కందుకూరి రమేష్ బాబు నాకు పదేళ్ళుగా తెలుసు. అతడు రాసిన ‘కోళ్ళ మంగారం, మరికొందరు’ (2006) తో పాటు మరొక రెండు పుస్తకాలు, ‘బాలుడి శిల్పం’, ‘గణితం అతడి వేళ్ళ మీద సంగీతం’ కూడా సమీక్ష చెయ్యమని వసంతలక్ష్మిగారు నాకు పంపిస్తూ అతడి గురించి నాలుగైదు మాటలు కూడా చెప్పారు. ఆ పుస్తకాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. మన చుట్టూ ఉన్న జీవితంలో మనం చూడని, చూడటానికి ఆగని జీవిత సన్నివేశాల్ని, వ్యక్తుల్ని, జీవనసమరాన్ని అతడు ఆ పుస్తకాల్లో చూపించాడు.
కాని నిన్న అతడి ప్రసంగం ‘నేను వదులుకున్న పాఠాలు’ విన్నప్పుడు రమేష్ బాబు ఈ పదేళ్ళలో చాలా దూరం ప్రయాణించేడనీ, చాలా పరిణతి సాధించేడనీ అర్థమయింది.
హైదరాబాదు స్టడీ సర్కిల్లో ‘ఛాయ’ సంస్థ నెలవారీ సమావేశంలో తన ప్రసంగం వినడానికి నన్ను రమ్మని పిలిచినప్పుడు నేను కేవలం ఆసక్తితోనే వెళ్ళినా,నాతో పాటు అక్కడున్న కొద్ది మంది శ్రోతలూ కూడా దాదాపు గంట సేపు సాగిన ఆ ప్రసంగంలో పూర్తిగా నిమగ్నులైపోయారు. ఒక విధంగా అతడితో పాటు కలిసి ప్రయాణించేరు. గొప్ప ఆధ్యాత్మిక ప్రసంగాలు వింటున్నప్పుడు జరిగేటట్టే, ఆ మాటలు వింటున్నంతసేపూ దాదాపుగా ప్రతి ఒక్కరూ అంతర్ముఖీనులైపోయారు.
రమేష్ బాబు తన ప్రసంగ విషయంగా తాను వదులుకున్న పాఠాల్ని ఎంచుకుని, అటువంటి కొన్ని పాఠాల గురించి చెప్పినప్పటికీ, ఆ ప్రసంగమంతా ప్రధానంగా ప్రసిద్ధ భారతీయ ఛాయాచిత్రకారుడు రఘురాయ్ గురించిన ప్రసంగం గానే సాగింది. తనకీ, రఘురాయ్ కీ మధ్య సాన్నిహిత్యం గురించీ, రఘురాయ్ నుంచి తానేమి నేర్చుకున్నదీ చాలా చిన్ని చిన్ని సంఘటనలతో, ఉదాహరణలతో అతడు వివరించిన తీరు ఎంతో హృద్యంగానూ, భావస్ఫోరకంగానూ ఉంది.
ఒక ఉదాహరణ:
రఘురాయ్ ని స్టేట్స్ మన్ పత్రిక ఎడిటర్ మొదటిసారి మదర్ థెరెసా దగ్గరకు తీసుకువెళ్ళినప్పుడు ఆమె అతణ్ణి డెస్టిట్యూట్ హోం లో ఉన్న ఆశ్రమవాసుల ఫొటోలు తియ్యమని అడిగిందట. అతడు అట్లానే ఫొటోలు తీసుకువెళ్తే మదర్ వాటిని మెచ్చుకోలేకపోయిందట. ‘జీవితంలో ఒక ఆశ, ఒక ఆసరా దొరికిన చివరిక్షణాల్లోని మనుషుల వదనాల్ల్లా లేవిందులో, శవాలూ, అస్థిపంజరాలూ మాత్రమే కనిపిస్తున్నాయి’ అన్నదట ఆమె. అప్పుడు మదర్ కళ్ళతో అతడు మళ్ళా ఆ వదనాల్నే ఫొటోలు తీసేడట. ఈ సారి ఆ కెమేరా దృశ్యాన్ని కాక దర్శనాన్ని చిత్రీకరించగలిగిందట.
రమేష్ బాబు ప్రసంగమంతా దాదాపుగా ఈ అంశం చుట్టూతానే తిరిగింది. కెమేరా కన్ను, మానవుడి కన్ను- ఈ రెండింటి మధ్యా తేడా, ఫొటో తీస్తున్నప్పుడు మనిషి ఒక కన్ను మూసుకుని, మరొక కన్నుని కెమేరా కన్నుతో జతకలిపి, లెన్స్ అనే మూడవనేత్రంతో చూడటం ఎట్లానో తనకి రాఘు రాయ్ నుంచే తెలిసిందని ఎన్నో ఉదాహరణలు చెప్పాడు.
ఫొటో తియ్యడమంటే ఒక దృశ్యాన్ని బంధించడం మాత్రమే కాదు, ఆ దృశ్యంతో ఒక జీవితకాల అనుబంధం పెనవైచుకోవడమని కూడా తాను గ్రహించానని చెప్పాడు.
తానొకప్పుడు మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఫొటోలు తియ్యడానికి వెళ్ళినప్పుడు తన ఇంట్లో దొంగతనం జరిగిందనీ, తిరిగి వచ్చాక తన ఇంటి ఎదట ఉండే ఒక ముసలమ్మ తనని ఎక్కడికివెళ్ళావని అడిగిందనీ, తాను మేడారం వెళ్ళానంటే, నీకు నమ్మకముందా అని అడిగిందనీ, తనకి నమ్మకం లేదని చెప్తే తప్పు కదా, నమ్మకం లేని చోటికి పోయి ఫొటోలు తియ్యకూడదు కదా అని అన్నదనీ చెప్పాడు. ఒక ప్రార్థనాస్థలానికి తాను టూరిస్టుగా వెళ్ళినందుకే తాను అటువంటి పరిహారం చెల్లించవలసి వచ్చిందని కూడా చెప్పాడు.
ప్రసంగం అయిన తర్వాత, ఒక శ్రోత లేచి, నమ్మకం లేని చోటకి వెళ్ళకూడదనడం అర్థమవుతోంది కాని, అక్కడ పోటోలు తీసినందుకు మీ ఇంట్లో దొంగతనం జరిగిందనడం అర్థం కావడం లేదంది. దానికి రమేష్ ఇచ్చిన జవాబు మరింత గంభీరం గా ఉంది. అతనన్నాడు కదా: ‘నేనూ, నా భార్యా ఇంట్లో లేనందువల్ల దొంగతనం జరిగింది. మేడారం జాతరప్పుడు ఇళ్ళల్లో దొంగతనాలు జరగడం కూడా మామూలే. కాని ఆ దొంగతనం వల్ల అంత నష్టమే కనక నాకు జరగకపోయిఉంటే ఇంత విలువైన పాఠం నేను నేర్చుకుని ఉండేవాణ్ణి కాను.’
నేను కూడా లేచి నిలబడ్డాను.
‘కాని ప్రశ్నలు అడగడానికి కాదు, నా ప్రశంస తెలియచెయ్యడానికి మాత్రమే’ అని చెప్పాను.
ఇంకా ఈ మాటలు కూడా చెప్పాను:
‘రమేష్, అభ్యసనంలో ‘లెర్నింగ్ ‘, ‘అన్ లెర్నింగ్ ‘ అనే రెండు పార్శ్వాలున్నాయని మొదటినుంచీ పెద్దవాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఈశావాస్యోపనిషత్తులో ఒక ప్రసిద్ధ శ్లోకముంది:
అంధం తమః ప్రవిశంతి యే అవిద్యా ముపాసతే
తతో భూయ ఇవ తే తమో య ఉ విద్యాయాగం రతాః
(అవిద్యని ఉపాసించే వాళ్ళు అజ్ఞానంలో పడతారు. కాని విద్యని ఉపాసించేవాళ్ళు అంతకన్నా కూడా అజ్ఞానంలో పడతారు)
‘అభ్యసనంలో నేర్చుకోవడం ఒక భాగమైతే, వదులుకోవడం రెండవ భాగం. ఎవరి చదువు లెర్నింగ్ తో ఆగిపోతుందో, అన్ లెర్నింగ్ వైపు సాగదో వారి జీవితం పరిపూర్ణం కాదు.మనం పిల్లవాణ్ణి విద్యావంతుణ్ణి చెయ్యడమే కాదు, అతణ్ణి విద్యనుంచి రక్షించాలి కూడా అని రూసో అన్నదిందుకే.’
‘కాని చిత్రమేమిటంటే, సాధారణంగా, పాఠశాలలు, కళాశాలలు, ఉపాధ్యాయులు, పుస్తకాలు, గూగుల్, స్కైప్, ట్విట్టర్ లు మనకి లెర్నింగ్ కి మాత్రమే సహకరిస్తాయి. అన్ లెర్నింగ్ కావాలంటే, మాష్టార్లు కాదు, Master కావాలి. ఒక జెన్ గురువు, సూఫీ సాధువు వంటి మాష్టర్ కావాలి. అతడు మటుకే మనని విద్యనుంచి రక్షిస్తాడు.మీకు అట్లాంటి మాష్టర్ రఘురాయ్ రూపంలో కనిపించాడు. అతడితో మీ అనుభవాలు వింటూంటే నాకు గొప్ప గురు-శిష్య సంభాషణలు వింటున్నట్టనిపించింది. చాలా సంతోషంగానూ, తృప్తిగానూ కూడా ఉంది ‘
అని కూడా చెప్పాను.
4-1-2016
వ్యాసం చాలా బాగుంది