కొండదిగువపల్లెలో

Awesome Nightfall: The Life, Times, and Poetry of Saigyoø

బాల్యం నుంచి నవయవ్వనంలో అడుగుపెట్టేటప్పుడు ఎప్పుడు పుడుతుందో, ఎప్పుడు అదృశ్యమైపోతుందో తెలియని తొలిప్రేమలాంటిది వసంతకాలం. వస్తున్న జాడ తెలుస్తుందిగాని ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. మనం మేలుకునేటప్పటికి వేసవి వేడి చుట్టూ వరదలెత్తుతుంది, ఇంతలోనే తొలి ఋతుపవనం మన ఆకాశాన్ని కమ్మేస్తుంది.

అందుకని ప్రతి వసంతకాలంలోనూ, వేసవిలోనూ నన్ను నేను మెలకువగా వుంచుకోవడంకోసం చీనా, జపాన్ కవుల చుట్టూ ప్రదక్షిణం చేస్తుంటాను.

వసంతఋతువేళ నేను పదేపదే గుర్తుచేసుకునే కవి, ప్రాచీన జపనీయ కవీంద్రుడు సైగ్యొ (1118-1190). మొదటిసారి ఆయన గురించి విన్నది బషొ యాత్రావర్ణనల్లో. పదిహేడో శతాబ్దికి చెందిన ప్రసిద్ధ హైకూ కవి బషోకి సైగ్యొ ఆదర్శం. సైగ్యొ తిరిగిన తావుల్ని చూడటంకోసమే ఆయన ఎన్నో యాత్రలు చేపట్టాడు. వాటిలో కొన్నింటిని ‘హైకూ యాత్ర’ పేరిట తెలుగులోకి అనువదిస్తున్నప్పుడు నేను కూడా సైగ్యొ ప్రేమలో పడిపోయాను.

సైగ్యో కవిత్వానికి ‘పొయెమ్స్ ఆఫ్ అ మౌంటెన్ హోం’ (1991) బర్టన్ వాట్సన్ అనువాదం చాలా ప్రసిద్ధి చెందిన పుస్తకం. ఈ మధ్య సైగ్యో గురించిన మరిన్ని వివరాలతో వచ్చిన మరొక పుస్తకం ‘ ఆసం నైట్ ఫాల్’ (2003), విలియం ఆర్ లాఫ్లెయెర్ అనువాదం.

ఇవి చదివినా దాహం తీరనివాళ్ళు ఇంటర్నెట్ లోwww.temcauley.staff.shef.ac.uk చూడవచ్చు.

సైగ్యొ ఋషిలాంటి కవి, ప్రపంచాన్ని వదులుకున్నాడుకాని సౌందర్యారాధనని వదులుకోలేకపోయాడు. చెర్రీపూలు, పున్నమిరాత్రులు, విల్లోకొమ్మలు, కొండశిఖరాలు-సైగ్యో చూసిన లోకం, ధ్యానించిన లోకం మనకు పరిచయమయ్యాక మనం కూడా పదేపదే వాటినే తలుచుకోకుండా ఉండలేం.

ఆయన కవితలు రెండు మీ కోసం:

కొండదిగువపల్లెలో

1

వసంతకాలం రోజంతా
పూలనిచూస్తూగడపాలనిపిస్తుంది,
రాత్రి వద్దనిపిస్తుంది, శరత్కాలంలోనా,
రాత్రంతా చంద్రుణ్ణే చూడాలని,
తెల్లవారవద్దనిపిస్తుంది.

2

ఈ కొండదిగువపల్లెలో
నువ్వెవరికోసం పిలుస్తున్నావు
చిన్నికోయిలా!
నేనిక్కడకు వచ్చిందే
ఒక్కణ్ణీ గడుపుదామని.

6-6-2013

Leave a Reply

%d bloggers like this: