అనంతపురం చరిత్ర

Reading Time: 3 minutes

47

ఇప్పుడు తెలుగు సాహిత్యంలో కృషి చేస్తున్న యువరచయితల్లో డా.వేంపల్లి గంగాధర్ ముందువరసలో ఉంటాడు. అతడికి సాహిత్య అకాదెమీ యువపురస్కారం లభించింది కూడా.

ఆరేడేళ్ళ కిందట అతడు ‘పూణేకి ప్రయాణం’ అనే పుస్తకం పంపించాడు. కడప, అనంతపురం ప్రాంతాలనుంచి ముంబై, షోలాపూర్, పూణే వంటి ప్రాంతాలకు విక్రయమవుతున్న గిరిజన మహిళల గురించిన యథార్థకథనం. ఆ పుస్తకం నన్ను చాలా కలవరపరిచింది. ఆ పుస్తకాన్ని అప్పటి గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కి ఇచ్చాను. అప్పణ్ణుంచీ ఆ మహిళలకోసం గిరిజన సంక్షేమ శాఖ ఏదన్నా చెయ్యాలని పోరుపెడుతూనే ఉన్నందుకు పోయిన ఏడాది కదిరి ప్రాంతానికి చెందిన కొందరు గిరిజనస్త్రీలకు కొంత పునరావాసం లభించింది.

ఈసారి గంగాధర్ నుంచి నేను మరొక పుస్తకం అందుకున్నాను.

‘అనంతపురం చరిత్ర’.

ఒకప్పుడు కల్నల్ కాలిన్ మెకంజీ సేకరించిన రచన అది. దాన్ని దాన్ని బ్రౌన్ ఇంగ్లీషులోకి అనువదించి 1853 లో ప్రచురించాడు. ఇన్నేళ్ళ తరువాత ఆ పుస్తకాన్ని గాయత్రి ప్రచురణలు, అనంతపురం వారు మళ్ళా వెలుగులోకి తీసుకువచ్చారు.

ఆ పుస్తకానికి డా. గంగాధర్ విపులమైన ముందుమాట రాసాడు. మౌర్యులకాలంనుండి మన్రో దాకా రాయలసీమ పరిణామాన్ని, ముఖ్యంగా అనంతపురం చరిత్రని స్థూలంగా వివరిస్తూ ప్రస్తుతం నెలకొన్న సామాజిక-రాజకీయ పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకమెట్లా ఉపకరిస్తో వివరించాడు.

ఈ రచన రాసింది ఎవరో తెలియదు. మెకంజీకి కూడా తెలియదనుకోవాలి. కాని సుమారు వందపేజీల ఈ రచనను ఏకబిగిన చదవకుండా ఉండలేకపోయాను. ఎంతో విశ్వసనీయంగానూ, ఉత్కంఠభరితంగానూ ఆ రచయిత అనంతపురం చరిత్రను చెప్పుకుంటూవచ్చాడు. క్రీ.శ 1364 నుండి 1811 దాకా సుమారు ఆరు శతాబ్దాల చరిత్ర. అంత విస్తృతమైన కాలానికి చెందిన పరిణామాల్ని అతడు చెప్పిన తీరులో గొప్ప రచయితలకు కూడా సాధ్యంకాని కౌశల్యం కనిపించింది.

ఆ మాటకొస్తే, అసలు తెలుగు రచయితలకి చారిత్రిక రచనలు చెయ్యడం చాతకాదనే చెప్పాలి. ఈ మాట చెప్పే అధికారం నాకెందుకుందంటే, నేను చారిత్రిక రచచనల వీరాభిమానిగానే తెలుగు సాహిత్యపఠనం మొదలుపెట్టానుకాబట్టి. నోరి నరసింహశాస్త్రి, అడవి బాపిరాజు, విశ్వనాథ సత్యనారాయణ నా తొలిరోజుల ఆరాధ్య రచయితలు. ‘రాజస్థాన కథావళి’, ‘మొగలాయీ దర్బారు కుట్రలు’,  ‘దుర్గేశనందిని’, ‘విజయనగర సామ్రాజ్యపతనం’ చదువుకుంటూ నేనక్కడున్నట్టే ఊహించుకునేవాణ్ణి. ఆ తర్వాత రాహుల్జీ రచనలు. కాని మాస్తి వెంకటేశ అయ్యంగార్ ‘చిక్కవీర రాజేంద్ర’ చదివినదాకా, ఒక నిజమైన చారిత్రిక నవల ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో నాకు తెలియలేదు. మన రచయితల దృష్టిలో చరిత్రకీ, పురాణానికీ మధ్య తేడా లేదు. ఒక్క ‘చెంఘిజ్ ఖాన్’ తప్ప తెలుగులో చరిత్రను నిర్దుష్టంగానూ, విశ్వసనీయంగానూ పునర్మించిన రచన లేదనే చెప్పాలి.

వెయ్యేళ్ళ కాలంలో వెనక్కి వెళ్ళి అప్పటి సంఘటనల్ని చిత్రించాలనుకునే రచయిత, అసలు ఆ స్థలకాలాలెటువంటివి, ఆ ప్రజలు ఏం తినేవారు, ఏం కట్టేవారు, ఏం పండించేవారు, యుద్ధాలెట్లా చేసేవారు, తగాదాలెట్లా పరిష్కరించుకునేవారు, ఒకళ్ళనొకళ్ళు ఎట్లా పిలుచుకునేవారు, ప్రేమించుకునేవారు, పుట్టుకలు, పెళ్ళిళ్ళు, చావులు ఎట్లా సాగుతుండేవి- ఇవేవీ తెలియకుండా ఆ కాలం గురించి రచన ఎట్లా చెయ్యగలరో నాకు అంతుబట్టదు.

అంటే, ఆ రచనలో ఈ వివరాలన్నీ ఏకరువు పెట్టాలని కాదు. ఈ వివరాలు నిర్దుష్టంగా సంభావించగలిగినప్పుడు ఆ పాత్రలు మరింత నిర్దుష్టంగా రూపొందుతాయి. ఆ రచన చదివినప్పుడు, మనకి చరిత్ర కలిగించివలసిన అంతర్దృష్టి తప్పకుండా కలిగితీరుతుంది. అలాకాకుండా, తమకి తెలిసింది కొంతా, తాము ఊహించేదీ చాలానూ అయినప్పుడు, ఆ రచన హాస్యాస్పదంగానే కాదు, విషాదకరంగా కూడా ఉంటుంది.

అందుకనే రాను రాను తెలుగులో చారిత్రిక నవలలు లల్లాదేవి, ముదిగొండశివప్రసాద్ ల దగ్గరకి వచ్చేటప్పటికి పురాణస్థాయిని కూడా దాటి ఫాంటసీ స్థాయిని చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోంచే ‘రుద్రమదేవి’, ‘శాతకర్ణి’ లాంటి సినిమాలు పుట్టుకొస్తున్నాయి. ఆ దర్శకులకి, ఆ రచయితలకి తామే కాలం గురించి రాస్తున్నారో, తీస్తున్నారో కించిద్ కూడా అవగాహన లేకపోవడం మనల్ని నిశ్చేష్టుల్ని చేస్తుంది. ఏదో ఒక వ్యక్తినామమో, స్థలనామమో,లేదా పదప్రయోగమో చరిత్రను పునర్నిర్మించదు. ఒకవేళ అటువంటి పదప్రయోగాలు ఒకటీ అరా కనిపించినా, ఆ రచయితల, దర్శకుల భావదారిద్ర్యం, అజ్ఞానం మనల్ని వెంటనే అధఃపాతాళానికి కుంగదీస్తుంది.

ఉదాహరణకి, శాతకర్ణీ , అతడి భార్యా మారువేషంలో సంచరిస్తూ, ఒక అంగడిదగ్గర బొమ్మ బేరమాడినప్పుడు, దాని వెల ‘రెండు కార్షాపణాలు’ అనగానే నాకెంతో సంతోషమనిపించింది. ఎన్నాళ్ళకు విన్నాను, ‘కార్షాపణం’ అనే మాట అని. కాని ఆ వెంటనే వాళ్ళు ఒక వీథినాటకం చూడటానికి కూర్చోగానే రంగస్థలం మీద కథకళి ప్రదర్శన మొదలవుతుంది. అంటే ఒకటో శతాబ్ది పాత్రలు పదిహేడో శతాబ్ది కళారూపాన్ని చూస్తూంటారన్నమాట!

ఇటువంటి కాలంలో, ఈ ‘అనంతపురం చరిత్ర’ చదవడం నాకు గొప్ప ఉద్వేగాన్నీ, గొప్ప ఉత్సాహాన్నీ కూడా కలిగించింది. ‘బోయకొట్టములు పండ్రెండు’ తప్ప గత ముఫ్ఫై, నలభయ్యేళ్ళుగా తెలుగులో చెప్పుకోదగ్గ చారిత్రిక రచననేదీ చదివిన జ్ఞాపకం లేని నాకు, ఈ అజ్ఞాతరచయిత రాసిన పుస్తకం చరిత్రగానూ, సాహిత్యంగానూ కూడా అద్భుతంగా అనిపించింది.

సుమారు ఆరుశతాబ్దాల కాలానికి చెందిన ఈ రచనలో ప్రధాన ఇతివృత్తాలు 1750 నుండి 1810 దాకా, అరవై ఏళ్ళ కాలానికి చెందినవి. రాయలసీమలో హిందూ, ముస్లిం యుగాల చివరి కాలానికి చెందిన సంఘటనలు. అంటే ఒక యుగాంత రచన. ఒక బృహత్ ఇతిహాసపు స్థాయిలో సాగే ఈ రచనలో, రచయిత అవసరమైతే, చిన్ని చిన్ని వివరాలు కూడా చెప్పడానికి సంకోచించడు. నిజానికి, అట్లాంటి వివరాలవల్లనే ఆ కథనం మరింత నమ్మదగ్గట్టుగానూ, ఆ పాత్రలు మరింత సజీవంగానూ గోచరిస్తాయి.

ఉదాహరణకి, తనని వంచనతో అంతమొందించడానికి పన్నాగం పన్నిన బళ్ళారి రామప్పనాయుడికి అనంతపురం రామప్పనాయుడు కోటలో ఆతిథ్యమివ్వడానికి సిద్ధపడ్డప్పుడు, అందుకుగాను, కోటలోని తన సైన్యాన్ని ఒక రాత్రికి ఖాళీ చేయించాలనుకున్నప్పుడు, అతడి సేనాపతి దేశాయి నారణప్ప అడ్డుపడతాడు. అక్కడ రచయిత ఇలా రాస్తాడు:

‘దేశాయి నారణప్ప ధణీతో, నా మనవి చిత్తగించండి, మీ జననకాలానికి బుధుడు మారకుడు, అతని మహాదశ రేపు, అతని వారమున్నూ రేపే, గనక మీ దర్శనం రేపటిదినం మాకు అయ్యే యోగ్యం లేదు, ఋణం తీరినది అని ఖండితోత్తరములు చెప్పి సెలవు తీసుకునివెలపటికి వచ్చి వారు వారు తమ ఇండ్లకు బోయిరి.’ (పే.66)

ఈ నాలుగు వాక్యాల్లో ఆ కాలమూ, ఆ దేశమూ ఎంతో సూక్ష్మవివరాలతో చిత్రించబడ్డాయి. అంటే, అప్పటి ప్రజల జీవితం మీద జ్యోతిష్యం ప్రభావమొక్కటే కాదు, సేనాధిపతికి తన ప్రభువు జాతకం తెలిసి ఉండటం, దశా, అంతర్దశలతో సహా, అతడా గ్రహపరిణామాల్ని గమనిస్తూండటం, అతడు సాహసించి తన ప్రభువుకు సలహా ఇవ్వడం, మంచితనంతో మూర్ఖంగా రామప్పనాయుడు ఆ మాటలు పెడచెవిన పెట్టడం, ఆ రాత్రే అతడు మోసంతో హతుడు కావడం, ఆ వైనమంతా గొప్ప సాహిత్యశిల్పంతో చెప్పుకొస్తాడు కథకుడు.

అసలు, ఈ నూరు పేజీల రచననుంచి కనీసం రెండు మూడు బృహత్ చారిత్రిక రచనలైనా రూపొందగలవు, రాయగల రచయితలుండాలే గాని. మొదటిది, హండే పవాడప్పనాయుడి వృత్తాంతం. అతణ్ణి ప్రభుభక్తులు ఎట్లా రక్షించిందీ,ఆ తరువాత, అతడు తనని మోసగించినవాణ్ణి పట్టుకుని చంపడం, కాని దాన్ని బ్రహ్మహత్యగా భావించి, ఆ భీతినుంచి బయటపడలేకపోవడం, చివరికి తన గొంతు తానే పిసుక్కుని చనిపోవడం, అదంతా గొప్ప గ్రీకు నాటకస్థాయికి చెందిన ఇతివృత్తం. ఆ కథ తెలుగులో గొప్ప చారిత్రిక నవల లేదా నాటకం కాగలదు. అట్లానే, బళ్ళారి రామప్పనాయుడి కథ. మూడవ ఇతివృత్తం, సిద్ధప్పనాయుడు, బసవప్పనాయుడూ టిప్పుసుల్తాన్ కారాగారంనుంచి బయటపడి తిరిగి రాజ్యం సంపాదించుకోవడం. ఒరియాలో సురేంద్రమొహంతి రాసిన ‘నీలశైలం’ కి సమానమైన ఇతివృత్తమది.

మళ్ళా పునర్ముద్రించినప్పుడు, ఈ రచనలో కఠిన పదాలకు అర్థాలిస్తే బాగుంటుంది. ధణి, ఖండిణి, అప్పణ, సంబళం, హుళె, వుమ్మళిగె వంటి పదాలకు అర్థం నేను సందర్భాన్ని బట్టి ఊహించుకోక తప్పింది కాదు. మరొకటి, కథాకథనం సంభవించిన ప్రాంతాల పటం కూడా ఒకటి జతపరచవచ్చు. ఆ దూరాలెటువంటివో తెలిస్తే, ఆ సంఘటనల ప్రాబల్యం మరింత స్ఫురిస్తుంది.

ఈ వందపేజీల పుస్తకం చదవగానే నాకు తక్షణమే మెకంజీ కైఫీయత్తులన్నీ చదవాలన్నంత ఉద్వేగం కలిగింది. గంగాధర్ కి మళ్ళీ ఋణపడ్డాను.

31-1-2017

Leave a Reply

%d bloggers like this: