నీళ్ళునింపుకున్న కడవల్లాంటి నల్లమబ్బులు నింగిలో కనబడగానే భారతీయకవులు లోనైన రసపారవశ్యంలో సంతోషం, దిగులు, ప్రేమించినవాళ్ళనుంచి ఎడబాటు, ఎడబాటు తీరుతుందన్న కోరిక-ఎన్నో భావాలు వ్యక్తం కావడానికి వాల్మీకి రామాయణంతోనే మొదలు.
ఆదికవి పలవరించిన వర్షఋతు వర్ణనలాంటిది నేను చదివిన ప్రపంచ సాహిత్యంలో మరెక్కడా కనిపించలేదు. ప్రాచీన సంస్కృత, తమిళ, ప్రాకృత కవులు, శూద్రకుడు, కృష్ణదేవరాయలతో పాటు ఆధునిక తెలుగుభావకవులెందరో వర్షాన్ని అద్భుతంగా వర్ణించారు. అయితే ఆ వర్ణలన్నిటిలోనూ వాల్మీకి వర్ణన శిఖరసమానమనవచ్చు. దానికి కారణం, ఆయన ఊహాశాలీనతమాత్రమే కాదు, ‘గిరివనప్రియుడై’న రాముడితో ఆ వర్ణన కిష్కింధాకాండలో చేయించడం, అది కూడా విరహతప్తక్షణాల్లో చేయించడంలోని ఔచిత్యం కూడా.
ఆగీ ఆగీ ప్రయాణించే మబ్బుల్ని ఆయన-
సముద్వహంత: సలిలాతిభారం బలాకినో వారిధరా నదంత:
మహస్తు శృంగేషు మహీధరాణాం విశ్రమ్య విశ్రమ్య పున: ప్రయాంతి.
అని వర్ణించడంలోంచే కాళిదాసు మేఘసందేశానికి స్ఫూర్తి దొరికింది.
వాన చేసే నృత్యాన్ని-
వహంతి వర్షంతి నదంతి భాంతి ధ్యాయంతి నృత్యంతి సమాశ్వసంతి
నద్యో ఘనా మత్తగజా వనాంతా: ప్రియావిహీనా: శిఖిన: ప్లవంగమా:
అని చేసిన వర్ణనలోంచే శూద్రకుడు మృచ్ఛకటికంలో చేసిన వర్షఋతువర్ణన వికసించిందనవచ్చు.
కిష్కింధాకాండ 28 వ సర్గలో మొత్తం అరవై శ్లోకాలదాకా చేసిన ఈ వర్ణన ఎవరికివారు బిగ్గరగా చదువుకుంటూ ఆస్వాదించవలసిందే. అయినా మీకోసం కొన్ని కవితలు:
తుమ్మెదల వీణ
1
మేఘాలమెట్లమీంచి
ఆకాశమారోహించి
కొండగోగుపూలు మాలగుచ్చి
సూర్యుడి మెడలో వేయాలనివుంది.
2
మేఘాలమధ్యనుంచి
కర్పూరశీతలంగా వీస్తున్న
మొగలిపూలగాలి-
దోసిళ్ళతో తాగాలనివుంది.
3
అక్కడక్కడ ఆవరించిన
మబ్బుల నీడలు, వెలుతురు:
అక్కడక్కడ కొండలు కనిపిస్తున్న
మహాసముద్రంలాగా ఆకాశం.
4
వానకు తడిసిన అడవుల్లో
సంతోషంగా పచ్చిక, నెమళ్ళ
నాట్యం, చూడు అపరాహ్ణవేళ
అడవులు మరీ అందం.
5
మేఘాల్ని చేరాలన్న కోరికతో
ఎగుర్తున్న కొంగలగుంపులు,
తెల్లతామర పూలమాలలు
గాలికి ఊగుతున్నట్టుంది.
6
కొత్తగా మొలిచిన పచ్చిక మధ్య
చిన్ని చిన్ని ఆరుద్రపురుగులు
ఎర్రని చుక్కల చిలకాకుపచ్చ
కంబళికప్పుకున్నట్టుంది పుడమి.
7
మెల్లగా విష్ణువుని చేరుతున్నది నిద్ర
వేగంగా సముద్రాన్ని చేరుతున్నది నది
సంతోషంతో మేఘాన్ని చేరుతున్నది కొంగ
ప్రేమతో ప్రియుణ్ణి చేరుతున్నది కాంత.
8
తుమ్మెదలెక్కడుంటే అక్కడ అడవులు
గానం చేస్తున్నాయి, నెమళ్ళున్నచోట
నాట్యం. ఏనుగులున్నచోట మత్తెక్కి
కనిపిస్తున్నాయి, వెలిగిపోతున్నాయి.
9
చూస్తుంటే అడవుల్లో
సంగీతం మొదలైనట్టుంది
తుమ్మెదల వీణ, కప్పలు
గానం, మేఘాల మద్దెల.
10
అడవులంతటా రాలిపడ్డ మద్దిపూలు
అడివిమల్లెలు, కడిమిపూలు,
నిండు మకరందంమధ్య తూలుతున్న
నెమళ్ళు, వనమంతా ఒక మధుశాల.
12-7-2013