శిలలలో మెడొనా

Reading Time: 2 minutes

12

నిన్న సాయంకాలం ఆదిత్య మా ఆఫీసుకి వచ్చాడు. అతడు బాగులోంచి ఆగమగీతి బయటకు తీస్తుండగానే గుర్తొచ్చింది, బైరాగి (1925-79) పుట్టినరోజని. ముఫ్ఫై ఏళ్ళకిందట నేను బైరాగి కవిత్వాన్ని ఆరాధించినదానికన్నా అతడిప్పుడా కవిత్వాన్ని మరింత ప్రాణాధికంగా ప్రేమిస్తున్నాడు. ఆ పిల్లవాడు నాకు పరిచయమైన మొదటి క్షణంలోనే ‘మీరంటే నాకిష్టం. ఎందుకంటే మీరు పనున్నా లేకపోయినా బైరాగి కవిత్వం గురించి ప్రస్తావించకుండా ఉండలేరు’ అన్నాడు. నిన్న ఆ పుస్తకం బయటకు తీసి ‘ఈరోజు మీతో కలిసి కూచుని ఈ కవిత్వం చదువుకోవాలని ఉంద’ న్నాడు.

ముందు కొంతసేపు ఆబిడ్స్ కామత్ హోటల్లో గోష్టి. ‘మీరు బైరాగి గురించి మొదటిసారి ఎప్పుడు విన్నారు?’, ‘మొదటిసారి ఆ కవితలు ఎప్పుడు చదివారు?’- ఇట్లాంటి ప్రశ్నలు. ఇద్దరు ప్రేమికులు తాము మొదటిసారి ఒకరినొకరు ఎప్పుడు చూసుకున్నదీ, ఆ తొలిక్షణాల్లో ఒకరికొకరు ఎట్లా గోచరించిందీ పదేపదే చెప్పుకునేటట్టు బైరాగి కవితతో నా తొలిపరిష్వంగం గురించి అతడడగడం, నేను చెప్పడం, మధ్యలో ప్రపంచం నుంచి ఎన్ని ఫోన్లు రావాలో అన్ని ఫోన్లు. మాతో పాటు మిత్రుడు రాళ్ళబండి కవితాప్రసాద్. ‘నేను మీ కవిని కాను’, ‘ఆడుకుంటున్న బాలిక’ కవితలు చదువుకున్నాం.ఇలియట్ కి చేసిన అనువాదం ‘యాత్రికులకు ఒక మాట’ చదువుకున్నాం.

అప్పటికి మమ్మల్ని వెతుక్కుంటూ గంగారెడ్డి వచ్చాడు. మా గోష్టి రావెల సోమయ్యగారి ఇంటికి మారింది. కవిత వెనక కవిత పఠిస్తూ గడిపాం. ‘అరచిత కవిత’, ‘ఎర్రక్రీస్తు’, ‘మేలుకున్నవాడు’. , ఇలియట్ వేస్ట్ లాండ్ లో చివరి భాగానికి అనువాదం ‘ఉరుము చెప్పినది’ చదువుకున్నాం.

అయినా ఆదిత్య దాహం చల్లారలేదు. ‘శిలలలో మెడొనా’  కవిత చదవమన్నాడు. లియోనార్డో డావిన్సీ చిత్రించిన చిత్రాన్ని చూసి రాసిన కవిత. ఆ కవిత నిన్నటి సాయంకాలాన్నంతా ఒక వెలుగు వెలిగించింది:

ఎంత శోకం లోకంలో!
ఎంత చీకటి లోకపు ఆలోకంలో?
కాని తల్లీ! నీ నల్లని కురుల చాయ ముసిరిన చోట
నీ చల్లని యూర్పుల తావి విసరిన చోట
నీ చూపుల తెలికలువలు దయతో విరిసిన చోట
ఇంచుక మచ్చిక నీడ!
పరులెరుగని పరిమళాల విరళపు జాడ!
లోకమంతా ఒకే మాత!
లోకమంతా ఒకే శిశువు!

మహాకవుల లక్షణమే ఇది. వాళ్ళు మన జీవితపు ప్రతిమలుపులోనూ మనకి కొత్తగా సాక్షాత్కరిస్తుంటారు. బైరాగి కవిత నా రక్తంలో ఇంకిపోయిందని నమ్మే నేను, ఈ వాక్యాల్ని ఇంతకాలం ఎట్లాదాటిపోయానా అని ఆశ్చర్యపోయాను:

సంజమసకలో తల్లి ఒక్కతే వేచిఉంటుంది
చిరు అడుగుల సడి, నవ్వులసందడి కలలుకంటుంది!
ఆ మొగాన, ఆ కరుణనయన యుగాన
జీవితపు అనంత సకలైశ్వర్యం, సౌందర్యం, సౌశీల్యం, వాత్సల్యం
లోకంలో అలౌకికమైనదంతా
ఈ అనృతంలో అమృతమైనదంతా.
శతశతగతశతాబ్దాల ధూళిధూసరదుర్గతిలో
సకలోద్భూత భూతకోటి దుస్థితిలో, దుర్మృతిలో
స్థితమైనది, ఋతమైనది, అమృతతులితమైనదంతా
ఆ మొగాన,
ఆ కరుణ నయన యుగాన,
లోకమంతా ఒకే మాత
లోకమంతా ఒకే శిశువు.

ఆ వాక్యాలు చదువుతూనే నా హృదయంతా ఒక అలౌకికభావన అలుముకుంది. ఆ కవిత గురించి ఆదిత్యను మాట్లాడమని అడిగాను. అతడు లేచినుంచుని అక్కడున్న నలుగురైదుగురు శ్రోతల్నీ ఉద్దేశించి గొప్ప ప్రసంగం చేసాడు. ఆ కవితలో మొదటి రెండువాక్యాలు:

నీలినింగి, నీలిరాళ్ళు, నీలి నీరు
జనననిధన గహ్వరాల్నుంచి ఉబికే ఒకే ఒక ఉనికి సెలయేరు

ఈ ఒక్క పదచిత్రం మీడనే పది నిమిషాలు మాట్లాడేడు. ‘మామూలుగా మనం జననమరణాలు ఒకే రేఖకి అటూ ఇటూ ఉండే కొసలుగా భావిస్తాం. కాని కవి ఇక్క్డడ ఆ రెండింటినీ కూడా పక్కపక్కన పెడుతూ ఆ రెండింటినుంచీ ప్రవహిస్తున్న ఒకే సెలయేరుగా ఉనికిని భావిస్తున్నాడు ‘అన్నాడు.

చప్పున గుర్తొచ్చింది నాకు, ఇదే కదా బైరాగి తన ప్రతి కవితలోనూ పదే పదే చెప్పే విషయం! తన ‘అరచిత కవిత’ లో కూడా ఇలానే కదా అన్నాడు:

ఏమంటే ఏదీ చావదు ఇచట; ద్రవ్యంలోంచి రూపంలోకి,
రూపంలోంచి భావంలోకి, ఓజంలోంచి తేజంలోకి,
తేజంలోంచి ఓజంలోకి, మరణపు మౌనం లోంచి జీవనవిరావంలోకి
రూపం మారుతున్నది ఒకే శక్తి;
రాలుటాకుల సెజ్జలోంచి క్రొంజివురులు లేచినట్లు
నేలరాలిన విత్తులపొత్తిలిలోన, రాబోయే పూదావుల తేనెతుంపరలు వేసినట్లు.

సందేహం లేదు,గురజాడ, శ్రీశ్రీలు కాక మరే తెలుగుకవీ అతడి భావనాప్రపంచపు పొలిమేరలకు కూడా చేరగలిగినవాడు కాడు. కాని ఇంతకీ బైరాగి విశిష్టత ఎక్కడుంది?

అతడు అస్తిత్వవాదుల్లా (existentialists) జీవితం ఒక అవస్థ predicament అని నమ్మాడు. దానికి మనం చెప్పుకునే ప్రతి అర్థమూ, నిర్వచనమూ, పిండుకునే సారాంశమూ అంతిమంగా ఒక కథనమేనని అతడికి తెలుసు. అయితే, హేతుబద్దంగా నువ్వు చెప్పుకునే ఎన్నో కథనాలకన్నా హృదయపూర్వకంగా నువ్వు జీవించే ఒక్క క్షణం చాలు జీవితాన్ని సార్థకం చేయడానికి. ఇలియట్ మాటల్లో:

ఒక్క క్షణపు ఆత్మార్పణలోనున్న సాహసాన్ని
ఒక యుగపు వివేకమైనా మరలించలేదయ్యా!
దీనివలన, దీనివలనే బ్రతికాం మనం.

మరో చోట

నెచ్చెలులారా, నరుని జీవనశ్రోతమేది? దేనివలన జీవిస్తున్నాడతడు?

అని ప్రశ్నించి బైరాగినే ఇట్లా అన్నాడు:

నరుడు జీవిస్తున్నాడిచట
త్యాగం వల్ల, జీవితానురాగం వల్ల
స్వేచ్ఛిత కష్టభోగం వల్ల.

ఇంటికి తిరిగివచ్చాక కూడా ఆదిత్యమాటలే కళ్ళముందు కనిపిస్తున్నాయి. డావిన్సీ చిత్రించిన Virgin of the Rocks చిత్రం తీసి చూసాను. బైరాగి చూసిన సౌందర్యం, సౌశీల్యం డావిన్సీ కూడా చూడలేకపోయాడనిపించింది.

6-9-2013

Leave a Reply

%d bloggers like this: