కృష్ణలీలాస్మరణ

Reading Time: 3 minutes

13

నా జీవితంలో కవిత్వం ప్రవేశించింది నా పసితనంలో. అయిదారేళ్ళ శైశవంలో మా ఊళ్ళో వేసవిరాత్రుల్లో ఆరుబయట నక్షత్రఖచిత ఆకాశం కింద మా బామ్మగారు భాగవత పద్యాలు చదువుతూండగా వినడం, గజేంద్రమోక్ష్జణం, రుక్మిణీకల్యాణం ఆమె నాతో కంఠస్థం చేయించడం నన్నొక అలౌకిక లోకానికి పరిచయం చేసాయి. ఆ తరువాత ఎన్ని కవిత్వాలు చదవనివ్వు ప్రపంచవ్యాప్తంగా ఎందరు కవులు పరిచయం కానివ్వు, నాలో ఆ అపూర్వ మంత్రమయలోకం మళ్ళా మళ్ళా నాలో పైకి లేస్తూనే ఉంటుంది.

కలుగడే నా పాలి కలిమి సందేహింప
కలిమిలేములు లేక కలుగువాడు
నాకడ్డపడరాడె నలినసాధువులచే
బడిన సాధులకడ్డుపడెడువాడు
చూడడే నా పాటు చూపుల చూడక
చూచువారల కృప జూచువాడు
లీలతో నా మొరాలకింపడె మొరగుల
మొరలెరుంగుచు దన్ను మొరగువాడు

నఖిలరూపులు దన రూపమైనవాడు
నాదిమధ్యాంతములు లేక యడరువాడు
భక్తజనముల దీనులపాలివాడు
వినడె చూడడె తలపడె వేగరాడె

రేపల్లెలో చిన్నికృష్ణుడు పుట్టిన పండగ, ఆ చిన్నారి పిల్లవాడి అల్లరిచేష్టలు,ఆ ప్రతిఒక్క బాలచేష్టతోనూ నా బాల్యం కూడా కలిసిపోయింది.

అమ్మా మన్నుదినంగ నే శిశువునో యాకొంటినో వెర్రినో
నమ్మంజూడగ వీరిమాటలు మదిన్నన్నీవు కొట్టంగా వీ
రిమ్మార్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయాస్యగం
ధమ్మాఘ్రాణము సేసి నా వచనముల్ దప్పైన దండింపవే

అప్పుడు ఆ తల్లికి కలిగిన ఆశ్చర్యం:

కలయో, వైష్ణవమాయయో ఇతరసంకల్పార్థమో సత్యమో
తలపన్నేరక యున్నదాననొ యశోదాదేవిగానొ పర
స్థలమో బాలకుడెంత యాతని ముఖస్థంబై యజాండంబు ప్ర
జ్వలమైయుండుట కేమి హేతువొ మహాశ్చర్యంబు చింతింపగన్

ఆ లేగదూడలు, ఆ పసులకొట్టాలు,ఆ అడవి, ఆ పసులుగాచే పిల్లవాళ్ళు, ఆ ఉట్టి, ఆ కవ్వం, ఆ వెన్న- ఏది రేపల్లెనో, ఏది విల్లిపుత్తూరో తెలియకుండానే ఆండాళ్ పెరిగినట్టు నేను కూడా ఏది మా ఊరో ఏది వ్రజదేశమో చాలాకాలం తేల్చుకోలేకపోయాను.

భారతీయ సంస్కృతిని ప్రభావితం చేసిన నాలుగు మూర్తులూ: శివుడు భారతీయ స్తోత్ర, తంత్రవాజ్మయాన్నీ, రాముడు కావ్య, నాటకవాజ్మయాన్నీ, బుద్ధుడు శిల్పకళాప్రపంచాన్నీ ప్రభావితం చేస్తే కృష్ణుడు భారతీయ గీతసంగీతాల్ని అపారంగా ప్రభావితం చేసాడని చెప్పాలి.

అసలు కృష్ణనామస్మరణలోనే అపారమైన రసస్ఫురణ ఉన్నది. ఈ భూమ్మీద లభ్యంకాగల సంతోషాలన్నీ కలిపినా కూడా రసానందంలో పదవవంతుకు తూగవని సుసాన్ కె లాంగర్ అన్నదని చెప్తూ ప్రసిద్ధ భారతీయ సాహిత్య మీమాంసకుడు సి.డి.నరసింహయ్య ‘శ్యామసుందర’ అన్న ఒక పదం కలిగించే రసానుభూతికే భారతీయులు మత్తెక్కిపోయారంటే ఆశ్చర్యమేముందన్నారు. (ఈస్ట్ వెస్ట్ పొయెటిక్స్ ఎట్ వర్క్,సాహిత్య అకాడెమి,1994.)

కృష్ణుడికి సంబంధించి ప్రతి ఒక్కపదం, ప్రతి ఒక్క చేష్ట, మాట, అలంకారం ప్రతి ఒక్కటీ రసం చిప్పిల్లుతూనే ఉంటుంది. అందుకనే, ‘రసోవైసః’ అన్న ఛాందోగ్యోపనిషత్తులోనే మొట్టమొదటిసారి కృష్ణ ప్రస్తావన రావడం ఆశ్చర్యం కలిగించదు.

మరే మనిషీ, దేవతా, చిహ్నమూ కూడా మనుషుల్నింత ఉన్మత్తుల్ని చెయ్యలేదు. ఆ భావన ప్రహ్లాదుణ్ణి
చిన్నతనం లోనే ఎంతవివశుణ్ణి చేసిందో చెప్తూ, నిజానికి కవి తన వివశత్వాన్నే ఇట్లా ప్రకటిస్తున్నాడు:

వైకుంఠ చింతావివర్జిత చేష్టుడై
యొక్కడు, నేడుచు నొక్కచోట
నశ్రాంత హరిభావనారూఢచిత్తుడై
యుద్ధతుడై పాడునొక్కచోట
విష్ణుడింతియకాని వేరొండు లేడని
యొత్తిలినగుచుండు నొక్కచోట
నళినాక్షుడను నిధానముగంటి
నేడని యుబ్బిగంతులు వైచునొక్కచోట

బలుకునొకచోట బరమేశు గేశవు
బ్రణయహర్షజనిత బాష్పసలిల
మిళితపులకుడై నిమీలిత నేత్రుడై
యొక్కచోటనిలిచి యూరకుండు

ఎందరు కవులు! ఎంత భావనాపారమ్యం! అసలు ఈ సంగీతానికి మొదలు భాగవతమే అందామా అంటే,ఆధునిక పరిశోధకులు భాగవత రచనాకాలాన్ని మరీ తొమ్మిదో శతాబ్దానికి తీసుకొస్తున్నారు. గాథాసప్తశతిలోనే గోపీకృష్ణప్రేమ ప్రస్తావన ఉందని గుర్తు చేస్తున్నారు. నాకేమనిపిస్తుందంటే అసలు ఈ సంగీతం వ్రజభూమిలోని వెన్నెలరాత్రులది. రెల్లుపొదలు విరబూసిన యమునాతీరం ఒడ్డున వినిపించిన పిల్లంగోవి పిలుపుది. భాగవతం ఆ కలధ్వనిని ఏ కొంతనో పట్టుకుంది. అందుకనే తక్కిన కావ్యపురాణాల సంస్కృతం వేరు, భాగవత సంస్కృతం వేరు. ఈ మాట సాక్షాత్తూ చైతన్య మహాప్రభువే అన్నాడని కృష్ణదాసకవిరాజు రాసినట్టు గుర్తు.

బర్హాపీడం నటవరవపుః కర్ణయోః కర్ణికారం బిభ్రద్
వాస: కనకకపిశం వైజయంతీంచ మాలాం
రంధ్రాన్ వేణోరధరసుధయా పూరయన్ గోపవృందై:
వృందారణ్యం స్వపదరమణం ప్రావిశద్ గీతకీర్తి:

భాగవతకారుడు చూసిన ఈ మహామోహన మూర్తిని ఏ కవి చూసి వర్ణించినా అంతే ఉన్మత్తతో, అంతే రసానందంతో వర్ణించకుండా ఉండలేకపోయారు:

శ్రవణోదంచిత కర్ణికారములతో స్వర్ణాభచేలంబుతో
నవతంసాయిత కేకిపింఛకముతో నంభోజదామంబుతో
స్వవశుండై మధురాధరామృతముచే వంశంబు బూరింపుచు
న్నువిదా, మాధవుడాలవెంట వనమందొప్పారెడిం జూచితే

అని పోతన అన్నా-

మోర్ ముకుట పీతాంబర సొహే
గల్ బైజంతీ మాలా
బృందావన్ మే ధేను చరావే
మోహన్ మురలీ వాలా

అని మీరా పాడినా-

మురళినినదలోలం ముగ్ధమాయూరచూడం
దళితదనుజజాలం ధన్యసౌజన్యలీలం
పరహితనవహేలం పద్మసద్మానుకూలం
నవజలధరనీలం నౌమిగోపాలబాలం

అని లీలాశుకుడు కీర్తించినా-

విష్ణుచిత్తులు, నమ్మాళ్వార్, కులశేఖరులు, ఆండాళ్, జయదేవుడు, సూర్ దాస్, అన్నమయ్య, పురందరదాసులు, నారాయణతీర్థులు-ఎందరు కవులు, ఎన్ని గీతాలు, ఎంతసంగీతం.

కృష్ణభావనారహిత ప్రపంచమెలా ఉంటుందో నేనూహించలేను. చిన్నికృష్ణుడే లేకపోతే నా బాల్యం స్మరణీయమే కాకపోయుండేది. బృందావనకృష్ణుడే లేకపోయుంటే నా యవ్వనం నిస్సారంగా ఉండిఉండేది. భాగవతకృష్ణుడే లేకపోయుంటే ఈ భవజలధి దాటగలననే ఆశ కించిత్తైనా ఉండేది కాదు. మనోహరమైన ఈ పద్యమే చదవకపోయిఉంటే నాకొక హృదయముందనే తెలిసిఉండేదికాదు:

నీ వడవిన్ పవల్ దిరుగ నీ కుటిలాలక లాలితాస్యమి
చ్ఛావిధి జూడకున్న మాకు యుగంబులై చనుం
గావున రాత్రులైన నిను గన్నులనెప్పుడు జూడకుండ ల
క్స్మీవర! రెప్పలడ్డముగజేశె నిదేల విధాత క్రూరుడై.

(నువ్వు పగలంతా అడవిలో తిరుగుతావు కాబట్టి ముంగురులు మీద పడుతుండే నీ ముఖం మీది చిరునవ్వు కనిపించక మాకు యుగాలు గడుస్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి రాత్రులప్పుడైనా నిన్ను కళ్ళారా చూద్దామా అంటే, ప్రభూ, ఇదేమిటి విధాత క్రూరంగా, మా కళ్ళకు రెప్పలడ్డం పెట్టాడు?)

29-8-2013

 

Leave a Reply

%d bloggers like this: