చాలాకాలంగా ఎదురుచూస్తున్న తావో యువాన్ మింగ్ ‘సెలెక్టెడ్ పొయెమ్స్’ (పండా బుక్స్, 1993) నిన్ననే వచ్చింది. సుమారు ముఫ్ఫై కవితలు, గతంలో చాలా సంకలనాల్లో చాలా సార్లు చదివినవే. కాని విడిగా ఒక పుస్తకంగా చూసినప్పుడు కలిగే ఆనందం చెప్పలేనిది కదా.
తావో కియాన్ గా కూడా ప్రసిద్ధి చెందిన తావో యువాన్ మింగ్ (365-427) చీనీ సాహిత్యంలో ఒక మహర్షి. గత పదిహేను శతాబ్దాల చీనా కవిత్వంమీద ఆయన ముద్ర చెరపలేనిది, మరవలేనిది. తరువాతి కాలాల్లో మహాకవులుగా గుర్తింపు పొందిన లీ బాయి, దుఫూ, బో జుయి, సు డోంగ్ పో వంటి వారికతడొక ఆరాధ్యమానవుడు, సు డోంగ్ పో అయితే తావో కియాన్ రాసిన ప్రతి కవితకీ మరొక ప్రతి కృతి రాయకుండా ఉండలేకపోయాడు.
తావో కియాన్ మన పోతనలాగా రాజాస్థానాల్ని నిరసించి వాటికి దూరంగా జీవించిన కవి. స్వయంగా ఒక రైతుగా జీవించినవాడు. రైతుల కష్టసుఖాలతో మమేకమయ్యాడు. నిరాడంబరంగా, సత్యసంధతతో జీవించాడు. మన చలంగారిలాగా ఆత్మవంచన ఏ రూపంలో ఉన్నా తట్టుకోలేకపోయాడు. మనం కూడా ఈ నిష్టుర ప్రపంచం నుంచి దూరంగా వెళ్ళానే అనుకుంటాం. కానీ వెళ్ళలేం. ఆ సాహసం, ఆ పరిత్యాగం అందరికీ సాధ్యమయ్యేవికావు కాబట్టి, ఇన్నేళ్ళైనా తావో కియాన్ కవిత్వం, చలంగారి రమణాశ్రమ లేఖల్లాగా మనకి కొత్తగా ఒక ప్రశాంతలోకాన్ని చూపించేదిగా కనిపిస్తూనే ఉంటుంది.
ఆయన కవితలు ఏవైనా మీతో పంచుకోవచ్చుగానీ, ప్రసిద్ధి చెందిన ఆయన రచన peach-Blossom springs ని మీకోసమిట్లా తెలుగు చేసాను:
పాలపళ్ళ వాగు
” చీనాదేశాన్ని జిన్ రాజవంశం పరిపాలిస్తూండిన కాలంలో హునాన్ ప్రాంతానికి చెందిన బెస్తవాడొకడుండేవాడు. ఒకరోజతడు వాగుమీద చిన్న తెప్పవేసుకుని చేపలు పట్టుకోవడానికి పోయాడు, అలా ఎంతదూరం వెళ్ళాడో తెలుసుకోకుండానే పెద్ద పాలపళ్ళ అడవికి చేరుకున్నాడు. వాగుకి అటూ ఇటూ కనిపించినంతదూరం పాలచెట్లు తప్ప మరే చెట్టూ అతడికి కనిపించలేదు. అక్కడ నేలమీద విస్తారంగా రాలిన పండ్లతో పచ్చిక సుగంధం విరజిమ్ముతోంది. అదంతా చూస్తూనే ఆ జాలరి ఆశ్చర్యపోయాడు. ఆ అడవి కొసదాకా పోయి చూడాలనుకున్నాడు.
ఆ ఆడవి చివరనే ఆ వాగు పుడుతున్నది, అక్కడొక కొండకొమ్ము, ఆ కొండ దిగువన ఒక చిన్ని గుహ, దాన్లోంచి మసగ్గా కొంత కాంతి. అతడు తన నావ వదిలిపెట్టి ఆ గుహలోపల అడుగుపెట్టాడు. మొదట్లో అది చాలా ఇరుగ్గా, ఒక్క మనిషి నడవడానికి మాత్రమే వీలుగా ఉంది. కాని సుమారు నలభై యాభై గజాలు నడిచాక చాలా విశాలంగా కనిపించింది.
ఇక అక్కణ్ణుంచి కనిపించే మేరంతా సమతలంగా, విస్తారంగా ఉంది. అక్కడ ఇళ్ళూ, కుటీరాలూ పొందిగ్గా కనిపిస్తున్నాయి. అక్కడంతా చక్కటిపొలాలూ, అందమైన కొలనులూ. చుట్టూ మల్బరీ చెట్లు, వెదురుపొదలూ, మరెన్నో రకరకాల చెట్లూ కనిపిస్తున్నాయి. పొలాలమధ్య గట్లు ఎత్తుగా కాలిబాటల్లాగా ఉన్నాయి. కోళ్ళూ, కుక్కలూ అరుస్తున్నాయి. అక్కడ మనుషులు, స్త్రీలూ, పురుషులూ కూడా, అటూ ఇటూ తిరుగుతూ, పొలాల్లో నాట్లు వేస్తూ, పని చేస్తూ కనిపించారు. వాళ్ళ దుస్తులు బయట ప్రపంచంలోలానే ఉన్నాయిగాని వాళ్ళంతా, పిల్లాజెల్లా ముసిలీ ముతకా, ప్రతి ఒక్కరూ, సిగలు బిగించుకుని సంతోషంగా, చెప్పలేనంత తృప్తిగా కనిపిస్తున్నారు.
వాళ్ళా బెస్తవాణ్ణి చూస్తూనే ఆశ్చర్యపోయారు. అతడక్కడికెలా రాగలిగాడని అడిగారు. వాళ్ళ ప్రశ్నలన్నిటికీ అతడు జవాబిచ్చాక వాళ్ళతణ్ణి తమ ఇళ్ళకు ఆహ్వానించారు. మద్యమందించారు. కోళ్ళు కోసారు, విందు చేసారు. ఊళ్ళో తక్కినవాళ్ళు కూడా ఈ అతిథి సంగతి వినగానే చూడటానికి విరగబడ్డారు. తాము అడగాల్సిన ప్రశ్నలన్నీ తాము కూడా అడిగేసారు.
ఇక అప్పుడు వాళ్ళు తమ గురించి కూడా చెప్పుకొచ్చారు. చీనాని క్విన్ రాజవంశం పరిపాలించే కాలంలో ఎడతెగకుండా సంభవిస్తున్న యుద్ధాలకూ, సంక్షోభానికీ విసుగుచెంది తమ పూర్వీకులు భార్యాపిల్లల్తో తమ ప్రాంతాల్ని వదిలిపెట్టి పారిపోయి ఈ మారుమూల ప్రాంతానికి వచ్చారని చెప్పారు.
ఇక్కడి చేరుకున్న తరువాత తమ తాతముత్తాతలు ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టలేదనీ, బయట ప్రపంచంతో సబంధబాంధవ్యాలు పూర్తిగా తెగతెంపులు చేసుకున్నారనీ చెప్పారు. ఆ కథంతా చెప్పి ప్రస్తుతం చైనాని ఏ రాజవంశం పరిపాలిస్తోందనడిగారు. వాళ్ళు హాన్ రాజవంశం పేరే వినలేదట, ఇక వెయి వంశం గురించీ, జిన్ వంశం గురించీ చెప్పేదేముంది? తనకు తెలిసిన తన ప్రపంచం గురించి ఆ బెస్తవాడు వారికి ప్రతి ఒక్కటీ పూసగుచ్చినట్టు వివరంగా చెప్పాడు, అదంతా విని వాళ్ళు దీర్ఘంగా నిట్టూర్చారు.
ఆ తరువాత వాళ్ళంతా అతణ్ణి తమ తమ ఇళ్ళకు రమ్మని పిలిచారు. అన్నపానీయాలతో సుష్టుగా విందుచేసారు. అతడట్లా అక్కడ చాలా రోజులే గడిపాడు. చివరికికొకనాడు వాళ్లనుంచి సెలవు తీసుకోడానికి సిద్దమైనప్పుడు వాళ్ళంతా అతడికొకటే మాట చెప్పారు: ‘ దయచేసి మా గురించి బయట ఎక్కడా చెప్పకు.’
అతడు అక్కణ్ణుంచి బయటకు వచ్చాడు. తన నావ తీసుకుని తిరిగి వచ్చినదారినే వెనక్కి మళ్ళాడు. అయితే దారి పొడుగునా గుర్తులు పాతాడు. తిరిగి తన ఊరికి చేరుకోగానే తమ స్థానిక ప్రభువును కలుసుకున్నాడు. తను చూసిందంతా చెప్పాడు. ఆ ప్రభువు తన మనుషుల్ని పిలిచి ఆ బెస్తవాడి కూడా వెళ్లమనీ, ఆ గుర్తుల్ని బట్టి ఆ లోకమెక్కడుందో చూసిరమ్మనీ పంపించాడు. వాళ్ళు వెళ్ళడమైతే వెళ్ళారుగాని, ఆ గుర్తులంతా కలగాపులగంగా కనిపించాయి. వాళ్ళెంతో తిరిగారుగాని ఆ దేశమెక్కడుందో జాడపట్టుకోలేకపోయారు.
అప్పట్లో నాన్యంగ్ లో లియు ఝిజి అనే గొప్పపండితుడుండేవాడు, ఈ సంగతెట్లానో అతడి చెవిన పడింది. అతడు తానా బెస్తవాడితో కలిసి ఆ ప్రపంచానికి దారి కనుక్కోగలనంటూ ముందుకొచ్చాడు. కానీ ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు, ఎందుకంటే అతడక్కడికిపోకముందే అనారోగ్యం బారినపడి తొందరలోనే చనిపోయాడు. ఇక ఆ తరువాత ఆ పాలపళ్ళ వాగుదారిన మరెవరూ ముందుకు పోలేదు.”
22-6-2013