సంగీతపు రెక్కలమీద యాత్ర

Reading Time: 3 minutes

9

ఈస్టర్ ప్రభాతం. నిన్నటి వసంతవాన చల్లదనం ఇంకా గాల్లో కమ్మతెమ్మెరగా ప్రసరిస్తూనే ఉంది. ‘చైత్రము లోన చినుకు పడాలని కోరేవు’ అన్నాడు కవి. వసంతకాల వాన నింగినీ నేలనీ కలిపే రంగుల వంతెన. ఇటువంటి వేళల్లోనే ప్రాచీనా చీనా కవులు తలపుకొస్తారు. కాని నా ఎదట మొన్ననే అభిషేక్ ముజుందార్ కానుక చేసిన గీతాంజలి ఉంది. విశ్వభారతి ప్రచురణ. నందలాల్ బోస్, అవనీంద్రనాథ్ టాగోర్, అసిత్ కుమార్ హాల్దార్, సురేంద్రనాథ్ కర్ ల అపురూపమైన బెంగాల్ సంప్రదాయపు చిత్రలేఖనాల్తో. ఆ పుస్తకాన్ని అట్లానే తెరిచి తడిమి చూస్తో ఉన్నాను. ఆ కవితల్లో ఏ ఒక్క వాక్యం కూడా ఇంకా చదవకుండానే, దూరనదీకూలం, రెల్లుపొదలు, రేవులో నవ్యపురుషుడెవరో వీణ వాయిస్తున్న నిశ్శబ్దం నన్ను కమ్ముకున్నాయి.

గడచిన వందేళ్ళుగా ఆ గీతాల్ని ఎందరో పిపాసులు తెలుగు చేసారు. ఆ దాహార్తుల పరంపరకి అంతులేదు. ఇప్పుడు ఇక్కడ నా మిత్రుల్లో గౌరునాయుడు, రొంపిచర్ల భార్గవి, నాగరాజు రామస్వామి, విజయలక్ష్మి పండిట్, బెందాళం కృష్ణారావు వంటివారు ఆ గీతాల్ని ఇప్పటి మన తెలుగులో అనువదించకుండా ఉండలేకపోయారు. భార్గవిగారి అనుసృజన, గిరిధర్ గౌడ్ నీటిరంగుల చిత్రాలు ఎంత అపూర్వంగా ఉన్నాయంటే, నేనామెను నాకో కాపీ పంపించమని అభ్యర్థించకుండా ఉండలేకపోయాను. ఇక, జింకా నాగరాజుగారైతే, గీతాంజలి కవితలకన్నిటికీ బొమ్మలు వేసుకుని మరీ అనువదించారు. నాకు తెలిసి అటువంటి అనుసృజన ప్రపంచంలోనే మరొకటి లేదు.

కాని, టాగోర్ ను తెలుగు చేసినవారంతా, చలంగారితో సహా, ఇంగ్లీషు అనువాదాలనుంచే తెలుగులోకి తెచ్చారు. టాగోర్ బెంగాలీ గీతాల్ని గీతాలుగా అనువదించినవారు, అబ్బూరి రామకృష్ణరావుగారిలాగా, తొలి తరం అనువాదకులు ఏ ఇద్దరు ముగ్గురో మాత్రమే. ఆ సాధక పరంపర ఎందుచాతనో తెలుగులో కొనసాగలేదు. కాని, టాగోర్ అన్నిటికన్నా ముందు గాయకుడు, తర్వాతే కవి. (‘గాయకుడిగానే నీ సమక్షానికి నా ప్రవేశమని తెలుసు.’) తన పదజాలం సంగీత ప్రపంచపు ద్వారం దగ్గరే నిలిచిపోవాలని ఆయన కోరిక. అపురూపమైన ఆ సంగీతాన్ని తెలుగులోకి తేవడంలో కొంత ఇబ్బంది లేకపోలేదు. ప్రాయికంగా హిందుస్తానీ, కర్ణాటక సంగీతాల మధ్య ఉన్న భేదం వల్లా, బెంగాలీ హలంత భాషా, తెలుగు అజంత భాషా కావడం వల్లా కొంత అనువాద క్లేశం తప్పనిసరి. కాని, తెలుగు కూడా అత్యంత సంగీతాత్మక భాష కావడం వల్లా, మనకొక మహనీయ పదకవితాసంప్రదాయం ఉన్నందువల్లా, ప్రయత్నిస్తే టాగోర్ సంగీతమయగీతాల్ని తెలుగు చేయడం అసాధ్యం కాకపోగా, అవసరం అని కూడా అనుకుంటున్నాను.

అలాగని టాగోర్ గొప్ప శాస్త్రీయ సంగీత సాధన చేసినవాడు కాడు. కావడానికి సంగీతకారుల వంశానికి చెందినవాడే అయినప్పటికీ, ఆయన సంగీతసాధన కూడా ఆయన పాఠశాల విద్యలానే మూన్నాళ్ళ ముచ్చటే అయింది. కొన్నాళ్ళు విష్ణుపుర్ ఘరానాకి చెందిన పండిట్ జాదూనాథ భట్ట్ దగ్గర సంగీత అభ్యసించాడుగానీ, తానెక్కువ నేర్చుకోలేకపోయాడనే రాసుకున్నాడొకచోట. కాని, ఆయన ఒక పండితుడిగా కాక, ఒక రసజ్ణుడిగా సంగీతాన్ని సమీపించాడు. రాగ-రాగిణుల స్వభావాన్నీ, సుర్-స్వరాల స్వరూపాన్నీ ఆయన హృదయంతో అవగాహన చేసుకున్నాడు. ఉదాహరణకి, భైరవి రాగం గురించి తలుచుకుంటూ ‘షెహ్ నాయి మీద భైరవి వాయిస్తున్నారు. అదెంత మధురంగా ఉన్నదో చెప్పడానికి నాకు మాటలు చాలడం లేదు. విషాదభరిత హృదయంతో ఆకాశమూ, గాలులూ కూడా బరువెక్కిపోయి ఉన్నాయి. ఆ విషాదం కూడా మధురంగా ఉంది’ అంటాడు. మరొకచోట, ‘నిరంతర వియోగానికీ, ఒంటరితనానికీ చెందిన అంతంలేని దుఃఖమేదో పరుచుకుని ఉన్నట్టు’ గా ఉందంటాడు. ‘తొలి ఉషస్సుతాలూకు ప్రథమ కాంతిరేఖ’ అంటాడు భైరవి రాగం గురించి. మల్ హర్ రాగం గురించి రాసుకుంటూ ‘ మేఘఛాయలోంచి రాలిపడ్డ గాలివాన చప్పుడూ, ఉరుము ధ్వనీ నాలో ఒక తుపాను రేకెత్తించాయి’ అని చెప్తూ, ఇక మేఘ మల్ హర్ అయితే ‘ఏదో పురాతన అశ్రు జలపాతమే’ అంటాడు. ఆ రాగాన్ని ‘ప్రపంచ వర్ష ఋతువు’ అని కూడా అంటాడు. ‘పద్మానది మీద వానపడుతున్న దృశ్యం చూసినప్పుడల్లా నాకు మేఘ మల్ హర్ లో మరొక కొత్త గీతం కూర్చాలనిపిస్తుంది’ అని కూడా రాసుకుంటాడు. ముల్తాన్ రాగం ‘ఆకుపచ్చని పృథ్విమీద కన్నీళ్ళ తెర కప్పినట్టుంద’నీ, ‘ఎండకి అలిసిపోయిన దినాంతం వదులుతున్న వేడినిట్టూర్పులాగా ఉంద’ నీ అంటాడు. ఇక పూరబి అయితే ‘ఎవరో భర్తృహీన ఒక శూన్యగృహంలో రోదిస్తున్నట్టుగా ఉంద’ ని వర్ణిస్తాడు. శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించినవాళ్ళు రాగలక్షణాన్ని అధ్యయనం చేస్తారు. టాగోర్ రాగహృదయాన్ని అర్థం చేసుకున్నాడు. అతడు రాగాల్ని వినలేదు, చూసాడు. తాకాడు. వాటి సుగంధాన్ని గుండెనిండుగా ఆఘ్రాణించాడు.

శాస్త్రీయ హిందుస్తానీ వాగ్గేయకారుల ఆత్మనివేదనాన్ని కూడా ఆయన చాలా సన్నిహితంగా పరిశీలించాడు. ఎంత సన్నిహితంగా అంటే , చాలాసార్లు, ఆ కృతులకి తన కృతులు ప్రతికృతులుగా కనిపించేటంత. ఆయన తన గీతాల్ని దాదాపుగా హిందుస్తానీ సాంప్రదాయిక కృతుల నిర్మాణాన్ని అనుసరించే కూర్చుకున్నాడు.

ఇదిగో నా ముందు ఉత్పల్ కె బెనర్జీ సంకలనం చేసిన Romantic Songs of Tagore (2013) ఉంది. టాగోర్ తన జీవితకాలం పొడుగుతా కూర్చుకున్న 2300 గీతాల్లోంచి వంద గీతాల్ని ఎంపికచేసి కూర్చిన సంకలనం ఇది. తన సంకలనానికి సంగ్రహంగానే కానీ, సమగ్రంగా రాసుకున్న ముందుమాటలో బెనర్జీ రవీంద్రుడు తన గీతాల్ని ద్రుపద్ పద్ధతిలో నిర్మించడం గురించి ప్రస్తావించాడు. ఇది తెలుగు పదాలకన్నా భిన్నమైన నిర్మాణం. తెలుగు పదకర్తలు పల్లవి, అనుపల్లవి, చరణాల రూపంలో తమ గీతాల్ని నిర్మించారు. కాని ద్రుపద్ లో నాలుగు భాగాలుంటాయి. స్థాయి, అంతర, సంచారి, ఆభోగ్ అని. కొన్ని ద్రుపద్ ల్లో భోగ్ అనే అయిదవ భాగం కూడా ఉంటుంది.

బెనర్జీ కూడా టాగోర్ కవితా వికాసాన్ని ఒక ద్రుపద్ నిర్మాణపద్ధతిలోనే నాలుగు భాగాలుగా విభజించాడు. మొదటిది, 1881-96 కాలం నాటిదనీ ఆ దశలో కవి పూర్తిగా రొమాంటిక్ తరహా కవిత్వం రాసాడనీ, రెండవ దశ, 1897-1912 మధ్యకాలానిదనీ, ఆ కాలంలో అతడు తాను దర్శిస్తున్న ఆ స్వప్నలోకసంచారిని ఇంకా పూర్తిగా గుర్తుపట్టలేదనీ చెప్తాడు. కాని, ఇక్కడే మొదటిసారిగా ఇంద్రియ ప్రపంచం నుంచి ఇంద్రియాతీత దర్శనంలోకి కవి మేల్కొన్నాడని కూడా చెప్తాడు. గీతాంజలి కవితలు ప్రధానంగా ఈ దశవే. ఇక 1913-26 మధ్యకాలంలో రాసిన కవిత్వంలో బహువర్ణశోభితమైన ప్రేమ కవిత్వం వికసించిందనీ, అది మోహవిదగ్ధ ప్రేమకాక, సౌందర్యానికీ, సంగీతానికీ మధ్య ఊయెలలూగే ఖేలగా కనిపిస్తుందంటాడు. ఇక చివరి దశ 1926-40 మధ్యకాలంలో కవి ఆనందవిషాదాలకు అతీతమైన స్థితికి చేరుకుని తనను సమీపిస్తున్న మృత్యుపదధ్వనిని ఆలకించడం మీదనే దృష్టి పెట్టాడనీ, తనను జీవితకాలం పొడుగునా వెన్నాడిన ఆ ప్రేమైక మూర్తి అనంతకాలం పాటు తన సహచరుడిగా ఉండగలడనే విశ్వాసానికి చేరుకున్నాడనీ చెప్తాడు.

ఈ ప్రయాణం ప్రధానంగా సంగీతపు రెక్కలమీద చేసిన యాత్ర. ఆ సంగీతానికి సాహిత్యం కేవలం ఆనుషంగికం మాత్రమే. ఆ సంగీతమయ గీతాంజలి తెలుగులోకి ఇంకా రావలసే ఉంది. కాని, ఆ ప్రయత్నం కేవలం ఒక కవి మటుకే చెయ్యగలిగింది కాదు. సంగీత సాహిత్యాలపట్ల సమస్కంధత ఉన్నవాళ్ళు మాత్రమే చెయ్యగల పని. ముఖ్యంగా హిందుస్తానీ సంగీతం గురించిన పరిజ్ఞానం ఉండాలి. తన రెండువేల పైచిలుకు గీతాల్లోనూ టాగోర్ 179 గీతాల్ని శాస్త్రీయ సంగీత కృతుల తరహాలో కూర్చాడు. అందులో ఒక్క ద్రుపద్ బాణీలోనే 77 దాకా పాటలు కట్టాడు. తెలుగులో మన కాలంలో ఇటువంటి గీతకారులెవ్వరూ కనిపించడం లేదు. ఉన్నదంతా సినీగీత కవులూ లేదా జానపద ధోరణి కవులూ మటుకే. టాగోర్ లాగా కీర్తన, భజన, ద్రుపద్, ధమార్, ఖ్యాల్, తప్పా, బావుల్ లాంటి వివిధ గానఫణితుల్లో కవిత్వం చెప్పగల కవి ఆధునిక తెలుగు కవిత్వంలో ఇప్పటిదాకా ఉదయించనేలేదు. అన్నమయ్య, క్షేత్రయ్య, త్యాగయ్యల వారసుడు కాగల అటువంటి తెలుగు కవి కోసమే నా నిరీక్షణ.

*

టాగోర్ గీతాన్ని గీతంగానే అనువదించగలనా అని ఒక చిన్న ప్రయత్నం:

ఓహో విదేశినీ!

ఎరుగుదు, నిన్నెరుగుదు, విదేశినీ
ఓహో సింధుతీర వాసినీ!

కనుగొంటిని శారదప్రాతర్వేేళల
కనుగొంటిని మాధవపులకిత రాత్రుల
కనుగొంటిని నా హృది నిను సరికొత్తగ
ఓహో విదేశినీ!

మింటికి నా చెవులప్పగించి నే
వింటిని, వింటిని, నీ గానమ్మును
మంటిన పరిచితి నా ప్రాణమ్ముల
ఓహో విదేశినీ!

తిరిగితి భువనము నిశ్శేషముగను
చేరితి తుదకీ నూతనదేశము
వరలితి నీ ముంగిటనొక అతిథిగ
ఓహో విదేశినీ!

(అమిచిని గోచిని తోమారే ఓగో బిదేశినీ (1895)

1-4-2018

Leave a Reply

%d bloggers like this: