రాత్రంతా సంభాషణ

Reading Time: 2 minutes

r2

రూమి కవిత చదివాక అన్నిటినీ వదిలేసి వాటినే చదువుకుంటూ మిగిలిన జీవితం గడిపేయాలని అనిపించింది అని రాసారు ఒక మిత్రురాలు. కోలమన్ బార్క్స్ చేసింది కూడా అదే.

1976 లో ఒక సాయంకాలం అతడికి మరొక అమెరికన్ కవి, అనువాదకుడు రాబర్ట్ బ్లై రూమీ కవిత్వాన్ని పరిచయం చేసాడు. ఎ.జె.ఆర్బెర్రీ అనువదించిన Mystical Poems of Rumi (1968) అతడి చేతుల్లో పెడుతూ, ఈ కవితల్ని ఈ పంజరం నుంచి మనం విడుదల చేయాలి అన్నాడట. ఆర్బెర్రీ పర్షియన్ నేర్చుకుని మూలవిధేయంగా, పండితపరిష్కార శైలిలో రూమీని అనువదించాడు. పంజరమంటే మూలవిధేయంగా ఉండిపోయి ఆ కవితలు పాఠకుల హృదయాల్లోకి ఎగరలేకపోతున్నాయని రాబర్ట్ బ్లై ఉద్దేశ్యం. అప్పణ్ణుంచి 2010 దాకా 34 సంవత్సరాలు బార్క్స్ రూమీ కవిత్వాన్ని తనకోసం తాను తిరగరాసుకుంటూ గడిపేసాడు. రూమీ ‘దివానీకబీరీ’ The Big Red Book (2011)గా వెలువరించడంతో ఆ తపస్సు పూర్తయ్యింది. షమ్స్ తబ్రీజీ పేరుమీద రూమీ చెప్పిన గజళ్ళు, రుబాయీలకు జాన్ మోయిన్, నెవిట్ ఎర్గిన్, అర్బెర్రీ, నికల్సన్ చేసిన అనువాదాల్ని మరింత సరళసులభంగా అందించిన పుస్తకం అది.

తన ముందున్న ఇంగ్లీషు అనువాదాల్ని తాను వాల్ట్ విట్మన్, విలియం కార్లోస్ విలియమ్స్, గాల్వే కిన్నెల్ ల తరహా అమెరికన్ వచనకవితగా మార్చడమే అతడు చేసిన ఇంద్రజాలం. అతడి వివేకం ఎక్కడుందంటే, గజళ్ళను సానబట్టేటప్పుడు విట్మన్ తరహా వచనకవితగానూ, రుబాయీలని కుదించేటప్పుడు డికిన్ సన్ తరహా వచనకవితగానూ మార్చడంలోనూ. ఆ నైపుణ్యంవల్ల అతడి రూమీలో వాల్ట్ విట్మన్, ఎమిలీ డికిన్ సన్ అనే రెండు మహాప్రవాహాలు మేళవించి ఒక కవిత్వప్రయాగగా మారిపోయేయి.

కోలమన్ బార్క్స్ ని అనువాదకుడు అనలేం. అతడు పారశీకం నుంచి అనువదించలేదు కాబట్టి. కాని అతడు అంతకన్నా మించినబాధ్యత నెరవేర్చాడు. రూమీ కవిత్వాన్ని పాఠకుడికి ఒక అపరోక్షానుభూతిగా మార్చేసాడు. తాను మధ్యవర్తినే. కాని ఒక పానపాత్రలాగా, మన ధ్యాస మధువు మీదనే ఉంచి పాత్రని మర్చిపోయేట్టు చేసాడు.

రూమీని చూసి ఆధునిక అమెరికన్ పాఠకుడు ఎందుకంత సమ్మోహితుడవుతున్నాడు? బార్క్స్ ఇట్లా అంటున్నాడు:

‘రూమీ సందేశాన్ని వివిధరకాలుగా వివరించవచ్చు. కాని దాని సారాంశంలో ప్రతి ఒక్క మతమూ ఉంది. ఎల్లల్లేని స్వాతంత్ర్యంలో,సంతోషంలో జీవించాలనే ప్రతి ఒక్క మానవుడి ఆకాంక్ష అందులో ఉంది. .’

ఆ మహాసంపుటిలోంచి ఒక కవిత:

రాత్రంతా సంభాషణ

ఒక్కరాత్రి నీ నిద్ర వాయిదా వెయ్యి.
నువ్వేది గాఢంగా కోరుకుంటున్నావో అది నిన్ను చేరవస్తుందప్పుడు.
నీలోపల సూర్యరశ్మి వెచ్చదనంతో అద్భుతాలు చూస్తావప్పుడు.

ఈ ఒక్కరాత్రికి మేను వాల్చకు,
ఓపికపట్టు, దృఢంగా ఉండగలుగుతావు.

దేన్ని ఆరాధన ఆరాధిస్తుందో ఆదీ రాత్రి నీకు సాక్షాత్కరిస్తుంది.
నిద్రపోయేవాళ్ళు దాన్ని చూడలేరు.
మోషే చూడు, ఒక్కరాత్రి మేలుకున్నందుకు
ఒక వృక్షంలో జ్యోతిస్సుని చూసాడు.

ఆ తర్వాత అతడు పదేళ్ళపాటు రాత్రిళ్ళు
పహరా కాస్తూనే ఉన్నాడు,
చివరికి ఆ చెట్టు మొత్తాన్ని తేజోవృక్షంగా కనుగొన్నాడు.
మహమ్మద్ రాత్రిపూట ఆకాశం మీంచి తన అశ్వాన్ని నడిపించాడు.

పగలు పని కోసం, రాత్రి ప్రేమ కోసం.

నిన్నెవ్వరూ ఏమార్చకుండా చూసుకో.
కొందరు రాత్రుళ్ళు నిద్రపోతారు, ప్రేమికులు కాదు
వాళ్ళా చీకట్లో కూర్చుని దేవుడితో సంభాషణ సాగిస్తారు.
సర్వేశ్వరుడు దావీదు తో అనలేదా
‘ప్రతి రాత్రీ రాత్రంతా నిద్రపోతూ మనకు సన్నిహితంగా ఉన్నామని చెప్పుకుంటున్నవాళ్ళు అబద్ధాలు చెప్తున్నార’ని.

తమ ప్రియతముడి ఏకాంతం తమని చుట్టబెట్టాక
ప్రేమికులు నిద్రపోలేరు.

ఒక దాహార్తుడెవరేనా కొంతతడవు కునుకు తియ్యవచ్చు
కాని అతడు కలగనేది నీళ్ళనే.
లేదా ఒక నీటిచెలమపక్కనొక నీళ్ళ కూజానే
లేదా మరోమనిషినుంచి మటుకే తనకందే ఆత్మజలాల్నే.

రాత్రంతా ఆ సంభాషణ విను, మెలకువగా ఉండు
ఉన్నదేదైనా ఈ క్షణమే,
మరునిముషంలో మృత్యువు నొల్లుకుపోగలదు.

ఒకనాటికి నువ్వు కూడా వెళ్ళిపోతావు,
అప్పుడీ ప్రపంచంలో ఒక మధురహృదయుడు తక్కువవుతాడు,
ముళ్ళల్లో పెరిగే కలుపుమొక్కలు మటుకే మిగుల్తాయి.

నా పని పూర్తయింది.
మిగిలిన కవిత ఈ రాత్రి చీకట్లో చదువుకో,
నాకు చేతులూ, చరణాలూ ఉన్నాయంటావా?

తబ్రీజువాసులప్రేమికుడివయిన ఓ షమ్స్, నా పెదాలు మూసుకుపోతున్నాయి
వాటిని నువ్వొచ్చి తెరిచేదాకా నీకోసమే ఎదురుచూస్తాను.

23-1-2018

 

Leave a Reply

%d bloggers like this: