ఆ వేసవి విలాపం

Reading Time: 2 minutes

11

అమెరికానుంచి రావెల సోమయ్యగారితో వాళ్ళబ్బాయి మనోహర్ నా కోసమొక బుట్టెడు కవిత్వం పంపించారు. ఆఫీసులో ఉండగా ఆ పూలబుట్ట, ఆ పళ్ళగంప నా చేతికందింది. చైనా, పర్షియా, యూరోప్ లనుంచి లాటిన్ అమెరికన్ దేశాలదాకా వికసించిన కవిత్వం.

ఆ పుస్తకాలు చూస్తూనే ఆఫీసులోనే డాన్స్ చేసేసాను. ఎంతో పవిత్రమైన ఆ దృశ్యం చూసేవాళ్ళకి ఎంతో హాస్యాస్పదంగా ఉంటుంది కదా, కాని అదే సమయంలో నా గదిలో అడుగుపెట్టిన మిత్రురాలు ఏమిటి సంగతంది. అంతా విన్నాక, ఆ పెద్దవాళ్ళు కాబట్టి అంత బరువు అంత దూరంనుంచి అంత బాధ్యతగా నీ కోసం మోసుకొచ్చారు.ఆ స్థానంలో యువకులెవరయినా ఉండి ఉంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఉండేవారంది.

మరి ఆ కవిత్వాన్ని నలుగురితోనూ పంచుకోవాలి కదా. మొదటగా, ఆర్క్ ప్రచురణలవారి Six Polish Poets.

యుకె కి చెందిన ఆర్క్ ప్రచురణలు వివిధ దేశాల కవిత్వాన్ని ఎల్లలు దాటించే ప్రయత్నంలో తలమునకలై ఉంది. ముఖ్యంగా యూరోప్ లో ఇటీవలి కాలంలో తలెత్తిన యువతీయువకుల కవిత్వాన్ని, బయటి ప్రపంచానికి అంతగా సుపరిచితం గాని దేశాలు లట్వియా, ఎస్తోనియా, స్లొవేనియా వంటి సీమలనుంచి పుట్టిన కవిత్వాన్ని అనువదింపచేసి అందిస్తోంది. ఆ సిరీస్ లో భాగంగా తెచ్చిన పుస్తకాల్లో Six Polish Poets (2008) కూడా ఒకటి.

ఇందులో ఉన్న కవులు గత దశాబ్దంలో మొదటి కవితాసంపుటులు వెలువరించినవారని సంపాదకుడు రాసాడు. 1989 లో కమ్యూనిజం కుప్పకూలిపోయినతర్వాత, వెంటనే కవిత్వం చెప్పిన కవులు, అంటే 90 ల కవులు, దాదాపుగా అరాచకధోరణితోనూ, వ్యక్తివాదంతోనూ కవిత్వం చెప్పారనీ, ఆ తర్వాతి తరం కవులు అంటే గత దశాబ్దపు కవులు ఆ ధోరణిని సరిదిద్దుకుంటూ మరింత సున్నితంగా, మరింత ఆలోచనాత్మకంగా కవిత్వం చెప్పారని రాసాడు. ఈ సంకలనంలోని ఆరుగురు కవులూ ఈ నవీన ధోరణికి ప్రాతినిథ్యం వహిస్తున్న కవులని చెప్పాడు.

ఈ కవుల కవిత్వం కొత్తగానూ,సున్నితంగానూ, గాఢంగానూ కూడా ఉంది.ఉదాహరణకి అన్నా పివ్కోవ్స్కా (జ.1963) రాసిన ఈ కవిత ( Lament of That Summer, 1998) చూడండి:

ఆ వేసవి విలాపం

ఆమె మృత్యువు వైపు ఒక అడుగువేసింది
ఇక్కడ, తడినేలమీద ఒక అడుగు,
హెయిర్ డ్రయ్యర్, నడుము చుట్టూ తువ్వాలు
మరొక అడుగు నీళ్ళల్లో
మృత్యువులో, వేసవి స్నానం నుంచి నేరుగా.
చిక్కుపడ్డ తన కేశపాశాన్ని
ఒక్కసారి చేత్తో సరిదిద్దుకోగలిగింది.
గదిలో చల్లారుతున్న టీ,
సన్నని పట్టుపోగుల్తో
అల్లిన లోపావడా, లేత నీలంరంగు ఊహ
దాన్ని ఆరెయ్యాలనుకుంది.
వేసవి. వేడితో ప్రకంపిస్తున్న ప్రభాతం.
ఆనందవాగ్దానంతో తెల్లవారిన రోజు, ఒకింత తొందర;
గోడవతల కుక్కపిల్ల పాలగిన్నెలో మూతిపెట్టిందని పిల్లవాడు పిలుస్తున్నాడు.
కుర్చీమీద హడావిడిగా గిరవాటు పెట్టిన వస్త్రం, సూర్యరశ్మిబిందువుల్ని
పీల్చుకుంటున్న సింధూరం. గదిలో ప్రవహిస్తున్నది
జొహాన్ సెబాస్టియన్ స్వరపరిచిన సంగీతం, ఎవరో ఒక స్త్రీ,
లేదా ఒళ్ళంతా దట్టంగా ఉన్ని పెరిగిన విచిత్ర జంతువు.
అనుకున్నట్టే ఆ రోజు సంతోషాన్ని మోసుకొచ్చింది. ఆమె
చేసిందేమీ లేదు, కనీసం అరవనైనా అరవలేదు.
యుద్ధం ముందో, సుదీర్ఘ ప్రయాణం ముందో
ఆవహించే భయంలాగా, హృదయ సంకోచంలాగా. కాని
ఎందుకని? ఏ సన్నాహం లేకుండా, వీడ్కోళ్ళు లేకుండా
ఒక నవ్వులాగాప్రాణవాయువుని ఎగిరిపోనిచ్చింది?
అద్దం మీదుగా చిన్న కొయ్య శిలువ. క్షణం పాటు చెదిరిన
ఏకాగ్రత. గోడ వెనక పిల్లవాడు కుక్కపిల్లతో ఆడుకుంటున్నాడు.

27-10-2015

Leave a Reply

%d bloggers like this: