జయంత్ మహాపాత్ర

Reading Time: < 1 minute

26

ఈ రోజు హిందూ లిటరరీ సప్లిమెంట్ లో జయంత్ మహాపాత్ర ఇంటర్వ్యూ పడింది.

జయంత్ మహాపాత్ర అంతర్జాతీయస్థాయి గుర్తింపు పొందిన కవి. సాధారణంగా ఆధునిక సమకాలీన ప్రపంచ కవిత్వసంకలనాల్లో భారతదేశానికి ప్రతినిధిగా ఎంచబడే ఒకరిద్దరు కవుల్లో ఆయన కూడా ఉంటున్నాడు. 85 సంవత్సరాల ఈ కవి తన ముఫ్ఫైఎనిమిదో ఏట కవిత్వరచన మొదలుపెట్టాడు. అది కూడా ఇంగ్లీషులో. ఇప్పుడు తన ఆత్మకథ మాత్రం ఒడియాలో రాస్తున్నాడు.

వృత్తిరీత్యా భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు. అత్యున్నత మార్మికసంకేతాల్ని బోధపరుచుకోవడానికి ప్రయత్నించడంలో, ఆ మాటకొస్తే అర్థం చేసుకోలేకపోడంలో కూడా భౌతికశాస్త్రానికీ, కవిత్వానికీ మధ్య తేడాలేదనే ఈ కవి కటక్ కీ, మహానదీ తీరానికీ, ఒడియా నేలకీ జీవితమంతా అంటిపెట్టుకుపోయాడు. ఆ విషయంలో రామానుజన్ కన్నా, పార్థసారథికన్నా దిలీప్ చిత్రేకన్నా తనెంతో అదృష్టవంతుణ్ణని చెప్పుకుంటాడు.

మహాపాత్ర కవిత్వం గాఢమైన జీవితానుభవంలాగా చాలా సాంద్రంగా ఉంటుంది, అలాగని పూర్తిగా అర్థమవుతుందని చెప్పలేం. తనకి మాత్రమే అర్థమయ్యే నిగూఢప్రతీకల్ని సాధారణ జీవితదృశ్యాలతో కలిపి చెప్తాడు. మనకి ఏదో తెలిసినట్టే ఉంటుంది. కాని చాలా తెలుసుకోలేకపోయామని కూడా అనిపిస్తుంది.

ఆయన కవితలు మూడు మీకోసం తెలుగులో:

ఒక వేసవి కవిత

ఊళ పెడుతున్న దిగులుగాలిలో
మరింత గట్టిగా వినిపిస్తున్న పూజారులమంత్రాలు.

భారతదేశపు నోరు తెరుచుకుంటోంది.

మొసళ్ళు మరింతలోతుల్లోకి జరుగుతున్నాయి.

మండుతున్న పేడపిడకల ప్రభాతాల
పొగ ఎండలో.

బారెడు పొద్దెక్కినా
నా ధర్మపత్ని ఇంకా
నా శయ్యలో
కలలు కంటూనే ఉంది
చితిమంటలపెళపెళలకు
సొలసిపోని స్వప్నాలతో.

దేవాలయం వీథి, పూరి

మట్టిలాగా జేగురురంగు పిల్లలు
వికలాంగుల్నీ, వీథికుక్కల్నీ
చూసి నవ్వుతున్నారు
వాళ్ళనెవరూ పట్టించుకుంటారన్న బాధ లేదు.

అనంతలయోన్ముఖం దేవాలయం .

నున్నగా గొరిగినగుండురంగు వీథిదుమ్ములో
అన్నీ నిరంతరం సంచరిస్తూనే వుంటాయి
కాని ఏ ఒక్కటీ దృష్టిపథం దాటిపోదు.

ఇక అక్కడ ఆ ఆకాశం
ఉల్లంఘించలేని ఏ అధికారానికో
కట్టుబడి నిశ్శబ్దపు చంకకర్రలు సాయంగా.

రేపటికోసమొక ఆశతో

పూరిలో కాకులు
విశాలమైన ఆ ఒక్క వీథి
రాక్షసినాలుకలాగ సోమరిగా.

అటుపోతున్న పూజారికోసం
దారితొలుగుతున్న
అనామకులు ఐదుగురు కుష్టువాళ్ళు .

వీథి చివర దేవాలయద్వారం
దగ్గర తోసుకుపడుతున్న మనుష్యసందోహం.

మహోన్నతకారణాలగాలిలో
తలూపుతున్న
బృహత్ పవిత్రపుష్పం.

7-7-2013

Leave a Reply

%d bloggers like this: