భారతీయనవలాదర్శనం

6

ఈ మధ్య కొన్నాళ్ళుగా మిత్రులు తమకి ఇష్టమైన పుస్తకాల్ని వరసగా మిత్రులతో పంచుకుంటూ ఉన్నారు. మామూలుగా ఆస్తులు, డిగ్రీలు, హోదాలు, నగలు, చీరలు, ఫర్నిచరు ప్రదర్శించుకోడానికి ఇష్టపడే ఈ ప్రపంచంలో ఇట్లా తమకిష్టమైన పుస్తకాల్ని ప్రదర్శించుకుంటున్న మిత్రులు తామున్న మేరకి ఈ ప్రపంచాన్ని మరింత శోభాయమానంగానూ, ప్రేమాస్పదంగానూ చేస్తూ ‘నువ్వు చదివే పుస్తకాలేవో చెప్పు , నీ మిత్రులెవరో చెప్తాను’ అనే పాత మాటని ‘నీ మిత్రులెవరో చెప్పు, నువ్వు చదివే పుస్తకాలేవో చెప్తాను’ అంటో తిరగరాస్తున్నారు.

మిత్రులట్లా ఈ మాధ్యమాన్ని ఒక పుస్తక ప్రదర్శనగా మార్చేసిన తర్వాత కూడా, ఇంకా చాలా పుస్తకాలు, ఎంతో విలువైన పుస్తకాలు, నాలాంటి ఎందరో గ్రామీణ విద్యార్థుల జీవితాల్ని సమూలంగా మార్చేసిన పుస్తకాలు ఇంకా కనబడవలసే ఉందనిపిస్తున్నది. ఇంగ్లీషులో వచ్చిన, వస్తున్న క్లాసిక్స్ కాదు, ప్రాచీన తెలుగు సాహిత్యం కాదు, ఆధునిక తెలుగు సాహిత్యంలోనే మరెన్నో మణిపూసలింకా మిత్రుల అల్మైరాల్లోంచి చిన్నతెరకి ఎక్కవలసే ఉంది. కథలు కనిపిస్తున్నాయి సరే, స్వీయచరిత్రలేవి? వీరేశలింగం ‘స్వీయచరిత్ర’, చిలకమర్తి ‘స్వీయచరిత్ర’, కాళోజీ ‘నాగొడవ’, విశ్వనాథ ‘నా రాముడు’, సంజీవదేవ్ ‘తుమ్మపూడి’, ఉప్పల లక్ష్మణ రావు ‘బతుకుపుస్తకం’, దర్శి చెంచయ్య ‘నేనూ-నా దేశం’ లాంటి పుస్తకాల్నిష్టపడుతున్న మిత్రులెవరో ఇంకా తెలియవలసి ఉంది. కవిత్వం కనిపిస్తున్నది సరే, నాటకాలేవి? చిలకమర్తి ‘గయోపాఖ్యానం’, తిరుపతి వెంకటకవుల ‘పాండవోద్యోగవిజయాలు’, చలం ‘పురూరవ’, ‘వాసిరెడ్డి-సుంకర ‘మాభూమి’, ఆత్రేయ ‘గుమస్తా’, రావిశాస్త్రి ‘ఇల్లు’, నార్ల ‘సీతజోస్యం’, ఆనందరావు ‘పడమటిగాలి’, శ్రీ శ్రీ, బుచ్చిబాబు, కృష్ణశాస్త్రి రేడియో నాటకాలేవి?

అన్నిటికన్నా ముఖ్యం తెలుగును అపూర్వంగా వెలిగించిన ఆ మహానువాదాలేవి? పకీర్ మోహన్ సేనాపతి రాసిన ఏ నవల గురించి మాట్లాడుకోవడంలో ఈనాడు అమెరికా లో విశ్వవిద్యాలయాలన్నీ తల మున్కలైపోయాయో ఆ ‘చొమాణో అఠొగుంటో’ ని ఇప్పటికి డెబ్బై ఏళ్ళకిందటే పురిపండా తెలుగులోకి తెచ్చాడే, ఆ నవల ఏది? తక్కిన సాహిత్యమంతా పక్కన పెట్టేసినా ఏ ఒక్క రచన వల్ల రవీంద్రుడు శిఖరప్రాయుడైన రచయితగా మిగిలిపోగలడో ఆ ‘గోరా’ ఎక్కడ? సబ్ ఆల్టరన్ స్టడీస్ అనే పేరే ప్రపంచ సాహిత్య చర్చలోకి ఎక్కకముందే ఒక గ్రామీణ దొంగలసమాజానికి చెందిన జీవితాన్ని తీసుకుని కావ్యంగా మలిచిన తారాశంకర్ బెనర్జీ నవల ‘కవి’ ఎక్కడ? ఆధునిక మహేతిహాసాలుగా చెప్పదగ్గ ‘యయాతి’, ‘పర్వ’, ‘పథేర్ పాంచాలి’ ఎక్కడ? స్వాతంత్ర్యానంతర రాజకీయవికృతచిత్రాన్ని ఉత్కృష్టంగా చిత్రించిన ఫణీశ్వర్ నాథ్ వర్మ ‘రేణు ‘ నవల ‘మలినాంచలం’ ఎక్కడ? ఏ రచయితని చదువుతుంటే గుండె కరిగి కన్నీళ్ళుగా మారకుండా ఉండలేదో, ఆ కన్నీళ్ళమధ్యనే నవ్వుల్ని కూడా ఆపుకోలేమో, ఆ వైక్కం మహమ్మద్ బషీర్ రాసిన రెండు నవలికలు ‘పాతుమ్మా మేక’, ‘చిన్ననాటి చెలి’ ఎక్కడ? కురతులైన్ హైదర్ ‘అగ్నిధార’, మాస్తివెంకటేశ అయ్యంగార్ ‘చిక్కవీర రాజేంద్ర’, తకళి శివశంకర పిళ్ళై ‘చెమీన్’ నవలల గురించి ఎవరైనా గుర్తుచేస్తారేమోనని నేనింకా ఎదురుచూస్తూనే ఉన్నాను.

భారతదేశపు డాస్టవిస్కీగా చెప్పదగ్గ ప్రసిద్ధ హిందీ రచయిత ఇలా చంద్ర జోషీ నవల ‘ప్రేతము-ఛాయ’, డికెన్స్ రచించిన ఇతిహాసానికి తెన్నేటి సూరి ఉదాత్త అనుసృజన ‘రెండు మహానగరాలు’, టాల్ స్టాయి కి బెల్లంకొండ రామదాసు ‘సమరము-శాంతి’, ‘ఏడుతరాలు’ నవలతో పోల్చదగ్గ రచన ప్రకాశ్ టాండన్ ‘పంజాబీ శతాబ్ది’, ఇక అన్నిటికన్నా తెలుగుజాతికి పురిపండా అందించిన గొప్ప కానుక ‘విశ్వకథావీథి’ ఆరుసంపుటాలూ కూడా ఇంకా మిత్రులు తమ పెట్టెల్లోంచి బయటకు తియ్యవలసే ఉంది.

అలాగని నేనన్నీ చదివేసానని కాదు. బషీర్ స్మరణీయ నవలిక ‘మా తాతయ్యకో ఏనుగుండేది’, హరినారాయణ ఆప్టే నవలకు పి.వి.నరసింహారావు అనువాదం ‘అబలాజీవితము’ వంటి వాటికోసం నేను గత ముప్పై ఏళ్ళుగా గాలిస్తోనే ఉన్నాను. మురసకి షికిబు రాసిన గెంజిమొనొగొటారికి తెలుగు అనువాదం ‘గెంజిగాథ’, షేక్ స్పియర్ ప్రసిద్ధ విషాదాంతనాటకాలకు సాహిత్య అకాడెమీ చేయించిన తెలుగు అనువాదాలు ‘హామ్లెట్’, లియర్ రాజు ‘, ‘ఒథెల్లో’, మేక్బెత్’ల అట్టలన్నా చూడగలమా ఇప్పుడు?

పునర్ముద్రణలకు నోచుకోనందువల్లా, గ్రామీణ గ్రంథాలయాలు పేదవైపోతున్నందువల్లా, ప్రధాన స్రవంతి సాహిత్య చర్చలు మౌనం వహిస్తున్నందువల్లా ఎన్నో విలువైన రచనల గురించి తెలిసే అవకాశం, అందుబాటులోకి వచ్చే అవకాశం లేకపోతున్నది.

ఆ లోటుని గుర్తుపట్టి, అటువంటి రచనల గురించి, ముఖ్యంగా, గత నూట యాభై ఏళ్ళల్లో భారతదేశంలో వచ్చిన అద్భుతమైన నవలల గురించి వాడ్రేవు వీరలక్ష్మి దేవి గత అయిదేళ్ళుగా చినుకు పత్రికలో పరిచయాలు చేస్తూ ఉంది. అలా చేస్తూ వచ్చిన 60 పరిచయాల్ని 520 పేజీల ఉద్గ్రంథంగా ఇప్పుడు వెలువరించింది. ఆదివారం విజయవాడలో ఆ పుస్తకాన్ని ప్రసిద్ధ రచయిత్రి పోచిరాజు సత్యవతి ఆవిష్కరించేరు.

అందులో కొన్ని పరిచయాలు ‘భారతీయ నవల’ పేరిట 2011 లో పుస్తకరూపంగా వచ్చినప్పుడు నేను ఆ పుస్తకానికి ముందుమాట రాస్తూ వాటిని ‘డిస్కవరీస్ ఆఫ్ ఇండియా’ అని అభివర్ణించాను. ఎందుకంటే, ప్రసిద్ధ మరాఠీ రచయిత, జ్ఞానపీఠ పురస్కార స్వీకర్త వ్యంకటేశ మాడ్గ్యూళ్కర్ రసిన ‘బనగోర్ వాడి’ నవలను ఒక విమర్శకుడు ‘మరొక డిస్కవరీ ఆఫ్ ఇండియా’ గా ప్రస్తుతించాడు. విదేశాలనుంచి భారతదేశ సామాజిక అధ్యయనం కోసం వచ్చే పరిశోధకులు ఆ నవల చదివితే చాలు , భారతదేశగ్రామాలెలా ఉన్నాయో తెలుస్తుందని ఆ విమర్శకుడి అభిప్రాయం. ఇప్పుడు, ఈ అరవై పరిచయాల ఈ బృహద్గ్రంథాన్ని నేను ‘భారత్- ఏక్ ఖోజ్’ గా అభివర్ణిస్తున్నాను.

ఎంతో ఇష్టంతో రాయడమే కాక, వీటిని పుస్తకరూపంలో ప్రచురించడానికి ఏ ప్రచురణ కర్తా ముందుకు రాకపోడంతో ఆమెనే స్వయంగా ప్రచురించి వెలువరించింది. ఇప్పుడీ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుని చూస్తుంటే, పుస్తకప్రదర్శనలో ఏకంగా ఒక స్టాలు మొత్తం నా చేతుల్లోకి వచ్చినంత అపురూపంగా అనిపిస్తున్నది.

ఇవి వట్టి పరిచయాలు కాదు. రీ టెల్లింగ్స్. ఒక నవలను పునఃకథనం చెయ్యడం చాలా కష్టం. ఒకప్పుడు మాలతీ చందూర్ ఆ పని చెయ్యగలిగారు. ఇప్పుడు అక్క.

మరో విశేషం మా అక్క ఈ పుస్తకాన్ని మా బామ్మగారికి అంకితం ఇచ్చింది. వాడ్రేవు లక్ష్మీదేవి (1905-1993) ఒక శతాబ్దకాలపు సభ్యతకి, సంస్కారానికి, సాహిత్యాభినివేశానికీ ప్రతినిధి. మా పసితనంలో మా మొదటి సాహిత్య గురువు ఆమెనే. అందుకనే, నా మొదటి కవితాసంపుటి ‘నిర్వికల్ప సంగీతం’ (1986) ఆమె చేతులమీదనే ఆవిష్కరింపచేసుకున్నాం. ఈరోజు ఈ పుస్తకం ఆమెకి అంకితమివ్వడంలో ఔచిత్యమిదే. ఒక స్త్రీ చదువుకుంటే ఒక కుటుంబం నిలబడుతుంది. ఒక స్త్రీ సాహిత్యం చదువుకుంటే ఒక తరం తరం మొత్తం నిలబడుతుంది.

13-3-2018

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading