ఆ వేణువు నా చుట్టూ

33

ఈ సారి హైదరాబాద్ బుక్ ఫెయిర్లో నా కోసం కొత్త కవిత్వం తీసుకొచ్చాడు అనల్ప పబ్లికేషన్స్ బలరామ్. చైనా నుంచి గ్రీసుదాకా మూటగట్టుకొచ్చిన ఆ కవిత్వంలో, అన్నిటికన్నా ముందు నేను తెరిచిందీ, అక్కడే నిలిచిపోయిందీ రాబర్ట్ వాల్సర్ Thirty Poems (న్యూ డైరక్షన్స్, న్యూయార్క్, 2011).

వాల్సర్ రచనల్ని ఇంగ్లీషు పాఠకులకి మొదటిసారిగా పరిచయం చేసిన క్రిష్టఫర్ మిడిల్ టన్ నే ఈ కవితలకీ అనువాదకుడు, ఇందులో చిన్న ముందుమాట కూడా రాసాడు.

రాబర్ట్ వాల్సర్ (1878-1956) ఐరోపీయ ఆత్మని గోచరింపచేసే ఆధునిక ఐరోపీయ రచయితల కోవకి చెందినవాడని తక్కిన ప్రపంచానికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ముఖ్యంగా కాఫ్కా తరహా రచనలకి అతడే ఆద్యుడు. కాఫ్కా రచనల్ని జర్మన్ పాఠకులు చదివిన కొత్తలో వాళ్ళు ఆ సాహిత్యాన్ని వాల్సర్ అనే పట్టకం గుండానే చూడగలిగారని సుసాన్ సొంటాగ్ రాసింది. కాఫ్కాని మొదటిసారి చదివినప్పుడు రాబర్ట్ ముసిల్ ఆ సాహిత్యాన్ని వాల్సర్ తరహా సాహిత్యమనే భావించాడట. జర్మన్ రచయితల్లో హీన్రిక్ వాన్ క్లీస్ట్ (1777-1811) కీ, కాఫ్కా (1883-1924) కీ మధ్య ఉండే అంతరాన్ని వాల్సర్ పూరించాడు. మొదటి ప్రపంచయుద్ధం రాబోయే ముందే ఆ సామాజిక, వైయక్తిక అనారోగ్యం అతడి రచనల్లో కనిపించింది.

మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన పదేళ్ళకి, అంటే 1929 నాటికి అతడిలో కూడా మానసిక అనారోగ్య లక్షణాలు కనిపించడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత, మరణించే దాకా అతడు మానసిక వ్యాథిగ్రస్తుడుగానే బతికాడు. మానసిక ఆరోగ్యం క్షీణించడం మొదలైన తొలిరోజుల్లో అతడు పెన్సిల్తో చాలా చిన్న లిపిలో కథలు, కవితలూ రాసుకుంటూ పోయేడు. ఆ micro-script సుమారు 500 పేజీల సారస్వతంగా వెలుగు చూసింది. ఆ తర్వాత రోజుల్లో రాయడం పూర్తిగా మానేసాడు. ఆ ఆసుపతిలో తనని కలవడానికి వచ్చే ఒక మిత్రుడితో ‘నేనిక్కడ ఉండవలసింది పిచ్చివాడిగా, రచయితగా కాదు’ అన్నాడట. చివరికి ఒక తెల్లవారుజామున ఆ మానసిక వైద్యాలయం దగ్గర పొలాల్లో, చలిలో, నడుచుకుంటూపోతూ అనాథగా కుప్పకూలిపోయాడు.

మిడిల్ టన్ అనువదించిన కవితల్లో 15 కవితలు ఆ pencil zone కి చెందిన సూక్ష్మలిపినుంచి కూడా ఉన్నాయి. గొప్ప మానసిక సంవేదన, సునిశిత ఇంద్రియ చైతన్యం కలిగిన కవిత్వమది. చదివినవెంటనే నా మనసుని పొగలాగా కమ్మిన ఒక కవితని మీకోసం తెలుగు చేసాను:

ఇప్పుడే అరగంట కిందటే

ఇప్పుడే అరగంట కిందటే
ఎవరో మృదువుగా ఒక వేణువూదారు
ఉల్లాసభరితమైన ఒక పాంథశాలలో
నేను నా దుఃఖాన్నిమూటగట్టుకు కూచున్నాను
దిగులు పడ్డప్పుడల్లా మరింతబాగా కనిపించే
పల్లెటూరి పిల్లగాడిలా.

ఈ విశాల మహా ప్రపంచంలో
స్వర్గం కింద, పుడమి పైన
వీస్తున్న గాలులకొక భాషంటూ లేనివేళ
హటాత్తుగా నాకు నేను కనబడ్డాను:
ప్రవహిస్తున్న పిల్లంగోవి
పేల గులాబిరంగు స్వరాలమధ్య.

ఆ దృశ్యం మరింత పచ్చబడింది;
‘ఒక రష్యన్ బాలిక’ అనుకున్నాను
బలమైన నిట్టూర్పు విడిచాను.
‘ఎక్కడ, ఓహ్, ఎక్కడ, నేను నిన్ను గుర్తుపట్టగలను?’
ఇంకా నిశ్శబ్దంగా ఆ వేణువు నా చుట్టూ
ఒక వలయం చుడుతూనే ఉంది.

6-1-2016

2 Replies to “ఆ వేణువు నా చుట్టూ”

  1. అనువాదం చాలా బావుంది. Original కూడా post చెయ్యండి సార్.

Leave a Reply

%d