రామాయణ పర్వతశ్రేణి

Reading Time: 3 minutes

10

మీకు కొండలంటే చాలా ఇష్టమల్లే ఉందనుకుంటాను అన్నారు గణేశ్వరావుగారు, నా ‘కొండమీద అతిథి’ పుస్తకం చూసి. ‘అవును, మాది కొండ కింద పల్లె’ అని ఒకింత గర్వంగానే చెప్పాను గాని, ఆ వెంటనే సిగ్గుపడ్డాను కూడా. నిజంగా కొండల్ని ప్రేమించవలసినంతగా ప్రేమిస్తున్నానా నేను?

కొండల్ని ఇష్టపడటమంటే ఏమిటి? రమణ మహర్షిలాగా, తక్కిన ప్రాపంచికబంధాలన్నిట్నీ పక్కన పెట్టేసి, ఒక కొండని చూస్తో జీవితమంతా గడపడమే కదా! అట్లాంటి మహర్షులూ, పర్వతారాధకులూ ప్రపంచంలో మరెందరో ఉన్నారనే అంటున్నాడు గారీ ఫ్లింట్. పర్వతప్రేమికులైన సుమారు మూడువందల మంది కవుల కవితలతో అతడు నిర్వహిస్తున్న mountainsongs.net నాలాంటివాళ్ళకి గొప్ప కనువిప్పు. కొండల్ని ప్రేమించేవాళ్ళకి కన్నుల పండగ.

ఆ వెబ్ సైట్ ప్రధానంగా ప్రాచీన, ఆధునిక చైనా కవుల్ని స్మరించుకోవడం కోసమే నడుపుతున్నప్పటికీ, అందులో ఇతరదేశాల కవులు కూడా లేకపోలేదు. కానీ, అది చూసిన తర్వాత నేను ఆలోచనలో పడ్డాను. భారతీయ కవిత్వంలోనూ, తెలుగు కవిత్వంలోనూ కొండల గురించిన పద్యాలూ, పాటలూ, కవితలూ ఏమున్నాయా అని. ఒకటో, రెండో కాదు, కొండల గురించి కలవరించి పరితపించిన కవులెవరున్నారా అని? కొండలంటే తనకి అబ్సెషన్ అని చెప్పిన ఇస్మాయిల్ కూడా కొండలమీద కవితలేమీ రాసినట్టు లేదు.

మళ్ళీ మళ్ళీ పర్యావలోకిస్తే ఒక్క రామాయణమే కనిపిస్తున్నది. (రామాయణం నాకు రాజకీయ గ్రంథం కాదు, మతగ్రంథం కాదు. ఒక సాహిత్యకృతిగా, సౌందర్యరసాత్మక కావ్యంగా అది నాకు పునఃపునః పఠనీయం.) రామాయణమంతా ఒక సూర్యస్తోత్రమని శేషేంద్ర అన్నాడు. కాని, నా వరకూ అది కొండనుంచి కొండకి, అడవినుంచి అడవికి (శైలాత్ శైలమ్, వనాత్ వనమ్) చేసిన ప్రయాణం. ప్రాపంచికంగా తనను తాను నిరాకరించుకోడాన్ని సాధనచేసిన ఒక మనిషి నడిచిన దారి. రాముణ్ణి ‘గిరివనప్రియుడు’ అనీ, హనుమంతుణ్ణి ‘కాంతార వనకోవిదుడు’ అని అభివర్ణిస్తున్నప్పుడు, వాల్మీకి నా ముందుంచుతున్న ఆదర్శాలు స్పష్టంగానే ఉన్నాయి. అడవుల్నీ, కొండల్నీ ఇష్టపడటం కన్నా మించిన లౌకిక, అలౌకిక జీవితానందమేదీ నాకిప్పటిదాకా కనిపించలేదు.

ఎన్ని కొండలు! ఎన్ని కొండలు! రాజ్యం నుంచి బయటకు నడిచిన రాముడు గంగానది దాటినప్పటినుంచే అతడి నిజమైన మనోసామ్రాజ్యం మొదలవుతుంది. రాముడు తిరుగాడిన చిత్రకూటం, పంచవటి, ప్రస్రవణ పర్వతం, ఋశ్యమూకం, మలయపర్వతం, మాల్యవంతం వంటి పర్వతాలే కాదు, హనుమంతుడు అధిరోహించిన వింధ్య, మహేంద్రగిరి, మైనాకం, త్రికూటం, సువేలం వంటి పర్వతాలే కాదు, వాలివెంట తరుముంటే, సుగ్రీవుడు పరుగెత్తిన పర్వతశ్రేణులన్నీ రామాయణంలో కనిపిస్తాయి. ఆ కొండలు నిజంగా ఉన్నాయా లేదా అన్నది ప్రశ్న కాదు. అది కావ్యభూగోళం. Mythological geography. కవి మాత్రమే చూడగల, మనకు చూపించగల ప్రపంచం.

సీతను వెతకడం కోసం వానరసైన్యాన్ని నాలుగు దిక్కులా పంపిస్తున్నప్పుడు సుగ్రీవుడు ఎన్ని కొండల గురించి చెప్పుకొస్తాడని! చివరికి ఒకచోట, కొన్ని కొండల పేర్లు చెప్పుకొస్తూ వాటికవతల అరవై వేల కొండలుంటాయంటాడు. అవును, నేను కూడా దండకారణ్యంలోనూ,నల్లమలలోనూ, అదిలాబాదు అడవుల్లోనూ తిరుగాడుతున్నప్పుడు అరవై వేల కొండలు చూసాను. ఏ కొండ కొమ్ముమీదనో నిలబడ్డప్పుడు, దూరంగా కనిపించే కొండల వరసని ఎట్లా లెక్కగట్టాలి? అందుకనే గోపీనాథ మొహంతి అట్లాంటి తావుల్లో ‘కెరటాల్లాగా కొండలు’ న్నాయంటాడు.

ఇప్పుడు కొండలకి దూరంగా బతుకుతున్న నాకు, ఆ కొండగాలి తగలాలంటే, రామాయణం తెరవడమొక్కటే శరణ్యం. వాల్మీకి అక్షరాలా ఆటవిక కవి. అయోధ్యనీ, లంకనీ పోల్చడానికి అతడు ఆ కావ్యం రాసాడంటారుగాని, అతడు ఆ రెండు నగరాల్లోనూ కూడా ఊపిరాడనట్టే కనిపిస్తాడు. తక్కిన మహాకవుల విషయం వేరు. వ్యాసుడు నదీమైదానాల కవి. గంగ లేకపోతే భారతమే లేదు. కాళిదాసాదులు స్పష్టంగా నగర కవులు. గాథాసప్తశతి కవులు గ్రామాల కవులు. కానీ వాల్మీకి, అడవుల కవి, కొండల కవి.

ప్రాచీన చైనా మహాకవులు హాన్ షాన్, మెంగ్ హావో రాన్, లిబాయి, బైజుయి వంటి వారు రామాయణం చదివి ఉంటే, ఆ కొండల కోసం, వాల్మీకిని హృదయానికి హత్తుకుని ఉంటారనిపిస్తుంది.

చిత్రకూటం :అయోధ్యాకాండ

1
సుందరం, బహుమూలఫలం ఈ కొండ
చూడగానే నా మనసు దోచుకుంది.
ఎన్నెన్ని తరువులు, తీగలు, సౌమ్యుడా
నేనిక్కడ సుఖంగా జీవించగలననిపిస్తున్నది.

2
రాజ్యం లేకపోయినా బాధలేదు,
మిత్రులు లేకపోయినా నష్టం లేదు,
రమణీయమైన ఈ కొండని చూస్తుంటే,
ప్రియా, నాకు కష్టం తెలియడం లేదు.

3
ఎక్కడ చూడు నీళ్ళు, దుంపలు, పండ్లు
ఈ కొండ ముందు కుబేరనగరం ఎక్కడ?
సౌగంధిక సరోవరం ఎక్కడ? ఇంతకు
మించిన ఆదర్శ రాజ్యం ఎక్కడ?

పంచవటి : అరణ్యకాండ

4
కొన్నిచోట్ల బంగారు, వెండి,
కొన్ని చోట్ల రాగి, రంగురంగుల
అలంకారాలు తొడిగిన ఏనుగుల్లాగా
ఉన్నాయిక్కడ కొండలు.

ఋశ్యమూకము: యుద్ధకాండ

5
సీతా, ఇదిగో,ఋశ్యమూకం,
కొండలన్నిటిలోనూ గొప్ప కొండ,
నిలువెల్లా బంగారం, మెరుపుల
వెలుగులీనుతున్న నీలమేఘం.

ప్రస్రవణ గిరి: కిష్కింధాకాండ

6
వసంతవేళల కొండగాలి
మత్తెక్కిన కోకిలపాటకి జతకలిపి
చెట్లతో నాట్యం చేయిస్తూ
తానే పాడటం మొదలుపెట్టినట్టుంది.

7
మహామేఘాలు వర్షించిపోయాక
శుభ్రపడ్డ కొండచరియలు.
ఇప్పుడు వెన్నెల పూసినట్టు
మెరుస్తున్నవి గిరిసానువులు.

పుష్పితక పర్వతం : కిష్కింధాకాండ

8
ఆ కొండకి రెండు శిఖరాలు
ఒకటి బంగారం, అది సూర్యుడిది
మరొకటి తెల్లనిది, వెండి,
చంద్రుడిది.
అందరికీ కనిపించేవి కావవి.
చేసిన మేలు మర్చిపోయేవాళ్ళు
క్రూరులు,
దేన్నీ నమ్మలేనివాళ్ళు
చూడలేరు వాటిని.

మైనాకం : సుందరకాండ

9
పైకి లేచిన పర్వత శిఖరాలు
బంగారంలాగా మెరుస్తుంటే
శస్త్రంలాగా ఉన్న ఆకాశం
శుభ్రకాంచనంలాగా మెరిసిపోయింది.

త్రికూటం : యుద్ధకాండ

10
సుందరం, శ్రీమంతం ఆ శిఖరం
పక్షులు సైతం చేరలేని స్థలం.
మనసుతో కూడా అడుగుపెట్టలేం
ఇక నడిచి ఎక్కే మాట ఎక్కడ!

5-4-2018

Leave a Reply

%d bloggers like this: