నువ్వు చెప్పుకునే ప్రతి కథా 

15

రూమీ గురించి నేను రాసిన నాలుగు మాటల్నీ మిత్రులు ఎంతో ఇష్టంతో చదవడం నాకు చాలా సంతోషానిచ్చింది. ముఖ్యంగా గోపరాజు వెంకటరమేష్ గారి ప్రతిస్పందనకి నేను కైమోడ్చకుండా ఉండలేకపోయాను. అయితే ఆయన రూమీ మాట్లాడిన ప్రేమ మనుషులకే పరిమితమా, తక్కినవాటికి అందులో చోటులేదా అనడిగారు.

ఇందుకు రూమీనుంచే కొన్ని వాక్యాలు ఎత్తిరాస్తాను. Signs of the Unseen లో ఆయనిలా అంటున్నాడు:

‘నువ్వెటు చూస్తే అటు భగవంతుడి ముఖం గోచరిస్తుంది’ అంటున్నది కొరాన్ (2:115). ఆ వదనం నిత్యం,నిరంతరం, నిరాఘాటం. నిజమైన ప్రేమికులు చూడాలనుకునేది ఆ వదనాన్నే. వాళ్ళు మరింకేదీ చూడాలనుకోరు. తక్కినవాళ్ళింకా జంతుస్థాయిలోనే ఉండిపోయినట్టు. అలాగని వాళ్ళు నిరాదరణీయులు కారు… ఏ ఉనికీ లేని స్థితినుంచి వాళ్ళని ఖనిజస్థితికి , ఖనిజ స్థితినుంచి వృక్షస్థితికి, వృక్షస్థితినుంచి జంతుస్థితికి, జంతుస్థితినుంచి మానవత్వస్థితికీ, మనుష్యస్థితినుంచి దేవదూతలస్థాయికి అట్లా అనంతసోపానక్రమంలో ఆయన తీసుకుపోగలడు. ఇన్ని రకాల స్థితుల్ని ఆయన ఎందుకు కల్పించాడంటే, మొదటిది ఇన్ని స్థితులున్నాయని నీకు తెలియడానికీ, రెండవది, ఒక స్థితికన్నా మరొకటి ఉత్తరోత్తరా మరింత ఉదాత్తమైందని నువ్వు గ్రహించడానికీ..’

నువ్వెటు చూస్తే అటు భగవంతుడి వదనమే గోచరిస్తుంది కాబట్టి ఎవరికైనా ఇది లభ్యమే. కాని, కావలసిందల్లా నేరుగా దాన్ని చూడగలిగే శక్తి. మన చుట్టూ ఆ దివ్యాస్తిత్వం కనిపిస్తున్నప్పటికీ మనం మధ్యవర్తులకోసం వెతుకుతున్నామని రూమీ ఆవేదన. మనం నేరుగా పొందవలసిన ఆ అనుభూతి, వేదాంతుల మాటల్లో ‘అపరోక్షానుభూతి’, దాని గురించే ఒక కవితలో ఇలా అంటున్నాడు:

నువ్వు చెప్పుకునే ప్రతి కథా

నువ్వు చెప్పుకునే ప్రతి కథా
నువ్వు స్నానానికి కాచుకున్న
వేణ్ణీళ్ళాంటిది.

అది నిప్పుకీ, నీ చర్మానికీ మధ్య
సందేశాన్ని మోసుకొస్తుంది
ఆ రెంటినీ కలుపుతుంది
నిన్ను కడిగేస్తుంది.

జ్వాలామధ్యంలో
కూచోగలిగింది
అబ్రహాములాగా, అగ్నిసరీసృపంలాగా
ఎవరో ఒకరిద్దరుమాత్రమే,
మనకి మధ్యవర్తులు కావాలి.

మనకి కూడా అప్పుడప్పుడు
సంతృప్తికలగకపోదు
కాని రొట్టె మన ఆకలితీర్చినప్పుడే
మనకి తెలుస్తుందది.

సౌందర్యం మనచుట్టూతానే ఉంది
కాని దాన్ని చూడాలంటే
తోటలోకి పోవాలనుకుంటాం.

నీ అస్తిత్వంలో ప్రజ్వరిల్లే కాంతి:
ఈ దేహముందే, ఇది కొన్ని సార్లు
దాన్ని మరుగుపరుస్తుంది
కొన్నిసార్లు బయలుపరుస్తుంది.

నీళ్ళు, కథలు, దేహాలు-
మనం చేసేదంతా
మనలోదాగిఉన్నదాన్ని
బయటికి చూపుకునే
మాధ్యమాలు మాత్రమే.

పరిశీలించు:
తెలుస్తూ, తెలియకుండా పోతున్న
ఆ రహస్యం నిన్ను కడిగేస్తుంటే
నిలువెల్లా పులకరించు.

16-8-2013

Leave a Reply

%d bloggers like this: