ఇప్పుడు తెలుగు సాహిత్యప్రపంచం కూడా నెమ్మదిగా రూమీ పిచ్చిలో పడుతున్నది. కవులూ, పాఠకులూ కూడా రూమీని స్మరిస్తూ రోజు మొదలుపెడుతున్నారు.
కాని, మనం రూమీని పారశీకంలోనే చదువుకోగలిగితే ఎంత బాగుణ్ణు. 13 వ శతాబ్దానికి చెందిన ఒక కవిని, ఈనాడు అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన పాప్ కవి గా మార్చిన అనువాదకులు కోలమన్ బార్క్స్, కబీర్ హెల్మ్ సింకి, రాబర్ట్ బ్లై వంటి వారు రూమీని పారశీకం నుంచి కాక, ఇంగ్లీషునుంచి ఇంగ్లీషులోకి అనువదించారని మనం మర్చిపోకూడదు.
పారశీకం నుంచి రూమీని నేరుగా అనువదించిన తొలితరం పండితులు ఆర్.ఎ.నికల్సన్, ఎ.జె.ఆర్బెర్రీ ల ఇంగ్లీషు అనువాదాలకి ఇంగ్లీషు అనువాదాలు మనం చదువుతున్నవి.
రూమీ రచనల్లో మస్నవీనే ఇంతదాకా పూర్తిగా ఇంగ్లీషులోకి వచ్చిన రచన. 3229 గజళ్ళు, సుమారు 1660 రుబాయిత్ లు ఉన్న దివాన్-ఇ-కబీరీ ని పారశీకం నుంచి పూర్తిగా ఇంగ్లీషులోకి ఇప్పటిదాకా ఎవరూ అనువదించలేదు. అబ్దుల్ బకి గొల్పినర్లి అనే టర్కిష్ పండితుడు పారశీకం నుంచి టర్కిష్ లోకి చేసిన అనువాదాన్ని నెవిట్ ఎర్గిన్ అనే ఆయన ఈ మధ్యనే పూర్తిగా ఇంగ్లీషు చేసి 22 సంపుటాలుగా ప్రచురించాడు.
అందులో కొన్ని (సుమారు 600 గజళ్ళ దాకా) నెట్ లో దొరుకుతున్నాయి.
నికల్సన్ అనువదించిన 48 గజళ్ళు, ఆర్బెర్రీ అనువదించిన 400 గజళ్ళ తర్వాత ఇదే మనకి లభిస్తున్న అతి పెద్ద సంపద.
చూడగానే ఒక గజల్ ని తెలుగు చెయ్యకుండా ఉండలేకపోయాను.
గజల్ 1029
ఈ ప్రపంచానికి సహనం లేదు, స్థిరత్వంలేదు, నేనింకా ఎంతకాలం ఈ పంకంలో పడి పొర్లాలి? నా ప్రేమికుడికి నా ప్రేమ కూడా అక్కర్లేదు.
అతడే నా దుకాణమూ, నా బజారూ అయ్యాక నాకు మరో అంగడి తెరవాల్సిన పనేముంది? నేను నా ఆత్మకే సుల్తానుని, ఈ ప్రపంచాన్నింకా సేవకుడిలా ఎందుకు సేవించాలి?
ఈ అంగడి మూసేస్తాను. అతడి ప్రేమనే నా భాండాగారం. రత్నాల గని దొరికిందినాకు, ఇంకా అంగడి నడుపుకుంటూ కూర్చోడమెందుకు?
నా నెత్తిన గాయమేదీ లేదు. తలకి కట్టు కట్టుకుని తిరగడమెందుకు? నేనీ ప్రపంచానికే వైద్యుణ్ణి. నేనింకా రోగగ్రస్తుడిలాగా కనిపించడం అవసరమా?
హృదయోద్యానవనంలో కోయిలని నేను, గుడ్లగూబలాగా బతకడం తప్పు. అతడి తోటలో గులాబి మొక్కను. ఒక ముల్లులాగా బతకడం కన్నా అపరాధముంటుందా?
నేను సుల్తానుకే సన్నిహితుణ్ణయ్యాక, పనికిమాలిన పరిచయాలతో పనేమిటి? అతడి ప్రేమని చవిచూసాక నాకు నేనంటేనే మొహం మొత్తింది.
నేనేదన్నా పనివెతుక్కుందామంటే అతడు నన్ను కట్టిపడేస్తాడు. నేను మడికట్టుకునికూచుందామంటే నన్ను నిలువెల్లా మధువులో ముంచేస్తాడు.
నేనొక పానపాత్రని, ఇంకా హృదయం మూలుగుతుండటమెందుకు? నేను దీపపు సెమ్మెని. ఇంటినెట్లా చీకటిపాలు చెయ్యగలను?
ఒక రాత్రి నా ఇంట అతిథిగా అడుగుపెట్టు, పూర్ణచంద్రుణ్ణే నీకు కానుకచేస్తాను. నీ హృదయాన్నివ్వు. సకల సపర్యలతో నీ హృదయాన్ని కైవసం చేసుకుంటాను.
నీ జీవితం నువ్వు వదులుకోగలిగితే నేను నీ జీవితంగా మారతాను, నీ ప్రేమనవుతాను. ఒకవేళ ఎవరైనా నీ తలపాగా హరిస్తే, నేనే నీ శిరోవేష్ఠనంగా మారిపోతాను.
నీ హృదయాన్ని మరెవరికీ కానుకచెయ్యకు, నాలాంటి ముత్యం మరొకరు లేరు. ఇంక చింతించకు. నీ కోసం చింతించడం నా పని. నువ్వు నా బాధ్యత.
విసుగు, సోమరితనాల్ని జయించాను. ఆత్మనుంచి భయాన్ని పక్కకు నెట్టేసాను. మృత్యువంటావా, వచ్చినప్పుడు వస్తుంది, నేను మృత్యువునే శాసించే స్థితికి చేరాను.
నేను పులియబెట్టుకున్నదే నా మధువు. సుఖదుఃఖాలు రెండూ ఒక్కటైపోయాయి. శుభవార్త మోసుకొచ్చాను. నా ద్రాక్షతోట పక్వమైంది. ఇంక కసుగాయల్తో పనిలేదు.
ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇప్పుడు మన ప్రేమ పునాది స్థిరపడింది, నిరూపణ కళ్ళకి కడుతున్నది. దేవుడా, ఎంత భాగ్యం, నేను సింహాన్ని, నక్కని కాను.
సుఖసంతోషాలు అందివచ్చాయి, దుఃఖాలు తొలగిపొయాయి, దయామయుడైన సర్వేశ్వరుడికి నా ప్రణామాలు, ఓ అతిథీ, సాష్టాంగపడు, ఇప్పుడు నిన్ను కొనుక్కోగలను.
పొద్దుణ్ణుంచీ తంబురా మోగిస్తున్నాను, పెళ్ళిసందడి మధ్యలో ఉన్నాను, ఈ ముసుగు తొలగించిపారేస్తాను, నన్నిట్లా ఎంతకాలం కప్పిపుచ్చుకోవాలి?
ఇప్పుడు నిరాశ్రయులందరికీ నీడ దొరుకుతుంది. దీనులకి ఐశ్వర్యం లభిస్తుంది. మాట్లాడకు! నువ్వు మౌనంగా ఉంటే నీ తరఫున నేను మాట్లాడతాను.
తబ్రీజునుంచి వచ్చిన షమ్స్ దీ నాదీ ఒకే గ్రహస్థితి. మా ఇద్దరి తారలూ ఒక్కటయితే ఇంక చెప్పేదేముంది?నేను పదిదిక్కులా ఒక్కసారే ఉదయిస్తాను, ప్రకాశిస్తాను.
21-1-2018