రమణా సుమనశ్రీ అవార్డు

Reading Time: 2 minutes

113

26 సాయంకాలం గోల్డెన్ త్రెషోల్డ్ ప్రాంగణంలో ప్రసిద్ధ కవి, ఆత్మీయమిత్రుడు సుమనశ్రీ కె.శివారెడ్డి ఇటీవలి కవితాసంపుటి ‘గాథ’ కీ, నా కవితా సంపుటం ‘నీటిరంగుల చిత్రం’ కీ రమణా సుమనశ్రీ అవార్డులు అందించాడు.

ఆ సత్కార సమావేశానికి మరొక ప్రసిద్ధ కవి, భావుకుడు దీవి సుబ్బారావుగారు అధ్యక్షత వహించారు. శివారెడ్డి కవిత్వం మీద సుధామ, నా కవిత్వం మీద కె.బి.లక్ష్మి ప్రసంగించారు.

నేను రోజంతా సెక్రటేరియట్ లో ఏదో సమావేశానికి నోట్సు తయారుచెయ్యడంలో కూరుకుపోయి, రాత్రి ఏడున్నరకి ఒక గంట సమయం ఎట్లానో చిక్కించుకు మరీ ఆ సమావేశానికి వెళ్ళాను. పుష్యమాసపు నెలవంక ఇంకా ఆకాశంలో మెరుస్తూనే ఉన్నాడు. భారతకోకిల నడయాడిన ఇల్లు. ఒక కవిమిత్రుడు తన తోటి కవులిద్దరిని సత్కరించడానికి ఉవ్విళ్ళూరుతున్నాడు.

సత్కారానికి నా స్పందన చెప్పడానికి మైకు అందుకోగానే చాలా చాలా భావాలు తుమ్మెదల్లా నా మనసంతా ఝుమ్మన్నాయి.

పుస్తకం విడుదలై ఏడాది కూడా కాకుండానే ఒక కవిమిత్రుడి ఆత్మీయ సత్కారానికి నోచుకోవడమే ఎంతో సంతోషం. ఇక శివారెడ్డిగారితో సమానంగా ఆ గౌరవం అందుకోవడం మరింత ఆనందాన్నిచ్చింది.

‘నీటిరంగుల చిత్రం’ లో కవితలు గత అయిదేళ్ళ కాలంగా రాస్తూ వచ్చినవి. ఒక రకంగా చెప్పాలంటే అంతకు పూర్వం నేను రాసిన కవిత్వమంతా పూర్వకవుల కవిత్వ ఛాయలో రాసింది కాగా, ఈ కవిత్వంలో నన్ను నేను వెదుక్కునే ప్రయత్నం చేసాను. ఆ ప్రయత్నంలో, ఆ ప్రయోగాల్లో ఉన్న ముఖ్యాంశాల్ని ఆ పుస్తకంలో చివర ఆదిత్య కొర్రపాటి చేసిన ఇంటర్వ్యూలో వివరంగా చెప్పాను. అయినా ఆ సాయంకాలం నా ఎదట ఉన్న శ్రోతలకోసం మళ్ళా ఆ సారాంశాన్ని మూడు మాటల్లో చెప్పడానికి ప్రయత్నించాను.

మొదటిది, కావ్యశిల్పానికి సంబంధించి. తెలుగు కవిత్వం ప్రధానంగా రీతికవిత్వం. ధారాళంగాను, ధారాప్రవాహంగానూ, వర్ణనాత్మకంగా,సంబోధనాత్మకంగా, ప్రబోధనాత్మకంగా ఉండే కవిత్వంతో తెలుగువాళ్ళు ఎక్కువ మమేకమవుతారు. పోతన, శ్రీనాథుడు, నన్నయ, శ్రీశ్రీ, శివారెడ్డి ఆ తరహా కవులు. దానికి పూర్తిగా అవతలిదిక్కున ఉండేది ధ్వనిప్రధాన కవిత్వం. గాథాసప్తశతి, హైకూ, ఇస్మాయిల్ ఆ తరహా కవులు. నేను ఆ రెండు కవిత్వాలకు మధ్యేమార్గంగా ఉండే కవిత్వం కోసం ‘నీటిరంగుల చిత్రం’ లో ప్రయత్నించాను. దానికి ముఖ్యంగా మెటఫర్ మీద ఆధారపడ్డాను. అలంకారం కవిత్వానికి ప్రాణమని భామహుడి కాలంనుంచీ భావించినప్పటికీ, ప్రాచీన అలంకారాలకీ, modern metaphor కీ తేడా ఉంది. Modern metaphor రెండు సాదృశ్యాల్ని పోల్చడం కాకుండా రెండు విరుద్ధ జీవితసన్నివేశాల మధ్య సాదృశ్యాన్ని చూడటానికి ప్రయత్నిస్తుంది. ఇది ప్రాచీన కవులు కూడా చెయ్యకపోలేదు. ఉధాహరణకి వాల్మీకి లంకానగరాన్ని వర్ణిస్తూ ‘యంత్రాగార స్తనీ, కోష్టాగార అవతంసికా’ అంటాడు. తెనాలి రామకృష్ణుడు నిగమశర్మ గురించి రాస్తూ ‘వేదముల్ పోసిన గాదె’ అంటాడు. కాని ప్రాచీన కవిత్వప్రశంస వాటిమీద దృష్టి పెట్టలేదు. కాని ఆధునిక ప్రపంచం అట్లాంటి మెటఫర్లముందే మోకరిల్లుతుంది. అట్లాంటి మెటఫర్ల కోసం తపసు చేస్తే వచ్చిన కవితలు నీటిరంగుల చిత్రం కవితలు.

రెండో అంశం, అట్లాంటి మెటఫర్లకు కావలసిన పదచిత్రాలనూ, పదసామగ్రినీ నా చుట్టూ ఉండే దైనందిన జీవితంలోంచి, ముఖ్యంగా నగరజీవితంలోంచి పట్టుకునే ప్రయత్నం చేసాను. ఒకప్పుడు మధ్యయుగాల్లో కబీర్ ఇట్లాంటి ప్రయత్నం చేసాడు.

ఇక మూడవ అంశం, ముఖ్యమైన అంశం, ఆదిత్య తన ప్రశ్నల్లో ఎత్తిచూపి బహిర్గతం చేసిన అంశం, నా కవిత్వం వెనక బలంగా పనిచేస్తున్న భారతీయ భక్తికవుల పరంపర. కవిత్వరసాస్వాదనకు సంబంధించినంతవరకూ భారతీయ భక్తికవులు పండితపామర భేదాన్ని తుడిచిపెట్టేసారు. ప్రాచీన తమిళ కవిత్వమూ, సంస్కృత కవిత్వమూ కూడా సుశిక్షితుడైన శ్రోతని కోరుకున్నాయి. కాని ప్రాకృతకవిత్వం ఆ పరిమితినుంచి బయటపడింది. ఆ దారిలో మరాఠీ భక్తికవులూ, హిందీ సంత్ కవులూ, బెంగాలీ వైష్ణవ కవులూ ప్రజాహృదయాల్లోకి సూటిగా చొచ్చుకు పోగలిగారు. కాని వారి దేవుడు సాకారమూర్తి. ఆ దేవుణ్ణి ఒక విగ్రహంలో కాకుండా జీవితం వికసించిన ప్రతితావులోనూ పసిగట్టడానికి ప్రయత్నించి టాగోర్ ఆధునిక భారతదేశానికి మహోపకారం చేసాడు. కాని టాగోర్ కవితలో భగవంతుడింకా నిరాకారుడిగానే అయినా ఒక ఉనికిగా కొనసాగుతూనే వచ్చాడు. నేను మరొక అడుగు ముందుకేసి నేను authentic గా ‘బతికిన’ ప్రతి క్షణంలోనూ భగవంతుణ్ణి సందర్శించి, ఆయన్ని ఒక సగుణ లేదా నిర్గుణ మూర్తిగా కాక ఒక స్పృహగా గుర్తుపట్టడానికి ప్రయత్నించాను. తద్వారా సనాతన భారతీయ భక్తి కవితా పరంపరలో ఉపనిషత్కారులు, భాగవతం, కబీర్, టాగోర్ ల కోవలో 21 వ శతాబ్దపు వారసురాలిగా నా కవిత్వాన్ని నేను సంభావించుకుంటున్నాను.

ఈ జీవితమెందుకో, ఈ నామరూపప్రపంచం వెనక ఉన్న సత్యమేమిటో నేను ఎప్పటికీ అవగతం చేసుకోలేననే అనుకుంటున్నాను. ఒకప్పుడు వేదాంతులు దీన్ని మాయ అన్నారు. ఇప్పుడు పోస్ట్ మోడర్న్ తత్త్వవేత్తలు text కి బయట ఏమీ లేదంటున్నారు. ఇట్లాంటి అగమ్య స్థితిలో జీవిత ప్రయోజనాన్ని నిర్ధారించుకోవడం కష్టం. ఏది మంచో ఏది చెడో కూడా తేల్చుకోవడం కష్టం. ఇప్పుడు నేను చెయ్యగలిగేదల్లా మాయో, సత్యమో తెలీదుగానీ, జీవితం సుందరంగానూ, ఆనందప్రదంగానూ గోచరించిన కొన్ని క్షణాల్ని పట్టుకోవడం, వాటిని పదేపదే తల్చుకోవడం. అట్లాంటి సౌందర్యమయ క్షణాల సమాహారమే నా ‘నీటిరంగుల చిత్రం.’

7-12-2014

Leave a Reply

%d bloggers like this: