కవిమూలాల అన్వేషణ

8

ఏడెనిమిదేళ్ళ కిందట చైనాలో సిచువాన్ రాష్ట్రానికి చెందిన జియాంగ్-యూ నగరం హుబే రాష్ట్రానికి చెందిన అన్లూ నగరపాలకసంస్థకి ఒక లాయర్ నోటీస్ పంపించింది. ఎనిమిదో శతాబ్దానికి చెందిన చీనా మహాకవి లి-బాయి తమ నగరానికి చెందినవాడని అన్లూ పదే పదే టివీల్లో ప్రచారం చెయ్యడం మానుకోవాలనీ, అతడు తమ నగరానికి చెందిన కవి అనీ జియాంగ్యూ వాదన. ఆ నోటీస్ ని అన్లూ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు, వాణిజ్య శాఖ ముందుపెట్టింది. వాళ్ళు న్యాయనిపుణులతో సంప్రదించి, అన్లూ ప్రభుత్వం చేస్తున్న టివి షోలు కాపీ రైటు ఉల్లంఘనకిందకు రావని తేల్చారు.

అక్కడితో కథ పూర్తవలేదు. ఆ రోజుల్లోనే అన్లూని సందర్శించిన కిర్గిజ్ స్థాన్ రాయబార కార్యాలయం ఉద్యోగి, అసలు లి-బాయి పుట్టిన ఊరు కిర్గిజ్ స్థాన్ లో టొక్ మొక్ కాబట్టి, లి-బాయి వారసత్వంలో తమకి కూడా హక్కు ఉంటుందని ప్రకటించాడు. ఇది చాలదన్నట్టు, ఒక పండితుడు నిజానికి లి-బాయి తల్లిదండ్రులు గంసూ రాష్ట్రంలోని చెంగ్జీ జిల్లాలో నివసించారు కాబట్టి, లి బాయి గంసూకి చెందినవాడంటో ఒక వ్యాసం రాసాడు. పదమూడు శతాబ్దాల కిందట జీవించిన ఒక కవి వారసత్వం గురించి ఒక్కసారిగా నాలుగు నగరాలూ, రెండు దేశాలూ పోటీపడటం మొదలుపెట్టాయి.

ఒకప్పుడు హోమర్ గురించి ఇలా చెప్పేవారు. ఆయన మరణించినతర్వాత ఏడు నగరాలు అతడు మా వాడంటే మా వాడన్నాయని. హోమర్ గురించి పోటీ పడటంలో సాహిత్యకారణాలు ఉండవచ్చుగాని, లి-బాయి గురించిన పోటీలో కేవలం సాహిత్యం మటుకే లేదు. ఆ ప్రాచీన లలితగీతకర్త ఇప్పుడు గొప్ప ఆర్థికాభివృద్ధికి అవకాశంగా మారాడు. లి-బాయి తిరుగాడిన స్థలాలు చూడటం కోసం, అతణ్ణి స్మరించుకోడం కోసం ఏటా ప్రపంచం నలుమూలలనుంచీ పోటెత్తే సందర్శకుల వల్ల వచ్చే ఆదాయం కోసం పోటీ అది.

ఇప్పుడు చైనాలో ప్రాచీన కవులు, వారు జీవించిన స్థలాలు, సమాధులు ఇంత సందర్శనీయ స్థలాలుగా మారిపోయాయని నాకైతే బిల్ పోర్టర్ రాసిన Finding Them Gone: Visiting China’s Poets of the Past (2015) చదివినదాకా తెలియలేదు.

బిల్ పోర్టర్ కాలిఫోర్నియాలో పుట్టాడు. చాలాకాలం తైవాన్ రేడియోలో పనిచేసాడు. అక్కడే ఒక చైనీయురాల్ని పెళ్ళి చేసుకున్నాడు.  చైనీస్ నేర్చుకుని ప్రాచీన కవిత్వం అనువాదం మొదలుపెట్టాడు. సాంస్కృతిక విప్లవం కాలం తర్వాత చైనాలో కనుమరుగైపోయిన జెన్ సాధువుల్ని అన్వేషిస్తూ చైనా అంతా పర్యటించి Road to Heaven: Encounters with Chinese Hermits (1993) అనే పుస్తకం రాసాడు. ఆ పుస్తకం చైనీస్ అనువాదం చైనాలో గొప్ప ప్రసిద్ధి పొందింది. దాదాపు ఇరవయ్యేళ్ళ తరువాత, తిరిగి, ఆ దారుల్లోనే చైనీయ పూర్వకవులు తిరిగిన దారులు అన్వేషిస్తూ ప్రయాణించి రాసిన పుస్తకం ఇది.

‘ఎర్రటి పైన్ చెట్టు’ అనే అర్థం వచ్చేటట్టు ‘చీ సోంగ్’ అనే పేరుతో బిల్ పోర్టర్ చైనా కవిత్వాన్ని ఇంగ్లీషులోకి అనువదించాడు. ముఖ్యంగా, ప్రాచీన మహాకవుల్లో ఒకడైన హాన్ షాన్ ‘హిమాలయం’ పద్యాలకి, డావో డెజింగ్ కి చేసిన అనువాదానికిగొప్ప ప్రశస్తి లభించింది.

ఈ నేపథ్యమంతటివల్లా, Finding Them Gone ఒక యాత్రావర్ణనగానే కాక, ఒక సాహిత్య చరిత్రగానూ, కవిత్వప్రశంసగానూ కూడా మనల్ని కట్టిపడేస్తుంది. అతడు యాత్ర మొదలు పెడుతూనే ముప్పై రోజుల్లో పూర్తిచేసుకోవాలనే ఒక నిబంధన పెట్టుకున్నాడు. అటువంటి పరిమితి పెట్టుకోకపోతే ఆ యాత్ర ఎప్పటికీ ముగియదని అతడికి తెలుసు. కాని, 25 వ రోజుదాకా యాత్ర బాగానే సాగింది. 26 వ రోజు ఒక కొండ మీద యాక్సిడెంటు కావడంతో, ప్రయాణం ఆగిపోయింది. కొన్ని నెలల విశ్రాంతి తర్వాత మళ్ళా యాత్ర కొనసాగించి, మిగిలిన నాలుగు రోజుల యాత్రా పూర్తిచేసాడు. కన్ ఫ్యూసియస్ తో మొదలైన యాత్ర హాన్ షాన్ నివసించిన పర్వతగుహని సందర్శించడంతో పూర్తయింది.

అసలు అన్నింటికన్నా ముందు ఒక అమెరికన్ అటువంటి చైనా సాహిత్యయాత్ర చెయ్యడమే నాకెంతో ఆశ్చర్యకరం గానూ,ఉత్తేజపూరితంగానూ అనిపించింది. నాలాంటి చైనా కవిత్వ పిపాసికి ఈ యాత్ర గొప్ప స్ఫూర్తిదాయకంగా ఉండటమే కాక, నేను అంతగా గమనించని కొందరు ప్రాచీన కవులమీద కొత్త వెలుతురు ప్రసరించేదిగా కూడా ఉంది.

బిల్ పోర్టర్ ఒకవైపు ప్రాచీన చైనా సాహిత్యం గురించి మాట్లాడుతూనే మరొకవైపు తన ప్రయాణాల్ని వర్ణించడంలో భాగంగా 21 వ శతాబ్దపు చైనాని కూడా చూపిస్తాడు. గంటకి 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ ట్రైన్లు, అత్యాధునిక రహదారులు, కొత్త పారిశ్రామిక, వాణిజ్యసముదాయాలు మనకి అడుగడుగునా కనిపిస్తాయి. కాని, ఒక దేశంగా, ఒక పాలనావ్యవస్థగా చైనాలో గర్వించదగ్గది స్వల్పమేనని కూడా అతడి అనుభవాలు మనకి చెప్పకుండానే చెప్తుంటాయి. టాక్సీ డ్రైవర్ల దగ్గర మామూళ్ళు వసూలు చేసే పోలీసులు, సమాధుల్లో నిధినిక్షేపాలుంటాయనుకుని ప్రాచీన సమాధుల్ని తవ్వుకుపోయే దొంగలూ, చీకటిపడకుండానే వీథుల్లో బారులు తీరే సెక్స్ వర్కర్లూ-చైనా తక్కిన దేశాల్లాంటిదే అని చూపించే దృశ్యాలు కూడా ఈ యాత్రలో తక్కువేమీ కాదు.

ప్రాచీన మహాకవిగురించి పోటీ పడుతున్నందువల్ల చైనా అంతటా పూర్వకవుల పట్ల గొప్ప ఆరాధన వెల్లివిరుస్తోందని అనుకుంటే అది కూడా పొరపాటే. ప్రసిద్ధ చీనా కవయిత్రి లీ- చింగ్- చావో స్మారక మందిరం దగ్గర ఒక ఉన్నత ప్రభుత్వ అధికారి బిల్ పోర్టర్ ని ఇది ఎవరి సమాధి అని అడుగుతాడు. ఇట్లాంటి సన్నివేశాలు ఈ నెలరోజుల యాత్రలోనూ తక్కువేమీ కాదు. కాని, ఒక్క గ్రామాల్లోనూ, గ్రామీణ పాఠశాలల్లోనూ మాత్రమే పూర్వకవుల స్మృతి పదిలంగా ఉందని మనకి పదే పదే అనుభమవుతూ ఉంటుంది.

పుస్తకం చదువుతున్నంతసేపూ, చదివాకా నన్నొకటే ఆలోచన వెంటాడుతూ ఉంది. ఇటువంటి యాత్ర మన పూర్వతెలుగు మహాకవుల్ని వెతుక్కుంటూ చేస్తే ఎలా ఉంటుందని. ఆ యాత్ర ఎక్కణ్ణుంచి మొదలుపెట్టవచ్చు? విశాఖపట్టణం జిల్లాలో ఎస్.రాయవరం నుంచి మొదలుపెట్టవచ్చునేమో. లేదంటే శ్రీకాకుళంలో పర్వతాలపేట- గిడుగు పుట్టిన ఊరు, ఇంకొంత ముందు నుంచి మొదలు పెడదామంటే, గంజాం జిల్లా పురుషోత్తపురం- త్రిపుర పుట్టిన ఊరినుంచి మొదలుపెట్టవచ్చు. లేదంటే, ఆధునిక తెలుగు ‘సంఘసంస్కరణ ప్రయాణ పతాక’ బరంపురం నుంచి మొదలుపెట్టడం సముచితంగా ఉంటుంది. దక్షిణాన ఎక్కడిదాకా వెళ్ళవచ్చు? తిరువైయ్యారు దాకా వెళ్ళడమే సముచిత మనుకుంటాను. అక్కణ్ణుంచి అనంతపురంలో కటారుపల్లెమీదుగా, తెలంగాణాలో బోధన్ , అదిలాబాదు, అంతేనా, పైఠాన్, నాసిక్ ల దాకా కూడా ప్రయాణిస్తే గాథాసప్తశతి కవుల అడుగుజాడల్ని కూడా వెతుక్కుంటున్నట్టు ఉంటుంది.

మనసులో ఇప్పటికే ఒక రూట్ మాపు పూర్తవుతూ ఉంది. ఈ దారిన నాతో కలిసి ప్రయాణించడానికి మీలో ఎందరు ఉవ్విళ్ళూరుతున్నారు?

19-3-2018

Leave a Reply

%d bloggers like this: