నూరు పువ్వులు వికసించనీ

79

కవిత్వం ఇలానే రాయాలని ఎప్పటికీ ఎవరికీ చెప్పలేం. కవిత్వం లీగల్ డాక్యుమెంటు కాదు, రాజకీయ పార్టీలు సమావేశాలు అయిపోయిన తర్వాత బయట మీడియా పాయింట్ దగ్గర ప్రెస్ కి వివరించడంకోసం రాసిపెట్టుకునే ప్రెస్ నోట్ కాదు. కవిత్వంలో ఆచి తూచి పదాలు వాడతాము కానీ, అది వేరే తరహా ‘మెమొరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్’. కవిత్వం ఒక మనిషి తన వ్యక్తావ్యక్తాల్ని రెండు చేతుల్తోనూ బాలన్స్ చేసుకునే ప్రక్రియ. అందులో అజ్ఞాతమానసంలో ‘శిశువు చిత్రనిద్రలో ప్రాచీన స్మృతులూచే చప్పుడు’ తో పాటు జాగ్రదావస్థకు చెందిన సామాజిక, సామూహిక ఆదర్శాలదాకా అన్నీ ఉంటాయి. ఒక కవి కవిత రాయడానికి పూనుకున్నప్పుడు, ‘నువ్వీ పదం రాయకూడదు’, ‘ఈ సంకేతం వినిపించకూడదు’ అని అడ్డుచెప్పడం నిషిద్ధాక్షరిలో మాత్రమే శోభించే చర్య. ఒక కవితని పదే పదే పఠనీయం చేసేది ఆ ‘జననాంతర సౌహృదాల’ సున్నితమైన సంవేదనలే. కవి తానెంచుకునే శబ్దాల్లో ఆ సూక్ష్మలోక ఛాయలే లేకపోతే, తన ప్రతి పదాన్నీ డెట్టాల్ లో ముంచి తేల్చడం మొదలుపెడితే, కవిత్వం ఔషధ లక్షణాన్ని పోగొట్టుకుని మందుల చీటీగా మిగిలిపోతుంది.

కవిత్వ శైలి ఇలానే ఉండాలన్న నియమం కూడా ఏదీ లేదు. ఎవరి కవిత్వ ధోరణి వారి సంతకం లాంటిది. మనం ఎవరినీ వాళ్ళ సంతకం ఇలానే ఉండాలని ఎలా నిర్బంధించలేమో, వాళ్ళ కవితాధార కూడా ఇలానే ఉండాలని చెప్పలేం. ఒక కవి, తిక్కనలాగా, అల్పాక్షరాల్లోనే అనల్పార్థ రచన చెయ్యగలుగుతాడు. మరొక కవి, శ్రీనాథుడిలాగా, ధారాధుని గా కవిత్వం చెప్తాడు. కవిత్వం రాస్తే ఇస్మాయిల్ లాగా రాయాలనే నేను చాలాకాలం పాటు భావించాను. కాని ఆ అభిప్రాయం తప్పని నెమ్మదిమీద అర్థమయింది. ఒక కవి కవిత సుదీర్ఘంగానూ, వక్తృత్వసదృశంగానూ ఉండవచ్చు, అయితే ఏమి? అది అతడి హృదయంలోంచి సూటిగా నిజాయితీగా బయటకి వస్తున్నంతకాలం, నజీం హిక్మత్ లాగా, పాబ్లో నెరుదా లాగా, అది ప్రజాహృదయాల్ని స్పందింపచేస్తూనే ఉంటుంది.

పది మంది ఆదరించారు కాబట్టి ఒక కవితని గొప్ప కవిత అనలేం. బ్రిటిష్ సామ్రాజ్యం మీద సూర్యుడు అస్తమించని రోజుల్లో టెన్నిసన్ కవిత్వానికి తిరుగులేదు. కాని ఈ రోజు అతణ్ణి జనాదరణకు నోచుకున్న కవిగా మాత్రమే పరిగణిస్తున్నారు. విలియం బ్లేక్ ని అతడి జీవితకాలంలో మహాకవిగా ఎవరూ పరిగణించలేదు. కాని ఈ రోజు అతణ్ణి ఒక విజనరీగా, పాత నిబంధన ప్రవక్తలతో సమానమైన ఋషిగా పరిగణిస్తున్నారు. పదిమంది పట్టించుకోలేదు కాబట్టి ఒక కవి కవిగా విఫలమయ్యాడని అనలేం. ప్రాచీన చైనా మహాకవి దు-ఫూ గురించి ఈ మధ్య ఎక్కడో చదివాను, అతడి జీవితకాలంలో అతడి కవిత్వం ఒకటి రెండు సంకలనాలకన్నా మించి ఎక్కలేదట. కాని, ఈ రోజు చైనా సాహిత్యచరిత్రలోనే అతడు హిమాలయశిఖరంగా పరిగణించబడుతున్నాడు.

ఒక కవిత వినగానే మనకు అది కవిత్వం అవునో కాదో తెలిసిపోతుందని కూడా చెప్పలేం. మార్క్సిస్టులు చెప్పేట్టుగా ప్రతి కవికీ ఒక వర్గం ఉంటుంది, కాదనలేం. అయితే ఆ కవికి వర్గ స్పృహ ఉన్నా, లేకపోయినా, ఆ కవిత్వంలో ఆ వర్గలక్షణాన్ని మనం పట్టుకోవడం ఏమంత కష్టం కాకపోవచ్చు. ప్రతి కవీ తనకు తెలియకుండానే తన కవితలో తన కాలాన్ని లిఖిస్తూనే ఉంటాడు. కాని, ఒక కవిత మహాకావ్యం కావాలంటే మటుకు, ఆ కవి తన వర్గ స్పృహను దాటి కవిత్వం చెప్పవలసి ఉంటుంది. ఒకప్పుడు తాంగ్ వంశ కాలంలో భూస్వామ్య, పాలక వర్గాని చెందిన కవి అయినప్పటికీ బై-జుయి సామాన్యప్రజల స్థిగతులమీద కవిత్వం చెప్పగలిగినందువల్లనే ఆయన్ను నేడు మహాకవిగా పరిగణిస్తున్నాం. ఒక రాజు రాసిన కవిత అయినప్పటికీ, వానాకాలపు పల్లెటూళ్ళు ఎలా ఉంటాయో వర్ణించగలిగింది కాబట్టే ఆముక్తమాల్యద పునఃపునః పఠనాలకు నోచుకుంటున్నది.

కవికి ఉన్నట్టే పాఠకుడికి కూడా తీవ్ర పరిమితులుంటాయి. మనకి కొన్ని కవితలు నచ్చుతాయి, కొన్ని నచ్చవు. కొన్నిట్ని బిగ్గరగా పదిమందీ వినేట్టు చదువుతుంటాం, కొన్ని లోపల్లోపలనే తలుచుకుంటూ ఉంటాం. కాని మనకు నచ్చేది మాత్రమే కవిత్వం, తక్కింది కాదనుకోవడం, మనకు నచ్చే వంట మాత్రమే నిజమైన ఆహారం అనుకోడం లాంటిదే. చిన్నప్పుడు మనం మన ఇంట్లో పెరుగుతున్నప్పుడు మన ఇంట్లో మనకి తెలిసే జీవనవిధానం ఒకటే ఉంటుంది. మనం బడికి వెళ్ళాక, మనకన్నా భిన్నమైన వేషభాషలు, ఆహారపు అలవాట్లు, పద్ధతులు ఉన్న పిల్లలు కనిపించగానే ఒక కుదుపుకి లోనవుతాం. ఆ తర్వాత మన ఊళ్ళో ఉన్న చిన్న బడి దాటి హైస్కూలు వెళ్ళినప్పుడు మరింత పెద్ద కుదుపుకి లోనవుతాం. ఇక పై చదువులకోసం దేశాంతరాలకీ, ఖండాంతరాలకీ వెళ్ళే కొద్దీ ఈ culture shock మరింత తీవ్ర తరంగా ఉంటుంది. కాని, విద్య పరమప్రయోజనం ఇక్కడే ఉంది. అది ఈ ప్రపంచం అంటే నువ్వు మాత్రమే కాదనీ, నీకన్నా వేరేలా ఉండే ఇతరులు కూడా ఇక్కడుంటారనీ, వాళ్ళని అంగీకరించడం నేర్పడమే. నీ self ని దాటి నువ్వు other ని అంగీకరించగగలగడమే విద్య. ఆ అవగాహన రానంతకాలం ఆ చదువు చదువుకానే కాదు.

ఒకప్పుడు ప్రతి మతంలోనూ ఎంతో అత్యున్నత ఆదర్శాలు వికసించాయి. కాని, తమ మతానికి చెందని వాళ్ళు కనిపించగానే వాళ్ళ మతాదర్శాలన్నీ గాలికెగిరిపోయాయి. తమలాగా జీవించనివాళ్ళని హిందువులు ‘మ్లేచ్ఛులు’ అని పిలిచారు. తమ లాగా ప్రార్థించనివాళ్ళని ముస్లిములు ‘కాఫిర్లు’ అన్నారు. తమలాగా కనిపించనివాళ్ళని యూదులు, క్రైస్తవులు ‘జెంటైళ్ళు’ అన్నారు. (విశ్వనాథ సత్యనారాయణ రాసిన ‘పురాణవైర గ్రంథమాల’ చదివి, ఆ మత్తులో, నేను మ్లేచ్ఛులనే పదం వాడినప్పుడు, మా హీరాలాల్ మాష్టారు నన్ను మందలించడం నేనెప్పటికీ మర్చిపోలేను). తమలాగా జీవించని ప్రతి ఒక్కరినీ భౌతికంగానో, మానసికంగానో నిర్మూలించడానికి ప్రయత్నించే ఈ ఛాందసత్వం నుంచి మతాలైనా ఏదో ఒక మేరకు బయటపడ్డాయిగానీ, సిద్ధాంతాలింకా బయట పడటం లేదు. నీలాగా ఆలోచించని ప్రతి ఒక్కడూ నీ దృష్టిలో ఒక ద్రోహి, ఒక శత్రువు. నీలాగా ఆలోచించని వాడు రాసేది కవిత కాదని భావిస్తుంటే నీకూ మధ్యయుగాల మతోన్మాదికీ మధ్య తేడా ఏమున్నది మిత్రమా!

నీలాగా జీవించనివాణ్ణి నువ్వు మనిషి కాదనుకుంటున్నావంటే నువ్వింకా విద్యావంతుడివి కాలేదనే అర్థం. ఇంకా నువ్వు ఇంటిభాషకీ, బడిభాషకీ మధ్య నలుగుతున్నావనే అర్థం. దాన్నుంచి బయటపడితేనే నీ చదువు ముందుకు సాగుతుంది.

‘నూరు పువ్వులు వికసించనీ, నూరు ఆలోచనలు సంఘర్షించనీ ‘.

అందరూ ఒక్కలానే అనుభూతి చెందితే, ఒక్కలానే ఆలోచిస్తే ఈ ప్రపంచానికీ, యంత్రానికీ తేడా ఏముంటుంది? అందుకనే మహాత్ముడు అన్నాడు:’యంత్రంతో నిర్మించబడ్డ వృక్షం ఎలా ఉంటుందో నేనూహించగలను, దాని ఆకులన్నీ ఒక్కలానే ఉంటాయి’ అని.

30-3-2018

Leave a Reply

%d bloggers like this: