మాలతీచందూర్

Reading Time: 2 minutes

14

నన్ను చాలా ప్రభావితం చేసిన రచయితల్లో మాలతీచందూర్ గారిని చెప్పుకోవాలి. ఆమె నన్ను మాత్రమే కాదు, కొన్ని తరాల్ని ప్రభావితం చేసిన రచయిత.

మామూలుగా మార్పుకి సంబంధించి సమాజంలో మూడు రకాలవ్యక్తులుంటారు. ఒకతరహా మనుషులు మార్పుని తీవ్రంగా వ్యతిరేకిస్తారు, అడ్డుకోవాలని చూస్తారు. మరొక తరహా మనుషులు ఎలాగైనా మార్పు తేవాలని చూస్తారు. నెమ్మదిగానో, హఠాత్తుగానో,సవ్యంగానో, అపసవ్యంగానో. మూడవతరహాకి చెందిన వ్యక్తులు మార్పు అనివార్యమని గ్రహించి అందుకు తగ్గట్టుగా సమాజాన్ని మానసికంగా సంసిద్ధం చేస్తూంటారు. సమాజమంటే ఎవరో కానక్కర్లేదు. తమచుట్టూ ఉండేవాళ్ళు, ఇంట్లో వాళ్ళు, ఇరుగుపొరుగు. స్కూల్లో, ఆఫీసులో, క్లబ్బులో నిన్ను కలిసేవాళ్ళు, ఏదన్నా కష్టమొచ్చినప్పుడు నీ సలహా అడిగేవాళ్ళు.

మాలతీచందూర్ మూడవతరహా కోవకి చెందిన రచయిత. ఆమె సాహిత్యజీవితం, పౌరజీవితం సారాంశమంతా ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగుసమాజాన్ని మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా సమాయత్తం చెయ్యడమేనని చెప్పవచ్చు.

తన చుట్టూ వస్తున్న సామాజికపరిణామాన్ని ఆమె పాజిటివ్ గా అర్థం చేసుకోవడానికీ, చిత్రించడానికే ప్రయత్నించారు. ఇప్పుడింత సమాచారవిప్లవం సంభవిస్తున్న కాలంలో మనుషులు ఆమెవైపు చూడటం బహుశా తగ్గిందేమో గాని, నలభయ్యేళ్ళ కిందట, మా ఊళ్ళో, వార్తాపత్రిక తప్ప మరే సమాచారసాధనమూ అందుబాటులో లేని కాలంలో ఆమె ప్రమదావనం ఒక్కటే మాకు లభ్యంగా ఉండే వనరు. ఆ రోజుల్లోఅంధ్రప్రభలో ఎవరెవరో అడుగుతున్న ప్రశ్నలకి ఆమె ఇచ్చే జవాబులు మా అక్కా నేనూ మళ్ళీ మళ్ళీ చదువుతూ చర్చించుకోవడం నేను మర్చిపోలేను.

ఆ జవాబులద్వారా ఆమె ఒక సంస్కారాన్ని ప్రకటించేది. ఆ సంస్కారానికి కొన్ని ముఖ్యలక్షణాలున్నాయి. మొదటిది ఆమె ప్రజాస్వామ్యవాది. నలుగురికీ నాలుగురకాల అభిప్రాయాల్ని ఏర్పరచుకునే అవకాశమూ, వాటిని ప్రకటించుకునే హక్కూ ఉండాలని కోరుకున్నారు. ఆమె ఇచ్చే జవాబుల్లో కూడా ఆ సహనశీలత స్పష్టంగా వ్యక్తమయ్యేది. రెండవది, ఆమె హేతుబద్ధతకీ, శాస్త్రీయ దృక్పథానికీ ఇచ్చిన ప్రాధాన్యత. మూడవది సామాజిక జీవితంలో, మానవసంబంధాల్లో అనుసరించి తీరవలసిన ఒక పౌరసంస్కారం. తెలుగు సమాజం ప్రధానంగా గ్రామీణసమాజం కాబట్టి, గ్రామీణ జీవితంలో ఉండే ఎన్నో అవలక్షణాలు మన పట్టణ నాగరిక జీవితంలోకి కూడా ప్రవహించాయి. అటువంటి నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ వచ్చిన సంస్కారం మొదట్లో అర్థం కావడం కష్టంగా కూడా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీల చదువుగురించీ, స్త్రీలు స్వేచ్ఛగా తమ జీవితావకాశాల్ని సాధించుకోవడం గురించీ ఆమె అవకాశం దొరికినప్పుడల్లా మాట్లాడేవారు. స్త్రీలని చిన్నచూపు చూడటం, గౌరవించలేకపోవడమనేవి మన గ్రామీణ జీవిత నేపథ్యం నుంచి మనకు తెలియకుండానే మనలో చేరుకున్న కల్మషాలనీ వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలనీ ఆమె పదేపదే చెప్తూ వచ్చారు.

మరొక రెండు ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిది, ఇప్పుడు వ్యక్తిత్వవికాసవాదంగా చలామణీ అవుతూ ఎందరికో ఉపాధిగా మారిన కౌన్సిలింగ్ ని ఆమె ఉచితంగా, ధారాళంగా, విశ్వసనీయంగా జీవితకాలంపాటు అందించారు. ఆమె ప్రమదావనంద్వారా, జవాబులద్వారా ప్రధానంగా చేసింది కౌన్సిలింగే. సమస్యల్ని ముఖాముఖి స్వయంగా ఎదుర్కోవడమే సమస్యల్ని అధిగమించే ఏకైక పరిష్కారమనే ఆమె చెప్పినట్టు నాకు తోస్తున్నది. అంతేతప్ప ఇప్పటి కౌన్సిలర్లలాగా ఆమె ఎటువంటి చిట్కావైద్యమూ సూచించేవారు కారు.

ఇక రెండవ అంశం అన్నిటికన్నా ముఖ్యమైనది. అది నాలెడ్జి మానేజిమెంటుకు సంబంధించిన అంశం. ఇరవై ఒకటవ శతాబ్దంలో ప్రపంచం నాలెడ్జి మానేజిమెంటు గురించి అలోచిస్తున్నది. నాలెడ్జి మానేజిమెంటులో మూడు ముఖ్యమైన దశలుంటాయి. మొదటిది, సమాచారం విశ్వనీయంగానూ, తక్కువఖర్చులోనూ లభ్యం కావడం. ఉదాహరణకి ఇంటర్నెట్. అలా లభ్యమైన సమాచారాన్ని ఎవరికి వారు వ్యక్తులుగా, బృందాలుగా ప్రాసెస్ చేసుకుని తమ తమ విజ్జానాన్ని (నాలెడ్జి) పెంపొందించుకోవడం, పంచుకోవడం. మూడవదశ క్లిష్టమైనది. ఇక్కడ విజ్జానం వివేకంగా (విజ్ డం) మారవలసిఉంటుంది. విజ్జానం సరాసరి వివేకం కాలేదు. అది గూగుల్, స్కైప్, ట్విట్టర్, ఫేస్
బుక్ ల ద్వారా సాధపడేది కాదు. దానికి మనిషిలో అంతర్గతంగా కొన్ని ప్రాసెసర్లు ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యం సంస్కారం, ఆర్తి, ఎదుటిమనుషులపట్ల దయలాంటి గుణగణాలు ఉండాలి. జీవితం పట్ల గౌరవం ఉండాలి.

ఆశ్చర్యమేమిటంటే, నాలెడ్జి మానేజిమెంటు అనే పదాన్ని కూడా మనం ఊహించలేని రోజుల్లో మాలతీచందూర్ చేసింది అదే కావడం. ఆమె సమాచారం సేకరించుకునేది. ఆ సమాచారాన్ని విజ్జానంగా మార్చుకునేది. ఎవరెవరో మనుషులు ఆమెతో తమ సమస్యలు చెప్పుకున్నప్పుడు ఆ విజ్జానం వివేకంగా పరిణమించి ఒక సమాధానంగా బయటకొచ్చేది.

తెలుగులో చాలామంది గొప్ప రచయితలు, మార్పుని కోరుకున్నవాళ్ళూ, ద్వేషించినవాళ్ళూ ఉన్నారు. శైలిలో, శిల్పంలో మాలతీచందూర్ బహుశా వాళ్ళ స్థాయికి నిలబడకపోవచ్చు. కాని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనుషుల్ని తర్ఫీదు చేయడంలో మాత్రం ఆమెని మించిన వాళ్ళు లేరు.

ఆమె ఋణం తీర్చుకోలేనిది.

21-8-2013

Leave a Reply

%d bloggers like this: