అల నన్నయకు లేదు

42

నూటొక్క డిగ్రీల వైరల్ జ్వరంతో మంచం మీద పడి కునారిల్లుతున్న నాకు ఒక జిజ్ఞాసువునుంచి రెండు మిస్డ్ కాల్స్. ఏమిటని పలకరిస్తే ‘ఒక పద్యం రిఫరెన్సు కావాలి మాష్టారూ, విశ్వనాథ వారి పద్యం ‘అల నన్నయకు లేదు, తిక్కనకు లేదా భోగము..’ అనే పద్యం ఎక్కడిదో చెప్తారా’ అని. రాళ్ళబండి కవితాప్రసాద్ కి వెళ్ళవలసిన కాల్ నాకొచ్చిందేమబ్బా అని నిట్టూరుస్తూనే, ఆ మగతనిద్రలోనే ‘అది కల్పవృక్ష అవతారికలో పద్యం కాదూ’ అన్నాను. ఇప్పుడు కల్పవృక్షమెక్కడ దొరుకుతుంది అనే మాట వినవలసివస్తుందని ‘నాకు అయిదు నిమిషాలు సమయమిస్తే ఆ పద్యం చదివి వినిపిస్తాను, రాసుకుందురుగాని’ అన్నాను.

సరే, బాలకాండ తీసి, ఎలాగూ పుస్తకం తెరిచాను కదా అని ఆ కావ్యావతారిక మొత్తం మళ్ళా చదివాను. నా మగత, నా నిద్రా ఒక్కసారి ఎగిరిపోయాయి. ఉష్ణం ఉష్ణేణ శీతలం అని ఆ కవిహృదయాగ్నికి నా ఒళ్ళొక్కసారి చల్లబడిపోయింది.

ఈ తెలుగునేలమీద విశ్వనాథ పండితులకి కొదవలేదు. కాబట్టి ఇప్పుడు నేను మళ్ళా కల్పవృక్ష కావ్యావతారిక గురించి మాట్లాడటమంటే నా అల్పజ్ఞత్వాన్ని సైబర్ వీథుల్లో ప్రకటించుకోవడమే. కల్పవృక్ష కావ్యావతారికలోని పద్యాలూ -‘మరల నిదేల రామాయాణంబన్నచో’, తన ఎద ఎల్లమెత్తన, కృతప్రతి పద్యమునంతకంటె మెత్తన’, ‘అల నన్నయకు లేదు, తిక్కనకు లేదు..’, ఋషివంటి నన్నయ రెండవ వాల్మీకి..’, ‘ఈ సంసారమిదెన్ని జన్మలకు నేనీ..’; చాలా పదప్రయోగాలు-సకలోహ వైభవసనాథము, ధిషణాహంకారము, ఒకడు నాచనసోమన్న వంటివి, కొన్ని మాటలైతే – రసము వేయిరెట్లు గొప్పది నవకథాధృతినిమించి- వంటివీ సుప్రసిద్ధంగా, సుస్థిరంగా నిలబడిపోయినవి. ఇప్పుడు వీటిగురించి నేను మళ్ళా కొత్తగా తలుచుకునేదేమీ లేదు.

కాని అంత సుస్థిరంగానూ, సుప్రతిష్టంగానూ జనస్మృతికి లో వెళ్ళవలసిఉండి కూడా వెళ్ళకుండా ఉండిపోయినవి (కనీసం నా వరకూ నాతో ఎవరూ ఇంతదాకా ముచ్చటించనవి)మరికొన్ని వాక్యాలు కనబడ్డాయి. అవే నా నిద్రమత్తుని విదిలించేసాయి.

వాటిగురించి చాలా సవివరంగా సమాలోచించాలని ఉందిగాని, ఇప్పటికిప్పుడు వాటిని గనిలోంచి తవ్విన ముడిఖనిజశకలాల్లాగా మీముందు పెట్టకుండలేకపోతున్నాను.

1

‘ప్రాగ్విపశ్చిన్మతంబున రసము వేయిరెట్లు గొప్పది నవకథాధృతిని మించి.’ ఇది సుప్రసిద్ధ వాక్యం. అయితే ఇంతకీ రసమంటే ఏమిటి? రసం భారతీయ అలంకారిక చర్చలో నాటకసమాలోచనతో మొదలై సాహిత్యసమాలోచనకు విస్తరించింది. ఎంతదాకా విస్తరించిందంటే, గొప్ప భావుకులైన పాఠకులు, కవి రాసిన కావ్యాన్ని చదవడం ద్వారా తమ మన:ఫలకం మీద చిత్రించుకున్న రూపకానికి తగ్గట్టుగా రంగస్థలం మీద నరనటీనటులు ఎప్పటికీ రక్తికట్టించలేరనేంతగా. కవికి ఈ శక్తి ఎక్కణ్ణుంచి వస్తుంది?

విశ్వనాథ ఇలా అంటున్నాడు: ‘రసము పుట్టింపగ వ్యవహారము నెరుంగ జనును లోకమ్ము వీడి రసమ్ము లేదు’ ఇది నిశ్చేష్టపరిచే వాక్యం. ‘లోకమ్ము వీడి రసమ్ము లేదు’ అనే ఈ వాక్యాన్ని ఒక సాహిత్యబ్రహ్మసూత్రంగా మనం నెత్తికెత్తుకోవాలి కదా. యథార్థానికి, కవి అంటే, లోకంనుంచి, అంటే సమకాలిక సమాజం నుంచి దూరంగా ఉండేవాడనే భావన రొమాంటిసిస్టు సంప్రదాయంనుంచి వచ్చింది. అది పాశ్చాత్యసాహిత్యంనుంచి, ముఖ్యంగా పందొమ్మిదో శతాబ్ది ఇంగ్లీషు సాహిత్యాన్ని మన విశ్వవిద్యాలయాల్లో బోధించడం వల్ల, అదే మనం మన సాహిత్యభావనగా పొరపడుతూ ఉన్నాం. కాని ప్రాచీన భారతీయ ఆలంకారికులకి గానీ, కవులకు గానీ ఇందులో ఎట్లాంటి సందేహం లేదు.

మమ్మటాచార్యుడి ‘కావ్యప్రకాశం’ లో

‘శక్తి ర్నిపుణతా లోకశాస్త్రకావ్యాద్యవేక్షణాత్
కావ్యజ్ఞశిక్షయాభ్యాస ఇతి హేతుస్తదుద్భవే.

అన్నాడు. అంటే కవి ప్రతిభ కావ్యంగా మారడానికి, లోకమూ, శాస్త్రమూ, కావ్యమూ మూడింటినీ పరిశీలించగలిగిన నిపుణత ఉండాలన్నాడు.

మమ్మటుడికి సమకాలంగానో, కొద్దిగా ముందుగానో తెలుగులో మొదటి పరిపుష్ట కావ్యనిర్మాణం చేసిన నన్నయ తన కావ్యావతారికలో తనను ‘లోకజ్ఞుడు’ అని వర్ణించుకున్నాడు.వెయ్యేళ్ళ తరువాత విశ్వనాథ ఆ మాటే మాట్లాడేడు గాని, అది పునరుక్తికాదు, చారిత్రిక అవసరం. ముఖ్యంగా భావకవులు సమాజంనుంచి దూరంగా జరిగిపోయి తమని తాము గుర్తుపట్టుకునే పనిలో ఉన్నారుగాని లోకాన్ని గుర్తుపట్టడం లేదని దాని తాత్పర్యం. తెలుగులో రకరకాల చారిత్రిక కారణాలవల్ల శ్రీశ్రీ పెను ఉప్పెనలాగా కవిత్వాన్ని లోకోన్ముఖం చేసినండువల్ల ఈ విషయం మనకు కొత్తగా అనిపించకపోవచ్చుగానీ, వెయ్యేళ్ళ తెలుగు కవిత్వ పరిణామంలో అదొక గొప్ప మెలకువ.

ఇంతకీ రసం లోకం నుంచి ఎట్లా పుడుతుంది? నేను విశ్వనాథ పండితుణ్ణికాను, కల్పవృక్షం సాకల్యం చదివినవాణ్ణీ కాను, కాని చదివినంతమేరకు విశ్వనాథ కల్పవృక్ష కథనంలో అనుసరించింది, యూరోప్ లో ప్రభవించిన నేచురలిజం తరహా పద్ధతి అనిపిస్తుంది. ఆయన లోకస్వభావాన్ని అనుకరించడానికి పూనుకున్నాడు. ఇది అరిస్టాటిల్ చెప్పిన మిమెసిస్. అయితే స్వభావోక్తి చాలా అరుదుగా మాత్రమే రసప్రతీతి కలిగిస్తుంది. మరి స్వాభావిక చిత్రణ ద్వారా విశ్వనాథ రసోత్పత్తి ఎట్లా సాధ్యమని భావించాడు? ఇందుకు జవాబు నాట్యశాస్త్రంలోనే వెతకవలసిఉంటుంది. భరతముని ‘లోకధర్మి’, ‘నాట్యధర్మి’ అనే రెండు పదాలు వాడాడు. లోకధర్మివృత్తాంతం నేరుగా నాట్యధర్మాన్ని నిర్వహించలేదు. దానికి కొంత conscious effort ‘కావాలి. విశ్వనాథకీ, శ్రీశ్రీ కి తేదా ఇక్కడే ఉంది. విశ్వనాథ స్రష్ట. శ్రీశ్రీ ద్రష్ట. బహుశా ఈ సమస్య ఆధునిక యుగధర్మానిదేనేమో. వెల్లువలాగా విరుచుకుపడుతున్న ఆధునికకాలంలో కవికి ఎప్పుడు ఏది స్ఫురిస్తే అప్పుడది మాట్లాడుకుంటూ పోవడమే తప్ప, తీరిగ్గా కళాసృష్టి చేసే అవకాశం లేనేలేదేమో.

ఉహు. ఈ ఆలోచన నాకు నచ్చలేదు. అదే నిజమైతే ‘ఫిన్నెగన్స్ వేక్’ లాంటి రచన ఆధునిక యుగంలో ఎట్లా ప్రభవించింది? మాడర్నిజం అనే సాహిత్య కళాఉద్యమానికి ఇప్పుడు జాయిస్ అధికార ప్రతినిథిగా ఎట్లా గుర్తింపుపొందుతున్నాడు? మానవుడు చంద్రుడి మీద అడుగుపెట్టడమూ, ఫిన్నెగన్స్ వేక్ రచించడమూ ఒక్కలాంటివేనని శ్రీ శ్రీ ఎందుకంత పరవశించిపోయాడు?

2
ధిషణాహంకారమని విశ్వనాథ చెళ్ళపిళ్ళ గురించి ఏ ముహూర్తంలో అన్నాడోగాని, ఆ మాట విశ్వనాథకే విశేషణంగా నిలబడిపోయింది. ఎవరినీ లెక్కచేయని ఆజానుబాహువైన ఒక సాహిత్యమూర్తి, అపరాజితుడిలాగా నిలబడే ఒక మూర్తిని మన కళ్ళముందు మెదిలేలా చేస్తుంది. కాని విశ్వనాథకి నిజంగా అంత అహంకారముందా? ఆ పద్యంరాసిన తడి ఆరకముందే తన మిత్రుడు, తనతో కొన్నాళ్ళు జంటకవిత్వం చెప్పిన కొడాలి ఆంజనేయుల్ని స్మరిస్తూ

ఆతడె తోడు కల్గినను నచ్చముగా గలకండ లచ్చులుం
బోతలు పోసి యుండెదము పోతనగారి విధాన..

అని, అక్కడితో ఆగకుండా

సుంతయు విలంబనమోర్వదు నిత్యవేగి నా
చేతము శబ్దమేరుటకు చిన్నము నిల్వదు భావతీవ్రతన్

అన్నాడాయన.

ఇదొక చాలా ఆకర్షణీయమైన confession. చెళ్ళపిళ్ళవెంకట శాస్త్రిగారు తెలుగునేలమీద సాహిత్యాభిరుచి నిర్మించినవాడు. ఆయన కథలు-గాథలు మొత్తం చదివాను. ఆయన తలవని సంస్కృతాంధ్ర కవులు లేరు. కాని కవులందరిలోనూ, నిజంగా గొప్పకవి ఎవరూ అంటే ఆయన నిర్ద్వంద్వంగా పోతననే ప్రస్తుతించాడు. అంటే కవి ప్రతిభ తాలూకు నిజమైన గీటురాయి ప్రజలనాలుకలే అన్నదాంట్లో ఆయనకి గానీ,విశ్వనాథకి కానీ ఎట్లాంటి సందేహమూ లేదు. కవిత్వాస్వాదనలో popular taste నీ , popular judgement నీ వాళ్ళు నిర్లక్ష్యం చెయ్యకపోగ, నిజమైన నికషంగా కైమోడ్చారు. నేను పోతనలాగా రాయాలేకపోయానని విశ్వనాథ అన్న ఈ మాట ఎలా ఉందంటే, ‘ఆశయాలకేం అనంతం/ అప్పారావంతంటివాణ్ణి’ అని శ్రీశ్రీ గురజాడముందు సాగిలపడ్డట్టుగా.

అయితే ఇంతకీ తాను పోతనలాగా ఎందుకు రాయలేకపోయాడుట? తన చిత్తవేగం ఆలస్యాన్ని సహించలేదుకాబట్టి సరైన పదాన్ని వెతుక్కునే సమయం చిక్కనందువల్ల తాను పోతనలాగా రాయలేకపోయానన్నాడు. ఈ మాటే నిజమైతే, విశ్వనాథని స్రష్ట కాదు, ద్రష్ట అనాలి. కాని నాకెండుకో విశ్వనాథ తన అశక్తతనైతే సరిగానే నిదానించుకోగలిగాడుకానీ, అండుకు కారణం మాత్రం సరిగ్గా పట్టుకోలేకపోయాడనిపించింది. పోతన ప్రధానంగా బరువైన భావజాలంతో శ్రోతని ఉక్కిరిబిక్కిరిచెయ్యడు. భావావేశంతో పరవశింపచేస్తాడు. విశ్వనాథలో సహజంగానే ఒక విరక్తుడూ, వేదాంతీ ఉన్నారు. అటువంటి వాళ్ళ భక్తి కవిత్వం సాధారణ శ్రోత హృదయంలోకి నేరుగా చొచ్చుకుపోవడం కష్టం.

3
ఇంకా మరికొన్ని ఉన్నాయి. ఉదాహరణకి-తిక్కన్న శిల్పపు తెనుగుతోట . ఇది ప్రసిద్ధ ప్రయోగమే. కాని ఇందులో ఆయన concrete vocabulary తో ఒక abstract భావనని అందించే ప్రయత్నం చేసాడు. ఈ పదప్రయోగం ఎటువంటిదంటే, దాదాపుగా ఆయనకు సమకాలికుడిగా చెప్పదగ్గ రిల్క-

Music. The breathing of statues. Perhaps:
The quiet of images. You, language where
languages end. You, time
standing straight from the direction
of transpiring hearts.

అని రాసినంతగా.

జర్మన్ మహాకవికి దాదాపు అయిదువాక్యాలు అవసరమైన భావాన్ని విశ్వనాథ నాలుగు పదాల్లో చెప్పాడనిపించింది. అంతేనా, శిల్పపు తోట అంటే ఏమిటి?

మరోసారి మాట్లాడుకుందాం.

28-7-2014

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s