క్రూరపాశము మోహబంధము

Reading Time: 2 minutes

 

31

వారం రోజుల కిందట వాల్డెన్ లో ఫైజ్ మీద కొత్త పుస్తకం కనబడితే తెచ్చుకున్నాను. ‘ద బెస్ట్ ఆఫ్ ఫైజ్ అహ్మద్ ఫైజ్’ (వింటేజ్ క్లాసిక్స్, 2013). శివ్ కె కుమార్ అనువాదం. ‘ ఓ సిటీ ఆఫ్ లైట్స్’ (ఆక్స్ ఫర్డ్, 2006), ‘100 పొయెంస్ బై ఫైజ్ అహ్మద్ ఫైజ్’ (అభినవ్ పబ్లికేషన్స్, 2009) తరువాత, ఇది మూడవ పుస్తకం ఫైజ్ మీద నా అలమారులో.

శివ్ కుమార్ పుట్టింది లాహోర్ లో. ఫైజ్ ఎంతో ప్రేమించిన నగరమది. ఫైజ్ లానే శివ్ కుమార్ కి కూడా పంజాబీ మాతృభాష. స్వయంగా ఇంగ్లీషు ఉపాధ్యాయుడూ, ఇంగ్లీషులో కవిత్వం రాయడంలో మెలకువలు తెలిసినవాడూ కాబట్టి శివ్ కుమార్ అనువాదాలు సరళంగానూ, సులభంగానూ ఉండటంలో ఆశ్చర్యం లేదు. పుస్తకానికి ఒక సున్నితమైన ముందుమాట కూడా రాసుకున్నాడాయన. అందులో చివర ఇలా రాసాడు:

‘మానవానుభవాన్ని దాని సమస్త ముఖాల్లోనూ- మనసుతో, దేహంతో, ఆత్మతో- ఆకళింపుచేసుకున్న ఫైజ్ లాంటి కవి గురించి సంగ్రహంగా చెప్పటం కష్టం. మీర్, గాలిబ్, ఇక్బాల్ ల తరువాత అతడినే మనం సర్వోన్నతుడైన ఉర్దూ కవిగా మనం గుర్తించవలసి ఉంటుంది.’

నిస్సందేహంగా ఫైజ్ అగ్రశ్రేణి కవి. అతడిని కేవలం ఉర్దూ కవిగానో, పాకిస్తానీ కవిగానో మాత్రమే చూడలేము. అతడి గురించిన చక్కని మూల్యాకంనమొకటి అగా సాహిద్ ఆలీ మాటల్లో కనబడింది నాకు. ఆలీ ఇలా రాసాడు (ద పొయెట్రీ ఆఫ్ ద వరల్డ్, పెరిన్నియల్, 2000, పే.408):

‘టర్కీనుంచి పాకిస్తాన్ దాకా ఒక ఏకీకృత సాహిత్య క్షేత్రమొకదాన్ని మనం ఊహించగలిగితే, అందులో అందరికన్నాఎత్తుగా ఫైజ్ కనిపిస్తాడు నాకు. ఎవరెంత ప్రయత్నించినా అడొనిస్ నీ, దర్వేష్ నీ, హిక్మత్ నీ దక్షిణాసియా కవులుగా ప్రతిపాదించలేరు. అలాగే, ఉదాహరణకి, టాగోర్ ని మధ్యాసియా కవిగా చూపించి ఒప్పించలేము. కాని, ఆజానుబాహువైనఫైజ్ ని చూడండి, ఆయన అటు ‘ముస్లిం’ మధ్యాసియాలోనూ, ఇటు ‘హిందూ’ ఇండియాలోనూ కూడా సునాయాసంగా నడిచిపోగలడు ‘.

శివ్ కుమార్ అనువాద ప్రతిభ చూడటానికి నాకు బాగా ఇష్టమైన గజల్, మెహిదీహసన్ తన గానంతో మరింత మెరుగుపెట్టిన గజల్, ‘గులోం మే రంగ్ భరే’ చూసాను. లలితమార్దవమైన ఆ గజల్ కి ఇంగ్లీషు ఇలా ఉంది.

Lending hues to the flowers, blows the spring breeze
Now do come to let the garden blossom.

Sad is the cage, O friends, say something to the breeze
somewhere, for God’s sake, should be some talk of the beloved today;

Let the day break from the curl of your lips
and let the night go fragrant with the crest of your locks.

Let the heart be humble-but deep is the bond of love;
if I invoke your name, many will come to commiserate with me.

Whatever befell me, let it be; at least my tears,
O night of separation, had surely brightened you up.

Whenever my frenzy was summoned before my love,
I appeared, my collar in shreds, as my lone asset.

No resting place, O Faiz, appealed all through the journey;
as I emerged from my beloved’s lane, I headed straight for the gallows.

ఈ అనువాదం ఇచ్చిన ధైర్యంతో ఈ గజల్ ని నేనిట్లా ముత్యాలసరంగా కూర్చాను:

పూలరేకల రంగులద్దుచు
తొలివసంతపరాగధూళి
ఇనుమడించును తోటసొగసును
నీవు అడుగిడిన.

మిత్రులారా, కైదు దు:ఖము
కమ్మతెమ్మెర కబురలందున
దేవునియాన, నేడెక్కడనొ
ఆమె తలపోత.

రోజు మొదలగునేని నీ అధ
రాంచలములనె, రాత్రివేళలు
రాగరంజితమగుట నీ కబ
రీభరమువలన.

క్రూరపాశము మోహబంధము
గుండె పేదది, తరలివత్తురు
ప్రేమ పాంథులు, ఊరటకు, నీ
పేరువినగానె.

కుంగవలసిన బాధ కుంగితి
కాని ఈ విరహరాత్రిన నా
అశ్రుధారలె నీ బతుకునకు
అలంకారములు.

ప్రణయదస్త్రము చూపవలెనని
ప్రేమదేవత పిలవనంపగ
చిరిగిపేలికలైన దుస్తులె
సాక్ష్యమయ్యెడిని.

సేదతీర్చెడి మరొకతావును
చూడలేమిట, ఫయజ్, ప్రేయసి
వీథి విడుమన, చనుదు నేరుగ
ఉరికంబమునకె.

2-5-2013

Leave a Reply

%d bloggers like this: