దశార్ణదేశపు హంసలు

swans

అట్లాసులూ, ఫొటోగ్రాఫులూ లేని కాలంలో ఈ దేశాన్ని దర్శించిండానికి కవిత్వమూ, పురాణాలూ, స్థలపురాణాలే ఆధారంగా ఉండేవి. ముఖ్యంగా కవులు తాము దర్శించి నలుగురికీ చూపించిన దేశం ఎంతో హృద్యంగానూ, ప్రేమాస్పదంగానూ ఉండేది. వారు చిత్రించిన లాండ్ స్కేప్ కేవలం భౌగోళికమైంది మాత్రమే కాదు. అందులో కొంత ఊహ, కొంత స్మృతి, కొంత స్వప్నం కలిసిఉండేవి. చిన్నప్పుడు ఆ కావ్యాలు చదువుకున్నవాళ్ళకి ఆ దేశాన్ని దర్శించించాలన్న కోరిక జీవితమంతా వెంటాడుతుండేది. ఆ ప్రయత్నంలో వాళ్ళు తాము జీవిస్తున్న దేశాన్ని పునర్నిర్మించడానికి ఉత్సాహపడేవారు.

మేఘసందేశం అటువంటి ఒక దేశదర్శిని. అందుకనే శేషేంద్ర ఒకచోట ఇలా అన్నాడు:

‘మేఘసందేశం ఒక కావ్యం కాదు. కుమారావస్థలో దాన్ని చదువుకున్నవాళ్ళకు అది జీవితాంతం వెంటాడే బలీయమైన స్మృతి! సంధ్యాకాలపు స్వాతికొంగలు, మేఘపు శ్లోకాలు నన్ను బాల్యస్మృతుల్లోకి మోసుకుపోతాయి నౌకల్లా. మేఘసందేశం అనగానే మేఘాలు, గ్రామాలు, పొలాలు, తడినేలలు, పచ్చిగడ్డివాసనలు, పశువుల మందలు, ఇంధ్రధనుసు ముక్కలు, ఇలాంటివేవో జ్ఞాపకాలు ముసురుకు వస్తాయి.’

మేఘసందేశ ప్రభావం మనుషులమీద ఎట్లా ఉంటుందో నేను మా మాష్టారు మల్లంపల్లి శరభయ్యగారి విషయంలొ కళ్ళారా చూసాను. ప్రాచీన సంస్కృతాంధ్ర కవిత్వం మొత్తం కంఠోపాఠంగా ఉండే ఆయనకి, కవులందర్నీ హృదయస్థంగా నిలుపుకున్న ఆ రసజ్ణుడికి తొలిప్రేమ కాళిదాసకవితతోనే. దాన్నొక రహస్యంగా ఉంచాలనుకుంటూ ఎప్పటికప్పుడు బహిరంగం చేసేస్తూండేవారు.ఆ కాళిదాసు కూడా కుమారసంభవం, శాకుంతలాల కాళిదాసు కాదు, మేఘసందేశకావ్యపు కాళిదాసేనని ఆయనకే చాలా ఆలస్యంగా తెలిసింది.

పుష్కరకాలం కిందటి మాట. అప్పటికాయన వయోవృద్ధుడే కాకుండా రుజాగ్రస్తుడైకూడా ఉన్నాడు. పక్షవాతానికి లోనైన దేహం అప్పుడప్పుడే స్వస్థపడుతోంది. నేనాయన్ను చూడటానికి రాజమండ్రి వెళ్ళాను. అప్పుడాయన పూర్తిగా బసవేశ్వరుడి కవితారాధనలో మునిగిపోయి వున్నారు. బసవవచనాలకు తాను చేసిన సంస్కృతం వినిపిస్తున్నారు. కాని నాకు ఆయన నోటివెంట కాళిదాసును వినాలనిపించింది. కాళిదాస శ్లోకమేదన్నా వినిపించమని అడిగాను.

‘కాళిదాసు ఎవరు?’ అన్నారాయన. ‘నన్నిప్పుడు బసవేశ్వరుడు పూర్తిగా ఆవహించివున్నాడు’ అన్నారు. నేనేమీ మాట్లాడలేకపోయాను. చాలాసేపే గడిచింది. మరేదేదో మాట్లాడుకున్నాం. ఇక నేను లేవబోతూండగా ‘సరే, కాళిదాసును వినాలన్నావు కదా. ఇదిగో ఈ శ్లోకం విను’ అన్నారు:

పాణ్డుచ్ఛాయో పవనవృతయ: కేతకైస్సూచిభిన్నై:
నీడారంభై: గృహబలిభుజామాకులగ్రామచైత్యా:
త్వయ్యాసన్నే పరిణతఫలశ్యామజంబూవనాంతా:
సంపత్స్యంతే కతిపయదినస్థాయిహంసా దశార్ణా:

మేఘసందేశంలో, పూర్వమేఘంలోని ఈ 24 వ శ్లోకందగ్గర యుగయుగాలుగా భారతీయ భావుకులు మూర్ఛపోతూనేవున్నారు. అపురూపమైన సౌందర్యం, నిశ్శబ్దం కలగలిసిన ఈ శ్లోకాన్ని తెలుగు చేస్తే ఇలా ఉంటుంది:

నువ్వు దశార్ణదేశాల్ని సమీపించేవేళకి అక్కడంతా
పూచినమొగలిపొదలవెలుతురు. పండిన నేరేడుపళ్ళ
శ్యామఛాయ, రచ్చబండ్ల దగ్గరచెట్లమీద పక్షిగూళ్ళ
కిలకిల, చూడు, ఆ హంసలక్కడుండేది కొన్నిదినాలే.

ఈ శ్లోకం చదువుతూనే డెభ్భైయ్యేళ్ళ ఆ కావ్యారాధకుడి కంఠస్వరం గద్గదమైపోయింది. అప్పుడు నెమ్మదిగా ఆయనిలా అన్నారు:

‘చూడు, ఆరేడేళ్ళ పసిప్రాయంలో మా నాన్నగారు నన్నీ పుస్తకం చదివించారు. ఇన్నేళ్ళుగా నేనెన్నో వేలసార్లు ఈ శ్లోకం చదివివుంటాను. ఇన్నాళ్ళూ నేను హంసలంటే వట్టి హంసలనే అనుకున్నాను. ఇప్పుడు తెలుస్తోంది, హంసలంటే ప్రాణాలనీ, ఈ సుందరదేశంలో ఈ హంసలుండేది కొన్నిదినాలేననీ.’

12-6-2013

 

Leave a Reply

%d bloggers like this: