నిబ్బరంగా పైకిపాకుతున్న
కూనిరాగం.

7-4-2015

%d bloggers like this: