పసుపుపచ్చటిదుమ్ము

Reading Time: 3 minutes

r4

సంవత్సరమంతటిలోనూ అత్యంత సుందరభరితమైన కాలమేదంటే, ఫాల్గుణమాసంలో కృష్ణపక్షం రెండువారాలూ అంటాను. వసంత ఋతువు అడుగుపెట్టే ముందు ఆమె మువ్వల చప్పుడులాగా ఈ రోజులంతా గొప్ప సంతోషంతోనూ, అసదృశమైన శోభతోనూ సాక్షాత్కరిస్తాయి.

అట్లాంటి అపురూపమైన రోజులు నా ముందు తెరుచుకుంటున్న వేళ, The Spring of My Life and Selected Haiku (2013) చదవడం పూర్తిచేసాను. ప్రసిద్ధ జపనీయ హైకూ కవి కొబయషి ఇస్సా ‘ఒరగ హరు ‘అనే హైకూ డైరీతో పాటు అతడి కొన్ని హైకూలకి అనువాదం ఆ పుస్తకం.

ఇస్సా అంటే టీకప్పు అని అర్థం. హైకూని ఒక అజమరామరమైన కావ్యప్రక్రియగా మార్చిన నలుగురు సుప్రసిద్ధ కవులు, బషో, బూసా, షికి లతో పాటు ఇస్సా కూడా ఒకడు.

సాహిత్యం ఒక ఆధ్యాత్మిక సాధనగా జీవించాడు కాబట్టి, ఇప్పుడు ఇక్కడ నా రోజుల్ని వెలిగిస్తున్నాడుగాని, ప్రపంచంలో ఉన్న దుఃఖాన్నంతటినీ ఒక్క జన్మకే, ఒక్క మనిషికే మూటకడితే ఎట్లా ఉంటుందో, ఇస్సా గా కలం పేరు పెట్టుకున్న కొబయషి యతరో (1763-1827) జీవితమే ఒక ఉదాహరణ.

పుట్టి రెండేళ్ళు తిరక్కుండానే తల్లి మరణించింది. ఏడేళ్ళు తిరక్కుండా తండ్రి మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. సవతి తల్లి చేతుల్లో ఇస్సా నరకం చవిచూసాడు. సవతి తల్లి చివరికి అతణ్ణి ఇంటినుంచి గెంటేసింది. ఆ తర్వాత జీవితం చాలాకాలం పాటు దిమ్మరిగా తిరిగిన ఇస్సాని తన ఊరు, తన ఇల్లు కలలాగా వెంటాడేయి. నడివయసు దాటాక సవతితల్లితో రాజీ కుదిరింది. తన స్వగ్రామానికి తిరిగివచ్చాడు. పెళ్ళి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టారు, పిల్లవాడు నెలతిరక్కుండానే మరణించాడు. కూతురు పుట్టి ఏడాది తిరక్కుండా మరణించింది. మరొక ఇద్దరు కొడుకులు కూడా పుట్టిన వెనువెంటనే మరణించారు, భార్య కూడా మరణించింది. మళ్ళా పెళ్ళిచేసుకున్నాడు, కాని ఈసారి కాపరం నిలబడలేదు. అరవై నాలుగేళ్ళ వయసులో మూడో సారి పెళ్ళి చేసుకున్నాడు. కాని ఆ ఏడాదే అతడు జీవితమంతా ప్రేమించిన తన ఇల్లు తగలబడిపోయింది. ఆ ప్రమాదం మనసుమీద వదిలిన ముద్రల తడి ఆరకముందే అతడు కూడా తనువు చాలించాడు. అతడి మరణం తర్వాత అతడి భార్య ఒక పిల్లను ప్రసవించింది. తన సంతానంలో జీవించడానికి నోచుకున్న ఆ పుత్రికను కళ్ళారా చూడటానికి నోచుకోకుండానే అతడు ఈ లోకాన్ని వదిలిపెట్టేసాడు.

ఇంత దుఃఖపరంపర మధ్య అతడు ఇరవైవేల హైకూలు, కొన్నివందల తంకాలు, వచనరచనలూ చేసేడంటే అతడు జీవితాన్ని ఎంత ప్రేమించాడో ఊహించవచ్చు. ఆ అపారమైన జీవితేచ్ఛలో అతడు అత్యధికంగా ప్రేమించింది పూలనీ, పిట్టల్నీ, కప్పల్నీ, కీటకాల్నీ మటుకే. ఒకరోజు ఒక చిన్నకప్పమీద పెద్ద కప్ప విరుచుకుపడటం చూసాడట. అది చూస్తూనే అతడు చెప్పిన ఈ హైకూ జగత్ప్రసిద్ధం.

చిరుకప్పా
భయపడకు
ఇస్సా ఉన్నాడిక్కడ.

కొత్త సంవత్సరం రాబోతోందంటే పాత తప్పులు పునరావృతం కావనిగానీ, కొత్త తప్పులు కనిపెట్టమనిగానీ హామీ లేదంటాడు ఇస్సా. చేసిన పనులు, చేయని పనులు కూడా నన్ను చింతాక్రాంతుణ్ణి చేస్తున్న వేళ ఇస్సాని చదువుకోవడం కన్నా ధైర్యాన్నిచ్చే పని మరేముంటుంది!

అతడి హైకూలు కొన్ని, నా కోసం తెలుగు చేసుకున్నవి, మీ కోసం:

1

లోకమంతా వెతికి చూసాను
నిర్మలమైన మంచుబిందువు కనరాలేదు
చివరికి తామరాకుమీద కూడా.

2

కదలాడే ఒక తెమ్మెర
కనుగొంటే చాలు
ముళ్ళపొదలు కూడా అందమే.

3

తల్లిలేని పిల్లవాణ్ణిట్టే పోల్చుకోవచ్చు
ఒక్కడూ గుమ్మం దగ్గర
నోట్లో వేలు చీక్కుంటో.

4

చిన్నారి పిచుకలారా
ఇప్పుడు మీక్కూడా అమ్మలేదుకదా
రండి, కలిసి ఆడుకుందాం.

5

ఈ సంజెవేళ నింగిమీంచి
జాబిల్లిని తుంచితెమ్మని
మారాం చేస్తున్నది నా బిడ్డ.

6

పొద్దుపొయ్యేదాకా అరుస్తున్న కొంగలు
ఈ శీతల ప్రపంచానికి
ఏ దుప్పటి కూడా చాలదు.

7

(చనిపోయిన తన కొడుకుని తలుచుకుంటూ)

ఎంత దూరం పోయాడు
ఎక్కడ తిరుగాడుతున్నాడు
తూనీగల వెంటబడి?

8

సాయంకాల ప్రార్ధనకి ముండు
అ మెత్తని పచ్చికమీద నేనట్లానే
కూచుండిపోయాను చాలాసేపు.

9

(తన కూతురు మరణించిన నెలరోజుల తర్వాత, ఆమె సమాధి దగ్గర)

నువ్వెప్పుడూ కావాలని అడిగే
ఎర్రపువ్వు-
ఈ శీతాకాలపుగాలి.

10

మానవస్వభావం:
చంద్రుణ్ణి చూడ్డానికి వచ్చినవాళ్ళు
చంద్రుడికన్నా ముందే నిష్క్రమిస్తున్నారు.

11

ఈ అశాశ్వత ప్రపంచంలో
చివరికి ఈ పూర్ణచంద్రుడు కూడా
గ్రహణం సహించాలి.

12

కుప్పలు నూరుస్తున్న
పసుపుపచ్చటిదుమ్ములో ఆ చిమ్మెట
కనీసం ఒక నీడ పాటి కూడా కాదు.

13

ఇలా మంచుకరగడం మొదలవగానే
అలా పొంగిపొర్లుతాయి వీథులు
ఆడుకునే పిల్లల్తో.

14

కోరికల బరువంతా దింపేసుకున్నట్టు
ఏమి ఎగురుతోంది!
ఆ చిన్ని సీతాకోక.

15

మహాకవి సైగ్యో లాగా
కూచుని పాటలు పాడుతున్నది
ఈ బక్కచిక్కిన కప్ప.

16

దీర్ఘతీర్థయాత్ర చేసి అలిసిపోయినట్టు
ఆ గుడిముంగిట్లో
ఆగి చూస్తున్న పిచుక.

17

సుతారంగా గాల్లో తేలింది
సీతాకోక- నా వంటిమీద
యుగాలుగా పేరుకున్న దుమ్ము.

18

పూలకుండీదగ్గర
సీతాకోక చిలుకవింటున్నది:
నిజమైన బౌద్ధ దర్శనం.

19

తదియచంద్రుడు
చల్లటి ఈ వసంతరాత్రి
కూడా వంకరతిరిగింది.

20

పొద్దున్నే తెల్లవారుతూనే
నిశ్శబ్దంగా రాలిపడ్డ
ఒంటరి ఆకు.

21

ప్రకాశభరితంగా చంద్రుడు
ఏం ఇవ్వాళ నువ్వు కూడా
పనిలో కూరుకుపోవాలా?

22

అమ్మా, సముద్రాన్ని చూసిన ప్రతిసారీ
నిన్ను తలుచుకుని ఏడుపొస్తుంది,
సముద్రాన్ని చూసిన ప్రతి సారీ.

23

నా స్వగ్రామమా
ఇల్లు గుర్తొచ్చినప్పుడల్లా
ముల్లు గుచ్చుకుంటుంది.

24

కనుచూపుమేరకి ఆవల
నన్ను కన్న ఊరు
కాని కోకిలపాడేదక్కడే.

25

ఆ తూనీగ కనుపాపల్లో
దూరపర్వతశ్రేణి
ప్రతిబింబాలు.

26.

ఆ ఈగని చంపకు
చూడది చేతులు జోడించి
ఎట్లా వణికిపోతోందో.

27

ఈ ప్రపంచం నడుమ
పూలని చూస్తూ మటుకే
మనం నరకం దాటుతున్నాం.

28

ఎన్ని దోమకాటులో
కాని అందమైన ఆమె చర్మం మీద
అవి కూడా అందంగా ఉన్నాయి.

29

ఓ నత్తా, కొనసాగించు ప్రయాణం
ఫ్యూజీ శిఖరాగ్రానికి
నెమ్మదిగా,నెమ్మదిగా.

30

పూలు పూసిన చెట్టు
ఈ రోజు నరకాగ్నులన్నిటికీ
సెలవు ప్రకటించారు.

31

ఈ లోకంలో కీటకాలకి కూడా
ఇది వర్తిస్తుంది:
కొన్ని బాగా పాడతాయి, కొన్ని పాడలేవు.

32

అడుగు కన్నీళ్ళతో, నిజమేనా-
పూలు కూడా నేలరాలతాయా
నేలమీద రాలిపడుతుంటాయా.

33

పచ్చనిచెట్లనీడ
సీతాకోకచిలుకతో సేదతీరుతో-
ఇది కూడా కర్మకలాపమే.

34

దుఃఖమే, వేదనాభరితమే
అయితేనేం, ఆ ముసలి చెర్రీ కూడా
ఎట్లానో పూలు పూసింది.

35

చివరికి నేను మరణించాక
గొల్లభామా, నువ్వు
నా సమాధి చూసుకుంటావు కదా.

6-3-2018

%d bloggers like this: