పల్లెలో మా పాత ఇల్లు

33

కొత్త ఇంట్లో పుస్తకాలు సర్దుకుంటూండగా ఇస్మాయిల్ గారి ‘పల్లెలో మా పాత ఇల్లు’ (2006) కనబడింది. ఆదివారం తీరికదనంలో ఆ కవిత్వం నెర్రెల్లోకి నీళ్ళు పారినట్టు సూటిగా లోతుగా చొరబడిపోయింది.

ఇస్మాయిల్ గారి తక్కిన పుస్తకాలకీ దీనికీ తేడా ఇందులో ఆయన అనువాదాలూ, సొంత కవితలూ కూడా కలిసిఉండటం. ఆయన ప్రపంచ కవుల కవితలు కొన్నిటికి చేసిన అనువాదాలు ‘రెండో ప్రతిపాదన’ పేరిట ఒక పుస్తకం తీసుకొచ్చారు. అందులో ప్రధానంగా ఉన్నదంతా యూరపియన్ కవులు.ఈ అనువాదాల్లో అయిదు మటుకే యూరపియన్ కవితలు. తక్కినవాళ్ళంతా ఆరబ్, లాటిన్ అమెరికన్, భారతీయ కవులూ, జపాన్ తంకా కవులూను.

ఈ కవితలు రాసినప్పుడు ఆయన కాకినాడలో వలసపాకలో ఒక అద్దె ఇంట్లో ఉండేవారు. టు టౌన్లో లచ్చిరాజు వీథిలో ఉండే తండ్రితాతల ఇల్లు వదులుకుని ఆ ఊళ్ళోనే ఊరిచివరికి ప్రవాసిలాగా వెళ్ళిపోక తప్పని జీవీతం నుంచి వచ్చిన కవిత్వం. ఆ రోజుల్లోని ఏకాంతాన్నీ, ఏకాకితనాన్నీ ప్రతిఫలించిన కవిత్వం. ఇంకా చెప్పాలంటే ఆయన తన జీవితంలో పూర్తిగా పండిపోయిన తర్వాత వచ్చినకవిత్వం. ఆయన రాసిన హైకూలూ, తంకాలూ, అనువాదం చేసిన కవితలూ అన్నీ ఒక్కలానే పండుజామపండు వాసన వేస్తూ ఉన్నాయి.

ముందు ఆయన కవితలు:

ముందొక తంకా. తంకా అంటే జపనీయ ఛందస్సు. 5/7/5/7/7 మాత్రల్లో ఉండే అయిదు పాదాల కవిత. జపనీయ మొదటి కవితాసంకలనం మన్యోషూ రోజులనుండి ఇప్పటిదాకా కూడా ఈ ఛందస్సు ప్రాచుర్యం చెక్కు చెదరలేదు. ఇప్పుడూ ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీషులోనూ ఇతరభాషల్లోనూ కూడా తంకాలు రాస్తున్న కవులు విరివిగా ఉన్నారు. ఆసక్తి ఉన్నవాళ్ళు www.tankaonline.com,www.americantanka.com లాంటివి చూడవచ్చు.

ఇస్మాయిల్ గారికి తంకాలోని సారళ్యం, సున్నితత్త్వం బాగాపట్టుబడ్డాయి. ఈ కవిత చూడండి:

ఈ బోగెన్ విలియా
ఎర్రటి నినాదాల్ని
విప్లవకవిలా విరగబూసింది
ఐనా, ఒక్క పిట్టైనా
దీనిపై వాలదు.

ఇక హైకూని తెలుగు ఛందస్సుగా మార్చేసిన యశస్సు ఇస్మాయిల్ గారిదే. ఈ హైకూలు చూడండి:

ఊరినిండా తమాలద్రుమాలు
ఐతే రాధాకృష్ణుల బదులు
బ్యాంకు క్లర్కులు

తమాల ద్రుమమంటే కానుగ చెట్టు. కృష్ణభక్తి సాహిత్యంలో కానుగచెట్టు ఒక కవిసమయం. గీతగోవిందమూ, బేంగాలీ కృష్ణభక్తిగీతాలూ చదువుకున్నవాళ్ళకి వానలో తడిసే కానుగచెట్టుని చూస్తే చెప్పలేని సున్నితమైన సంవేదన కలుగుతుంది. సమకాలిక ప్రపంచంలో ఆ కవిసమయం మీద ఎంట దుమ్ము పడిందో ఈ మూడు మాటల్లో ఆయన అద్భుతంగా చెప్పారు.

చీకట్లో మెరిసే
వింతకీటకం:
ఫెర్టిలైజర్ ఫాక్టరీ

కాకినాడ శివార్లలో సముద్రపొడ్డున ఏర్పాటయిన ఎన్.ఎఫ్.సి.ఎల్ ఫాక్టరీ వలసపాక దగ్గర్లోనే ఉంది. చీకటిపడ్డాక కవి కోరుకునే సుందరదృశ్యాల స్థానంలో ఇప్పుడు రోజూ కనిపించేది ఆ ఫెర్టిలైజర్ ఫాక్టరీ మటుకే. ‘వింత కీటకం’ అన్న ఆ ఒక్క మాటలో ఆయన తన సాయంకాలాల సంఘర్షణనంతా కుక్కిపెట్టారు.

ఇందులో అనువాదాలు చాలా తాజాగా చాలా కొత్తగాలి పోస్తున్నట్టున్నాయి. కొన్నింటి పదును ఎంతగా ఉందంటే చదవగానే కత్తిలాగా కస్సున గుండెలో దిగబడ్డాయి.

మహమూద్ దర్వేష్ కవిత ‘మూడో గీతం’ చూడండి:

మట్టితో నా పద్యాలు
మలచిన రోజున
పచ్చని చేలకి స్నేహితుణ్ణి

తేనెగా నా పద్యాలు
మారిన రోజున
మూతిపై ఈగలు వాలాయి.

అట్లానే జపనీయ కవయిత్రుల తంకాలూ, హైకూలూ కూడా.

నొబు కొ కొట్సుర రాసిన హైకూ:

ఇబ్బంది పెట్టే
పాలిండ్లు-
దీర్ఘవర్షాకాలం

జపాన్ కవయిత్రి పేరులేకపోతే దీన్ని గాథాసప్తశతి కవిత అనే అనుకుంటాం.

ప్రాచీన కవిసమయాలూ, ఆధునిక జీవితం పరిచే దుమ్మూ కలగలిసే చోట ఏరుకునే కవితలు నన్నెప్పుడూ విభ్రాంత పరుస్తుంటాయి. కింకో ఇతమి రాసిన ఈ హైకూ చూడండి:

రేవులో సాయంకాలం-
స్టీలూ-పూలు
కలిసిన వాసన.

ఐ ఐకిత్సు రాసిన ఈ తంకా చదవగానే ఊపిరి ఒక్కసారి ఆగిపోయింది:

స్నానమయ్యాక
ఆవిరి విడిచే రొమ్ముల్ని
ఆత్మకు మల్లే
జాగ్రత్తగా
తుడిచాను

అట్లానే అమరి హయషి రాసిన ఈ తంకా కూడా:

రుతుకాలంలో
రతిక్రీడ-
రక్తం మరకల కేసి
చూస్తూ ఉండిపోయాం

ఇట్లాంటికవితే గాథాసప్తశతిలో కూడా ఉంది.

యూకొ కవనో రాసిన ఈ తంకా:

అప్పుడే కోసిన
పొద్దుటి పచ్చగడ్డి
పరిమళంతో వచ్చావు-
నా చనుమొనలు
గరుపారుతున్నాయి

కవులు శతాధిక గ్రంథాలు రాయనక్కర్లేదు, శతాధికంగా కవితలూ రాయక్కర్లేదు. బతికిన కొన్ని క్షణాలూ నిండుగా గాలిపీల్చి బతికితే చాలు, ఇస్మాయిల్ గారి లాగా.

23-11-2014

Leave a Reply

%d bloggers like this: