పైకి ఇద్దరం, ఆత్మలో ఒక్కరం

16

‘మీరు రూమీ గురించి తన్మయత్వంతో రాస్తున్నారని తెలుస్తోంది గాని,ఆ తన్మయత్వం ఎందుకో తెలియడం లేదు’ అన్నారొక మిత్రురాలు నిన్న నేను రూమీ గురించి రాసింది చదివి. ‘రూమి అంటే మాకు తెలిసింది ఆయనొక ప్రేమకవి అని మాత్రమే’ అని కూడా అన్నారామె.

సాదీ, హాఫిజ్, ఓమర్ ఖయ్యాంలతో పాటు పారశీక కవుల్లో ఎంచదగ్గ నలుగురు మహనీయకవుల్లో ఒకడైన మౌలానా జలాలుద్దీన్ రూమి (1207-1273) ని ఒక ప్రేమకవిగా మాత్రమే చూపించడమేది ఉత్తరమెరికా పాప్ సంస్కృతిలో భాగంగా జరుగుతున్న ఒక పరిణామం. రూమీ జీవితచరిత్రకారుడు ఫ్రాంక్లిన్ డి లూయిస్ కూడా తన ‘రూమి,పాస్ట్ అండ్ ప్రెజెంట్, ఈస్ట్ అండ్ వెస్ట్’ (2007) అన్న పుస్తకంలో ఈ రూమీమానియా గురించి ఆందోళన వెలిబుచ్చకుండా ఉండలేకపోయాడు. ఎందుకంటే రూమీ గానం చేసిన ప్రేమ స్త్రీపురుష ప్రేమ కాదు, భగవంతుడికీ, భక్తుడికీ మధ్య ప్రేమ కూడా కాదు, లేదా కొన్ని గే సమాజాలు భావిస్తున్నట్టుగా హోమో ఎరొటిసిజం కూడా కాదు.

అది ప్రధానంగా మనిషికీ మనిషికీ మధ్య సంభవించగల ప్రేమ. నీ రక్తానికీ, మతానికీ, వర్ణానికీ ఏ మాత్రం సంబంధంలేని మరో మనిషితో, నిష్కారణంగా ఏర్పడగల ప్రేమ. అందులో ఒకరు మరొకరినుంచి తీసుకునేదేమీ ఉండదు. ఇవ్వడమే ఉంటుంది. ఒకరు మరొకరికి ఇవ్వడమంటూ ఏమీ ఉండదు. నిస్సంకోచంగా తీసుకోవడమే ఉంటుంది. అసలు ఇవ్వడమూ, తీసుకోవడమూ కూడా ఉండదు. ఒకరు మరొకరిలో తన అస్తిత్వాన్ని కనుగొని కేవలం ‘ఉండటమే’ ఉంటుంది.

రూమీకి తబ్రీజ్ కి చెందిన సాధుపురుషుడు షంషుద్దిన్ తో అటువంటి ప్రేమ సంభవించింది. తండ్రినుంచి వారసత్వంగా సంభవించిన ఒక పీఠం, చక్కని కుటుంబం, మర్యాదామన్ననలతో కూడిన సామాజిక గౌరవాలతో సౌకర్యంగా జీవిస్తున్న రూమీ జీవితంలో అతడి 37 వ ఏట షమ్ష్ ఒక సుడిగాలిలాగ ప్రవేశించాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ లోకాన్ని మర్చిపోయారు. ఎడతెగని సంభాషణలో నిద్రాహారాలూ, దివారాత్రాలూ పక్కకి పోయాయి, చివరికి ఒకనాడు షంష్ అదృశ్యమైపోయినదాకా. అతణ్ణి చంపేసారా? తెలియదు. కొన్నాళ్ళదాకా రూమీ అతడు బతికున్నాడనే అనుకున్నాడు, చివరికి ఒకనాటికి అతణ్ణి తనలోనే దర్శించాడు. ఆ దర్శనంలోంచే ఆరు సంపుటాల మస్నవీ, 3500 గజళ్ళూ, 2000 రుబాయీలతో కూడిన దివాన్, ఎన్నో ప్రసంగాలూ, ఉత్తరాలూ వెలువడ్డాయి.

మనిషికీ, మనిషికీ మధ్య సంభవించగల ఇటువంటి తాదాత్మ్యభావన అమెరికాకి కొత్త కావచ్చుగాని, భారతదేశ సాహిత్యానికి కొత్త కాదు. 13 వ శతాబ్దపు మహారాష్ట్ర సంత్ కవి జ్ఞానేశ్వర్ ‘అనుభవామృతం’ కూడా ఇటువంటి అనుభవాన్నే వివరిస్తుంది. అయితే రూమీ విశిష్టత ఎక్కడంటే ఆయన ఈ అనుభవంలోని వివిధ అవస్థల్ని అత్యంత సూక్ష్మభేదాలతో, వివరాలతో పట్టుకోవడం, చిత్రించడం. అదెలా ఉంటుందో ఈ కవిత చూడండి:

నువ్వూ నేనూ

సంతోషభరితమైన ఒక క్షణం,
మనమిద్దరమిట్లా వరండాలో కూచున్నాం
పైకి ఇద్దరం, కాని ఆత్మలో ఒక్కరం
నువ్వూ నేనూ.

ప్రవహిస్తున్న జీవజలాలు
తోటనిండా పరుచుకున్న సౌందర్యం,
పాడుతున్న పక్షులు
మననే పరికిస్తూ పైన తారలు
సన్నని నెలవంక ఎలా ఉంటుందో
చూపిద్దాం మనం వాటికి.

మనమంటూ విడిగా లేకుండా
ఏ ఉబుసుపోకకోసమో కాకుండా
నువ్వూ, నేనూ.
పైన స్వర్గంలో చిలకలు
కలకండ కొరుకుతున్నాయి
ఇక్కడ మనమిద్దరం
మనసారా నవ్వుకుంటూ.

ఇంకా ఆశ్చర్యమేమిటో తెలుసా
ఇక్కడ మనమిద్దరమిలా కలిసున్నామా,
సరిగ్గా ఈ క్షణాన్నే
ఇరాక్ లోనూ, ఖొరాసాన్ లోనూ
కలిసి తిరుగుతున్నాం.
ఒక రూపంలో భూమ్మీదా
మరో రూపంలో మరో మధురదేశంలోనూ.

13-8-2013

Leave a Reply

%d bloggers like this: