పాతుమ్మా మేక, చిన్ననాటి చెలి

7

కొన్నేళ్ళ కిందటి మాట. డా.అబ్దుల్ కలాం ఆత్మకథని నేను తెలుగు చేసిన కొత్తలో, విజయవాడలో ఒకాయన ఆ పుస్తకం తీసుకుని ఎమెస్కో విజయకుమార్ ని నిలదీసాడట. ఎవరీ అనువాదకుడు, తెలుగు రాయడం కూడా సరిగా రాదే అని. ఎందుకంటే, అందులో ఒకచోట, నేను ‘బాల్యకాలం’ అనే మాట వాడానట. అది తెలుగూ కాదు, సంస్కృతమూ కాదు అన్నాడట ఆయన. ఆ మాట విజయకుమార్ నాతో చెప్పినప్పుడు నా హృదయం చిరుమందహాసం చేసింది. ‘పోనివ్వండి, వైక్కొం మహమ్మద్ బషీర్ కి ఎంత సంస్కృతం వచ్చో నాకూ అంతే సంస్కృతం వచ్చనుకుంటాను’ అన్నాన్నేను నా మిత్రుడితో.

కొన్ని పదాలూ,పదబంధాలూ అట్లాంటివి. అవి మనకి ఏ క్షణాన పరిచయమవుతాయోగాని మన హృదయంలో తిష్టవేసి కూచుంటాయి. పసితనపు అమాయకత్వం నవయవ్వనపు అమాయకత్వంగా మారే ఏ తొలిసంజవేళ చదివానోగాని బషీర్ నవలిక ‘బాల్యకాల సఖి’ నా హృదయం మీద పెట్టిన గాటు పచ్చిదనం ఏళ్ళు గడిచినా పోలేదు. ముప్పై ఐదేళ్ళు గడిచాయో, ముప్పై అరేళ్ళో- నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన ‘పాతుమ్మా మేక, చిన్ననాటి చెలి’ (1973) చదివి. మళ్ళా దొరకలేదు ఆ పుస్తకం ఎన్నిసార్లు చదవాలనుకున్నా. ఈ మధ్యకాలమంతటా ప్రతి మలుపులోనూ ఆ వాక్యం గుర్తొస్తూనే ఉండేది: ‘ఎలాగున్నావు సుహరా?’. నాకు తారసపడ్డ ప్రతి యువతిలోనూ ఆ సుహరాను వెతుక్కుంటూనే ఉన్నాను.

ఇన్నాళ్ళకు ఒక మిత్రుడు నాకోసం వెతికిపట్టి మరీ ఆ పుస్తకం సాఫ్ట్ కాపీ సంపాదించేడు. అతడికి అనేకవేల వందనాలు. ఇప్పుడందరూ తమకు నచ్చిన పుస్తకాల అట్టలు పరిచయం చేస్తున్నారు. నేను ఆ పుస్తకం ప్రతినే ఇక్కడ మీతో పంచుకుంటున్నాను. చదవండి. ఆధునిక భారతీయ సాహిత్యంలో అత్యంత విశిష్ఠుడైన ఒక రచయిత రాసిన రెండు నవలికలు ఇవి.

ఆ రచయిత మామూలు రచయిత కాడు. అందరూ తమ యవ్వనప్రాదుర్భావవేళ ఎవరో ఒక యువతితో ప్రేమలో పడితే, అతడు గాంధీజీతో ప్రణయంలో పడ్డాడు. పదహారేళ్ళ వయసులో వైక్కొం సత్యాగ్రహంలో మొదటిసారి గాంధీజీని చూసాడు. ఆయన చేతిని తాకాడు. ఆ స్పర్శ అతడి జీవితాన్ని మార్చేసింది. అప్పట్లో కొచ్చిలో సత్యాగ్రహం చేయడానికి అవకాశం లేకపోతే మలబారు వెళ్ళి ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్నాడు. జైలుకి వెళ్ళాడు. 1931 లో జైలునుంచి బయటపడగానే కేరళ వదిలిపెట్టి దేశమంతా సంచరించాడు. వంటవాడిగా, పేపర్ బాయ్ గా, పండ్లమ్మేవాడిగా, ఆటవస్తువులు అమ్ముకునేవాడిగా, లెక్కలురాసేవాడిగా, వాచ్ మేన్ గా, గొర్రెల కాపరిగా, హోటల్ మేనేజర్ గా, జ్యోతిష్కుడిగా,అతడు చెయ్యని పనిలేదు. హిందూ, సూఫీ సాధువులతో కలిసి తిరిగాడు.హిమాలయాలదాకా పర్యటించాడు. తిరిగి కేరళ వచ్చేటప్పటికి తండ్రి దివాలా తీసి ఉన్నాడు. కుటుంబం కుప్పకూలిపోయి ఉంది. మళ్ళా సత్యాగ్రహంచేసి కొట్టాయంలో అరెస్టయ్యాడు. రెండేళ్ళకు పైగా ట్రివేండ్రంలో జైలు శిక్ష అనుభవించాడు. అక్కడే, జైల్లో ఉండగానే, ‘బాల్యకాల సఖి’ రాసేడు.

1944 లో ప్రచురించబడ్డ, 75 పేజీలు కూడా లేని ఆ నవలిక, మళయాళ సాహిత్యాన్ని ఒక మలుపు తిప్పింది. ఆ రచనలో కొంత ఆత్మకథ కూడా ఉండి ఉండవచ్చు. దాన్ని కేరళ ముస్లిం జీవిత చిత్రణ అని కూడా రాసుకోవచ్చు. కాని, అది ఒక వ్యక్తికీ, ఒక ప్రాంతానికీ మాత్రమే పరిమితం చెయ్యలేని కథ. అది Paradise Lost లాంటి మహాకావ్యం. మనుషుల జీవితాల్లోని ఆ తొలిప్రేమ జీవితపు చివరిక్షణాలదాకా ఎట్లా వెలుగుతూ ఉంటుందో అపురూపంగా చిత్రించిన విషాదభరిత గీతం. ఆ కథ విషాదాంతమా? మీరే చెప్పాలి. దేవదాసులాగా, అందులో, మనుషులు ఓడిపోయి ఉండవచ్చు, కాని ప్రేమ ఓడిపోలేదు. ఆ ప్రేమనే లేకపోతే, ఆ నిష్టురజీవితం గురించి తలచుకోడానికి మనకు మరేమీ మిగిలి ఉండదనే బషీర్ చెప్తున్నాడని మనకి అర్థమవుతుంది.

సత్యాగ్రహం, జైలు, సంచారం ముగించి,అతడు తిరిగి, తన స్వగ్రామం తళయోళ పరంబు వచ్చేసాక, తనవాళ్ళ మధ్య జీవితం మొదలుపెట్టినప్పటి అనుభవకథనమే ‘పాతుమ్మా మేక’. కానీ ఈ నవలిక ఉల్లాసభరితమైన వాతావరణంలో కూచుని రాసింది కాదు. తర్వాతిరోజుల్లో అతడికి మతిస్తిమితం తప్పి రెండు సార్లు మానసిక చికిత్సాలయంలో గడపవలసి వచ్చింది. మొదటిసారి అసైలం లో గడిపినప్పుడు, చుట్టూ ఇరవైముప్పై మంది మానసికరోగులు తిరుగాడుతుంటే, ఆ గోల మధ్య రాసిన కథ అది. ఇది పూర్తిగా అతడి సొంత కథ. దీన్ని కూడా కేరళ ముస్లిం జీవితచిత్రణగా వర్ణించవచ్చు. కాని, ఈ కథ చదువుతున్నంతసేపూ మనకి మన కుటుంబసభ్యులే కనిపిస్తారు. బషీర్ ఫెమినిస్టు కాడు, కమ్యూనిష్టు కూడా కాడు. కాని, చూడండి, ఇటువంటి వాక్యాలు తన మనుషుల గురించి రాయగలిగిన రచయితని మనం ఏమని పిలవాలి?:

“..ఆరా తీసింతరువాత దీని వెనకాల వున్న రహస్యమొకటి బయటపడింది. అమ్మా, అన్నుమ్మా,కుంజానుమ్మా, ఐసోమ్మా-వీళ్ళల్లో ఏ ఒక్కరూ అన్నం తినరు. అసలు వీళ్ళకు అన్నం దొరకనే దొరకదు. వండిన అన్నమంతా మగవాళ్ళకు,పిల్లలకు మాత్రమే సరిపోతుంది. మిగిలినవాళ్ళంతా ఇలా ఉడికించిన టాపియోకా అనే కందమీదనే జీవిస్తారు. ఒక విధమైన కందమూలాన్ని ఎండబెట్టి నిలువబెడతారు, పదకొండుగంటల ప్రాంతంలో దీన్ని మెత్తగా దంచి పుట్టుగా చేసి తింటారు. పిడికెడు టీ ఆకును వేడి నీళ్ళల్లో వేసి, పంచదారవేసి పాలులేకుండానే ఆడవాళ్లంతా తాగుతారు. ఆ తరువాత వాళ్ళు పనిలో లీనమైపోతారు. ఆడవాళ్ళందరకూ ఎన్నో పనులుంటాయి. మగవాళ్ళంతా భోజనం సమయానికే ఇల్లు చేరుకుంటారు. కష్టాలన్నింటినీ భరించేది ఆడవాళ్ళే. ఇది కేవలం మా ఇంటి పరిస్థితి మాత్రమే కాదు. ఇక్కడి అన్ని మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఇలాగే ఉంటుంది, స్త్రీలు ఇంతగా కష్టపడుతూంటే పురుషులు ఎంత మాత్రం గ్రహించరెందుకో?” (పే.87)

ఈ సారి బషీర్ ని చదువుతుంటే నాకు రహమతుల్లా, సలీం, స్కైబాబా, అఫ్సర్, యాకూబ్, ఖాదర్, ఖదీర్ వంటి రచయితలంతా గుర్తొస్తున్నారు. వాళ్ళలో ప్రతి ఒక్కరూ ఒక బషీర్ కావాలన్నదే నా ఆశ.

15-3-2018

 

Leave a Reply

%d bloggers like this: