అనుస్వరం

50

నాగరాజు రామస్వామిగారు, ఎలనాగ గా ప్రసిద్ధి చెందిన వారి తమ్ముడు నాగరాజు సురేంద్ర గారు కరీంనగర్ తెలుగుసాహిత్యానికి అందించిన గొప్ప కానుకలు. వారిది కరీంనగర్ జిల్లా ఎలిగందల. రామస్వామిగారు ఉద్యోగరీత్యా చాలాకాలం అరబ్బు, ఆఫ్రికా దేశాల్లో ఇంజనీరుగా పనిచేసారు. ఉద్యోగ విరమణ తర్వాత ప్రస్తుతం అమెరికాలో పిల్లలదగ్గర ఉంటున్నారు. ఇప్పుడాయన జీవితంలో కవితా వసంతం ప్రవేశించింది. గత నాలుగేళ్ళలోనే ఏడు పుస్తకాలు వెలువరించారు. ముఖ్యం అనువాదాలు.

నేను హైదరాబాదు వదిలి వచ్చే ముందురోజు రావెల సోమయ్యగారు, గంగారెడ్డి, ఆదిత్య, సూరపరాజు రాధాకృష్ణమూర్తిగార్లతో కలిసి ఒక విందుగోష్టి చేసాం. ఆ గోష్టికి రామస్వామిగారు కూడా వచ్చారు. ఆయన్ని చూడటం అదేమొదటిసారి. తనవి నాలుగు పుస్తకాలు నా చేతుల్లో పెట్టారు చూడమని. జాన్ కీట్స్ కవిత్వానికి     ‘ఈ పుడమి కవిత్వం ఆగదు’ పేరిట చేసిన అనువాదం, రవీంద్రుడి గీతాంజలికి అనుసృజనలతో పాటు ‘అనుస్వరం’ పేరిట వివిధదేశాలకు చెందిన 57 కవితల అనువాదాలు.

తాను కీట్స్ ను అనువదించడానికి గంగారెడ్డి ప్రోత్సహమే కారణమన్నారాయన. ఆ పుస్తకానికి ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణగారు చాలాచక్కటి ముందుమాట కూడా రాసారు. ఆ పుస్తకం చేతుల్లోకి తీసుకోగానే ఇట్లాంటి పుస్తకం నా యవ్వనోదయ కాలంలో నా చేతుల్లోకి వచ్చిఉంటే ఎంతబాగుండేది అనిపించింది. నేను గ్రాడ్యుయేషన్ పూర్తిచేసేటప్పటికి కూడా నా ఇంగ్లీషు పరిజ్ఞానం అంతంత మాత్రమే. ఆ తర్వాత కూడా చాలాకాలం పాటు ఇంగ్లీషు రచయితల ఇంగ్లీషుని అర్థం చేసుకోగలిగే శక్తి నాకు స్వల్పంగానే ఉండేది. వేరే దేశాల రచనల ఇంగ్లీషు అనువాదాల్ని చదివినంత సులభంగా ఇంగ్లీషు భాషాసాహిత్యానికి చెందిన రచయితల్ని చదవలేకపోయేవాణ్ణి. ఇందులో ఆశ్చర్యం లేదు. ప్రతిపదార్థం లేకుండా ఆముక్తమాల్యదనీ, వసుచరిత్రనీ చదవడం నాకిప్పటికీ కష్టమే.

అయితే ఇంగ్లీషు కవులు-షెల్లీ, కీట్స్, బైరన్, బ్రౌనింగ్ వంటి వారిని ఇప్పుడు చదవడం చాలా సులభం. ఎందుకంటే ఇంటర్నెట్ లో వాళ్ళ కవిత్వాన్ని పాఠం చెప్పినట్టు బోధించే  shmoop.comsparknotes.com వంటి సైట్లు చాలానే ఉన్నాయి. కాని, ఒక కవితని ఒక అనువాదకుడు మనకి సన్నిహితం చేసినంతగా ఒక ట్యూటర్ ఎప్పటికీ సన్నిహితపరచలేడు. అందుకు, రామస్వామిగారి కీట్స్ అనువాదాలే సాక్ష్యం. ఇప్పటి నవయువతీ యువకులెంత అదృష్టవంతులో కదా.

ఆయన తీసుకొచ్చిన పుస్తకాల్లో ‘అనుస్వరం’ నన్ను మరింత ప్రత్యేకంగా ఆకర్షించింది. అందులో ఆయన ఎంపిక చేసిన కవులు దాదాపుగా భూగోళమంతటినుంచీ ఉన్నారు. నెరూదా, గాబ్రియేలా మిస్ట్రల్, పుష్కిన్, వర్డ్స్ వర్త్, అరవిందులు, విందా కరందీకర్ ల నుంచి హాన్ షాన్ దాకా ఉన్నారు.

అసలు కవితాసాధన చేస్తున్న ప్రతి కవి దగ్గరా ప్రపంచ దేశాల కవుల అల్బమ్ ఒకటి ఉండాలంటాను. అందులో ప్రాక్పశ్చిమాలు, ప్రాచీన ఆధునిక కాలాలకు చెందిన ఎందరో కవుల గురించిన ఆసక్తికరమైన విశేషాలు ఉండాలి. ప్రసిద్ధులూ, అప్రసిద్ధులూ ఎవరు రాసిందైనా, నువ్వు మొదటిసారిగా చదవగానే నిన్ను నిశ్చేష్టుణ్ణి చేసినకవిత కనీసం ఒకటైనా ఆ ఆల్బమ్‌లో పిన్ను చేసి ఉండాలి.

అట్లాంటి మరవలేని ఆల్బంలు కొన్ని ఉన్నాయి. నోబెల్ పురస్కారం పొందిన పోలిష్ కవి చెస్లావ్ మీవోష్ తనకి నచ్చిన కొన్ని కవితల్ని A Book of Luminous Things: An International Anthology of Poetry (1998) వెలువరించాడు. అందులో ప్రతి కవితకీముందొక చిన్న వ్యాఖ్య కూడా రాసాడు. ఆ కవితలు ఎంత ఆకర్షణీయాలో, ఆ వ్యాఖ్యలు కూడా అంతే సమ్మోహనీయాలు. ప్రసిద్ధ కవి, అనువాదకుడు రాబర్ట్ బ్లై The Winged Energy of Delight (2005) పేరిట కొందరు మహాకవుల గురించి పరిచయాలతో పాటు వారి కవితల్ని అనువదించి సంకలనం చేసాడు. ఎడ్వర్డ్ హిర్ష్ వెలువరించిన Poets Choice (2006) మరింత అమూల్యమైన పుస్తకం. ప్రతిరోజూ కనీసం ఒక కవి గురించేనా చదువుతూ ఉండాలనిపించే పుస్తకం.

తెలుగులో కూడా ఇస్మాయిల్ గారు ‘రెండో ప్రతిపాదన’ (1996) పేరిట వివిధ ప్రపంచ కవుల కవితల అనువాదాల్ని, తనదైన శైలితో చేసిన పరిచయాలతో వెలువరించారు. (తన పుస్తకాలకు ఎవరితోటీ ముందుమాటలు రాయించుకోని ఇస్మాయిల్ గారు ఆ ఒక్క పుస్తకానికీ నాతో ముందు మాట రాయించుకోవడం నా అదృష్టమనుకుంటాను.)

ఇప్పుడు రామస్వామిగారి ‘అనుస్వరం’ చూడగానే నాకు ఇస్మాయిల్ గారి కృషికి కొనసాగింపు కనిపించింది. (మధ్యలో ముకుందరామారావుగారు కూడా ఉన్నారనుకోండి.) కాని ఇట్లాంటి సంకలనాలు,అనువాదాలు ఒకటీ,రెండూ కాదు, వందల్లో రావాలి, అప్పుడే తెలుగు జాతి చూపు విశాలమవుతుంది.

10-7-2016

 

Leave a Reply

%d bloggers like this: