రెండురోజుల కిందట. పొద్దున్నే ఆఫీసుకి వెళ్ళే హడావిడి. విజ్జి అన్నం వడ్డించింది. కాని నా మనసులో కర్ణపర్వంలో శ్రీకృష్ణుడు మాట్లాడిన మాటలే పదేపదే వినిపిస్తున్నాయి. ఘటోత్కచవధ అయిన తరువాత ఆయన సంతోషం ఆపుకోలేకపోయాడు. మాటిమాటికి అర్జునుడి వీపు చరుస్తూ సంతోషంతో అరుస్తూ ఉన్నాడు. ఆ సంతోషాన్ని అర్జునుడు కూడా అర్థం చేసుకోలేకపోయాడు. ‘అంతా దు:ఖంతో ఉంటే నువ్విట్లా సంచలిస్తూండటం నేను అర్థం చేసుకోలేక పోతున్నాను. ఇందుకు కారణం రహస్యం కాకపోతే నాకు చెప్పు’ అన్నాడు. దానికి కృష్ణుడు చాలా వివరంగానే జవాబిచ్చాడు. ‘తన కవచకుండలాలు ఇంద్రుడికిచ్చినందుకు, ఇంద్రుడినుంచి కర్ణుడు పొందిన శక్తిని ఇన్నాళ్ళూ నీ మీద ప్రయోగించడంకోసమే దాచుకున్నాడు. అది ఉన్నంతకాలం నాకు నిద్రపట్టలేదు. అది ఇన్నాళ్ళకు ఘటోత్కచుడిమీద ప్రయోగించడంతో కర్ణుడింక మామూలు యుద్ధవీరుడు మాత్రమే. ఆ శక్తి ఉందనే ఇన్నాళ్ళూ నిన్ను కర్ణుడికి ఎదురుగా పోనివ్వలేదు. నిన్ను అహర్నిశలూ అతణ్ణుంచి కాపాడుకోవడమెట్లా అన్న ఆలోచనతో నాకు నిద్రకూడా పట్టేది కాదు’ అన్నాడు కృష్ణుడు.
అంతేకాదు, ఆ తరువాత సాత్యకితో ఇట్లా అన్నాడు:
న పితా న చ మే మాతా న యూయం భ్రాతర
న చ ప్రాణస్తథా రక్ష్యా యథా బీభత్సురాహవే (కర్ణ పర్వం:183:43)
(‘యుద్ధంలో బీభత్సుడిని రక్షించుకోవడం కన్నా నాకు నా తండ్రి, నా తల్లి, నా సోదరుడి ప్రాణాలుగాని, మీ ప్రాణాలుగాని, చివరికి నా ప్రాణాలు కూడా ముఖ్యం కాదు.’)
అక్కడితో ఆగకుండా మరోమాట కూడా అన్నాడు:
త్రైలోక్యరాజ్యాద్ యత్ కించిద్ భవేదన్యత్ సుదుర్లభమ్
నేచ్ఛేయమ్ సాత్వతాహమ్ తద్ వినా పార్థమ్ ధనంజయమ్ (183:44)
(‘ఈ మూడులోకాల్నీ పాలించడంకన్నా కూడా విలువైనదంటూ ఏదన్నా ఉంటే దాన్ని కూడా పార్థధనంజయుడు లేకుండా పొందడం నాకు ఇష్టం లేదు.’)
బహుశా మనమెవరమైనా జీవితంలో కోరుకోవలసింది ఇటువంటి మనిషిని, సఖుణ్ణి, హితైషిని. ఇటువంటి సారథి దొరికితే నా బతుకు పగ్గాలు అతడి చేతిలో పెట్టేసి నిశ్చింతగా జీవించగలను కదా అనిపించింది. లేదా మనమెవరి జీవితంలోనైనా ప్రవేశిస్తే, వారికి స్నేహితులిగానో, ప్రేమికులుగానో మారదలచుకుంటే ప్రవర్తించవలసిందిట్లానే కదా అనిపించింది. అయితే నీకొక పార్థసారథి దొరకాలి, లేదా నువ్వొక పార్థసారథిగానైనా బతకాలి.
ఈ మాటలే మనసులో సుళ్ళు తిరుగుతుంటే లోపల అణచుకోలేక అదంతా పైకి చెప్పాను. విజ్జి సానుకూలంగా విందిగాని, ప్రమోద్ ఉండబట్టలేక ‘మరి కర్ణుడు కూడా దుర్యోధనుడితో అట్లాంటి స్నేహమే చేసాడు కదా. కాని మీరంతా కృష్ణుడు దేవుడంటారుగాని, కర్ణుణ్ణి దేవుడిలాగా చూడరెందుకు’ అనడిగాడు.
మా ఇంట్లో ఇదొక పారడాక్స్. నా తాత, నా తండ్రి కృష్ణాభిమానులు. కాని నా తల్లినుంచి సంక్రమించిందేమో నా కొడుకు రామాభిమాని. కృష్ణుడికీ, కర్ణుడికీ తేడా ఏమిటని ప్రమోద్ అడుగుతున్నప్పుడు మ్యూజింగ్స్ లో చలం రాముడికీ, కృష్ణుడికీ మధ్య లేవనెత్తిన చర్చ అంతా గుర్తొచ్చింది.
కాని ఆ ప్రశ్న చిన్నదేమీ కాదు. అవును. కృష్ణుడు అర్జునుడి పట్ల చూపించిన స్నేహంకన్నా కర్ణుడు తన మిత్రుడి పట్ల చూపించిన నిబద్ధత ఏం తక్కువ?
కాని తేడా ఉందనిపించింది. ఒకనిముషం ఆలోచించాక ప్రమోద్ తో ఇలా చెప్పాను:
‘ కృష్ణుణ్ణి అందరూ దేవుడనే అన్నారు. ఆయన కూడా భగవద్గీతలో తనను సర్వేశ్వరుడిగానే చెప్పుకున్నాడు. కాని తన మిత్రుణ్ణి రక్షించుకోవాలన్న సంకల్పం ముందు ఆయన తన దైవత్వానికి విరుద్ధమైన ఏ ఒక్క పని చెయ్యడానికి కూడా వెనకాడలేదు. తనన్ని లోకులు ఏమనుకుంటారో, శత్రువులు ఏమని విమర్శిస్తారో అన్న అలోచనలేదు. ఆయన ముందున్నదంతా ఒకటే. తన సఖుణ్ణి ఎట్లాగైనా రక్షించుకోవాలి.ఆ విషయంలో ఆయన highly focused.’
‘కాని కర్ణుడలా కాదు. కర్ణుడి అండ చూసుకునే దుర్యోధనుడు మొత్తం కురుక్షేత్రానికి అంకురార్పణ చేసాడు. కర్ణుడు పరిచయమయ్యాకనే దుర్యోధనుడికి పాండవుల్ని గెలవగలన్న ఆశ కలిగింది. కర్ణుడి మాటలు ఎప్పటికప్పుడు ఆ నమ్మకాన్ని బలపరుస్తూ వచ్చాయి. కాని అంత వాగ్దానం చేసినవాడు, తన మిత్రుడి క్షేమం కోరుకున్నవాడు, తన దివ్యాస్త్రాల విషయంలో, ముఖ్యంగా ఇంద్రుడు కవచకుండలాలు కోరుకున్నప్పుడు వాటిని దానం చెయ్యకుండా ఉండలేకపోయాడు. అంటే ఏమిటి? తన దాతృత్వలక్షణం తక్కువకాకూడదనే కదా! కుంతి వచ్చి యాచించినప్పుడు అర్జునుడు తప్ప తక్కిన పాండవులు ఎవరు దొరికినా చంపకుండా వదిలిపెడతానని మాట ఇచ్చాడు. కాని అప్పటికే తన స్నేహితుడిలో ఆశలు రేకెత్తించి అతణ్ణి యుద్ధానికి సిద్ధం చేస్తున్న కర్ణుడి అట్లా దానాలూ, వాగ్దానాలూ ఇచ్చే అధికారం ఎక్కడుంది? అంటే కర్ణుడు ఆ సందర్భాల్లో మనిషిలాగా కాకుండా దేవుడిలాగా ప్రవర్తించాడు. కాని చూడు దాతృత్వమనే విషయానికి వచ్చినప్పుడు బహుశా కర్ణున్ని మనం గొప్పగా తలుచుకోవచ్చు. కాని తన దాతృత్వం వల్ల తాను తన స్నేహితుడికోసం సంపూర్ణంగా నిలబడలేనని గ్రహించుకోలేకపోయాడు. తాను దాత కాకుండా పోతానేమోనన్న ఆందోళన అతణ్ణి బలహీనపరిచింది. స్నేహితుడికోసం కట్టుబడటం ఒక విలువ. అడిగినవారికి లేదనకపోవడం ఒక విలువ. కాని రెండు విలువల మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు కర్ణుడు రెండింటినీ నిలుపుకోవాలని చూసాడు. కాని కృష్ణుడట్లా చెయ్యలేదు. ఆయనకి స్నేహితుణ్ణి రక్షించుకోవడమా, తాను దేవుడనిపించుకోవడమా ఏది ముఖ్యమంటే, స్నేహితుడే ముఖ్యమన్నాడు. అందుకోసం ఎటువంటి ఎత్తులకైనా, జిత్తులకైనా వెనకాడలేదు. పైగా అట్లా చెయ్యడమే తన వ్యూహమని సమర్థించుకున్నాడు.’
‘చిత్రంగా లేదూ, తన జీవితంలో కొన్ని సందర్భాల్లో దేవుడిలాగా ప్రవర్తించిన కర్ణుడికి మనం దైవత్వాన్ని ఆపాదించట్లేదు. కాని ఏం చేసైనా సరే అర్జుణ్ణి రక్షించిన కృష్ణుణ్ణి మాత్రం దేవుడని కొలుస్తున్నాం.’
15-6-2014