చుట్టూ, చెప్పలేనంత ఉల్లాసం

21

ఒకవైపు రంజాన్ ఉపవాసాలు, మరొకవైపు బోనాలు. పండగ సందడి లో తేలుతున్న నగరంలో స్నేహితుల రోజు. స్నేహమంటే జలాలుద్దీన్ రూమీ, షమ్షుద్దీన్ తబ్రీజీల మధ్య నడిచిన అనుబంధంలాగా ఉండాలి. ఒకరు మరొకరికి దర్పణంలాగా, అంటే ఎదుటివారిలో తను తప్ప మరేమీ కనిపించనంత తాదాత్మ్యం సాధ్యం కావాలి.

నేడు ప్రపంచమంతా రూమీ కవిత్వాన్ని హృదయానికి హత్తుకుంటున్నదంటే అందుకు కారణం ఆ తాదాత్మ్య భావనే. ఒక మనిషి మరొక మనిషితో సాధించుకోగల అత్యున్నతానుభవం స్నేహం మాత్రమేనని రూమీ కవిత్వమంతా శతాబ్దాలుగా ఘోషిస్తోంది.

మిత్రులకోసం రూమీ కవితలు కొన్ని:

1

నేను నీతో ఉన్నప్పుడు, రాత్రంతా నిద్రలేదు
నువ్విక్కడ లేనప్పుడు అసలు నిద్రే రాదు.

దేవుణ్ణి స్తుతించాలి: రెండురకాలుగానూ నిద్ర
లేనందుకు, రెండింటిలోనూ తేడా ఉన్నందుకు.

2.

నేను నా ప్రేమకథ విన్నతొలిక్షణం నుంచీ
నీ కోసం వెతుకుతూనే ఉన్నాను, అదెంత
గుడ్డితనమో తెలుసుకోకుండానే.

ప్రేమికులంటే ఒకరోజుకి కలుసుకునేవాళ్ళు
కారు, మొదటినుంచీ ఒకరిలో ఒకరు
కొనసాగుతుండేవాళ్ళే.

3.

మనం అద్దాలం, అందులో ముఖాలం కూడా
ఈ క్షణం మనం చవిచూస్తున్నది నిరంతరాన్నే
మనం నొప్పి, మనం ఔషధం కూడా
మనం పానీయం, మనం పాత్ర కూడా.

4.

ప్రేమ నా కార్యకలాపాన్నిపక్కకు నెట్టేసి
నా రోజుల్ని కవిత్వంతో నింపేసింది.

మామూలుగా చేసినట్టు
మౌనజపం చాలదు.
చప్పట్లు కొట్టాలి
నాట్యం చేయాలి.

ఇన్నాళ్ళూ మర్యాదస్తుడిగా,
పెద్దమనిషిగా బతికాను
ఈ మహాప్రభంజనంలో
అదేదీ నిలబడేట్టు లేదు.

పర్వతం ప్రతిధ్వనిని
తన హృదయాంతరాళంలో దాచుకున్నట్టు
నీ స్వరాన్ని నాలో నిలుపుకుంటాను

నీ జ్వాలలో ఒక
ఎండుకట్టెలాగా వచ్చిపడ్డాను
ఇంతలోనే భస్మమైపోతాను.

నిన్ను చూసినప్పుడే
నన్ను నేను శూన్యం చేసేసుకున్నాను
ఉండటం కన్నా ఈ లేకపోవడమే
ఎంతో బావుంది.
నా అస్తిత్వాన్ని మింగేసే శూన్యం
అయినా అది అడుగుపెట్టగానే
నాలో ప్రాణం పరవళ్ళు తొక్కుతోంది.

నీలాకాశం. అయినా
లోకమొక గుడ్డివాడిలాగా
రోడ్డు మీద చతికిలబడింది.
కాని నీ శూన్యాన్ని చూసినవాళ్ళు
ఆ నీలాన్నీ, ఆ లోకాన్నీ కూడా
దాటి చూస్తారు.

మహమ్మద్ లాగా, యేసులాగా
గొప్ప ఆత్మ ఒకటి
తననెవరూ గుర్తుపట్టని
నగరం మధ్య నడిచిపోతుంది

అట్లాంటి శూన్యం ముందు
నువ్వు మోకరిల్లడాన్ని
ప్రశంసించేదే ప్రశంస.

సూర్యుణ్ణి ప్రశంసించడంటే ఏమిటి?
నీ కళ్ళని నువ్వు ప్రశంసించుకోవడం.
నువ్వు ప్రశంసించవలసిందొక సముద్రం
మనమెంట మాట్లాడినా ఇంతాచేసి
ఒక తెప్పతో సమానం.

సముద్రం మీద ప్రయాణం,
ఎక్కడికో తెలియదు.
అయినా అపారసాగరంలో
మనమిట్లా పోతూండటమే
గొప్ప భాగ్యం,
పూర్తి మెలకువ.

నిద్రపోతున్నామని
దిగులెందుకు?ఎంతకాలంగా
నిద్రపోతున్నామన్నదేమంత
విషయం కాదు.

ఇంతకాలంగా జబ్బుపడ్డాం
సరే, పోనివ్వండి, ఇప్పుడు
చూడండి చుట్టూ,
చెప్పలేనంత
ఉల్లాసం.

4-8-2013

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading