కస్తూరి పరిమళం

r3

‘కొందరు మనల్ని పలకరించినప్పుడు కస్తూరి పరిమళం గుప్పుమంటుంది. మరికొందరు పలకరిస్తే పొగ కమ్ముకుంటుంది’ అని రాసాడట రూమీ.

మూడేళ్ళ కిందట నా చేతుల్లోకి వచ్చినట్టే వచ్చి చేజారిపోయిన పుస్తకం అన్నెమేరీ షిమ్మెల్ రచన Rumi (ఆక్స్ ఫర్డ్, 2014) ఈ సారి పుస్తక ప్రదర్శనలో చేతికందింది.

షిమ్మెల్ (1922-2003) ఇస్లామిక్ భక్తితత్త్వం మీదా, పారశీక సాహిత్యం మీదా అపారమైన పాండిత్యం సాధించిన జర్మన్ విదుషి. ఆరబిక్,పారశీకం,ఉర్దూ, సింధి, పష్తో సాహిత్యాలనుంచి ఎన్నో విలువైన అనువాదాలు వెలువరించింది. ముఖ్యంగా రూమీ పైనా, ఇక్బాల్ పైనా జీవితకాల కృషి చేసింది. అందులో రూమీ దివాన్ నుంచి కొంత కవిత్వం జర్మన్ లోకి అనువాదంతో పాటు సుమారు పది పన్నెండు అధ్యయనగ్రంథాలు కూడా వెలువరించింది.

వందపేజీల ఈ చిన్న రచన ఒక మోనోగ్రాఫులాంటిదే అయినా ఇందులో ఆమె రూమీ గురించిన సమగ్రపరిచయాన్నే అందించింది. ఎనిమిది అధ్యాయాలుగా విభజించిన ఈ పుస్తకంలో రూమీ జీవితం, అతడి కవిత్వం, ఆ కవిత్వానికి ఉన్న ఇస్లామీయ ఆధారాలు, అందులో సాగించిన ఈశ్వర చింతన లతో పాటు ఒక బోధకుడిగా రూమీ, అతడి మార్మిక తత్త్వాలను కూడా సంగ్రహంగా వివరించింది. ముఖ్యంగా రూమి సాహిత్యం నుంచి మనమేమి గ్రహించవలసి ఉంటుంది అన్న చివరి అధ్యాయం మరింత విలువైందని చెప్పవచ్చు.

రూమీని జీవితకాలం పాటు అధ్యయనం చేసిన విద్వాంసురాలు, అది కూడా పారశీకంలోనే నేరుగా చదివిన పండితురాలు, ఇస్లాం గురించీ, కొరాన్ గురించీ సాధికారికమైన అవగాహన కూడా ఉన్న మనిషి కావడంతో, ఈ రచనకి ఎంతో విలువ చేకూరింది.

రూమీ గురించి మనకి లభ్యమవుతున్న అనేక రచనలూ, ఆయన కవిత్వానికి విరివిగా లభ్యమవుతున్న జనాదరణ పొందిన అనువాదాలూ చెప్పని మూడు అంశాలు, షిమ్మెల్ మరీ మరీ చెప్తూ వచ్చినవాటిని మనవి చేస్తాను.

మొదటిది, రూమీ కవిత్వం ఇస్లామీయ దర్శనం పాదులోనే పుట్టిపెరిగిందనీ, తనకు సాక్షాత్కరించిన ఈశ్వరీయ ప్రేమను రూమీ కొరాన్ వెలుగులోనే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడనీ. ముఖ్యంగా కవిత్వాన్ని ఒక ప్రార్థనగా అర్థం చేసుకున్నాడనీ, ప్రార్థనగా మలుచుకున్నాడనీ. అందుకు ఉదాహరణగా ‘మస్నవీ’ లోని ఈ అద్భుతమైన కవితను ఎత్తి చూపించింది.

_____________

“ఈశ్వరా అంటో ఎన్నో రాత్రులపాటు ఒక అన్వేషి ఎలుగెత్తి పిలుస్తూనే ఉన్నాడు. అట్లా పిలిచి పిలిచి అతడి నోరు తీపెక్కిపోయింది.

‘నువ్విట్లా ఎన్నేళ్ళుగానో ఎలుగెత్తి పిలుస్తూనే ఉన్నావే , ఆ దేవుడు ‘ఇదిగో, నేనిక్కడున్నాను’ అని ఒక్కసారేనా బదులిచ్చాడా అనడిగాడు సాతాను. ‘ఆతడి దివ్యసింహాసనం నుంచి జవాబు రాదుగాని నువ్వేమో ఇట్లా మొత్తుకుంటూనే ఉన్నావ’న్నాడు.

ఆ సాధకుడేమీ మాట్లాడలేకపోయాడు, మౌనం వహించాడు. ఆ రాత్రి అతడో కలగన్నాడు. కలలో ఓ దేవదూత దిగివచ్చి అడిగాడు ‘నువ్వెందుకని ఆయన్ని తలవడం మానేసావు? దేనికోసం ఇన్నేళ్ళుగా ఆరాటపడుతున్నావో దాన్ని మరిచావా?’

ఆ భక్తుడన్నాడు ‘ఏదీ, ఎన్నాళ్ళుగా పిలిచినా నేనిక్కడున్నాను అన్న జవాబు రాలేదే. బహుశా ఆయన ద్వారం నాకోసం తెరుచుకోదేమో అనుకున్నాను.’

ఆ దేవదూత ఈశ్వరుడి మాటలుగా ఇట్లా చెప్పాడు.

‘మానవుడా, నువ్వు ‘ఈశ్వరా’ అని పిలిచిన పిలుపే ‘ఇదిగో నేనిక్కడున్నాను’ అనే నా జవాబు. నీ వేదన, విలాపాలే నేన్నీకిచ్చే సందేశాలు. నన్ను చేరుకోవాలన్న నీ అనుతాపమే నేను నిన్ను చేరవస్తున్నట్టుగా సంకేతం. నీ ప్రేమరోదననే నేన్నీకు ఘటించగల నివాళి. నువ్వు ఈశ్వరా అని పిలవడమే ‘ఇదిగో నేనిక్కడున్నాను’ అని నేను వందసార్లు బదులివ్వడం.”
_____________

ప్రార్థన దానికదే సాఫల్యం. ‘నువ్వు దప్పికగొన్నప్పుడు, నీళ్ళకోసం వెతుకుతున్నప్పుడు, గుర్తుపెట్టుకో, నీళ్ళు కూడా నీకోసం వెతుక్కుంటాయి’ అన్నాడట రూమీ. బహుశా నువ్వు ఈశ్వరుణ్ణి ఎన్నటికీ చూడలేకపోవచ్చు. కాని ప్రార్థన నీకూ, ఆయనకూ మధ్య ఒక రహస్యసాన్నిహిత్యాన్ని సంపాదిస్తుంది. అది ‘సగం మటుకే తెరిచిన అత్తరు డబ్బీలో చెయ్యి పెట్టి తియ్యడం లాంటిది. ఆ పరిమళం రోజంగా నిన్నావరించే ఉంటుంది’ అని కూడా అన్నాడట మెవ్లానా.

రెండవది, ప్రేమని రూమీ ఎన్ని రూపాల్లో ఎన్ని అవస్థల్లో ఎన్ని పార్శ్వాల్లో చూసాడో అదంతా. రూమీ కవిత్వాన్ని పారశీక మూలంలో చదవకపోతే ఈ ప్రేమ భగవత్ప్రేమ అన్న మౌలిక విషయాన్ని మర్చిపోయి సాధారణమైన లౌకికప్రేమగా దాన్ని పొరపడతామని కూడా ఆమె హెచ్చరిస్తుంది.

ప్రేమ, సరిగ్గా చెప్పాలంటే ఈశ్వరప్రేమ, రూమీ దృష్టిలో ఎల్లల్లేని సముద్రం, జీవనాధారం, మనిషిని నిలువెల్లా కడిగేసే ధారాపాతం.

ప్రేమ ఒక క్రిమి కూడా. వేరు పురుగు చేరి చెట్టుని లోపల్లోపల్నుంచీ తొలుచుకుంటూ పోయినట్టుగా ప్రేమ మనిషిలోని లౌకికాంశని పూర్తిగా తినేస్తుంది. పైకి అతడు చెట్టులాగా ఒక ఆకారంగా మిగులుతాడేగాని, లోపల శూన్యమైపోతాడు.

రూమీ కళ్ళకి ప్రేమ ఒక నగరంలాగా కూడా కనిపిస్తుంది. ఒక బాగ్దాద్ లాగా. ఆ నగరంలో ఇళ్ళూ, ఇళ్ళ కప్పులూ సంగీతంతోనూ, పద్యాలతోనూ నిర్మితమైఉంటాయట.

ప్రేమ ఒక క్రూరమృగం కూడా. మీద విరుచుకుపడుతుంది. అది ఒక చక్రవర్తి, గజదొంగ, అజేయుడైన దళపతి. ప్రేమ పన్ను వసూలు చేసే సుంకరి. నిన్ను నిలువెల్ల దోచుకుపోయే దారిదోపిడీకారు కూడా.

ప్రేమ ఒక వడ్రంగి, స్వర్గానికి నిచ్చెన వేస్తుంది. రజకుడు, నిన్ను బండకేసి బాదుతుంది. అది వంటమనిషి కూడా. నీలో ఉన్న పచ్చిని మొత్తం పక్వాహారంగా మార్చేస్తుంది. ప్రేమ ఒక దర్జీ. కొలతలప్రకారం నిన్ను కత్తిరించి కుడతాడు. ఇక ప్రేమ ఒక వైద్యుడు, సరేసరి.

మూడవది, అన్నిటికన్నా విలువైన అధ్యాయం, ‘రూమీ సాహిత్యం మనకిచ్చే సందేశమేమిటి?’ అని ప్రశ్నించి రాసిన వివరణ. నాలుగుపేజీలు కూడా లేని ఈ వివరణ ఈ పుస్తకంలోనే కాదు, అసలు రూమీ సాహిత్యసర్వస్వంలోనే, ఎంతో విలువైన అధ్యాయం అనిపించింది నాకు.

కవిగా, సాధకుడిగా, బోధకుడిగా రూమీ విశిష్టత అతడు తన చుట్టూ ఉన్న దైనందిన జీవితాన్ని చూడటంలో ఉందనీ, రోజువారీ జీవితంలోని అత్యల్ప విషయాల్లో కూడా ఈశ్వరాస్తిత్వాన్ని దర్శించడం, మనకు చూపించడమే రూమీని ఇప్పటికాలానికి కూడా అనువైన, అవసరమైన కవిగా మారుస్తున్నాయని అంటుందామె. భగవంతుడి చిహ్నాల్ని గుర్తుపట్టడమెలానో రూమీకి తెలుసు, ఆ విద్యనే అతడి కవిత్వం ద్వారా మనకీ నేర్పుతున్నాడంటుంది ఆమె. రూమీ ఇప్పుడు మనమధ్య జీవించిఉంటే, ఈ ఆధునిక సాంకేతిక ప్రపంచంలో, ఈ ఆధునిక వస్తుసముదాయంలో కూడా అతడు ఈశ్వరుణ్ణి చూసి ఉండేవాడు అంటుంది. ఉదాహరణకి మెట్లు ఎక్కర్లేకండా మనల్ని పై అంతస్థులకి చేర్చే ఎస్కలేటర్ ని చూసి ఉంటే అతడు మన ప్రమేయమేమీ లేకుండానే మనల్ని పైకి లేవనెత్తే భగవత్కృపకు మెటఫర్ గా దాన్ని కీర్తించిఉండేవాడంటుంది.

రోజువారీ జీవితంలోంచే స్వర్గం వైపుగా నడిచే ఈ ప్రేమవిద్యనే రూమీనుంచి కబీరూ, కబీరు నుంచి టాగోరూ నేర్చుకున్నారని మనం గుర్తుపట్టవచ్చు.

31-1-2018

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s