రంగులవంతెన

 

meghaduta

మేఘావృతమైన ఆకాశం. నా హృదయమింకా మేఘసందేశ కావ్యం చుట్టూతానే పరిభ్రమిస్తున్నది. ఆ కావ్యం మనమీద జల్లే మంత్రమయసుగంధం ఒకపట్టాన వదిలేది కాదు. టాగోర్ నే చూడండి. ఆయన జీవితమంతా ఆ కావ్యాన్ని స్మరిస్తూనే వున్నాడు. ఎంతగా అంటే, తనను తాను ‘ఆలస్యంగా, ప్రింటింగ్ ప్రెస్ యుగంలో జన్మించిన కాళిదాసుగా’ చెప్పుకునేటంతలా.

మేఘదూత కావ్యం తన జీవితంలో మొదటిసారి ఎప్పుడు ప్రవేశించిందో ఆయనకు గుర్తే. తన ‘జీవనస్మృతి’ లో ఇలా రాసాడు:

‘నా చిన్నతనంలో గంగ ఒడ్డున తోటలో మేఘోదయమవుతున్నప్పుడు, పెద్దన్నయ్య డాబా మీద వొకనాడు మేఘదూత చదువుతున్నాడు. అర్థం తెలుసుకోవలసిన అవసరం లేకపోయిందినాకు, తెలుసుకునే ఉపాయమూ లేదు-దాని ఆనంద, ఆవేగపూర్ణమైన ఛందోచ్చారణే నాకు చాలనిపించింది.’

కాని ఒక జీవితకాలం పాటు ఆ కావ్యాస్వాదనలో గడిపాక, ఆయనిలా రాసాడు:

‘మేఘదూతంలో యక్షుడు తన దు:ఖంలో తాను తలుపులు మూసుకుని ఉండిపోలేదు. తన ప్రియురాలి నుండి అతడి ఎడబాటు అతడి హృదయోద్వేగాన్ని మేఘమార్గంలో అడవులమీదా, నదులమీదా విరజిమ్మేలాచేసింది. ప్రణయతప్తమైన ఒక మనిషి దు:ఖం విశ్వసంగీతంలో భాగమైపోయింది.’

ఈ విషయాన్నే మరొకచోట మరింత వివరంగా చెప్పాడు:

‘విరహంతో తపిస్తున్న యక్షుడి దు:ఖాన్ని తెలపడానికి కాళిదాసు వాసంతసమీరాన్ని కూడా ఉపయోగించు కోగలిగేవాడే. అప్పుడాతడి కౌశల్యాన్ని రసజ్ఞులు చాలామందే కొనియాడివుండేవారు. దక్షిణసమీరం ఉత్తరదిక్కుకి మరింత శీఘ్రంగా ప్రయాణించగలిగిఉండేది. కాని కవికులగురువు తన కావ్యవస్తువుగా ఆషాడమేఘాన్నే ఎంచుకున్నాడు-ఎందుకని? తొలకరిమేఘం జగత్తాపనివారిణి కనుక. దాని కర్తవ్యం ప్రియుడి ఎడబాటు క్లేశాన్ని తొందర తొందరగా ప్రేయసి చెవిలో చెప్పివెళ్ళిపోవడమేనా? కాదు. అది దారిపొడుగునా నదులమీదా, అడవులమీదా, కొండలమీదా ఒక విచిత్ర పూర్ణసంచారం చేస్తూ సాగుతుంది. అది సాగినంతమేరా కదంబం వికసిస్తుంది. నేరేడువనాలు మిగలముగ్గుతాయి. కొంగలు ఎగురుతాయి. ఒడ్డుల్ని ఒరుసుకుపారే నదీజలాలు రెల్లుపొదల్లోకి పొంగిపొరలుతాయి. పల్లెల్లో అమాయికులైన జానపద స్త్రీల ప్రీతిపూర్వక లోచనాలతో ఆషాడమేఘం మరింత ఘనీభవిస్తుంది. ఒక విరహతప్తుడి ప్రణయవార్త సమస్త పృథ్విలోని మంగళవ్యాపారంతో మేళవిస్తేగాని కవి హృదయం తృప్తి చెందలేదు.’

మేఘసందేశకావ్యంలోని మహిమ, జీవితంలో కనవచ్చే విరుద్ధపార్శ్వాలమధ్య, అది నిర్మించిన రసమయ సేతువులో ఉంది. దక్షిణానికీ, ఉత్తరానికీ, అడవులకీ, జనపదాలకీ, పల్లెలకీ, పట్టణాలకీ, మట్టివాసనకీ, పురాణగాథలకీ , అంతిమంగా, భూమికీ, కైలాసానికీ మధ్య నిర్మించిన రంగులవంతెనలో ఉంది.

టాగోర్ అన్నట్లుగా అది ప్రవాస దు:ఖం. కాని ఆ ప్రవాసాన్ని కవి దీనాలాపంగా మార్చలేదు. దాన్నొక సెలబ్రేషన్ గా మార్చాడు. మా మాష్టారు తరచూ అనేట్లుగా శాపగ్రస్త ప్రణయమే కాళిదాసు సాహిత్యవస్తువు, కాని ఈ సృష్టిలో శాపగ్రస్తం కాని ప్రణయమంటూ లేదని కవికి తెలుసు. అందుకనే మేఘసందేశం, శాకుంతలం, విక్రమోర్వశీయం- ప్రతి ఒక్క కథలోనూ ఆయన శాపం ఆధారంగానే స్వర్గానికి సోపానాలు నిర్మించాడు.

కనుకనే ఈ మందాక్రాంత శ్లోకాల్ని పున: పున: పఠిస్తున్నప్పుడు మనకి స్వర్గలోకపు మెట్లు ఎక్కుతున్నట్టే ఉంటుంది:

రత్నచ్ఛాయా వ్యతికర ఇవ ప్రేక్ష్మే తత్ పురస్తాత్
వల్మీకాగ్రాత్ ప్రభవతి ధను: ఖండం ఆఖండలస్య
యేన శ్యామం వపు: అతితరాం కాంతిమాపత్స్యతే తే
బహర్ణేవ స్ఫురితరుచినా గోపవేషస్య విష్ణో:

శబ్దాయాంతే మధురమనిలై: కీచకా: పూర్యమాణా:
సంసక్తాభి: త్రిపురవిజయో గీయతే కిన్నరీభి:
నిర్హ్లాదస్తే మురజ ఇవ చేత్కందరేషు ధ్వని: స్యాత్
సంగీతార్థో నను పశుపతే: తత్ర భావీ సమగ్ర:

15-6-2013

 

 

Leave a Reply

%d bloggers like this: