కృష్ణమూర్తి నోట్ బుక్

Reading Time: 2 minutes

 

27

కవిత్వమంటే ఏమిటి? ఈ ప్రశ్న ప్రతి కవీ ఎప్పటికప్పుడు వేసుకునేదే. ఈ ప్రశ్న వేసుకుని సమాధానంగా ఎందరో ఎన్నో నిర్వచనాలు చేసారు. ప్రతి నిర్వచనమూ సరైందే, ఎందుకంటే, ఆ సమాధానం వెనక ఆ కాలానికి సంబంధించిన స్ఫూర్తీ, అప్పటి సామాజికావసరాలూ ఉంటాయి కాబట్టి.

గత ముఫ్ఫయ్యేళ్ళబట్టీ నేను కూడా ఈ ప్రశ్న వేసుకుంటూ సమాధానం అన్వేషించుకుంటూ వస్తున్నాను. ఎన్నో దేశాల ఎన్నో కాలాల కవిత్వాన్ని అధ్యయనం చేస్తూ వస్తున్నాను. ఇప్పటికి నాకు రెండు విషయాలు బోధపడ్డాయి.

ఒకటి, కరెంటు రాగితీగలోపలనుంచి కాకుండా, రాగితీగచుట్టూ ప్రవహించుకుంటూ పోయినట్టు, కవిత్వమనేది మాటల్లో ఉండదు,  మాటలచుట్టూ ఉంటుందని.

రెండవది, పై మాటకి పొడిగింపే, emotionally charged utterance మాత్రమే కవిత్వమవుతుందని.

ఇక తక్కినవన్నీ, ఛందస్సు, లయ, అలంకారం, చివరికి క్లుప్తత, గాఢత కూడా ఏమంత ప్రధానం కాదు. ఆ మాటలు చెప్తున్నప్పుడు ఆ కవి భావావేశాలు తీవ్రీకరణ చెందాయా లేదా అంతే. కవి నిజంగా emotionally charged అయితే, అతడు రాసింది వట్టి వచనం, వ్యాసం అయినా కూడా అది మనల్ని స్పందించకుండా ఉండలేదు.

ఈ రహస్యం శ్రీశ్రీకి కూడా తెలుసు. బొదిలేర్, పో, మపాసాల్ని తన ఋషులుగా చెప్పుకుంటూ రాసిన ఒక రచనలో ఆయన ఇలా అన్నాడు:

‘అతనిది (మపాసా) మహోన్మాదంలొని మహాకవిత్వం. గద్యం పద్యం అనే సరిహద్దులకి అతీతమైనది. పద్యాలేవీ రాయకపోయినా కవి… షార్ట్ స్టోరీకి, లిరిక్ కీ బేధం లేదని నా ఉత్సాహమొలో ఒక్కొక్కపుడనేస్తుంటానే దానికతని కథలే కారణం..’

నా నిర్వికల్పసంగీతం (1986) లో అశోకుణ్ణీ, గాంధీనీ కవులుగా పరిచయం చేయడానికి ఈ ఉత్సాహమే కారణం.

ఇన్నేళ్ళ తరువాత కూడా ఈ భావాలు మార్చుకోవడానికి నాకే కారణం కనిపించడం లేదు.

కృష్ణమూర్తి అన్నాడుట. టాగోర్ ని చదువుతుంటే తాత్త్వికరచన చదువుతున్నట్టుంటుంది, రాధాకృష్ణన్ ని చదువుతుంటే కవిత్వం చదువుతున్నంటుంటుందని. ఆ మాట కృష్ణమూర్తి రచనలకు కూడా వర్తిస్తుంది. ‘కృష్ణమూర్తి నోట్ బుక్’, ‘కృష్ణమూర్తి జర్నల్’, కృష్ణమూర్తి టు హిం సెల్ఫ్’ లను అత్యుత్తమ కవితాత్మకమైన రచనలనడంలో నాకే సందేహమూ లేదు.

ఉదాహరణకి ‘కృష్ణమూర్తి నోట్ బుక్’ లో 17-11-1961 నాటి ఈ వర్ణన చూడండి:

‘నేలంతా ఆకాశం రంగు తిరిగింది. కొండలు, పొదలు, పండిన వరిచేలు, చెట్లు ఎండి ఇసుకమేటలు వేసిన నదిశయ్య ప్రతి ఒక్కటీ ఆకాశం రంగు తిరిగేయి. కొండలమీద ప్రతి ఒక్క రాయీ, గండశిలలూ మేఘాలుగా, మేఘాలు శిలలుగా కనిపిస్తున్నాయి. ద్యులోకం పృథ్విగా, పృథ్వి ద్యులోకంగా మారిపోయింది. అస్తమిస్తున్న సూర్యుడు ప్రతిఒక్కదాన్నీ మార్చేసాడు. ఆకాశమిప్పుడొక జ్వాలామండలంగా, ప్రతి ఒక్క మేఘంలో, రాయిలో, రప్పలో ప్రతి ఒక్క ఇసుకరేణువులో నెరుసులు చిమ్ముతూంది. అకాశజ్వాలలో ఆకుపచ్చ, ఊదా, కపిల, ధూమ్రవర్ణాలు నాలుకలు చాపుతున్నాయి. అక్కడ కొండ మీద కపిలకాంతి, బంగారు ముద్ద. దక్షిణం వైపు కొండలమీద రగుల్తున్న సున్నితమైన ఆకుపచ్చ, పలచబడుతున్న నీలిరంగు. తూర్పు వైపు మరొక సూర్యాస్తమయమవుతున్నదా అన్నట్టు ప్రగాఢరక్తవర్ణం, జేగురురంగు, మందారకాంతి, మరుగవుతున్న ఊదా ఛాయ. తూర్పువైపు సూర్యాస్తమయం కూడా పడమటిదిక్కులానే వైభవోజ్జ్వలంగా ఉంది. అస్తంగమిత సూర్యబింబం చుట్టూ అల్లుకున్న కొన్ని మబ్బులూ నిర్మలంగా, పొగలేని నిప్పులాగా, ఎప్పటికీ ఆరని జ్వాలలాగా కనిపిస్తున్నాయి. ఈ మహాగ్ని తన సమస్త సాంద్రతతో ప్రతి ఒక్కదానిలోకీ, పుడమిలోతుల్లోకీ చొచ్చుకుపోయింది. భూమి స్వర్గంగా, స్వర్గం భూమిగా మారిపోయింది. ప్రతి ఒక్కటీ సజీవచైతన్యంతో రంగులు చిమ్ముతూ రంగు భగవద్రూపం ధరించింది. అయితే ఈ భగవంతుడు మనిషి నిర్మించుకున్న భగవంతుడు కాడు. కొండలన్నీ పారదర్శకాలై, పతి ఒక్క రాయి, శిల తూలికాతుల్యంగా మారిపోయి రంగులో తేలుతున్నాయి….నువ్వా కాంతిలో కలిసిపోయావు, మండుతున్నావు, రగుల్తున్నావు,బద్దలవుతున్నావు, నీకప్పుడు మూలాల్లేవు, నీడల్లేవు, మాటల్లేవు. సూర్యుడు మరింత లోతుకు జారుతున్నకొద్దీ, ప్రతి ఒక్క రంగూ మరింత ఉగ్రంగా, మరింత తీక్ష్ణంగా మారిపోతూన్నకొద్దీ, నిన్ను నువ్వు పూర్తిగా మర్చిపోయావు, నీదనేదేదీ నీకు స్మరణలో లేదప్పుడు. ఆ సాయంకాలానికి తనదంటూ ఎటువంటి స్మృతీ మిగల్లేదు..’

29-6-2013

Leave a Reply

%d bloggers like this: