ప్రాచీన చీనా కవిత్వంలో అద్భుతమైన కవిత్వం చెప్పిన కవయిత్రులున్నారు. కాని ప్రసిద్ధి చెందిన కవితాసంకలనాల్లో వాళ్ళ కవితలు చేరనందువల్ల బయటి ప్రపంచానికి వాళ్ళ గురించి ఎక్కువ తెలియలేదు. చీనా కవిత్వాన్ని ఇంగ్లీషులోకి అనువాదం చేసిన మొదటితరం అనువాదకులు కూడా ప్రసిద్ధి చెందిన కవులమీదనే ఎక్కువ దృష్టిపెట్టారు. కాని అందుకొక మినహాయింపు హెన్రీ ఎచ్ హార్ట్ అనువాదం చేసిన ‘పొయెమ్స్ ఆఫ్ ద త్రీ హండ్రెడ్ నేమ్స్’ (1933).ఆయన తన పుస్తకానికి ముందుమాటలో ఇలా రాసాడు:
‘..పాతకాలాల గురించి ఒక్కమాట. చీనీ జాతికి అద్భుతమైన గీతాల్ని అందించిన స్త్రీల గురించి ప్రస్తావించకుండా చీనా కవిత్వం గురించి ఏమి రాసినా, చివరికి సంక్షిప్తంగా రాసినా కూడా అది సమగ్రమనిపించుకోదు. ఇప్పుడు మనకి మిగిలిందల్లా వాళ్ళ పేర్లు మాత్రమే. వాళ్ళు వదిలివెళ్ళిన కవితల సౌందర్యం తప్ప వాళ్ళ గురించిన ఏ వివరాలూ మనకి మిగల్లేదు. అలాగని, కవయిత్రులు లేని చీనీ కవిత్వయుగం కూడా ఏదీ లేదు.’
ఇప్పుడిప్పుడే ఎందరో అనువాదకులు ఇతిహాసపు చీకటికోణం మరుగునపడ్డ కవయిత్రుల్ని మనకి పరిచయం చేస్తున్నారు. అటువంటి పుస్తకాల్లో నన్ను బాగా ఆకట్టుకున్నది జేన్ పోర్టల్ సంకలనం చేసిన ‘చైనీస్ లవ్ పొయెట్రీ’ (2004). అందులో ఝుయె తావో (768-832)కవితలు కూడా ఉన్నాయి. ఆమె తాంగ్ కాలానికి చెందిన ఆస్థానవిదుషి. ఆమె కవిత ఒకటి మీ కోసం:
వసంతాన్ని చూస్తూ-1
పూలు వికసిస్తున్నాయి, సంతోషించడానికి పక్కనెవరూ లేరు,
పూలు వాడిపోతున్నాయి, కలిసి దు:ఖించడానికెవరూ లేరు,
నాకు తెలియడం లేదు, ప్రేమ మన మనసుల్ని కలతపెట్టేది
పూలు వికసిస్తున్నప్పుడా, లేక నేల రాలుతున్నప్పుడా?
5-6-2013