అట్టిలా జోసెఫ్

30

ఈ రోజు ప్రపంచమంతా తల్లుల్ని తలుచుకునే రోజు, గౌరవించే రోజు. తల్లి ఒక నామవాచకం,ఒక సర్వనామం, ఒక క్రియ, ఒక విశేషణం, ఒక క్రియావిశేషణం, తల్లి అన్ని భాషల్నీ మించిన భాష. తల్లి ఒక మతం, దేవతలు అసంఖ్యాకం, కాని తల్లి ఒక్కతే.

అందరూ తమ తల్లులకి వందనమిచ్చే ఈ రోజు, నాకొక తల్లీ, కొడుకూ గుర్తొస్తున్నారు. ఆ కొడుకు, అట్టిలా జోసెఫ్ (1905-1937). ఆధునిక హంగేరియన్ సాహిత్య వైతాళికుడు, ప్రపంచవ్యాప్తంగా శ్రమజీవులందరి మూగగొంతులకీ తన గరళకంఠాన్ని అందించిన కవి.

లేమిలో, పేదరికంలో, ఎముకలు కొరికేసే దారిద్ర్యంలో అతడెట్లా బతికాడో, ఎట్లా మహాకవి కాగలిగాడో, ఎట్లా హంగరీకీ, ప్రపంచానికీ కూడా నిరంతర సాంత్వన కాగలిగాడో, అదంతా ఒక కన్నీటి గాథ, ఉత్కంఠభరితమైన మానవ విజయగాథ, వైఫల్యగాథ, జీవితవైఫల్యాన్ని, అక్షరవిజయంతో ఏమార్చుకున్న గాథ.

అతడి మూడేళ్ళ వయసులో అతడి తండ్రి కుటుంబాన్ని వదిలేసి పారిపోయాడు. ముగ్గురు పిల్లలు. వాళ్ళని సాకడం కోసం ఆ తల్లి ఇళ్ళల్లో గుడ్డలుతికి, అంట్లుతోమి పాచిపని చేసుకు బతికింది. చిన్నప్పుడు మూడేళ్ళ వయసుదాకా, ఆ తర్వాత ఏడేళ్ళ నుంచి పదిహేనేళ్ళదాకా అట్టిలా తల్లి దగ్గరే బతికాడు. ఆమెకి సాయంగా ఉండటంకోసం ఆ చిన్నపిల్లవాడు తాను చెయ్యగలిగిందంతా చేసాడు. నీళ్ళు అమ్మాడు, బరువులు మోసాడు, బొగ్గులూ, కట్టెలూ దొంగిలించాడు. తల్లికోసం, చెల్లెళ్ళకోసం తన బాల్యమంతా ఆహుతి చేసాడు. 1919 లో అతడి తల్లి మరణించింది. కాని ఆ తల్లి అతణ్ణి వదిలిపెట్టిందెప్పుడని!

అట్టిలా కవితలన్నీ మహత్తరమైనవేగాని, అతడు వాళ్ళమ్మ గురించి రాసుకున్న కవితలు, మరింత మహత్తరమైనవి. అవి చదివినప్పుడల్లా నేను ఒంటరిపిల్లవాడినైపోతాను. నా ప్రాణం మా అమ్మ కోసం కొట్లాడుతూంటుంది.

మీరు చదివినా మీకూ అంతే. చూడండి:

నువ్వు నన్నో శిశువుని చేసావు

ఎముకలు కొరికేసిన ముఫ్ఫై శీతాకాలాలు
నన్నో మనిషిని చెయ్యడానికి ఎంతో పెనగులాడేయి.
అయినా ఇప్పటికీ నేను నడవలేను, ఒంటరిగా నిలబడలేను
నిద్రలో నడిచినట్టుగా నా పాదాలు నీ వైపే నడుస్తాయి

కుక్కల్ని పట్టేవాళ్ళనుంచి
కుక్కపిల్లల్ని నోటన కరుచుకుని
పరిగెత్తే కుక్కలా
నేను నిన్ను నా నోట్లోనే కరిచిపెట్టుకుంటాను.

నాకేదన్నా పెట్టమ్మా,
చిన్న మాంసం ముక్కయినా ఇటు విసరవే, అమ్మా.
నాకు ఆకలేస్తోంది, చలేస్తోంది,
దుప్పటి కప్పవే.
నేను అల్లరిచేస్తున్నాను, చితకబాదవే.
ఇక్కడ చాలా చలిగా ఉంది,
నువ్వు లేక నేను వణుకుతున్నాను,
నా ఎముకల్లోకి చలి పొడుచుకొస్తోంది,
నన్ను ఒంటరిగా వదిలెయ్యమని వాళ్ళకి చెప్పవే.

నీ నుంచి ఒక్క చూపు,
నేను మొత్తం మర్చిపోగలను.
నువ్వు వింటూండు, నేను మాట్లాడుతూంటాను.

నన్ను నా కాళ్ళమీద బతికేలా చెయ్యి
నన్ను బతకనివ్వు, ఒంటరిగా చచ్చిపోనివ్వు

మా అమ్మ నన్ను బయటికి తన్ని తరిమేసింది,
నేనామె గుమ్మం దగ్గరే పడి ఉన్నాను.
నాలోకి నేను పాక్కోవాలనుకుంటున్నాను,
నా కింద రాయి, పైన ఒట్టి గాలి.

నేను కొద్దిగా నిద్రపోగలిగితేనా
ఆ తలుపట్లా బాదుతోనే ఉన్నాను…

గడ్డకట్టిన మనుషులు చాలా మందే ఉన్నారు
నేనూ వాళ్ళల్లొ ఒకణ్ణి, కాని, ఒకటి, వాళ్ళంతా ఏడవగలరు,
అందుకనే నాకా మనుషులంటే ప్రేమ
నేను కూడా తమవాణ్ణేనని తెలుసు వాళ్ళకి.

(దీన్ని తెలుగుచేస్తున్నంతసేపూ కన్నీళ్ళు చూపుకి అడ్డుపడుతూనే ఉన్నాయి.)

అమ్మ

వారం రోజులుగా, ఉండీ, ఉండీ
మా అమ్మే గుర్తొస్తోంది నాకు.
ఉతికిన గుడ్డలు నీళ్ళు కారుతుండగా
ఆ బుట్టపట్టుకుని
ఆమె చకచకా మేడపైకి వెళ్తున్నదృశ్యం.

నేనెంత దుడుకు ధైర్యశాలినంటే
కాళ్ళు నేలకేసి తాటిస్తో, అరుస్తో
మారాం చేస్తూనే వున్నాను.
ఆ గుడ్డలెవరికైనా అప్పగించు,
నన్ను మేడమీదకి తీసుకెళ్ళంటూ.

ఆమె మాట్లాడకుండా
ఆ గుడ్డలట్లా ఆరేస్తూనే ఉంది.
నన్ను తిట్టలేదు, కనీసం నా వంక చూడలేదు
ఉతికి ఆరేసిన ఆ గుడ్డలు ఆ గాల్లో
మెరుస్తున్నాయి, గుసగుసలాడుతున్నాయి.

నా గొణుగుడు ఆపేసాను,
అప్పటికే ఆలస్యమైపోయింది.
ఇప్పుడు తెలుస్తోంది, ఆమె ఎంత సమున్నతురాలో.
తన నెరిసిన జుత్తు స్వర్గంలోకీ రెపరెపలాడుతోంది,
ఆకాశజలాలకి తాను నీలిమ చేకూరుస్తోంది.

7-5-2016

Leave a Reply

%d bloggers like this: